అమ్మ, అక్క అంటూ దూషిస్తే జరిమానా.. మహారాష్ట్రలోని ఈ గ్రామం గురించి తెలుసా?

ఫొటో సోర్స్, Kiran Sakale/BBC
- రచయిత, శ్రీకాంత్ బంగలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఎవరైనా మా అమ్మని, సోదరిని దుర్భాషలాడితే నాకు కోపం వస్తుంది. దీనిపై ఎక్కడో ఒకచోట నిరసన తెలపాలి. అయితే, మా గ్రామం అలాంటి తిట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకే నా ఊరిని చూసి గర్వపడుతున్నా".
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో గల సౌందాల గ్రామానికి చెందిన మంగళ్ చముతే బీబీసీతో చెప్పిన మాటలివి.
అహల్యానగర్ (అహ్మద్‌నగర్) జిల్లాలోని నెవాసా తాలూకాలో సౌందాల గ్రామం ఉంది. ఊరిలో సుమారు 1,800 మంది జనాభా ఉన్నారు. మహిళలను దుర్భాషలాడే వారిపై జరిమానాలు విధిస్తుండటంతో ఈ ఊరు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది.
మేం గ్రామంలోకి అడుగుపెట్టగానే పెద్ద బ్యానర్ కనిపించింది. దానిపై తీర్మానానికి సంబంధించిన వివరాలను రాశారు. గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర సర్పంచ్ శరద్ అరగడేను మేం కలిశాం.
"ఈ తీర్మానం హెడ్‌లైన్ 'ఇది తల్లులు, అక్కాచెల్లెళ్ల గౌరవం కోసం'. మనం అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఉన్నాం, ఆమె శరీరం చాలా పవిత్రమైనది. వారిని మనం అవమానించకూడదు. మనం ఒక మహిళను దుర్భాషలాడితే.. సొంత తల్లిని, సోదరిని అన్నట్లే. అలాంటి వారికి 500 రూపాయలు జరిమానా విధించాలని మా గ్రామ సభ తీర్మానించింది" అని శరద్ తెలిపారు.


ఫొటో సోర్స్, Srikant Bangle/BBC
గ్రామస్తులు ఏమంటున్నారు?
గ్రామంలో ఎక్కడ చూసినా ఈ తీర్మానం పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. జ్ఞానేశ్వర్ థోరట్ అనే స్థానికుడు గ్రామంలోని ఒక కూడలిలో తన స్నేహితులతో ముచ్చటిస్తున్నారు.
ఈ తీర్మానం గురించి మేము ఆయనను అడిగినప్పుడు "ఇది సరైన నిర్ణయం, ఎందుకంటే కొన్నిసార్లు స్నేహితులు కలిసి కూర్చున్నప్పుడు, వారిలో ఎవరో ఒకరు మరొకరి తల్లి, సోదరిని దూషిస్తుంటారు. ఇది తప్పు" అని అన్నారు.
"స్నేహితుల మధ్య గొడవలు జరిగితే కుటుంబాన్ని లాగడం సరికాదు. గ్రామ సభ తీసుకున్న నిర్ణయం మంచిదే. భయంతో ఎవరూ దుర్భాషలాడరు" అని జ్ఞానేశ్వర్ అభిప్రాయపడ్డారు.
సౌందాల గ్రామ మహిళలు ఈ నిర్ణయం కీలకమైనదని చెబుతున్నారు. గ్రామపంచాయతీ రూ.500 అపరాధ రుసుం తీర్మానించింది, దీంతో జనం దుర్భాషలాడటం తగ్గుతుందని స్థానిక మహిళ జ్యోతి బోధక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Kiran Sikle
సీసీటీవీలు
ఈ తీర్మానం 2024 నవంబర్ 28న ఆమోదించి, అదే రోజు నుంచి అమలు చేశారు. దుర్భాషలాడిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు.
సర్పంచ్ శరద్ ఆరగాడే మాట్లాడుతూ.. "పొలం కాలువ విషయంలో ఇద్దరు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు ఉదయం డ్యామ్ వద్దకు వెళ్లాం. పిల్లర్లు ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పాం. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నామని అంగీకరించారు. దీంతో ఒక్కొక్కరు రూ. 500 చొప్పున జరిమానా చెల్లించారు" అని చెప్పారు.
అయితే ఎవరైనా దుర్భాషలాడిన తర్వాత కూడా జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే? అపుడేం చేస్తారు?.
ఈ విషయాన్ని ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నమోదు చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఆ తర్వాత నిందితులకు నోటీసులిస్తామని చెప్పారు.
"నోటీస్ తర్వాత కూడా జరిమానా కట్టకపోతే, చెల్లించాల్సిందేనని బలవంతం చేస్తాం" అని శరద్ చెప్పారు.
గ్రామసభ తీర్మాన సమయంలో ప్రజలు పొలాల్లో లేదా ఏదో ఒక పని కోసం బయటికి వెళ్తుంటారు. దీంతో వారు గ్రామసభకు హాజరుకాలేరు. అందుకే తీర్మాన విషయాలను తెలుసుకునేందుకు గ్రామంలోని పలుచోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు.
దుర్భాషలాడే పురుషులు, మహిళలు ఇద్దరికీ ఈ నియమం వర్తిస్తుంది. గ్రామంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటికి మైక్రోఫోన్లు ఉన్నాయని సర్పంచ్ చెప్పారు.
"ఘటనపై విచారణ జరుగుతుంది. ఇద్దరి వాదనలు వింటాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Srikant Bangle/BBC
పిల్లలకు మొబైల్ ఫోన్లపై ఆంక్షలు
ఇలాంటి నిర్ణయాలను భావితరాల కోసం కఠినంగా అమలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
"పెద్దలం దుర్భాషలాడినపుడు లేదా అనుచితమైన భాషను ఉపయోగించినప్పుడు పిల్లలు దానిని అనుకరిస్తారు" అని విలేజ్ అసిస్టెంట్ ప్రతిభా పిసోటే అన్నారు.
"కాబట్టి, మనం ఆపితే ఖచ్చితంగా దానిని అరికట్టవచ్చు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, పాఠశాల విద్యార్థులు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధించాలని గ్రామ పంచాయతీ నిర్ణయించింది. తల్లిదండ్రులు ఈ నిబంధనను తప్పకుండా అమలు చేస్తున్నారు.
మంగళ్ చముతే కొడుకు గ్రామంలోని పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. రాత్రి 7 నుంచి 9 లోపు పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని గ్రామ పంచాయతీ తీర్మానించిందని పిల్లలకు చెప్పామని మంగళ్ అన్నారు. ఆ సమయంలో చదువుకుంటున్న పిల్లల చిత్రాలను తల్లిదండ్రులు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయగా సర్పంచ్ శరద్ చూపించారు.
ఇతర గ్రామాలు కూడా తమ తల్లులు, సోదరీమణులను ఎవరూ దుర్భాషలాడకుండా చర్యలు తీసుకోవాలని సౌందాల గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














