ఇన్‌స్టాగ్రామ్ లవ్: ‘పెళ్లి కూతురు మాయ.. ఫంక్షన్ హాల్ మాయ.. దుబయి నుంచి వచ్చి మోసపోయా’

దీపక్

ఫొటో సోర్స్, UGC/SMViral

    • రచయిత, హర్మన్‌దీప్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ జలంధర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడిని మోసపోయేలా చేసింది.

ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత పెళ్లి రోజున వధువు కనిపించలేదు.

ఇలా ప్రేమ పేరుతో 'అమ్మాయి' చేసిన మోసాన్ని ఆయన నమ్మలేకపోతున్నారు.

పెళ్లి రోజున పూలతో అలంకరించిన కారులో 100 మందికి పైగా బంధువులతో ఊరేగింపుగా వివాహ వేదికగా చెప్పిన ప్రాంతానికి వెళ్లిన యువకుడు అక్కడ ఎవరూ లేకపోవడమే కాదు, అసలు వివాహ వేదికే లేకపోవడంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది.

వివాహం కోసం డిసెంబర్ 6న పంజాబ్‌లోని మోగాకు పెళ్లి వస్త్రధారణతో చేరుకున్నారు వరుడు దీపక్. కానీ ఆయనకు అక్కడ పెళ్లికూతురు కనిపించలేదు. కనీసం వివాహ వేదికా లేదు.

దీంతో దీపక్‌ మూడేళ్ల కల చెదిరింది. ఆయన మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ మోసపోయానని గ్రహించారు.

దీపక్‌ది పంజాబ్‌లోని జలంధర్ జిల్లా నకోదర్‌లోని మరియలా గ్రామం. ఆయన గత ఏడేళ్లుగా దుబయిలో ఉంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అమ్మాయితో పెళ్లి కోసం ఆయన దుబయి నుంచి వచ్చారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి రోజున రోజంతా వధువు కోసం వేచి ఉన్నారు దీపక్. ఆ రోజు వధువును ఫోన్‌లో సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

అమ్మాయి పేరు మన్‌ప్రీత్ కౌర్ అని, వృత్తిరీత్యా లాయర్ అని చెప్పినట్లు దీపక్‌ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దీపక్

ఫొటో సోర్స్, UGC/SMViral

ఫొటో క్యాప్షన్, వివాహం కోసం డిసెంబర్ 6న పంజాబ్‌లోని మోగాకు పెళ్లి వస్త్రధారణతో చేరుకున్నారు వరుడు దీపక్.

పెళ్లి రోజు ఏం జరిగింది?

పెళ్లి కోసం మోగాలోని రోజ్ గార్డెన్ అనే మ్యారేజ్ ప్యాలెస్ బుక్ చేసినట్లు తన ప్రేయసి చెప్పినట్లు దీపక్ తెలిపారు.

దీంతో పెళ్లి రోజున దీపక్ దాదాపు 100 మంది అతిథులతో అలంకరించిన కార్లలో మోగా చేరుకున్నారు.

మోగా చేరుకోగానే తాను పంపిన లొకేషన్‌కు రావాలని వధువు కోరినట్లు దీపక్ గుర్తుచేసుకున్నారు.

"మేం ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ప్యాలస్, వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం" అని అన్నారు.

''మోగా చేరుకున్న తర్వాత నా గర్ల్ ఫ్రెండ్‌కి ఫోన్ చేశాను. ఆమె కట్ చేసింది, తర్వాత స్విచ్ ఆఫ్ చేసింది'' అని దీపక్ చెప్పారు.

"డిసెంబర్ 5 వరకు మేం బాగానే మాట్లాడుకున్నాం. గత మూడేళ్లుగా రోజూ మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. నేను మోసపోతానని నాకసలు అనుమానమే రాలేదు" అని ఆయన అన్నారు.

పరిచయం ఎలా

దీపక్ ప్రకారం.. మోగా జిల్లాకు చెందిన మన్‌ప్రీత్ కౌర్‌తో ఆయనకు ఆన్‌లైన్‌లో పరిచయమైంది.

దీపక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఫాలో అయ్యారు. అనంతరం ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకోవడం ప్రారంభించారు. ఫోన్ నంబర్‌లను షేర్ చేసుకున్నారు.

దీపక్, మన్‌ప్రీత్‌లు గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో వీరి స్నేహం.. ప్రేమగా మారింది. ఆ సమయంలో దీపక్ దుబయిలో ఉన్నారు.

అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు.

దీపక్

ఫొటో సోర్స్, UGC/SMViral

ఎన్ని రోజుల పాటు సాగింది?

దీపక్ ప్రకారం.. ఇద్దరి మధ్య మూడు సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ నడిచింది.

పెళ్లి చేసుకుంటామనుకున్న డిసెంబర్ 6 వరకు ఇది కొనసాగింది. ఆమె దీపక్ కుటుంబంతో కూడా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవారు.

దీపక్, ఆయన కుటుంబంతో అమ్మాయి కుటుంబీకులుగా చెప్పుకుంటున్న వారు కూడా మాట్లాడేవారని పేర్కొన్నారు. పెళ్లి రోజు వరకు దీపక్, మన్‌ప్రీత్‌లకు ఇన్‌స్టాగ్రామ్, ఫోన్ల ద్వారా మాత్రమే పరిచయం ఉంది. ఇద్దరూ ఎప్పుడూ ముఖాముఖి కలుసుకోలేదు. పెళ్లి నిర్ణయమైన తర్వాత కూడా రెండు కుటుంబాలు నేరుగా కలవలేదు.

"నేను దుబయిలో ఉన్నందున మన్‌ప్రీత్‌ను కలవలేకపోయాను. నేను పంజాబ్‌కు వచ్చాక కూడా ఇరు కుటుంబాలు కలుసుకోలేదు" అని దీపక్ చెప్పారు.

'ముందుగా డిసెంబర్ 2న తేదీన పెళ్లి ఫిక్స్ చేశాం. అయితే కొన్నిరోజుల ముందు వాళ్ల నాన్న ఆరోగ్యం క్షీణించిందని మన్‌ప్రీత్ చెప్పడంతో.. పెళ్లి తేదీని మార్చుకున్నాం' అని అన్నారు. దీంతో డిసెంబర్ 6న పెళ్లి తేదీ కుదుర్చుకున్నామని దీపక్ తెలిపారు.

అమ్మాయికి డబ్బులిచ్చారా?

గత మూడేళ్లుగా మన్‌ప్రీత్ కౌర్ తన నుంచి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు తీసుకున్నారని దీపక్ చెప్పారు. రిలేషన్ షిప్ ప్రారంభమైన ఆరు నెలలకే మన్‌ప్రీత్ కౌర్ డబ్బు అడగడం ప్రారంభించారని దీపక్ గుర్తుచేసుకున్నారు. ఇంటి పనులు, కుటుంబీకుల అనారోగ్యం, కుటుంబ బాధ్యతల పేరుతో మన్‌ప్రీత్ చాలాసార్లు డబ్బులు తీసుకున్నారని ఆయన చెప్పారు.

"నేను వెస్ట్రన్ యూనియన్ ద్వారా ఈ డబ్బును మన్‌ప్రీత్‌కి పంపాను. ఈ మూడేళ్లలో దఫదఫాలుగా ఇచ్చాను" అని దీపక్ అన్నారు.

కేవలం మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రేమ వ్యవహారం మొదలైనట్లుగా ఉందని, అది నెరవేర్చుకున్నారని దీపక్ ఆరోపించారు.

జలంధర్ సమీపంలోని మెహత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో దీపక్ ఫిర్యాదు చేశారు. మన్‌ప్రీత్ కౌర్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీపక్ ఫిర్యాదు అందిందని మెహత్‌పూర్ పోలీస్ స్టేషన్ హెడ్ ఇన్‌స్పెక్టర్ సుఖ్‌దేవ్ సింగ్ ధ్రువీకరించారు. ఫిర్యాదుపై విచారణ ప్రారంభించామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)