అల్లు అర్జున్‌: సంధ్యా థియేటర్‌లో ‘పుష్ప 2’ షో నుంచి హైకోర్టులో బెయిల్ వరకు

allu arjun

ఫొటో సోర్స్, facebook/allu arjun

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సినీ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా తొలుత 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

డిసెంబరు 4 రాత్రి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసు అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ మీడియాకు చెప్పారు.

అల్లు అర్జున్‌పై ప్రధానంగా రెండు సెక్షన్ల కింద కేసులు పెట్టారు చిక్కడపల్లి పోలీసులు.

రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ చెప్పారు.

బీఎన్ఎస్ యాక్ట్ 105, 118(1) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇంతకీ ఈ సెక్షన్లు ఏం చెబుతున్నాయి? నేరం రుజువైతే ఎన్నేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండొచ్చో తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది చింతపల్లి లక్ష్మీనారాయణ బీబీసీకి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Indian actor Allu Arjun (C) comes out of the Chikkadpally police station following his arrest by the police in Hyderabad on December 13, 2024.

ఫొటో సోర్స్, Getty Images

రెండు సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే..

అల్లు అర్జున్‌పై పెట్టిన కేసుల్లో మొదటిది బీఎన్ఎస్ యాక్ట్ 105.

ఈ సెక్షన్ గురించి చింతపల్లి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే ఈ సెక్షన్ కింద కేసు పెట్టేందుకు వీలుందని చెప్పారు.

''నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు. దీన్ని హత్యానేరంగా పరిగణించరాదు. కానీ, తీవ్రమైన నేరం.

ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే, నిందితుడికి కనీసం అయిదేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష, జరిమానా లేదా గరిష్ఠంగా జీవిత ఖైదు విధించే వీలుంది'' అని చెప్పారు.

ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్, కానీ సహేతుక కారణాలుంటే నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసేందుకు వీలుందని భారత న్యాయ సంహిత చెబుతోంది.

ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే కనీసం అయిదేళ్ల జైలు నుంచి గరిష్ఠంగా జీవిత ఖైదు పడొచ్చు.

ఎవరైనా మరణించే అవకాశం ఉందని తెలిసి కూడా అందుకు దారితీసేలా వ్యవహరించారని రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు

118(1) రెడ్ విత్ 3(5) సెక్షన్

''ఈ సెక్షన్ ఎదుటి వ్యక్తిని తనంతట తానుగా వెళ్లి గాయపరచడం లేదా తీవ్రంగా గాయపరచడం గురించి చెబుతుంది.

ఆయుధంతో ఎదుటి వ్యక్తిని గాయపరిచినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది.

ఇక్కడ ఆయుధం అంటే తుపాకీతో కాల్చడం, కత్తితో పొడవడం, అగ్గి లేదా మండే స్వభావం ఉన్న పదార్థం, లేదా పేలుడు స్వభావం ఉన్న పదార్థం, లేదా ఏదైనా పదార్థంతో ఊపిరి ఆడకుండా చేయడం లేదా జంతువుతో గాయపరచడంగా చెప్పవచ్చు.

ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.20వేల జరిమానా లేదా రెండూ కలిపి విధించే వీలుందని భారత న్యాయ సంహిత చెబుతోంది.

ఎదుటి వ్యక్తికి తీవ్రమైన గాయం అయినట్లుగా నేరం రుజువైతే, జీవిత ఖైదు లేదా కనిష్ఠంగా ఏడాది నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది'' అని చెప్పారు లక్ష్మీనారాయణ.

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, allu arjun/facebook

అసలేం జరిగిందంటే..

డిసెంబర్ 5న 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలైంది. ఒకరోజు ముందు అంటే డిసెంబరు 4న ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు.

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి (35), కుమారుడు శ్రీతేజ (9), కుమార్తె శాన్వికతో కలిసి అక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు. థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట, తోపులాట కారణంగా రేవతి, శ్రీతేజకు ఊపిరి ఆడలేదని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనలో రేవతి చనిపోగా, శ్రీతేజ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీనిపై చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీన 376/2024 కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఏ1 గా సంధ్య 70ఎంఎం థియేటర్ యాజమాన్యం, సిబ్బందితో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు.

రిమాండ్ రిపోర్టులో అల్లు అర్జున్‌ను ఎ11గా పేర్కొన్నారు.

ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్చార్జిని అరెస్టు చేయగా, అల్లు అర్జున్‌ను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)