ముగ్గురు నర్సుల కథ గోల్డెన్ గ్లోబ్స్ వరకు ఎలా వెళ్లింది?

ఫొటో సోర్స్, All We Imagine as Light
ముంబయి అంటే.. ఆర్థిక రాజధాని అని కొందరు, సంపన్న వర్గాలకు, బాలీవుడ్ స్టార్లకు, బిలియనీర్ వ్యాపారవేత్తలకు పెట్టింది పేరుగా మరికొందరు చెబుతుంటారు.
అందుకు భిన్నంగా ఈ నగర వాసుల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'.
కేరళ నుంచి ముంబయి నగరానికి వలస వచ్చిన ఇద్దరు నర్సులు, మహారాష్ట్రలోని ఓ గ్రామం నుంచి వచ్చి ముంబయిలో పని చేసే ఓ నర్సు కథే ఈ చిత్రం.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ అవార్డుతో పాటు...అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్స్‌లో పోటీ పడుతోంది.

గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుకు 2025 ఏడాది నామినేషన్లకు గాను, నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 'బెస్ట్ మోషన్ పిక్చర్' కేటగిరీలో తొలి నామినీగా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం ఉంది. అలాగే గోల్డెన్ గ్లోబ్స్ బెస్ట్ డైరెక్టర్ – మోషన్ పిక్చర్ కేటగిరీలో కూడా ఈ చిత్రం పోటీ పడుతోంది.
ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ముంబయి వీధులకు, ఆ నగరానికి వలస వచ్చిన వారి జీవితాలకు కపాడియా తన చిత్రంలో ప్రధాన స్థానం కల్పించారు. ఇది కపాడియా తొలి నెరేటివ్ ఫీచర్ ఫిల్మ్.
అంతకుముందు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో పోటీపడిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం, నాటు నాటు పాటకు అవార్డును దక్కించుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
'ప్రేక్షకులంతా లేచి నిల్చుని 8 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు'
అంతకుముందు కాన్స్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు, ప్రేక్షకులంతా లేచి నిల్చుని 8 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు.
30 ఏళ్లలో తొలిసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన పోటీ విభాగంలో ప్రదర్శించిన భారతీయ సినిమా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'.
‘అద్భుతం...పూర్తి మానవత్వంతో నిండిన కథ’ అని 'ది గార్డియన్' పత్రిక ఈ సినిమాను వర్ణించింది. ఈ పత్రిక ఈ సినిమాకు 5 స్టార్లు ఇచ్చింది. సత్యజిత్ రే ‘మహానగర్’, ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమాతో దీనిని పోల్చారు.
పాయల్ కపాడియా ప్రముఖ కళాకారిణి నళిని మలాని కూతురు. ముంబయి నగరంతో, ఆ సిటీ వైవిధ్య, భిన్న సంస్కృతితో ఆమెకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది.
''ఇతర ప్రాంతాలతో పోలిస్తే మహిళలు సులభంగా పని చేసుకునే ప్రదేశాలలో ముంబయి ఒకటి'' అని కపాడియా అంటారు.
ఇళ్లను వదిలిపెట్టి, వేరొక ప్రాంతంలో పనిచేసేందుకు వెళ్లే మహిళలపై తాను సినిమా తీయాలనుకున్నానని కపాడియా అప్పట్లో చెప్పారు.

ఫొటో సోర్స్, All We Imagine as Light
ముగ్గురు నర్సుల కథ ఇది
తన చిత్రంలో ప్రధానంగా కేరళ నుంచి వచ్చిన ఇద్దరు నర్సుల రోజువారీ జీవిత కథనాన్ని పాయల్ కపాడియా చూపించారు.
ముంబయి నగరంలో వారు ఒక హాస్పిటల్‌లో పనిచేస్తూ, చిన్న, ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో కలిసి జీవిస్తున్నట్లు చూపిస్తారు.
ప్రభా అనే నర్సు (కని కుశృతి, గర్ల్స్ విల్ బి గర్ల్స్‌లో సపోర్టింగ్ రోల్ చేశారు) ఒక వివాహిత. ఆమె భర్త జర్మనీలో నివసిస్తుంటాడు. ఆమెతో చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు.
కానీ, ఒకరోజు అకస్మాత్తుగా తన భర్త నుంచి రైస్ కుక్కర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా వస్తుంది. ఆ కుక్కర్‌ను గట్టిగా హత్తుకున్న ఆమె, వారి పెళ్లి బంధంలో చివరి ప్రేమ కానుకగా భావిస్తుంది.
రెండో నర్సు అను. ఈ పాత్రలో దివ్య ప్రభ నటించారు. చాలా సాహసాలతో కూడుకున్న ప్రయాణాన్ని సాగిస్తుంటారు. రహస్యంగా ఒక ముస్లిం యువకుడు షియాజ్(హృదు హరూన్)తో ప్రేమలో పడుతుంది. ఆమె కూడా కేరళ నుంచి వచ్చిన మహిళే.
అను హిందూ కుటుంబంలో పుడుతుంది. షియాజ్‌తో ఆమె బంధాన్ని అను కుటుంబం తిరస్కరిస్తుంది.
అదే ఆస్పత్రిలో పనిచేసే మూడో నర్సు-పార్వతీ (ఛాయా కదం, ఈ ఏడాది కాన్స్‌లో రెండు సినిమాల్లో కనిపించారు) నగరాన్ని వదిలిపెట్టాలనుకుంటారు. ఎందుకంటే, నగరానికి పేరు కోసం ఆమె నివసిస్తున్న ప్రాంతాన్ని కూల్చివేసి, పునరుద్ధరించాలనుకుంటారు ఓ బిల్డర్.
ఈ ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే కథే 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'.
ఈ చిత్రం ముగ్గురు మహిళల స్నేహానికి సంబంధించిన కథ అని దర్శకురాలు చెప్పారు. స్నేహం ఎంతో ముఖ్యమైన సంబంధమని అంతకుముందు కాన్స్ ఫెస్టివల్‌లో అవార్డు ప్రదానోత్సవ సమయంలో పాయల్ కపాడియా అన్నారు.
అవార్డు ప్రదానోత్సవ సమయంలో, పాయల్ కపాడియా ఈ సినిమాలో నటించిన ముగ్గురు మహిళలను వేదికపైకి పిలిచారు.

ఫొటో సోర్స్, RRR MOVIE/FB
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు పొందిన భారతీయ చిత్రాలేంటి?
భారతీయ సినిమాకు 1959లో తొలిసారి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ వచ్చింది. వి.శాంతారామ్ డైరెక్ట్ చేసిన 'దో ఆంఖే బారా హాథ్(1957)' సినిమా, విదేశీ భాషా విభాగంలో ఉత్తమచిత్రంగా నిలిచింది.
ఆ తరువాత మహాత్మా గాంధీ జీవితం మీద తీసిన గాంధీ(1982) సినిమాకు ఆరు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను నిర్మించిన సంస్థల్లో నేషనల్ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి.
మీరా నాయర్ తీసిన సలాం బాంబే(1988), మన్సూన్ వెడ్డింగ్(2001) సినిమాలు విదేశీ భాషా విభాగంలో నామినేట్ అయ్యాయి.
ఇక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయునిగా 2009లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నిలిచారు.
స్లమ్‌డాగ్ మిలియనీర్(2009) సినిమాకు 'బెస్ట్ స్కోర్' విభాగంలో ఆయనకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు లభించింది.
అలాగే, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో పోటీపడిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం, నాటు నాటు పాటకు ఈ అవార్డు వచ్చింది.
'నాటు నాటు' పాటను చంద్రబోస్ రాశారు. ఎంఎం కీరవాణి స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.
పాటకు తగ్గ జోష్‌తో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














