మోహన్ బాబు వివాదం: బౌన్సర్లు, బాడీగార్డులను ఎలా నియమించుకుంటారు, వారికి అర్హతలేంటి, పరిమితులేంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం కొన్ని రోజులుగా మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రిపై చిన్న కొడుకు మంచు మనోజ్, మనోజ్‌పై తండ్రి మోహన్ బాబు పరస్పరం చేసుకున్న ఫిర్యాదుతో కుటుంబ గొడవలు బహిర్గతమయ్యాయి.
ఇదే సమయంలో, జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద ఇరు వర్గాలకు చెందిన పదుల సంఖ్యలో బౌన్సర్లు మోహరించడంతో పాటు, పెద్ద కొడుకు విష్ణు, మనోజ్ బౌన్సర్లు ఒకరికొకరు ఘర్షణ పడ్డారు.
అలాగే, మోహన్ బాబు బౌన్సర్లు మీడియాపై దాడి చేశారు. బౌన్సర్లే పోలీసుల్లా మారారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
ఈ ఘటనలో బౌన్సర్ల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనే కాదు, అంతకు ముందు సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చిన ఘటనలో కూడా బౌన్సర్లు చర్చనీయాంశమయ్యారు.
అయితే, బౌన్సర్లంటే ఎవరు? వారిని ఎవరు నియమించుకుంటారు? బౌన్సర్ల లేదా బాడీగార్డుల నియామకంలో ఉన్న నియమ, నిబంధనలు ఏంటి?

ఫొటో సోర్స్, janasena
బౌన్సర్లు అంటే ఎవరు?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బౌన్సర్లంటే.. క్లబ్, పబ్ వంటి ప్రవేశ ద్వారాల వద్ద నిల్చుని సెక్యూరిటీ అందించే వ్యక్తులు. లోపలికి వెళ్లకూడని వ్యక్తులను, ఘర్షణలకు కారణమయ్యే వారిని బయటే ఆపేయడానికి బౌన్సర్లను నియమిస్తుంటారు.
అలాగే, ప్రైవేట్, వ్యక్తిగత సెక్యూరిటీగా కూడా బౌన్సర్లను నియమించుకుంటూ ఉంటారు కొందరు.
రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ ఉంటుంది. వారికి కావాల్సిన సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ, సమాజంలో కాస్త హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రైవేట్‌గా బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీని నియమించుకుంటూ ఉంటారు.
వీరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే...బౌన్సర్లు, బాడీగార్డులనే వారు వ్యక్తులకు భద్రత కల్పించేవారన్నమాట.
ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కూడా అంతకుముందు బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీ ఉండేవారు.
ఎన్నికలకు ముందు వారాహి యాత్రను ప్రారంభించినప్పుడు ఆయనకు వీరు భద్రత కల్పించారు. వారాహి వాహనంతో పాటు పవన్ బాడీగార్డులు, బౌన్సర్లు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన యాత్ర జరిగినన్ని రోజులు వాళ్లు వాహనం చుట్టూ కన్పించేవారు.
పవన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, వీరు రద్దీని నియంత్రిస్తూ ఉండేవారు.
అయితే, తాజాగా సంధ్య థియేటర్ వద్ద నెలకొన్న ఘటనలో మాత్రం బౌన్సర్ల వైఫల్యం కన్పించింది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీ విభాగంగా వ్యవహరించిన 30 నుంచి 40 మంది బౌన్సర్లు ఒక్కసారిగా లోపలికి వచ్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పోగుకావడంతో గాలి ఆడక ఒక మహిళ మృతి చెందారు. అలాగే, మోహన్ బాబు ఇంట్లో జరిగిన వివాదంలో బౌన్సర్ల ప్రవర్తన చర్చనీయాంశమైంది.
సైలెంట్ గార్డియన్లుగా బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులకు అవసరమైన సెక్యూరిటీ కల్పిస్తారన్న పేరుతో పాటు, కొన్నిసార్లు వారి వైఫల్యాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
"సాధారణంగా బాడీ గార్డులను వీఐపీలు, సినీ ఇండస్ట్రీ వాళ్లు, వ్యాపారవేత్తలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా బాడీగార్డులను, బౌన్సర్లను పెట్టుకునే ట్రెండ్ పెరిగింది" అని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్(తెలంగాణ, ఏపీ) చైర్మన్ సి. భాస్కర్ రెడ్డి తెలిపారు.
పబ్బులు, పార్టీలు పెరుగుతుండటంతో పాటు సామాజిక అవగాహనతో ఇటీవల కాలంలో, బౌన్సర్లకు, బాడీగార్డులకు డిమాండ్ పెరుగుతోంది. సమాజంలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తులు పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు, పెద్ద సంఖ్యలో రద్దీని నియంత్రించేందుకు కూడా బౌన్సర్లు కీలకంగా ఉంటున్నారు.

ఫొటో సోర్స్, C Bhaskar Reddy, Association of Private security Agencies
బౌన్సర్లు గురించి చట్టం ఏం చెబుతుంది?
"ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పించే వారిని బాడీగార్డులు లేదా వీఐపీ ఎస్కార్ట్స్ అని పిలవాలి. బౌన్సర్లు అనకూడదు. కానీ, బౌన్సర్లని పిలుస్తున్నారు. వీరిని చాలామంది చట్టవిరుద్ధంగా నియమించుకుంటున్నారు. వీరికి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (పస్రా), 2005 ఉంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. బాడీగార్డులను నియమించుకోవాలంటే ఏజెన్సీలకు కచ్చితంగా పస్రా లైసెన్స్ ఉండాలి. వీరు ఎలా నడుచుకోవాలనే దానిపై నియమ, నిబంధనలు దానిలో ఉన్నాయి.’’ అని భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
భాస్కర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం
- బాడీగార్డులుగా నియమితులయ్యే వారు కూడా పస్రా లైసెన్స్ పొంది ఉండాలి.
- చదువుకుని ఉండాలి.
- తెలంగాణ పోలీసులు వీరికి ఐఐటీఏ (ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ) మొయినాబాద్‌లో ఒక నెల శిక్షణ ఇస్తారు.
- ప్రతి ఏడాది వీరి ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి
తాము తెలంగాణలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సేవలను అందిస్తున్నామని, తమ సంస్థ పస్రా నుంచి లైసెన్స్ పొందిందని భాస్కర్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, https://psara.gov.in/
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఉండాల్సిన అర్హత ఏంటి?
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఉండాల్సిన అర్హతలను ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (పస్రా)లో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం. అవేంటో కింద చూద్దాం..
- భారతీయ పౌరుడై ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తించిన మరే ఇతర దేశానికి చెందిన పౌరుడైనా కావచ్చు.
- 18-65 ఏళ్ల వయసు ఉండాలి.
- సెక్యూరిటీ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోవాలి.
- నిర్దేశించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
- అధికార పరిధి గల న్యాయస్థానం ద్వారా దోషిగా నిర్ధరణై ఉండకూడదు. లేదా కేంద్ర, రాష్ట్ర పోలీసు సంస్థలకు సాయుధ దళాలుగా పనిచేసినప్పుడు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్క్ చేసినప్పుడు లేదా ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిచేసినప్పుడు తప్పుడు ప్రవర్తనతో గార్డుగా సస్పెండ్ లేదా డిస్మిస్ అయి ఉండకూడదు.
- ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును నియమించే సమయంలో, ప్రతి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏదైనా ఇతర సాయుధ దళాలు, పోలీసు, హోమ్ గార్డులుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- అనుకోని సంఘటన జరిగితే దాన్ని నియంత్రించే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండాలి.

ఫొటో సోర్స్, C Bhaskar Reddy, Association of Private security Agencies(Telangana&Andhrapradesh)
జీతాలు ఎలా ఉంటాయి?
లైసెన్స్ ఉన్న ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కాకుండా చట్టవిరుద్ధంగా సాగే ఏజెన్సీల నుంచి బాడీగార్డులుగా నియమితులైన వారికసలు కనీస వేతనాలు ఇవ్వడం లేదని భాస్కర్ రెడ్డి చెప్పారు.
''ఏదైనా ఘటన జరిగినప్పుడు, బాడీగార్డులు ఎవరైనా చనిపోతే, కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. అయితే, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యే బౌన్సర్లకు కనీసం వేతనంగా నెలకు రూ.45 వేల వరకు వస్తుంది. 26 రోజులే వర్కింగ్ డేస్ ఉంటాయి. వారంలో ఆరు రోజులు పనిచేసి, ఒక రోజు ఆఫ్ తీసుకోవచ్చు.
మహిళలను కూడా బాడీగార్డులుగా నియమిస్తుంటారు. అయితే, వీరికి క్లయింట్స్ తక్కువ, రాత్రివేళల్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి, ఉమెన్ బాడీగార్డుల సంఖ్య తక్కువగా ఉంది" అని భాస్కర్ రెడ్డి తెలిపారు.

ఫొటో సోర్స్, C Bhaskar Reddy, Association of Private security Agencies (Telangana&Andhrapradesh)
లైసెన్స్ పొందిన సెక్యూరిటీ ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయి
"అధికారికంగా 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు తెలంగాణలో ఉంటే, వారిలో 5 వేల నుంచి 10 వేల మంది బాడీగార్డులున్నారు. మిగతా వారందరూ అక్రమమే. బాడీగార్డులను అందించే ప్రైవేట్ ఏజెన్సీలు తెలంగాణలో రెండు వేల వరకు ఉంటే, వాటిలో లైసెన్స్ ఉన్నవి 800 మాత్రమే. 1200 ఏజెన్సీలు చట్టవిరుద్ధంగానే పనిచేస్తున్నాయి. అయితే, చట్టవిరుద్ధమైన బౌన్సర్లుగా పిలిచే బాడీగార్డుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది'' అని భాస్కర్ రెడ్డి తెలిపారు.
బాడీగార్డులను నియమించుకునే వ్యక్తులు లేదా సంస్థలు అప్పుడప్పుడు నియమించుకున్న కొద్ది కాలానికి డబ్బులు ఇవ్వకుండా ఏజెన్సీలను మోసం చేస్తుంటాయని చెప్పారు. అందుకే, ఎవరైనా ప్రైవేట్ సెక్యూరిటీ కావాలని తమను కోరితే, ముందుగా సంబంధిత పోలీసు స్టేషన్‌కు ఇన్‌ఫామ్ చేస్తామని అన్నారు.
అలాగే, వారి బ్యాక్‌గ్రౌండ్, స్టేటస్ మొత్తం తనిఖీ చేస్తామని భాస్కర్ రెడ్డి తెలిపారు. అవసరం రీత్యా పర్మిషన్ తీసుకోవడమే తప్ప, పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదని చెప్పారు.
అలాగే, బౌన్సర్లుగా పిలిచే వీరికి ఎవరిపై చేయి చేసుకునే అర్హత లేదని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.
'ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలి'
బాడీగార్డులుగా పనిచేసే వారు నిత్యం అలర్ట్‌గా ఉండాలని, కళ్లు, కాళ్లు, చేతులు సహా శరీరమంతా ఎప్పుడూ ప్రజెంట్‌గా ఉండాలని ఓ వ్యాపారవేత్త దగ్గర బాడీగార్డుగా పనిచేస్తున్న వెంకట్ చెప్పారు.
''ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు మనతో పాటు, క్లయింట్ కూడా ఆపదలో ఉంటారు. ఎదుటి వ్యక్తి ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో తెలియదు కాబట్టి అలర్ట్‌గా ఉంటూ వారిని రక్షించాలి. అప్పుడే మనకు, క్లయింట్‌కి ఇద్దరికీ మంచిది. మనం సరిగ్గా సర్వీసు అందించకపోతే, మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తారు. బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ ద్వారా మమ్మల్ని రీఫ్రెష్ చేసే శిక్షణ ఇస్తుంటారు. మళ్లీ అన్నిరకాల శిక్షణ ఇచ్చి, పరీక్షించి సర్వీసులకు పంపిస్తుంటారు'' అని వెంకట్ తెలిపారు.
సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు లభిస్తాయని, క్లయింట్స్ నుంచి కూడా తమకు సపోర్టు లభిస్తుందని వెంకట్ తెలిపారు. అయితే, లైసెన్స్ పొందిన ఏజెన్సీ నుంచి బాడీగార్డులుగా నియమితులైతేనే ఈ సౌకర్యాలుంటాయని, లేదంటే అలాంటివి డిమాండ్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదని వెంకట్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














