ఈ స్కూలులో చేరే పిల్లల తల్లులు కూడా అడ్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే...

పాకిస్తాన్, కరాచీ, మానసిక వేదన, స్కూలు, మానసిక ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, కరాచీలోని ఈ స్కూలులో మానసిక ఆరోగ్యం, వ్యక్తుల సంతోషం గురించి బోధిస్తారు.
    • రచయిత, నజిష్ ఫయాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్కూలు అనే మాట వినగానే బ్యాగులు, యూనిఫామ్‌లతో పిల్లలు కనిపించే భవనం మన మదిలో మెదులుతుంది.

అయితే ఇప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన స్కూలు గురించి తెలుసుకోబోతున్నారు. ఇందులో చేరే పిల్లల తల్లులు కూడా అడ్మిషన్ తీసుకోవాలనే షరతు ఉంది.

తహ్మీనా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు. బిడ్డ పుట్టాక విడాకులు తీసుకున్నారు. విడాకుల వల్ల ఏర్పడిన పరిస్థితులను అధిగమించిన తర్వాత, జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆమె కరాచీలోని ఈ స్కూలుకు వచ్చారు.

''నా కొడుకు అడ్మిషన్ కోసం ఈ స్కూల్‌కి వెళ్లినప్పుడు కొడుకుతో పాటు నేనూ ఇక్కడే అడ్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇక్కడ కుట్టుపని, ఎంబ్రాయిడరీ వర్క్‌ నేర్చుకోవచ్చని అనుకున్నాను. అయితే ఈ స్కూలు మిగతా స్కూళ్ల కంటే చాలా భిన్నంగా ఉంది. ఇక్కడ నాకు చదువు నేర్పుతూనే నా సమస్యల నుంచి బయటపడేందుకు థెరపీ కూడా ఇచ్చారు" అని తహ్మీనా చెప్పారు.

"మదర్ చైల్డ్ ట్రామా ఇన్‌ఫామ్డ్ స్కూల్" అనే పేరున్న ఈ స్కూలు కరాచీలోని ల్యారీ అనే ప్రాంతంలో ఉంది. ఇందులో తల్లి బిడ్డలు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఏదైనా ప్రమాదం జరగడం, అనుకోని పరిస్థితుల వల్ల ఎదురైన షాక్‌ను అధిగమించి జీవితంలో ముందడుగు వేసేందుకు తల్లులకు ఈ స్కూలు అండగా నిలుస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ స్కూలును సబీనా ఖత్రీ నిర్వహిస్తున్నారు. ఎనిమిదేళ్లకే ఆమె తల్లి నుంచి విడిపోయి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.

తన చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలు మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ఈ స్కూలును ప్రారంభించానని ఖత్రీ చెప్పారు. ఈ స్కూలు ఇప్పుడు అనేక మంది పిల్లలకు చదువు నేర్పడంతో పాటు వారికి ఎదురయ్యే కష్టాలను అధిగమించేందుకు అండగా నిలుస్తుంది.

మరి ఈ స్కూలులో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ల్యారీ వెళ్లాల్సిందే.

పాకిస్తాన్, కరాచీ, మానసిక వేదన, స్కూలు, మానసిక ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, తల్లి నుంచి విడిపోయిన ఖత్రీ అలాంటి కష్టం మరొకరికి రాకూడదంటారు.

ఇది తల్లులకు బహుమతి

ఈ స్కూలు ఒక తల్లి మరో తల్లికి అందిస్తున్న బహుమతి లాంటిదని సబీనా ఖత్రి భావిస్తున్నారు. తన ఎనిమిదేళ్ల వయసులో తల్లితో విడిపోయినట్లు ఆమె బీబీసీకి చెప్పారు.

"అప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఆ సంఘటన నాలో ఎక్కడో ఉండిపోయింది" అని ఆమె అన్నారు.

2006లో, ల్యారీలోని పాఠశాలతో తన మిషన్‌ ప్రారంభించారు సబీనా ఖత్రీ .

వెనుకబడిన తరగతుల వారు తన పాఠశాలకు వస్తుంటారని ఆమె చెప్పారు. ఈ పాఠశాలలో మానవీయ విలువలు, మానసిక ఆరోగ్యం, సంతోషానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.

ల్యారీలో ముఠాల గొడవలు, నేరాలు సర్వ సాధారణం. అందుకే మేము ఆమె నిర్వహిస్తున్న స్కూలు దగ్గరకు వెళ్లడానికి కాస్త సంకోచించాల్సి వచ్చింది.

"ముఠాల గొడవలు, చంపుకోవడాలు, నేరాలను సంపన్నుల పిల్లలు ప్రత్యక్షంగా చూడలేదు. అలాంటి వాటిని వాళ్లు వీడియో గేమ్‌లలోనే చూస్తారు. ల్యారీలో పిల్లలు మాత్రం వాటిని ప్రత్యక్షంగా చూశారు" అని సబీనా ఖత్రీ చెప్పారు.

ల్యారీలో జరుగుతున్న నేరాలు పిల్లల్ని ప్రభావితం చేస్తాయని సబీనా గుర్తించారు.

తన చిన్నతనంలో ఎదురైన కష్టాల నుంచి బయటపడినట్లుగానే ల్యారీలో ఉన్న పరిస్థితుల నుంచి ప్రతీ చిన్నారిని బయటకు తీసుకురావాలని ఆమె నిర్ణయించుకున్నారు.

పిల్లల్లో అనేక మంది తాము ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి బయటపడ్డారు. చదువుకుని ఒక వయస్సు వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రుల ఆలోచనా విధానం, అర్థం చేసుకునే విధానం తమకు భిన్నంగా ఉంటాయని వారు గుర్తించినట్లు సబీనా అభిప్రాయపడ్డారు.

ఈ కారణంగానే ఈ పాఠశాలలో పిల్లలతో పాటు తల్లుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆమె భావించారు. అందుకే తాను ప్రారంభించిన స్కూలులో చదువుకునే పిల్లలతో పాటు వారి తల్లులకు కూడా అడ్మిషన్ ఇస్తున్నారు.

పాకిస్తాన్, కరాచీ, మానసిక వేదన, స్కూలు, మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరాచీలోని ఈ స్కూలులో పిల్లల అసలైన టాలెంట్‌ను గుర్తిస్తారని చెబుతున్నారు (ప్రతీకాత్మక చిత్రం)

బిడ్డతో పాటే తల్లి కూడా అడ్మిషన్ నిబంధన

సబీనా మిషన్ విజయంతమైందని చెప్పడానికి అతి పెద్ద ఉదాహరణ ల్యారీకి చెందిన తహ్మీనా.

తహ్మీనా 16 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడాది తర్వాత బిడ్డను కన్నారు. కానీ ఆమె వివాహం మూడేళ్లే కొనసాగింది

"విడాకుల తర్వాత, నా బిడ్డను ఏం చేయాలో అర్థం కాలేదు" అని తహ్మీనా బీబీసీతో అన్నారు.

ఏదో ఒక పని చేసుకుంటూ మళ్లీ చదువుకోవడం మొదలు పెట్టవచ్చని ఆమె భావించారు.

విడాకుల తర్వాత, మహిళల పరిస్థితి వారి పిల్లలపైనా ప్రభావం చూపిస్తుంది. తహ్మీనాపై జరిగిన అకృత్యాలను ఆమె కుమారుడు ప్రత్యక్షంగా చూశాడు.

సబీనా ఖత్రీ ప్రారంభించిన స్కూలు గురించి తహ్మీనాకు తెలిసింది. తన కుమారుడితో పాటు తనకు కూడా అడ్మిషన్ కావాలని ఆమె స్కూలు యాజమాన్యాన్ని కోరింది.

తహ్మీనాకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ తెలుసు. స్కూలులో తాను కూడా చేరి ఈ పనులను మరింత మెరుగ్గా నేర్చుకోవచ్చని ఆమె భావించారు.

ఆమె స్కూలులో చేరిన తర్వాత ఆ స్కూలు మిగతా వాటితో పోలిస్తే భిన్నమైనదిగా గుర్తించారు తహ్మీనా.

"నాకు చాలా థెరపీ సెషన్లు ఇచ్చారు. నేను, నా కుమారుడు, మా బాధలను అధిగమించడానికి నాలుగేళ్లు పట్టింది" అని ఆమె చెప్పారు.

తహ్మీనా ఇదే స్కూలు నుంచి టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె అదే స్కూలులో పని చేస్తున్నారు. ఆమె కుమారుడు అక్కడే చదువుకుంటున్నారు.

ల్యారీలో ఈ స్కూలు ఉండటం తన అదృష్టమని, అది తన జీవితాన్ని మార్చిందని, తాను జీవించడానికి ఒక కారణాన్ని చూపించిందని తహ్మీనా భావిస్తున్నారు.

ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న స్కూలు టీచర్లు

చిన్నప్పటి నుంచి ఇదే స్కూలులో చదువుకుని ప్రస్తుతం యూనివర్సిటీలో బీబీఏ చేస్తున్నారు మొహమ్మద్ అబ్దుల్లా. చదువుకోవడంతో పాటు అబ్దుల్లాకు నటన అంటే ఇష్టం.

స్కూలులో చదువుకుంటున్నప్పుడు తన కుటుంబంలో ఏర్పడిన సమస్యల వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు.

"జీవితంలో ఏం చెయ్యాలనే దాని గురించి నాకేమీ అర్థం కాలేదు. చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది. నాలో ఉన్న శక్తి ఏంటో నాకు తెలియలేదు. స్కూలు టీచర్లు నా టాలెంట్ గుర్తించి ప్రోత్సహించారు.’’ అని అబ్దుల్లా చెప్పారు.

అబ్దుల్లా స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు నటనను కూడా కొనసాగించారు. తన టీచర్లపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చనే నమ్మకాన్ని స్కూలు వాతావరణం కల్పించిందని అబ్దుల్లా చెప్పారు.

ప్రస్తుతం ఆయన తన మానసిక స్థితి నుంచి బయటపడి అద్భుతమైన జీవితం గడుపుతున్నారు.

పాకిస్తాన్, కరాచీ, మానసిక వేదన, స్కూలు, మానసిక ఆరోగ్యం
ఫొటో క్యాప్షన్, పిల్లలకు ఉన్నట్లే తల్లుల కోసం కూడా ప్రత్యేకంగా సిలబస్ తయారు చేసిన స్కూలు

పిల్లల మాదిరిగానే, తల్లులకు కూడా కోర్సులు

అడ్మిషన్ ఇచ్చే విషయంలో షరతుల గురించి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడనని సబీనా ఖత్రీ స్పష్టం చేశారు.

ఈ స్కూలులో చేరాలనుకునే చిన్నారులకు ఒకటో తరగతి నుంచి అడ్మిషన్ ఇస్తారు. వారంలో ఐదురోజులు మాత్రమే స్కూలు ఉంటుంది. తల్లులకు మూడు రోజులు క్లాసులు ఉంటాయి. వారికి కూడా ప్రత్యేకంగా సిలబస్ ఉంటుంది. ఇందులోనే కౌన్సిలింగ్ సెషన్లు ఉంటాయి.

ఈ స్కూలు కాన్సెప్ట్ విజయవంతం కావడంతో ఇలాంటి స్కూళ్లను పాకిస్తాన్‌లోని అన్ని నగరాల్లోనూ తెరవాలని సబీనా ఖత్రీ భావిస్తున్నారు. ఈ స్కూలు బ్రాంచ్‌ను కరాచీలో ప్రారంభించారు.

స్కూలులోని క్లాసు రూముల్లో బ్లాక్ బోర్డులు ఉండవు. కుర్చీల మీదే కాకుండా, పిల్లలంతా కింద కూర్చుని ఆడుకునే వాతావరణం కూడా ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)