సిరియా: అసద్ వ్యతిరేకులను చిత్ర హింసలు పెట్టిన ఆ క్రూరమైన జైళ్లను రెబల్స్ ఏం చేస్తారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సోఫియా ఫెరీరా సాంటోస్
- హోదా, బీబీసీ న్యూస్
సిరియాకు చెందిన ఒక మాజీ ప్రభుత్వ అధికారిపై చిత్రహింసలకు సంబంధించిన అభియోగాలు అమెరికాలో నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
డమాస్కస్ సెంట్రల్ జైలును 2005 నుంచి 2008 వరకు పర్యవేక్షించిన సమీర్ ఉస్మాన్ అల్‌షేక్‌పై హింస, కుట్రకు సంబంధించిన అనేక అభియోగాలను ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ మోపింది.
అల్‌షేక్‌పై వచ్చిన అరోపణలు చాలా భయంకరమైనవని అమెరికా అధికారులు అన్నారు.
ఇమిగ్రేషన్‌కు సంబంధించిన రెండు మోసాల ఆరోపణలతో ఈ ఏడాది ఆరంభంలో లాస్ ఏంజెలెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను అరెస్ట్ చేశారు.


ఫొటో సోర్స్, Reuters
జైలులో పనిచేసిన విషయాన్ని అల్‌షేక్ రహస్యంగా ఉంచారని కాలిఫోర్నియాలోని యూఎస్ అటార్నీ ఆఫీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాను ఎవరినీ హింసించలేదంటూ అమెరికా వీసా, పౌరసత్వ దరఖాస్తుల్లో అల్‌షేక్ పేర్కొన్నారని అటార్నీ కార్యాలయం తెలిపింది.
పదవీచ్యుతుడైన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ హయాంలో అల్‌షేక్ వ్యక్తిగతంగా పలువురు రాజకీయ, ఇతర ఖైదీలను తీవ్రమైన శారీరక, మానసిక హింసలకు గురిచేశారని, క్షోభ పెట్టారని అమెరికా అధికారులు చెప్పారు.
బందీలను జైల్లోని శిక్షలు విధించే గదికి తీసుకెళ్లాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేసేవారని, ఆ గదిలో అమర్చిన సీలింగ్‌పై వారిని వేలాడదీసి, విచక్షణారహితంగా కొట్టేవారని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఖైదీల వెన్నెముకలు చీలిపోయేవని తెలిపారు.
''దాదాపు 20 ఏళ్ల కిందట, సిరియాలోని జైళ్లలో బందీలను హింసించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈరోజు ఆ హేయమైన నేరాలకు ఆయనను బాధ్యుడిని చేసే ప్రక్రియకు మేం మరింత దగ్గరయ్యాం'' అని హెచ్‌ఎస్‌ఐ లాస్ ఏంజెలెస్ స్పెషల్ ఏజెంట్ ఎడ్డీ వాంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఒకవేళ నేరం రుజువైతే, హింసకు కుట్ర పన్నినందుకు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, హింసకు సంబంధించిన ప్రతీ మూడు అభియోగాలకు మరో 20 ఏళ్ల వరకు జైలుశిక్ష, రెండు ఇమిగ్రేషన్ మోసాలకు 10 ఏళ్ల చొప్పున శిక్ష పడుతుంది.
తనపై వచ్చిన ఈ రాజకీయ ప్రేరేపిత, దురుద్దేశ పూర్వక ఆరోపణలను అల్‌షేక్ ఖండించినట్లు ఆయన తరఫు న్యాయవాది అసోసియేట్ ప్రెస్‌కు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
72 ఏళ్ల అల్‌షేక్ , 2020లో అమెరికా వెళ్లి దక్షిణ కరోలినాలోని లెక్సింగ్టన్‌లో నివసిస్తున్నట్లు కోర్టు పత్రాలు చూపిస్తున్నాయి.
అసద్ పాలన పతనం తర్వాత రెబల్ బలగాలు, సిరియా అంతటా ఉన్న వేలమంది ఖైదీలను విడుదల చేసిన తర్వాత ఈ పరిణామాలు జరిగాయి.
జైళ్ల నుంచి డజన్ల కొద్ది బందీలు విడుదల అవుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. కనిపించకుండా పోయిన తమ వారి కోసం కుటుంబీకులు ఆశగా జైళ్లలోకి పరిగెత్తుతున్న ఫుటేజీలు కూడా బయటకు వచ్చాయి.
సిరియా మాజీ ప్రభుత్వం జైళ్లలో విపరీతంగా అకృత్యాలకు పాల్పడిందంటూ మానవ హక్కుల సంఘాలు, ఐక్యరాజ్యసమితి అధికారులు గతంలో ఆరోపించారు.
అసద్ నేతృత్వంలోని జైళ్లలో దాదాపు 60 వేల మందిని చిత్రహింసలు పెట్టి, చంపేశారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, EPA
‘క్రూరత్వానికి నిలయాలైన ఈ జైళ్లను మూసేస్తాం’
గతంలో క్రూరమైన హింసలకు నిలయాలుగా ఉన్న ఈ జైళ్లను మూసేయాలని, బందీలను హింసించి చంపేసిన వారిని పట్టుకుని శిక్షించాలని భావిస్తున్నట్లు సిరియా రెబల్ బలగాలు చెప్పాయి.
అసద్ పాలనలోని భద్రతా బలగాలను రద్దు చేస్తామని తిరుగుబాటు దళాల నాయకుడు అహ్మద్ అల్ షారా ఒక ప్రకటనలో వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది. ఈయనకు ఉన్న మరో పేరు మొహమ్మద్ అల్ జులాని.
‘మానవ కబేళా’ గా పేరున్న సెడ్నేయా జైలు నుంచి వేల మంది ఖైదీలు బయటకు వస్తున్నట్లుగా కనిపించే వీడియోలు అసద్ ప్రభుత్వం పతనమైన తర్వాత కొద్దిగంటలకే బయటకు వచ్చాయి.
ఖైదీలను హింసించడంలో, చంపడంలో భాగమైన వారిని క్షమించే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో జులాని స్పష్టం చేశారు.
2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత సెడ్నేయా జైలు ఒక డెత్ క్యాంప్‌గా మారిందని 2022 నాటి ఒక నివేదికలో తుర్కియేకు చెందిన అసోసియేషన్ ఆఫ్ డిటైనీస్ అండ్ ద మిస్సింగ్ ఇన్ సెడ్నేయా ప్రిజన్ (ఏడీఎంఎస్‌పీ) పేర్కొంది.
సిరియా మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందనే భయాల నేపథ్యంలో దేశంలో భద్రతా బలగాల పునర్మిర్మాణాన్ని రెబల్స్ ఎంత త్వరగా చేపడతారన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది.
రసాయన ఆయుధాల స్థావరాలను రక్షించుకోవడానికి అంతర్జాతీయ సంస్థలతో కలిసి జులానీ పని చేస్తున్నట్లుగా రాయిటర్స్ పరిశీలించిన ఒక ప్రకటన ద్వారా తెలుస్తోంది.
సిరియా అంతటా వందల దాడులు చేసి, అనేక మిలిటరీ ఆస్తులను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రెబల్స్ అప్రమత్తం అవుతున్నారు.
రసాయన ఆయుధాల తయారీతో సంబంధాలున్నట్లుగా అనుమానిస్తున్న ఒక రీసెర్చ్ సెంటర్ లక్ష్యంగా దాడులు జరిగాయని స్థానిక మీడియా పేర్కొంది.
తీవ్రవాదుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్లడాన్ని ఆపేందుకే తాము ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














