అల్లు అర్జున్‌కు అండగా ఉంటామన్న నందమూరి బాలకృష్ణ.. జగన్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఏమన్నారంటే

ఫొటో సోర్స్, facebook/aha video
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ, సినీ వర్గాల నుంచి అనేక మంది స్పందిస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు.. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నాయకుడు జగన్‌లు అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు.
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. ఆయన నేరుగా అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం, ఆయనకు అండగా ఉంటాం అంటూ ‘ఎక్స్’లో ప్రకటించారు.
ఆ ప్రకటనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో పాటు తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీలనూ ట్యాగ్ చేశారు.
వీరితో పాటు తెలుగు సినీరంగం నుంచి నాని, ఇతర కొందరు నటులు.. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ తదితరులు కూడా స్పందించారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అల్లు అర్జున్‌తో కలిసి ‘అన్‌స్టాపబుల్’ వంటి షోస్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ దీనిపై స్పందిస్తూ ఈ అరెస్ట్ అన్యాయమన్నారు.
అల్లు అర్జున్‌కు అండగా ఉంటామని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Bandi sanjay/FaceBook
‘‘జాతీయ అవార్డు గ్రహీతను అగౌరవపరిచారు’’
అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు స్పందించారు.
జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ పట్ల పోలీసులు వ్యవహరించి తీరు అగౌరవనీయమని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
''కనీసం దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా నేరుగా బెడ్‌రూమ్‌లో నుంచి ఆయనను తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య.
భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టిన ఆయన పట్ల హుందాగా ప్రవర్తించాలి.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం చాలా దురదృష్టకరం. అయితే జనాన్ని అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది ఎత్తి చూపుతోంది
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ దుర్ఘటనకు కారణం'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, FaceBook/RevanthReddy
చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లుఅర్జున్ అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడారు.
అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, FaceBook/Ys Jagan mohan reddy
అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సాఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
''తొక్కిసలాటలో మహిళ చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అయితే, అల్లుఅర్జున్ దీనిపై విచారణ వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఈ ఘటనకు ఆయనను నేరుగా బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాటలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం సమ్మతం కాదు'' అని ట్వీట్‌లో జగన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, FaceBook/KTR
‘‘రాష్ట్ర ప్రభుత్వ అభద్రతాభావానికి ఇది నిదర్శనం’’
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును, చేసిన అతిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ట్వీట్ చేశారు.
''జాతీయ అవార్డు పొందిన నటుడిని అరెస్టు చేయడం ప్రభుత్వ పాలకుల అభద్రతాభావానికి నిలువెత్తు నిదర్శనం.
తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ, అసలు తప్పు ఎవరిది? నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా పరిగణించడం సరైనది కాదని'' ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ మరో ప్రముఖ నాయకుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు.
అసలు బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర పాలకులే తొక్కిసలాట జరగడానికి కారకులని, చర్యలు తీసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంపై అంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘‘పోలీసులు స్పందించకపోతే ఎవరిది తప్పు?’’

ఫొటో సోర్స్, ANI
థియేటర్‌కు అల్లు అర్జున్‌తో పాటు సినీ బృందం వస్తోందని ముందే పోలీసులకు సమాచారమిచ్చినప్పటికీ, పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లు చేయకపోతే ఆ తప్పు ఎవరిదని బీజేపీ నాయకుడు టి. రాజా సింగ్ అన్నారు.
''చట్టం అందరికీ ఒకటేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ రాష్ట్రంలో చట్టం ఎక్కడ ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. ఈ అరెస్ట్‌ను నేను ఖండిస్తున్నా'' అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, FaceBook/nani
సినిమా వారికి సంబంధించిన విషయాల పట్ల మీడియా, ప్రభుత్వ యంత్రాంగం చూపే చొరవ, ఉత్సాహం వంటివి సాధారణ పౌరుల పట్ల కూడా చూపించాలని కోరుకుంటున్నట్లు తెలుగు సినీ నటుడు నాని ట్వీట్ చేశారు.
''దురదృష్టకర ఘటన జరిగింది. మహిళ చనిపోవడం చాలా బాధించింది. ఈ దారుణ ఘటన నుంచి అందరూ గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో అందరి తప్పు ఉంది. ఒక్కరినే దీనికి బాధ్యుల్ని చేయడం సరికాదు'' అని ట్వీట్‌లో నాని పేర్కొన్నాడు.

ఫొటో సోర్స్, ANI
''భద్రతాపరమైన అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరు''
బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్, అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు.
భద్రతా పరమైన అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరని ఆయన అన్నారు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే వాళ్లు చుట్టుపక్కల వారికి సూచిస్తుంటారని చెప్పారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, దీనికి ఒక వ్యక్తినే నిందించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, PTI
ఇంతకీ అల్లు అర్జున్ ఏమన్నారు?
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు తనకు సంబంధం లేదని హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌లో అల్లు అర్జున్ పేర్కొన్నారు.
గతంలో కూడా సినిమా విడుదల అయినప్పుడు థియేటర్లకు వెళ్లిన సమయంలో ఇలాంటి ఘటనలు జరుగలేదని, కేవలం తాను వెళ్లడం మూలంగానే ఈ ఘటన జరిగిందని చెప్పడం సరికాదని అల్లు అర్జున్ పేర్కొన్నట్లు ఆ పిటిషన్ తెలుపుతోంది.
థియేటర్‌కు వస్తున్నట్లుగా ముందుగా థియేటర్ యాజమాన్యం, ఏసీపీ సహా పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా అల్లు అర్జున్ తన పిటిషన్‌లో చెప్పారు.
ఈ కేసు కారణంగా తన పేరు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని అందులో రాశారు.
మృతురాలు రేవతి భర్త ఏమన్నారంటే..
అల్జు అర్జున్ అరెస్టు గురించి ఫోన్‌లో చూసి తెలుసుకున్నానని రేవతి భర్త భాస్కర్ చెప్పారు.
''నా కొడుకు మూవీ చూస్తా అంటేనే సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లాను. అక్కడికి అల్లు అర్జున్ వచ్చినందుకు, ఆయన తప్పేమీ లేదు.
అల్లు అర్జున్ అరెస్టు గురించి ఫోన్‌లో చూసి తెలుసుకున్నా. పోలీసులు ఈ విషయం నాకేమీ చెప్పలేదు. అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకునేందుకు రెడీగా ఉన్నా'' అని మీడియాకు చెప్పారు.
''పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం'': థియేటర్ యాజమాన్యం
థియేటర్‌కు అల్లు అర్జున్ సహా నటీనటులు వస్తున్నట్లుగా ఈ నెల 2వ తేదీన ఏసీపీకి సంధ్య థియేటర్ యాజమాన్యం రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది.
బందోబస్తు కల్పించాలని అందులో థియేటర్ యాజమాన్యం కోరింది.
''నాలుగో తేదీన పుష్ప 2 విడుదల సందర్భంగా ప్రేక్షకుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. హీరో, హీరోయిన్, ఇతర ప్రముఖులు, చిత్ర యూనిట్ సినిమా చూసేందుకు వస్తున్నారు.
పోలీసు బందోబస్తు కల్పించాలి'' అని ఏసీపీకి రాసిన లేఖలో సంధ్య థియేటర్ మేనేజర్ పేర్కొన్నారు.
నాలుగో తేదీన రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షో తోపాటు 5వ తేదీ తెల్లవారుజామున 1.50 గంటలకు, 5.50 గంటలకు, ఉదయం 9.50గంటలకు, మధ్యాహ్నం 1.50 గంటలకు చిత్ర ప్రదర్శనలు వేస్తున్నట్లు సంధ్య థియేటర్ మేనేజర్ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, hyderabadpolice
‘‘అల్లు అర్జున్ వచ్చాకే నియంత్రణ తప్పింది’’
అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చే వరకు రద్దీ నియంత్రణ సవ్యంగా ఉందని, ఆ తర్వాత అదుపు తప్పిందని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ స్పష్టం చేశారు.
సంధ్య థియేటర్ యాజమాన్యం బందోబస్తు కోసం లేఖ రాసిన విషయంపై సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ స్పందించారు.
''నిత్యం ఎంతో మంది బందోబస్తు కోసం పోలీసులను అడుగుతుంటారు.
ఇన్వార్డ్ సెక్షన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ ఇచ్చారే తప్ప నేరుగా ఏ అధికారిని కలిసి అడగలేదు.
అయినప్పటికీ జనాన్ని నియంత్రించేందుకు సరిపడా బందోబస్తు కల్పించాం.
అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చే వరకు జనం అదుపులోనే ఉన్నారు. అతను వచ్చి వాహనంపైకి ఎక్కి అభివాదం చేసేసరికి పరిస్థితి అదుపు తప్పింది.
అతని వాహనం ముందుకు వెళ్లేందుకు వీలుగా సెక్యురిటీ సిబ్బంది కూడా జనాన్ని నెట్టివేశారు. అల్లు అర్జున్‌ను వెనక్కి తీసుకెళ్లాలని సిబ్బందికి చెప్పినా వినలేదు. థియేటర్‌లో అల్లు అర్జున్ రెండు గంటలపాటు ఉన్నారు.
అల్లు అర్జున్ కారణంగానే సంఘటన జరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది'' అని డీసీపీ చెప్పారు.
అరెస్టు సందర్భంగా అల్లు అర్జున్‌తో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
''అల్లు అర్జున్ దుస్తులు మార్చుకోవడానికి సరిపడా సమయం ఇచ్చాం. ఆయన బెడ్రూంలోకి వెళితే బయట ఎదురు చూసి, వచ్చాకే కస్టడీలోకి తీసుకున్నాం. కుటుంబసభ్యులతో మాట్లాడుకోవడానికి సరిపడా సమయం ఇచ్చాం'' అని స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














