అజ్మీర్ దర్గాను శివాలయంపై నిర్మించారా? ఏమిటి ఈ వివాదం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మోహర్ సింగ్ మీణా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గాను శివాలయం పైన నిర్మించారంటూ హిందూ సేన వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
కేసులో అన్ని పక్షాలకూ కోర్టు నోటీసుల జారీ చేసింది.
అజ్మీర్ వెస్ట్ సివిల్ కోర్టు జడ్జి( సీనియర్ డివిజన్) మన్మోహన్ చందేల్ ఈ పిటిషన్‌ను నవవంబర్ 27న విచారణకు స్వీకరించారు.
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దర్గా కమిటీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు.
అక్కడ శివాలయం ఉందనడానికి ఆధారాలు అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా కొన్ని వివరాలు సమర్పించారు.
హర్ బిలాస్ సర్దా రాసిన పుస్తకంతో పాటు మొత్తం 3 వివరాలను ఆయన సమర్పించారు.
ఆలయంలో పూజలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.
అజ్మీర్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గా ప్రధాన వారసుడు సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ ఈ పిటిషన్‌ను ‘పాపులారిటీ పొందడానికి వేసిన చౌకబారు ఎత్తుగడ’ అని విమర్శించారు.
విష్ణుగుప్తా లాంటి వాళ్లంతా దేశాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళుతున్నారని నసీరుద్దీన్ అన్నారు.
ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 20కి వాయిదా వేసింది.

పిటిషనర్ ఏమంటున్నారు?
దర్గాలో ఆలయం ఉందన్న వాదనకు మూడు ఆధారాలు ఉన్నాయని విష్ణుగుప్తా చెబుతున్నారు.
“బ్రిటిషర్ల పాలనలో అజ్మీర్ మునిసిపాలిటీ కమిషనర్‌గా పనిచేసిన హర్ బిలాస్ సర్దా 1911లో రాసిన పుస్తకంలో ఆలయంపై దర్గాను నిర్మించడం గురించి ప్రస్తావించారు. మనం దీన్ని ఆధారంగా తీసుకోవచ్చు” అని విష్ణుగుప్తా చెప్పారు.
రెండో ఆధారం గురించి చెబుతూ ‘‘మా స్థాయిలో పరిశోధన చేసి పుస్తకంలోని సమాచారం ఆధారంగా దర్గాను సందర్శించాం. హిందూ దేవాలయాన్ని కూల్చివేసి దాని మీద దర్గా నిర్మించారు. దర్గా గోడలు, తలుపులపై చెక్కిన ఆకృతులు హిందూ దేవాలయాలను గుర్తుకు తెస్తాయి” అని అన్నారు.
"అజ్మీర్‌లో అందరికీ తెలుసు. వారి పూర్వీకులు అక్కడ ఒక శివలింగం ఉండేదని చెబుతారు. అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేదని చెబుతారు” ఇది తన వద్ద ఉన్న మూడో ఆధారం అని విష్ణు గుప్తా వివరించారు.

ఫొటో సోర్స్, X/VISHNU GUPTA
"వాస్తవానికి దర్గాలో సంకట మోచన్ మహాదేవ్ ఆలయం ఉంది. దర్గాకు సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్ ఉంటే దాన్ని రద్దు చేయాలని, ఆ ప్రాంతాన్ని సంకట మోచన్ ఆలయంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు అక్కడ పూజ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని” విష్ణుగుప్తా కోరారు.
దర్గాలో బేస్‌మెంట్ ఉందని దాన్ని మూసివేశారన్న విష్ణుగుప్తా.. ప్రభుత్వం ఆర్కియాలజీ విభాగంతో సర్వే చేయిస్తే వాస్తవాలన్నీ బయట పడతాయని చెప్పారు.
విష్ణు గుప్తా 2011లో హిందూ సేనను స్థాపించారు. ఈ సంస్థ హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతోంది.
హిందువులకు సంబంధించిన విషయాలపై చేసిన వ్యాఖ్యల ద్వారా విష్ణుగుప్తా గతంలోనూ వార్తల్లో నిలిచారు.
ముస్లింలకు మైనారిటీ హోదాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇటీవల హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అంతకుముందు 2022లో పీఎఫ్ఐ సంస్థను నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK
దర్గా కమిటీ ఏం చెబుతోంది?
విష్ణుగుప్తా కోర్టులో కేసు వేసిన తర్వాత న్యాయస్థానం దర్గా కమిటీకి నోటీసులు జారీ చేసింది. కొన్నేళ్లుగా అజ్మీర్ దర్గాలో దర్గా నాజిమ్‌ను నియమించలేదు.
దీంతో దర్గా నాజిమ్ బాధ్యతలను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి మహ్మద్ నదీమ్ చూస్తున్నారు.
"మాకు ఇంకా కోర్టు నోటీసు అందలేదు. కోర్టు నోటీసు వచ్చిన తర్వాత మేం దానిని పరిశీలించి చట్టపరంగా స్పందిస్తాం" అని నదీమ్ బీబీసీకి చెప్పారు.
"మా లాయర్లను సంప్రదిస్తున్నాం. ఈ కేసును చట్టబద్దంగా ఎదుర్కొంటాం” అని అజ్మీర్ దర్గా ప్రధాన వారసుడు సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు చెప్పారు.
“కొంతమంది పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారు. ప్రతిరోజూ కోర్టుకెళ్లి పిటిషన్లు వేస్తుంటారు. మసీదు లేదా దర్గాలో దేవాలయం ఉందని చెబుతారు. ఇది తప్పుడు సంప్రదాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"1911 నాటి పుస్తకం ఆధారంగా వాళ్లు చేస్తున్న వాదనలకు విశ్వసనీయత లేదు. 850 ఏళ్ల చరిత్రను వందేళ్లనాటి పుస్తకం ఆధారంగా తిరస్కరించలేం" అని చిష్తీ అన్నారు.

ఫొటో సోర్స్, HARBILAS SARDA
దర్గా వద్ద పెరిగిన పోలీసుల గస్తీ
గుడిపై దర్గా నిర్మించారనే వాదన వచ్చినప్పటి నుంచి ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇటీవల అనేక రాష్ట్రాల్లో ఆలయ-మసీదు వివాదం తర్వాత, ఆయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఈ పిటిషన్ తర్వాత రాజస్థాన్‌లోనూ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ అంశం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలక్కుండా అధికారులు చర్యలు చేపట్టారు.
"మేం అన్ని వర్గాలతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. కోర్టు చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. శాంతి భద్రతల విషయం రాజీపడే ప్రసక్తే లేదు. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహిరిస్తే కఠిన చర్యలు తప్పవు” అని అజ్మీర్ ఎస్పీ వందితా రాణా బీబీసీకి చెప్పారు
‘శాంతి, సామరస్యం, శాంతిభద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ప్రజలంతా అందరూ ఐక్యంగా ఉండాలని ఇలాంటి పిటిషన్ల ద్వారా కొంతమంది సమాజంలో అరాచకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ అన్నారు.
"ఖ్వాజా సాహెబ్ ఆస్థానానికి 850 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఎనిమిది వందల సంవత్సరాలలో జైపూర్, జోధ్‌పూర్, కోట, గ్వాలియర్ సహా రాజులందరికీ దర్గాతో అనుబంధం ఉంది. ఇందులో శివాలయం ఉంటే వాళ్లంతా అభ్యంతరం చెప్పకుండా ఉంటారా?” అని నసీరుద్దీన్ ప్రశ్నించారు.
" కేంద్ర ప్రభుత్వం ప్రార్థన స్థలాల చట్టం 1991ని మరింత పటిష్టం చేయాలి. మతపరమైన స్థలాలకు సంబంధించి 1947 కి ముందు ఉన్న వివాదాలను పక్కన పెట్టాలి. కోర్టు నిర్ణయం ఏదైనా సరే, దాన్ని గౌరవించాల్సిందే. అయితే ఇలాంటి వ్యక్తులు వివాదాలు సృష్టించకూడదు” అని సయ్యద్ నసీరుద్దీన్ చెప్పారు.

ఫొటో సోర్స్, HARBILAS SARDA
కేసుకు ఆధారంగా ఉన్న పుస్తకంలో ఏముంది?
విష్ణు గుప్తా హర్ బిలాస్ పుస్తకాన్ని తన వాదనకు ప్రధాన ఆధారంగా చూపిస్తున్నారు.
1911లో హర్ బిలాస్ ‘అజ్మీర్: హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్’ అనే పుస్తకాన్ని రాశారు. 206 పేజీల ఈ పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి.
పుస్తకంలో దర్గా ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీపై ఒక అధ్యాయం కూడా ఉంది. పేజీ నంబర్ 97 మొదటి పేరాలో, దర్గాలోని మహాదేవ్ ఆలయ ప్రస్తావన ఉంది.
ఈ పుస్తకంలో హర్ బిలాస్ ఏం రాశారంటే.. సాంప్రదాయం ప్రకారం నేలమాళిగలో ఉన్న ఒక మందిరంలో మహాదేవుని చిత్రం ఉంది, దానిపై ఒక బ్రాహ్మణ కుటుంబం ప్రతిరోజూ చందనాన్ని ఉంచుతుంది” అని రాశారు.
ఈ వ్యాఖ్యల ఆధారంగానే విష్ణుగుప్తా కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పుస్తకం ప్రామాణికతపై సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














