ఎన్‌పీఎస్ అంటే ఏంటి? ప్రయోజనాలు, గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవీ..

కంప్యూటర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దినేష్ ఉప్రేతీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రిటైర్మెంట్ ప్లానింగ్‌ గురించి దేశంలోని కొన్ని నగరాల్లో ఇటీవల ఒక సర్వే చేశారు. తాము రిటైర్మెంట్ ప్లానింగ్ ఆలస్యం చేశామని ఆ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది చెప్పారు. సరైన వయసులో రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ చేసుకునుంటే బాగుండేదని వారు అన్నారు.

వారు ఎలాగూ ఆలస్యం చేసేశారు. కానీ మీరెందుకు ఆలస్యం చేయాలి? రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వెంటనే రిటైర్మెంట్ ప్లానింగ్ మొదలుపెట్టండి. దానికోసం ఉన్న ఒక మార్గం ఎన్‌పీఎస్ (NPS). అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్.

ఇదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ( పీఎఫ్‌ఆర్డీఏ) దీన్ని రెగ్యులేట్ చేస్తుంది. 2004లో దీనిని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించారు. 2009లో దేశ పౌరుల్లో ఎవరైనా సరే దీనిని ఎంచుకునేలా మార్చారు.

రిటైర్మెంట్ కోసం ఈ పథకాన్నే ఎందుకు తీసుకోవాలని మీరు అనుకోవచ్చు. దానికి సమాధానంగా ఎన్‌పీఎస్ అందిస్తున్న రెండు ప్రయోజనాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఒకటి రిటైర్మెంట్ ప్లానింగ్. రెండోది టాక్స్ సేవింగ్స్. అంటే దీనితో ఆదాయపన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

ఎన్‌పీఎస్‌లో ప్రతి చందాదారుకు 12 అంకెల పీఆర్ఏఎన్ నంబర్ జారీ చేస్తారు. దాన్నే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అంటారు. ఇందులో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. మొదటిది టయర్ వన్.. రెండోది టయర్ టు.

ఇద్దరు వృద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

టయర్ 1 అకౌంట్

18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న ఎవరైనా ఈ ఖాతా తెరవచ్చు. 500 రూపాయలతో ఈ ఖాతా తెరవచ్చు. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఏటా కనీసం 500 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది.

డబ్బులు జమ చేశారు కాబట్టి, వాటిని తీయాలంటే షరతులు కూడా తెలుసుకోవాలి. ఈ టయర్ వన్‌లో మూడేళ్ల లాకిన్ పిరియడ్‌ ఉంటుంది. అంటే మూడేళ్ల వరకు అందులోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడానికి కుదరదు. ఆ తర్వాత పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. మీకు 60 ఏళ్లు వచ్చినపుడు అంటే రిటైరవుతున్నప్పుడు, మీరు ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు.

టయర్ 2 అకౌంట్

దీన్ని టయర్ వన్ ఖాతా ఉన్నవారు మాత్రమే తెరిచేందుకు వీలుంటుంది. 1,000 రూపాయలతో ఈ ఖాతా తెరిస్తే, తర్వాత మీకు నచ్చినంత మొత్తాన్ని అందులో జమ చేస్తూ వెళ్లచ్చు. దీనికి ఎలాంటి లాకిన్ పిరియడ్ ఉండదు.

జేబులో డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

ఫండ్ మేనేజర్లను మీరే ఎంచుకోవచ్చు

మీ పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మీరే స్వయంగా ఎంచుకోవచ్చు. అయితే, ఎవర్నంటే వారిని ఎంచుకోవడం కుదరదు. ఎన్‌పీఎస్ కింద ప్రస్తుతం 10 మంది ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. వారిలో ఒకరిని మీరు ఎంచుకోవచ్చు.

ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే యాక్టివ్ చాయిస్ లేదా ఆటో చాయిస్. యాక్టివ్ చాయిస్‌లో డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీరే ఎంచుకోవచ్చు. అందులో మార్పులు కూడా చేసుకోవచ్చు.

ఇక ఈ ఫండ్ మేనేజర్లు మన డబ్బుల్ని ఏం చేస్తారనే సందేహం కూడా వస్తుంది.

వీళ్లు నాలుగు కేటగిరీల్లో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు.

లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్

లో రిస్క్‌లో గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. మోడరేట్ రిస్కులో కార్పొరేట్ బాండ్స్. హై రిస్కులో షేర్ మార్కెట్, ఇక వెరీ హై రిస్కులో ఆల్టర్నేటివ్ ఇన్వెస్టిమెంట్ ఫండ్స్. అంటే రియల్ ఎస్టేట్ ఫండ్స్, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ఉంటాయి.

మీరు యాక్టివ్ చాయిస్ ఎంచుకుంటే, మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి దేనిలో ఎంత పెట్టుబడి పెట్టలనేది మీరే నిర్ణయించుకోవచ్చు.

రిటైర్మెంట్‌ వయసు నాటికి అంటే 60 ఏళ్ల వయసులో మీ అకౌంట్‌లో ఉన్న డబ్బుల్లో 60 శాతం తీసేసుకోవచ్చు. ఇదేంటి.. నేను జమ చేసిన డబ్బులను తీసుకోవాలంటే ఇలా పరిమితెందుకు? అని కొందరు అనుకోవచ్చు. అయితే, ఎన్‌పీఎస్ అనేది రిటైర్మెంట్ ప్లాన్‌ అని మనం మర్చిపోకూడదు. ప్రతి నెలా మనకు పెన్షన్ అవసరమవుతుంది. అందుకే మొత్తం డబ్బుల్లో 40 శాతంతో మీకోసం మీరు పెన్షన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. దీన్నే అంటారు యాన్యుటీ.

కరెన్సీ నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

తాము ఎన్‌పీఎస్‌ను సీరియస్‌గా తీసుకోలేదని, అందుకే పెద్ద మొత్తాన్ని కూడబెట్టలేకపోయామని, రిటైర్మెంట్ సమయంలో 60 శాతం డబ్బులను విత్‌డ్రా చేసుకున్న తర్వాత అతికొద్ది మొత్తమే అకౌంట్లో మిగిలి ఉందని కొందరు చెప్తుంటారు. అలాంటివారి కోసం కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వారి మొత్తం డబ్బు 5 లక్షలు, లేదా అంతకంటే తక్కువగా ఉంటే, వారు ఆ మొత్తం డబ్బును ఒకేసారి తీసేసుకోవచ్చు. అది కూడా ట్యాక్స్ లేకుండా.

ఇప్పటి వరకు ఈ స్కీమ్ గురించి మంచి విషయాలు తెలుసుకున్నాం. అయితే, కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 40 శాతం మొత్తంతో తీసుకున్న యాన్యుటీ చాలా పెద్ద ప్రతికూల అంశమని కొందరు నిపుణులు చెబుతారు. యాన్యుటీ అందిస్తున్న కంపెనీ ఆ మొత్తం మీద ఏడాదికి 6 నుంచి 7 శాతం రాబడి మాత్రమే ఇవ్వగలదని వారు భావిస్తున్నారు. అంటే మనకు వచ్చే పెన్షన్ ద్రవ్యోల్బణానికి తగినట్లు ఉంటుందా? అనే ప్రశ్న వస్తుంది.

ఈ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ చూడండి.

(గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)