సెడ్నేయా జైలు: ‘ఎటుచూసినా ఉరితాళ్లు, రోజుకు 50 మందిని ఉరి తీశారు.. ఏడేళ్లలో 30 వేల మంది మృతి’

ఫొటో సోర్స్, White Helmets
- రచయిత, మ్యాట్ మర్ఫీ
- హోదా, బీబీసీ న్యూస్
సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతం కావడంతో ఇకనైనా తమ ఆత్మీయుల ఆచూకీ తెలుస్తుందేమోనన్న ఆశతో దేశంలోనే అత్యంత క్రూరమైన జైలుగా ముద్రపడిన సెడ్నేయాకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు.
రాజధాని డమాస్కస్‌కు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని ఒక చిన్న పట్టణంలో 1980ల ప్రారంభంలో ఈ జైలు ఏర్పాటైంది. తమ పాలనను వ్యతిరేకించిన వారిని దశాబ్దాలుగా అసద్ కుటుంబం ఈ జైల్లో నిర్బంధించేది.
ఈ జైలును హక్కుల సంస్థలు 'మానవ కబేళా'గా అభివర్ణించాయి. ఈ జైలులో 2011 సిరియా అంతర్యుద్ధం నాటి నుంచి వేలాది మంది నిర్బంధానికి, హింసకు గురయ్యారు.
ఇక్కడ ఎంతో మందిని ఉరితీశారు.
సెడ్నేయా జైలును చాలా రహస్యంగా ఉంచారు, గతంలో ఎప్పుడూ ఈ జైలు లోపలి చిత్రాలు బయటికి రాలేదు.
అక్కడ పనిచేసిన మాజీ గార్డులు, ఖైదీలు చెప్పిన వివరాల ఆధారంగా ఆ జైలు ఎలా ఉండేదో తెలిసేది.
కానీ, హక్కుల సంఘాలు, అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం.. ఈ జైలు అసద్‌ల క్రూరమైన అణచివేతకు చిహ్నమని చెప్పొచ్చు.

మానవ కబేళా
దశాబ్దాల పాటు సిరియన్ మిలటరీ పోలీస్, ఇంటెలిజెన్స్ నిర్వహణలో ఉంది ఈ జైలు. దీని నిర్మాణం 1980లలో ప్రారంభంలో మొదలైంది. సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జైలులో 1987 నుంచి ఖైదీలను నిర్బంధించడం ప్రారంభమైంది. బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ పాలనలో తొలిసారి ఖైదీలను ఈ జైలుకి తరలించారు.
ఈ జైలులో ప్రధానంగా రెండు బ్లాకులు ఉండేవి. వాటిలో ఒకటి వైట్ బిల్డింగ్. హక్కుల సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం.. తమ పాలనపై విధేయత ప్రకటించని సైనిక అధికారులు, బలగాలను ఇందులో నిర్బంధించేవారు. ఆగ్నేయ దిశలో ఎల్ ఆకారంలో ఈ బ్లాక్ ఉంటుంది.
రెండోది రెడ్ బిల్డింగ్. దీన్ని ప్రధాన జైలుగా చెబుతారు. తమ రాజకీయ ప్రత్యర్థుల (తొలినాళ్లలో ఇస్లామిస్ట్ గ్రూపుల సభ్యులు)ను నిర్బంధించేవారు. వై ఆకారంలో ఉండే ఈ భవన సముదాయం.. మధ్యలో కేంద్రంలా ఉండి, మూడు భాగాలు ఫ్యాన్ రెక్కల్లా విస్తరించినట్లు కనిపిస్తుంది.
ఈ రెండు భవన సముదాయాల మధ్య కనీసం 10 వేల నుంచి 20 వేల మంది ఉండొచ్చని జైలు నుంచి విడుదలైన ఖైదీలు చెప్పినట్లు హక్కుల సంఘాలు తెలిపాయి.
డజన్ల కొద్దీ జైలు గదులు, సీసీటీవీ స్క్రీన్‌లతో నిండిన ఒక పెద్ద నిఘా గది ఉన్నట్లు చూపుతున్న జైలు వీడియోలు ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.
వీటిని బీబీసీ వెరిఫై కూడా ధ్రువీకరించింది.

ఫొటో సోర్స్, planetlabspbc
2011 సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారిని నిర్బంధించడం కోసం వైట్ బిల్డింగ్ నుంచి ఖైదీలను ఖాళీ చేయించారని జైల్లో పనిచేసిన మాజీ గార్డులు చెప్పినట్లు 2017లో విడుదల చేసిన నివేదికలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
''2011 తర్వాత సెడ్నేయా సిరియాలో ప్రధాన రాజకీయ జైలుగా మారింది'' అని మాజీ అధికారి ఒకరు చెప్పారని ఆమ్నెస్టీ తెలిపింది.
రెడ్ బిల్డింగ్‌లో బందీలుగా ఉన్నవారిని తరచూ హింసించేవారని, తీవ్రంగా కొట్టడంతో పాటు రేప్ చేయడం, ఆహారం, వైద్యసాయం అందకుండా చేయడం వంటివి చేసేవారని మాజీ ఖైదీలు సాక్ష్యం చెప్పినట్లు ఆమ్నెస్టీ తన నివేదికలో పేర్కొంది.
రెడ్ బిల్డింగ్‌లో ఉన్న ఖైదీలను ఉరి తీసేందుకు వైట్ బిల్డింగ్ కిందనున్న గదికి తీసుకెళ్లేవారని, దానిని వారు ''ఎగ్జిక్యూషన్ రూమ్(ఉరితీసే గది)''గా చెప్పారని ఆమ్నెస్టీ తెలిపింది.
''మధ్యాహ్నం భోజనం సమయానికి ఉరి తీయాల్సిన వారి జాబితా వచ్చేది. ఉరి తీయాల్సిన వారిని బలగాలు బేస్‌మెంట్‌లోని ఒక సెల్‌కు తీసుకెళ్తాయి, కొన్నిసార్లు 100 మంది వరకు ఉండేవారు, అక్కడ వారిని కొట్టేవారు'' అని అక్కడి మాజీ గార్డు చెప్పారు.
రెడ్ బిల్డింగ్‌లోని బందీలను అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో అక్కడికి తీసుకెళ్లేవారని ఖైదీలు ఆమ్నెస్టీకి చెప్పారు.
ఖైదీల కళ్లకు గంతలు కట్టి, మెట్లు దించుతూ వైట్ బిల్డింగ్‌లో ఆగ్నేయం వైపునున్న ''ఉరితీసే గది''కి తీసుకెళ్లి, అక్కడ పది తాళ్లు బిగించి వున్న ఒక మీటర్ ఎత్తైన ప్లాట్‌ఫాంపైకి తీసుకెళ్లి ఉరితీసేవారని చెప్పారు.
2012లో ఆ గదిని మరింత విస్తరించినట్లు, మరో 20 ఉరితాళ్లతో రెండో ప్లాట్‌ఫాం నిర్మించినట్లు ఆమ్నెస్టీ పేర్కొంది.
అసద్ పాలన అంతమైన తర్వాత రెబల్స్ అనుబంధ మీడియా విడుదల చేసిన ఫుటేజీలో అక్కడి గదుల్లోని డజన్ల కొద్దీ ఉరితాళ్లు కనిపించాయి.

ఫొటో సోర్స్, GoogleEarth
ఏడేళ్లలో 30 వేల మంది..
2011 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 30 వేల మందికి పైగా ఖైదీలు ఉరి, చిత్రహింసలు, వైద్యసాయం అందకపోవడం, ఆకలితో అలమటించడం వంటి కారణాలతో చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు అంచనా వేశాయి.
2018 నుంచి 2021 మధ్య కనీసం 500 మందిని ఉరితీసి ఉంటారని ఇటీవల జైలు నుంచి విడుదలైన వారు చెప్పిన దానిని బట్టి అర్థమవుతోందని ది అసోసియేషన్ అండ్ డీటెయినీస్ ఇన్ సిరియా ప్రిజన్ (ఏఎండీఎస్‌పీ) 2022లో తెలిపింది.
మృతదేహాల దహనానికి 2017లో అక్కడ ఒక స్మశానవాటికను కూడా నిర్మించినట్లు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది.
వైట్ బిల్డింగ్‌కు ఆనుకుని ఉన్న ఒక చిన్న రెక్కలాంటి నిర్మాణాన్ని పైచిత్రంలో చూడొచ్చు.
సెడ్నేయా జైల్లో జరుగుతున్న సామూహిక హత్యలను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో భాగంగా దీనిని నిర్మించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అమెరికన్ నిఘా వర్గాలు విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు ఒక నిర్మాణాన్ని చూపుతున్నాయి. అందులో కనిపిస్తున్న చిన్న భవనాన్నే స్మశానవాటికగా మార్చినట్లు వారు చెబుతున్నారు.
భవనంపై మంచు కరిగిపోయిన ఆనవాళ్లు కూడా తమ వాదనలకు బలం చేకూరుస్తున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అప్పట్లో, ఆ జైలులో రోజుకు కనీసం 50 మందిని ఉరితీసి ఉంటారని అంటున్నారు.

ఫొటో సోర్స్, AMDSP&Planet labs pbc
జైలు చుట్టూ మైన్స్
ఈ జైలు కాంప్లెక్స్.. చుట్టూ ఎత్తైన గోడలు, భారీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేది.
ఏఎండీఎస్‌పీ 2022లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జైలు లోపల అంతర్గత భద్రతను మిలటరీ పోలీసు విభాగం పర్యవేక్షిస్తుండగా, జైలు వెలుపల 200 మంది మిలటరీ సిబ్బందితో పాటు 250 మంది మిలటరీ ఇంటెలిజెన్స్ బలగాలు పెట్రోలింగ్ విధుల్లో ఉండేవి.
పాలకులకు అత్యంత విధేయులైన ఆర్మీ మూడో డివిజన్‌లోని 21వ బ్రిగేడ్ బలగాలను జైలు రక్షణ కోసం ఎంపిక చేశారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ వర్గమైన అలవైట్ మైనారిటీ వర్గానికి చెందిన వారు ఆ సైనికులకు కమాండింగ్ అధికారులుగా ఉండేవారు.
అసద్ పాలన ముగిసిన తర్వాత జైలు సరిహద్దుల దగ్గరికి వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు వచ్చాయి. జైలు బయట భారీగా తవ్వకాలు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. జైలు చుట్టూ యాంటీ ట్యాంక్ మైన్స్, లోపల యాంటీ పర్సనల్ మైన్స్ ఉన్నాయి.
జైలు చుట్టూ ముళ్ల తీగలతో ఎత్తైన గోడలు ఉన్నాయని సిరియన్ సివిల్ డిఫెన్స్ గ్రూప్ వైట్ హెల్మెట్స్ షేర్ చేసిన చిత్రాలు చూపిస్తున్నాయి. చుట్టూ గార్డు టవర్లు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ గ్రూపుల నుంచి వచ్చిన ఆరోపణలను అసద్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఖండిస్తూ ఉండేది. అవన్నీ అవాస్తవమని, రుజువులు లేకుండా చేస్తున్న ఆరోపణలని పేర్కొనేది.
తమ కుటుంబీకులను సెడ్నేయాలో ఉంచారని చాలామంది నమ్ముతున్నారు. అసద్ పాలన అంతం కావడంతో ఇకనైనా తమ ఆత్మీయుల ఆచూకీ తెలుస్తుందేమోనన్న ఆశతో బంధువులు ఎదురుచూస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















