నెల్లూరు చిన్నారి మృతి: ‘ఆసుపత్రి తీసుకెళ్తామంటే చర్చిలోనే ఉండమన్నారు, పాప చనిపోయింది’

పాప తల్లి లక్ష్మి
ఫొటో క్యాప్షన్, చనిపోయిన పాప తల్లి లక్ష్మి
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందడం కలకలం రేపుతోంది. అనారోగ్యంతో ఉన్న తమ పాపను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉండిపోవడంతోనే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు చెప్పారు.

కలువాయి మండలం బాలాజీరావు పేటకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మి దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని చేజర్ల మండలంలో ఆదురుపల్లిలోని ఒక చర్చికి తీసుకెళ్లారు. పాపకు నయం కావడానికి అక్కడ ప్రార్థనలు చేసినట్లు వారు చెబుతున్నారు.

అయితే, అసలు చిన్నారి ఎలా చనిపోయింది? తల్లిదండ్రులతో పాటు, చర్చి నిర్వాహకులు, డాక్టర్లు ఏం చెబుతున్నారు? తదితర విషయాలను తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది.

ఎస్సీ వర్గానికి చెందిన లక్ష్మయ్య, లక్ష్మిలది నిరుపేద కుటుంబం. వీరికి ఇల్లు కూడా సరిగా లేదు. గుడిసె పడిపోయి మొండిగోడలు ఉన్నాయి.

లక్ష్మయ్య నెల్లూరులోని ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ ఆటో నడుపుతుంటారు.

ఆ సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.

రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురైన తమ పాపను వారు పలుచోట్ల చూపించారు. చివరికి నవంబర్ 2న నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ సీటీ స్కానింగ్ లాంటి పరీక్షలన్నీ చేసిన తర్వాత చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్లు చెప్పారని తల్లి లక్ష్మి అన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లాలని సూచించారని ఆమె తెలిపారు.

''పాప తలనొప్పితో బాధపడుతోందని, వాంతులు చేసుకుంటోందని నెల్లూరులోని నిజాం హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. అక్కడి డాక్టర్లు తలలో నీరు ఉందని చెప్పారు. మళ్లీ తలనొప్పి ఎక్కువగా ఉందని పాప బాధపడుతుంటే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాం. ఎమ్మారై స్కానింగ్ తీశారు. బ్రెయిన్‌లో గడ్డ ఉంది. ఆ గడ్డలో నీరు చేరింది. వెంటనే చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్‌కి వెళ్లండి. అక్కడ ఆపరేషన్ చేస్తే, మళ్లీ హైదరాబాద్ పంపిస్తారు అని చెప్పారు'' అని తల్లి లక్ష్మి అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆదురుపల్లిలోని చర్చి
ఫొటో క్యాప్షన్, లక్ష్మయ్య, లక్ష్మి దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని చేజర్ల మండలం ఆదురుపల్లిలోని ఒక చర్చికి తీసుకెళ్లారు.

పాపను చెన్నైలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లబోయే ముందు బంధువుల్లో ఒకరు పాపను చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తే నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు చిన్నారిని చేజెర్ల మండలం ఆదురుపల్లిలోని చర్చికి తీసుకెళ్లారు.

అక్కడ ఒక టార్పాలిన్ కప్పిన గుడిసెలోనే చర్చిని నిర్వహిస్తున్నారు. చెన్నై ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు చిన్నారికి దేవుడు ఆశీస్సులు లభిస్తాయని చర్చికి వెళ్లామని లక్ష్మి తెలిపారు.

''చిన్న బిడ్డని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి మేం భయపడ్డాం. అయినా సరే దేవుడి దయతో వెళ్దాం అనుకున్నాం. వెళ్లేముందు చర్చికి పోదామనుకున్నాం. అక్కడికి వెళ్లిన తర్వాత పాపకు రెండు రోజుల పాటు తలనొప్పి, వాంతులు వచ్చాయి. తర్వాత కోలుకొని బాగా ఉంది. దీంతో ఇంటికి తీసుకెళ్లాం'' అని వివరించారు.

చర్చిలో చిన్నారి కోసం ప్రార్థనలు చేసిన పాస్టర్ వారిని అక్కడే ఉండమన్నారని, దీంతో తాము అక్కడే ప్రార్థనలు చేసుకుంటూ ఉండిపోయామని పాప తల్లిదండ్రులు చెప్పారు. ఆ సమయంలో పాప తల్లికి బాప్టిజం ఇచ్చారు.

పాప తండ్రి లక్ష్మయ్య
ఫొటో క్యాప్షన్, ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చర్చిలో ఉండటం వల్లే తన బిడ్డ చనిపోయిందని పాప తండ్రి లక్ష్మయ్య అంటున్నారు.

40 రోజులు చర్చిలో ఉంటే, తర్వాత ఏ ఇబ్బందీ ఉండదని, పాపను తీసుకెళ్లొచ్చు అని పాస్టర్ తమకు చెప్పారని చిన్నారి తల్లిదండ్రులు బీబీసీతో అన్నారు.

కొద్ది రోజుల తర్వాత పాపకు నయమైందని బంధువులను అందరినీ చర్చి దగ్గరకు రప్పించి తల్లిదండ్రుల చేత పాస్టర్ భోజనాలు కూడా పెట్టించినట్లు లక్ష్మయ్య చెప్పారు.

40 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన చిన్నారికి మళ్లీ తలనొప్పి, వాంతులు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి కాకుండా మళ్లీ చర్చికే తీసుకెళ్లారు.

శనివారం డిసెంబర్ 7న తల్లిదండ్రులు పాపను చర్చికి తీసుకొస్తే, ఆదివారం నుంచి ఆమె ఆరోగ్యం విషమించింది. చివరకు సోమవారం డిసెంబర్ 8న అర్థరాత్రి ప్రార్థనలు చేస్తున్న సమయంలో పాప చనిపోయింది.

ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చర్చిలో ఉండటం వల్లే తన బిడ్డ చనిపోయిందని పాప తండ్రి లక్ష్మయ్య ఆరోపిస్తున్నారు.

"తలలో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి, చెన్నైకి తీసుకెళ్లండని డాక్టర్లు చెప్పడంతో ముందుగా దేవుడి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుందామని చర్చికి వెళ్లాం. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఆశీర్వదించి.. నువ్వు ఇక్కడే ఉండు, ఏమీ కాదు, దేవుడు బాగు చేస్తాడు అని చెప్పి నా బిడ్డని అక్కడే ఉంచారు. వారం తర్వాత మళ్లీ నేను పాపను తీసుకెళ్తాను, ఆపరేషన్ చేయించాలంటే, 40 రోజులు అక్కడే ఉండాలని చెప్పి మా బిడ్డ ప్రాణాలు తీశాడు" అని లక్ష్మయ్య ఆరోపించారు.

చర్చి
ఫొటో క్యాప్షన్, ఆదురుపల్లిలో టార్పాలిన్ కప్పిన గుడిసెలో చర్చిని నిర్వహిస్తున్నారు.

‘‘పాస్టర్ నన్ను కూడా మతం మారమన్నారు. కానీ పాపకు నయమైతే మారతానని చెప్పా. కానీ, ఆయన వినకుండా బలవంతంగా మతం మార్పించారు’’ అని లక్ష్మయ్య తెలిపారు.

చర్చిలో ప్రార్థనల వల్ల చిన్నారికి ఆరోగ్యం నయం అయిందనుకొని సంతోషించామని, చర్చి దగ్గర అన్నదానం కూడా చేశామని పాప పెదనాన్న బండయ్య చెప్పారు.

''వచ్చే ఆదివారం వరకు ఉండండి, నార్మల్ రిపోర్టు వస్తుంది అని పాస్టర్ చెప్పారు. మేం గుడ్డిగా నమ్మి అక్కడే ఉండిపోయాం. ఆపరేషన్ చేస్తే ఏమవుతుందో అని భయపడి అక్కడే ఉండిపోయాం. వారం తర్వాత మళ్లీ రిపోర్ట్ కోసం హాస్పిటల్‌కి వెళ్తామంటే వద్దు అన్నారు. మేం చాలాసార్లు అడిగినా మాకు ఆస్పత్రికి వెళ్లే అవకాశం ఇవ్వలేదు'' అని బండయ్య అన్నారు.

''పాపకు మళ్లీ వాంతులైతే చర్చికి వెళ్తే బాగవుతుందని శనివారం రాత్రి చర్చికి తీసుకెళ్లాం. ఆదివారం రాత్రి 11 గంటలకి మళ్లీ వాంతులు, తలనొప్పితో పాప ఇబ్బంది పడింది. సోమవారం తెల్లవారుజామున చనిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్తామని పాస్టర్‌ని అడిగాం. అయితే ఆయన.. దేవుడి మీద భారం వేశారు కదా, దేవుడే చూసుకుంటాడు, ఉండండి అని చెప్పారు'' అని బండయ్య బీబీసీకి తెలిపారు.

పాస్టర్ ద్రాక్షవల్లి
ఫొటో క్యాప్షన్, పాస్టర్ ద్రాక్షవల్లి

డబ్బు లేకే ఆస్పత్రికి వెళ్లలేదు: పాస్టర్ ద్రాక్షవల్లి

తమ మీద వస్తున్న ఆరోపణలను చర్చి నిర్వాహకులు ఖండించారు.

''పాప చాలా నీరసంగా వచ్చింది. ప్రార్థనలు చేసిన తర్వాత 20 రోజుల వరకు బాగుంది. తర్వాత వాళ్ల బంధువులంతా కూడా వచ్చి చూసుకొని వెళ్లారు. పాపకు బాగుందని అందరికీ భోజనాలు పెట్టించి ఇంటికి వెళ్తాం అన్నారు'' అని పాస్టర్ ద్రాక్షవల్లి తెలిపారు.

పాపకు మళ్లీ బాగాలేదని ఆస్పత్రికి వెళ్లకుండా చర్చికే తీసుకొచ్చారని పాస్టర్ ద్రాక్షవల్లి బీబీసీకి చెప్పారు.

''మళ్లీ నాలుగు రోజుల తర్వాత పాపకు తలనొప్పిగా ఉందని వచ్చారు. ఆదివారం ప్రార్థనలు చేశాం. పాప బాగా యాక్టివ్ అయ్యింది. ఆరోజు నైట్ అంతా అందరూ ఉపవాసంలో ఉండి పాప కోసం ప్రార్థనలు చేశాం. పాపకు సమస్య ఎక్కువైంది. తర్వాత పాపను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉండగానే, తేల కండ్లు వేసింది. ఒడిలో నుంచి కింద పడుకోబెట్టగానే చనిపోయింది. నేను కూడా పాపను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి, ప్రార్థనలు కూడా చేసుకోవాలని చెప్పాను. కానీ వాళ్లు ఏం చెప్పారంటే.. మా పరిస్థితి బాగోలేదు. మా బంధువులు అడిగితే ఎవరూ మాకు సాయం చేయలేదు అని మా కాళ్లు పట్టుకున్నారు. బలవంతంగా మేం వారిని ఎలా బయటికి తోస్తాం చెప్పండి'' అని ఆమె అన్నారు.

చర్చి పాస్టర్ మత్తయ్య
ఫొటో క్యాప్షన్, చర్చి పాస్టర్ మత్తయ్య

తమను బయటకు వెళ్లనివ్వలేదని, బలవంతంగా చర్చిలో ఉంచారని పాప తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన చర్చి నిర్వాహకులు, వారు ఉద్దేశపూర్వకంగా తమపై అపవాదు వేస్తున్నారని చెప్పారు. తాము ఎవరికైనా బాగుండాలనే ప్రార్థనలు చేస్తామని, బలవంతంగా ఉంచబోమని చెప్పారు.

పాప తల్లిదండ్రులకు మతం మార్చారనే ఆరోపణలపై చర్చి పాస్టర్ మత్తయ్య స్పందించారు.

''మీకు ఇష్టముంటే మతం తీసుకోండి, కొంతమంది తీసుకుంటున్నారని చెప్పాం. మాకు ఇష్టం ఉంది, తీసుకుంటున్నామని వాళ్లే తీసుకున్నారు'' అని చెప్పారు.

 పిల్లల వైద్య నిపుణులు సర్దార్ సుల్తానా

డాక్టర్లు ఏం చెబుతున్నారు?

చిన్నారిని మొదట్లో పరిశీలించిన నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని పిల్లల వైద్య నిపుణులు సర్దార్ సుల్తానా బీబీసీతో మాట్లాడారు.

''తలనొప్పి అంటూ పాపను తీసుకొచ్చారు. కంటి చెకప్ కోసం మేం ఆప్తల్మాలజీకి పంపించాం. అక్కడ గ్రేడ్ 4 ఫ్యాపిల్లెడేమా అని రిపోర్ట్ వచ్చింది. అంటే బ్రెయిన్‌లో ప్రెజర్ ఎక్కుగా ఉండటం వల్ల కంటి మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. వెంటనే మేం ఎమ్మారై స్కానింగ్ రాశాం. గ్రేడ్ 4 ట్యూమర్ అని తేలింది'' అని డాక్టర్ సుల్తానా బీబీసీకి తెలిపారు.

ఆ తరువాత చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌కు ఈ కేసును రిఫర్ చేశామని సుల్తానా అన్నారు.

''అక్కడ న్యూరో సర్జరీ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. గ్రేడ్ 4 ట్యూమర్ అని వెళ్లమని చెప్పాం. అంటే మూడు నెలలకు ముందు నుంచి అది ఉండొచ్చు. మేం పంపించిన తర్వాత వాళ్లు తిరిగి రాలేదు. గ్రేడ్ 4 ట్యూమర్ అయితే గరిష్ఠంగా ఏడాది, ఏడాదిన్నర కాలం వరకూ బతకవచ్చు. వెంటనే సర్జరీ చేయకపోతే బ్రెయిన్, స్పైనల్ కార్డులో హెర్నియేట్ అవడం మొదలవుతుంది. అలా ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది ఎదురై ప్రాణాలకు ప్రమాదం వస్తుంది'' అని సుల్తానా తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని పోలీసులు చెప్పారు.

''కేసు పెట్టడానికి తల్లిదండ్రులు సుముఖంగా లేరు. చర్చి నిర్వాహకుల వల్ల తమకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని చెప్పారు'' అని చేజర్ల సబ్‌ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు బీబీసీకి తెలిపారు.

ఎవరు చేసినా తప్పే

మూఢనమ్మకాలకు ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి బలి కావడం దారుణమని సామాజిక ఉద్యమకారులు, రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు అన్నారు.

''ఇప్పుడు చర్చిలో జరిగింది. రేపు ఇంకెక్కడైనా జరగొచ్చు. దేవుడుని నమ్మవద్దని మేం చెప్పడం లేదు. వైద్యం తీసుకుంటూనే మనోధైర్యం కోసం నమ్మిన భగవంతుని పూజించుకోవచ్చు. అంతేకానీ, కేవలం భగవంతుడే మీదే భారం వేసి మూఢనమ్మకాలతో వైద్యానికి దూరంగా ఉంచడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి మూఢనమ్మకాలకు బలి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి'' అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)