అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు: భార్య నికిత, ఆమె తల్లి, సోదరుడు అరెస్ట్

ఫొటో సోర్స్, BCP ( Whitefield)
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక – ఈ కథనంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని కలచివేయొచ్చు
''కేసు తేలే వరకూ నా అస్థికలు నిమజ్జనం చేయకండి. నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలు కోర్టు దగ్గర మురికిగుంటలో పారేయండి'' - బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి అతుల్ సుభాష్ తన ఆత్మహత్య లేఖలో రాసిన మాట ఇది.
తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు, ఒక న్యాయాధికారి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అతుల్ రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
24 పేజీల సుదీర్ఘ ఆత్యహత్య లేఖతోపాటు, ''ఈ ఏటీఎం శాశ్వతంగా మూత పడింది. భారత్‌లో మగవారిపై చట్టపరమైన మారణకాండ జరుగుతోంది'' అనే హెడ్డింగ్‌తో గంటా 20 నిమిషాల నిడివి గల వీడియో, తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసి, ఆత్మహత్య చేసుకున్నారు అతుల్ సుభాష్.
''ఇంకా న్యాయం జరగాల్సి ఉంది'' (జస్టిస్ ఈజ్ డ్యూ) అని ఇంగ్లిష్‌లో రాసి, దాని పక్కనే చనిపోయే ముందు తాను చేయాలనుకున్న పనుల చెక్ లిస్ట్ కప్‌బోర్డుపై అతికించి, వాటిలో అన్ని పనులూ చేసినట్టుగా టిక్ పెట్టి, ఆత్మహత్య చేసుకున్నారు అతుల్.
దీనిపై అతుల్ సోదరుడు వికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 0682 కింద నమోదైన ఎఫ్ఐఆర్‌లో అతుల్ భార్య నికితా సింఘానియా, అత్త నిషా సింఘానియా, బావమరిది అనురాగ్ సింఘానియా, వరుసకు మామ అయ్యే సుశీల్ సింఘానియా పేర్లను ఆరోపితులుగా చేర్చారు.
అతుల్ భార్య నికితా సింఘానియాను పోలీసులు హరియాణాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేశారు. నికిత తల్లి నిషా సింఘానియాను, నికిత సోదరుడు అనురాగ్ సింఘానియాను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేశారు.


ఫొటో సోర్స్, AtulSubhas/X
ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో ఒక జడ్జి పేరును కూడా అతుల్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నప్పటికీ, వికాస్ ఫిర్యాదులోను, ఎఫ్ఐఆర్‌లోను ఆ జడ్జి పేరును రాయలేదు. డిసెంబరు 9 తెల్లవారుజామున తనకు ఆత్మహత్య సమాచారం అందినట్టు అతుల్ సోదరుడు ఫిర్యాదులో రాశారు.
లేఖలో ఏముంది?
అతుల్ రాసిన 24 పేజీల లేఖలో కొంత టెక్స్ట్‌తో పాటు, గత కేసుల వివరాలు, వాట్సాప్ చాట్ల స్క్రీన్ షాట్లు, కొన్ని ఫోటోలు..ఉన్నాయి. ప్రతి పేజీలో 'జస్టిస్ ఈజ్ డ్యూ' అనే పెద్ద హెడింగ్ ఉంది.
తన డబ్బు తీసుకుని, తిరిగి అదే డబ్బుతో తన కుటుంబంపై యుద్ధం చేయడాన్ని ఇక అనుమతించబోనని, కోర్టులో లంచం అడిగారు కానీ తాను అవినీతికి పాల్పడదలుచుకోలేదని ఆ లేఖలో రాశారు. మెయింటెనెన్స్ రూపంలో తన డబ్బు దోచుకోవడానికి తన పిల్లలనే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు.
అతుల్ చేసిన ఇతర ముఖ్యమైన ఆరోపణలు, చెప్పిన విషయాలు:
1. అతుల్‌పై ఆయన భార్య పెట్టినవి మొత్తం 6 కేసులు, వాటిని తొందరగా విచారించాలంటూ హైకోర్టులో వేసిన 2 పిటిషన్లు, అదనపు నగదు కోసం హైకోర్టులో వేసిన మరో పిటిషన్, మొత్తం 9 పిటిషన్ల వివరాలు.
2. రెండు సందర్భాల్లో తన భార్య తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందంటూ కొన్ని సంభాషణలు ఈ లేఖలో పెట్టారు. ఇందులో ఒకటి జడ్జి సమక్షంలోనే జరిగిందని ఆరోపించారు. వారి సంభాషణలన్నీ హిందీలో వివరంగా రాశారు.
3.కోర్టులో సిబ్బంది, న్యాయాధికారి డబ్బు డిమాండ్ చేశారన్న వివరాలు ఉన్న ఆరోపణలు. అక్కడి సిబ్బంది, న్యాయాధికారి పేర్లను, వారు డిమాండ్ చేసిన మొత్తాలను రాశారు.
4. జాన్పూర్ కోర్టు తీర్పుపై ప్రశ్నలు, తీర్పులో అంశాలపై తన అభ్యంతరాలు సుదీర్ఘంగా రాశారు. ఈ విభాగంలో మొత్తం 17 పాయింట్లు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పులను ఫాలో కాలేదని, భరణం ఎంతన్న నిర్ణయం సక్రమంగా జరగలేదని, జడ్జి ఏకపక్షంగా వ్యవహరించారని, ఇలాంటివెన్నో ఆరోపణలు ఇందులో ఉన్నాయి.
తన తరపు పిటిషన్లను పక్కన పెట్టి, ఆవిడ పిటిషన్లనే అంగీకరించారని ఆరోపణలు చేశారు. కొడుకును చూడనివ్వలేదని, కోర్టు కూడా ఆ దిశగా సాయం చేయలేదని అన్నారు.
5. కేసు సెటిల్మెంటుకు ముందుగా రూ.కోటి, తరువాత రూ.3 కోట్లు డిమాండ్ చేశారని, మూడేళ్లుగా బాబుతో మాట్లాడనివ్వలేదని, బాబు ఖర్చుల కోసం మాత్రం నెలకు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
6. హత్యాయత్నం, అసహజ శృంగారం, వరకట్న వేధింపుల కేసులు వంటి తప్పుడు కేసులు తనపై పెట్టారన్నారు.
7. కేసును మొత్తం 120 సార్లు వాయిదాలు వేశారని, తాను స్వయంగా 40 సార్లు బెంగళూరు నుంచి జాన్పూర్ వెళ్లాల్సి వచ్చిందన్నారు. తన వృద్ధ తల్లిదండ్రులు బిహార్ నుంచి, తన సోదరుడు దిల్లీ నుంచి రావాల్సి వచ్చిందన్నారు.
8. ప్రతి చిన్న సందర్భానికీ..అంటే ఏదైనా పూజ జరిగితే 6 చీరలు, రూ.10 లక్షల విలువైన ఆభరణాలు డిమాండ్ చేసేవారన్నారు. తన నుంచి రూ.16 లక్షలు తీసుకుని, మరో రూ.50 లక్షలు ఇంటి నిర్మాణం కోసం అడిగారన్నారు. ఇవ్వను అన్నప్పుడల్లా గొడవేనన్నారు.
9. తమ కుటుంబంపై భార్య కుటుంబం చేసిన ఆరోపణల వివరాలు ఇచ్చారు.
10. కోర్టుల పనితీరు, కోర్టుల్లో అవినీతి, ఉన్నత స్థాయి న్యాయమూర్తులపై కొన్ని ఆరోపణలు, మహిళలకు అనుకూల చట్టాలు, తన భార్య తప్పుడు సమాచారంతో కేసులు వేసినా కోర్టులు చర్యలు తీసుకోకపోవడం, జడ్జి ప్రవర్తన...ఇలాంటివన్నీ ప్రత్యేకంగా రాశారు.
11. ''బాబూ నువ్వు ఏదో ఒక రోజు ఈ లేఖ చదివి అర్థం చేసుకుంటావని ఇదంతా రాస్తున్నాను'' అంటూ తన కుమారుడిని ఉద్దేశించి కూడా రాశారు..
అయితే ఈ అంశాలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అతుల్ డిమాండ్లు ఏంటి ?
1.తన కేసుల విచారణ బహిరంగంగా (లైవ్‌లో) జరగాలి. తన ఆత్మహత్య లేఖ, వీడియోలను మరణ వాంగ్మూలంగా తీసుకోవాలి.
2.ఉత్తర ప్రదేశ్ కోర్టుల కంటే బెంగళూరు కోర్టులు నయం. తన కేసు ఇక్కడకు మార్చాలి.
3.తన పిల్లాడిని తన తల్లితండ్రులకు అప్పగించాలి. తన శవం దగ్గరకు భార్య, ఆమె తరపు బంధువులను రానివ్వకూడదు. కోర్టు కేసు తేలే వరకూ అస్థికలు నదుల్లో కలపవద్దు. తన భార్యకు, అవినీతిపరురాలైన జడ్జికి శిక్ష పడకపోతే కోర్టు దగ్గర ఏదో ఒక మురికి గుంటలో నా అస్థికలు కలిపేయండి.
4.నన్ను వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి. నా కుటుంబాన్ని వేధించడం మానండి. తప్పుడు కేసులు పెట్టానని ఒప్పుకుంటే తప్ప, కేసులు వెనక్కు తీసుకోవడానికి తన భార్యను అనుమతివ్వవద్దు, వారితో రాజీ పడవద్దు.
అంటూ రాసిన అతుల్, ప్రతి పేజీపైనా సంతకం పెట్టారు.
అతుల్ కుటుంబం నికిత కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
''కోర్టులో పనిచేసేవారు చట్ట ప్రకారంగానీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగానీ పనిచేయడం లేదు. కనీసం 40సార్లు బెంగళూరు నుంచి జాన్పూర్ వెళ్లాడతను. ఆ అమ్మాయి (అతుల్ భార్య) ఒకదాని తరువాత ఒకటి చొప్పున కేసులు పెడుతూ వచ్చింది. అతను బాగా ఫ్రస్టేషన్లో ఉన్నా, ఎప్పుడూ మా దగ్గర బయట పడలేదు. అకస్మాత్తుగా రాత్రి ఒంటిగంటకు మా చిన్నబ్బాయికి మెయిల్ వచ్చింది. మా అబ్బాయి ఆ అమ్మాయిపై చేసిన ఆరోపణలు వంద శాతం వాస్తవం. మా అబ్బాయి పడ్డ బాధ చెప్పడం మా తరం కాదు'' అన్నారు పవన్ కుమార్.
అయితే ఈ ఆరోపణలపై స్పందించడానికి నికిత కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ అందుబాటులోకి రాలేదు. వారు స్పందిస్తే ఇక్కడ జతచేస్తాం.
ఈ ఘటన తరువాత నికిత లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ నుంచి సమాచారం, ఫోటో సేకరించి పలువురు ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించాలంటూ ఆమె పనిచేసే కంపెనీని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం నికిత అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ హైడ్/ఆఫ్ చేశారు.
అయితే ఏదైనా తుది అభిప్రాయానికి వచ్చేముందు ఆమె వాదన కూడా వినాలని కొందరు నెటిజన్లు చెప్పడం కనిపించింది.
భారత్‌లో మగవారి ఆత్మహత్యలే ఎక్కువా?
భారత్‌లో ఆత్మహత్యల వార్తలు అసాధారణం కాకపోయినా, ఈ ఆత్మహత్య దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా భారత్‌లో మగవారి హక్కులపై పెద్ద చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా భారతీయ సమాజంలో తరతరాలుగా మహిళపై ఉండే వేధింపులు, అణచివేత నుంచి రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన చట్టాలు, కాలక్రమంలో పురుషుల పాలిట శాపంలా మారాయని వాదించే వారి సంఖ్య పెరిగింది.
ఈ చట్టాలపై పోరాడుతూ, వీటి బాధితులకు అండగా అనేక స్వచ్ఛంద సంస్థలు మగవారి కోసం పోరాడుతున్నాయి. అటువంటి సంస్థలన్నీ ఇప్పుడు ఈ అతుల్ ఆత్మహత్య కేసును దేశంలో మగవారికి వ్యతిరేకంగా చట్టాల దుర్వినియోగానికి ఒక పెద్ద ఉదాహరణగా చూపుతున్నాయి.
చట్టాల దుర్వినియోగం అరికట్టి, మగ-ఆడ అంటూ లింగ వివక్ష లేని చట్టాలు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్త్రీల వేధింపుల వల్ల మగ వారి మరణాలు గణనీయంగా ఉన్నాయని చెబుతోంది ఏకం న్యాయ ఫౌండేషన్. దీనిపై ఆ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం, 2023లో ఆ సంస్థ పరిశీలించిన కేసుల్లో భర్తను భార్య చంపిన సుమారు 306 కేసుల్లో 213 వివాహేతర సంబంధాల వల్ల, 55 కుటుంబ గొడవల వల్లా, మిగతావి ఇతర కారణాల వల్ల జరిగాయి.
ఇక అదే ఏడాది వారు అధ్యయనం చేసిన 517 ఆత్మహత్య కేసుల్లో మగవారు మానసిక వేధింపుల వల్ల 235 మంది, కుటుంబ హింస వల్ల 22 మంది, వివాహేతర సంబంధాల వల్ల 47 మంది, తప్పుడు కేసుల వల్ల 45 మంది, ఇతర కారణాల వల్ల 168 మంది మరణించారు.
ఈ మానసిక వేధింపులు అంటే భార్య లేదా ఆమె తరపు వారి నుంచి తప్పుడు కేసులు, ఆరోపణలు, జైలుకు పంపుతామనే బెదిరింపులు వంటివే ఎక్కువని చెబుతోంది ఆ నివేదిక.
ఇక ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం 2022లో భారత్‌లో ఆత్మహత్య చేసుకున్న వారు 1,70,924 మంది. వారిలో ఆడ, మగ కలిపి కుటుంబ సమస్యల వల్ల 31.7 శాతం, వివాహ సంబంధిత సమస్యల వల్ల 4.8 శాతం, ప్రేమ వ్యవహారాల వల్ల 4.5 శాతం మరణించినట్టు తెలుస్తోంది.
2021 కూడా దాదాపు ఇదే శాతంలో ఉన్నాయి. ఇలా చనిపోయిన వారిలో 2022లో మగవారు 71.8 శాతం కాగా, ఆడవారు 28.2, అలాగే 2021లో మగవారు 72.5 శాతం మంది చనిపోగా, ఆడవారు 27.4 శాతం మంది చనిపోయారు. అంటే ఆత్మహత్యల్లో ఆడవారి కంటే మగవారివి రెండింతలు ఎక్కువ ఉంటున్నాయి.
అదే సందర్భంలో వివాహ సమస్యలు, అందులోనూ కట్నం వేధింపులు, పిల్లలు కలగకపోవడం అనే కారణాలతో చనిపోయే వారిలో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువని ఎన్సీఆర్బీ డాటా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘మగ వారికీ చట్టాలు కావాలి’
ఇవాళ అతుల్ వంటి వారు చనిపోయే పరిస్థితి రావడానికి కారణం లింగ భేదాలతో కూడిన చట్టాలేనని, వాటి వల్ల మగవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారని ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ భరధ్వాజ్ అన్నారు.
''ప్రస్తుతం భారత్‌లో మహిళల రక్షణ కోసం 6కు పైగా చట్టాలు ఉన్నాయి. కానీ మగవారి కోసం ఏవీ లేవు. ఈ దేశంలో మగవారిపై కూడా గృహ హింస జరుగుతోంది. కుటుంబ వేధింపులున్నాయి. భార్యలు భర్తలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. కానీ వాటికి చట్టం లేదు. అలాంటి కేసుల సంఖ్య తక్కువైనంత మాత్రాన చట్టాలు చేయకూడదా?’’ అని దీపికా నారాయణ్ భరద్వాజ్ ప్రశ్నించారు.
‘‘ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 9 కేసులు వేసింది అతుల్ భార్య. భర్తపైనే కాకుండా భర్త కుటుంబంపై కూడా కేసులు వేస్తున్నారు. అలాంటి బాధితులు దేశమంతా ఉన్నారు కాబట్టే అతుల్ కేసులో ఇంత స్పందన, మద్దతు వచ్చాయి'' అని బీబీసీతో అన్నారు దీపికా భరధ్వాజ్.
ఇదంతా మహిళలకు వ్యతిరేకంగా చేస్తున్నది కాదని, మగవారికి కూడా రక్షణ కావాలని మాత్రమే తాము చెబుతున్నామని స్పష్టం చేశారామె.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీం కోర్టు పదే పదే చెబుతోంది
మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీం కోర్టు చెప్పినా, ప్రభుత్వం కొత్త చట్టాలు లేదా సవరణలతో ముందుకు వచ్చిన సందర్భాలు కనపడడం లేదని సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
''చట్టాల దుర్వినియోగం అనే సమస్య అన్ని రకాల చట్టాల్లోనూ ఉంటుంది. కానీ మహిళలకు సంబంధించిన కేసుల్లో అది ఈ మధ్య చాలా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.’’ అని లక్ష్మీ నారాయణ అన్నారు. ఈ మాట తాను చెప్పడం లేదని, స్వయంగా సుప్రీంకోర్టు పదే పదే చెప్పిందని, ఇందుకోసం సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
‘‘ఈమధ్య పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టు చేయకుండా ముందుగా 41ఏ నోటీసు ఇవ్వాలి అని సుప్రీ కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన సంగతి తెలుసు కదా.. వాస్తవానికి ఆ నిబంధన రావడానికి కూడా వరకట్న వేధింపుల కేసులే కారణం.’’ అని ఆయన వివరించారు.
‘‘అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ తీర్పులోనే సుప్రీం కోర్టు ఇలా ఎవర్ని పడితే వారిని, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయకుండా 41ఏ నిబంధన ఇచ్చింది. మహిళల చట్టాల దుర్వినియోగానికి ఈ కేసు ఒక పరాకాష్ట'' అని బీబీసీతో అన్నారు లక్ష్మీనారాయణ.

ఫొటో సోర్స్, Getty Images
‘మగవారు వేరే చట్టాల ద్వారా కోర్టులకెళ్లొచ్చు’
అతుల్ సుభాష్ కేసులో తప్పు ఎవరిదైతే వారికి శిక్ష పడాల్సిందే కానీ ఒక్క కేసు ఆధారంగా 498ఏ కేసులన్నీ తప్పుడు కేసులు అనడం సరికాదని మహిళా హక్కుల కార్యకర్త దేవి అన్నారు.
''మహిళా సంఘాలమే అయినప్పటికీ మా దగ్గరికి ఎందరో మగవారు బాధితులుగా వస్తారు. వారికి మేం అండగా నిలబడి సాయం చేస్తాం. ఏ కేసు అయినా ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్‌ని బట్టే నిర్ధరణ చేయాలి. ఒక కేసు ఆధారంగా చట్టాలపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నేను వందల కేసుల ఉదాహరణలు చెబుతాను. ఎంతో అరాచకంగా మహిళను వేధించి, చివరకు మహిళకు న్యాయం దక్కని ఉదాహరణలు కొన్ని వందలు ఉన్నాయి నా దగ్గర. భర్త కొడితే రక్తం వస్తున్నా సరే కేసులు నమోదు చేయని సందర్భాలు ఉన్నాయి. ఈ దేశంలో దుర్వినియోగం కాని చట్టం ఏముందో చెప్పండి? చట్టాల దుర్వినియోగానికి ప్రధాన కారణం వ్యవస్థలో దాన్ని అమలు చేయాల్సిన వారే'' అని బీబీసీతో అన్నారు దేవి.
‘‘జాతీయ కుటుంబ సర్వే ప్రకారం, ఒక ఐదు కారణాలతో భార్యను భర్త కొట్టడం తప్పేం కాదని మహిళలే అంగీకరిస్తున్న సమాజం మనది. దేశంలో వరకట్న వేధింపులు మరణాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మహిళలపై నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. నిజంగా మగవారిని ఏదైనా చట్టాల ద్వారా బాధితులను చేస్తుంటే, వారు ఇతరత్రా చట్టాల ద్వారా కేసులు పెట్టవచ్చు, కోర్టులకు వెళ్లవచ్చు'' అన్నారు దేవి.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














