సిరియా: అసద్ కుటుంబం భవిష్యత్తు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సామ్ హాన్కాక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సిరియాలో బషర్ అల్-అసద్ ఆదివారం (డిసెంబర్ 8న) అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగారు. దాంతో, ఆయన 24 ఏళ్ల పాలనకే కాదు, సిరియాపై ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన అసద్ కుటుంబ ఆధిపత్యాన్ని కూడా ముగింపు పడింది.
2000లో బషర్ అల్-అసద్ అధ్యక్షుడు కావడానికి ముందు ఆయన తండ్రి హఫీజ్ అల్-అసద్ మూడు దశాబ్దాల పాటు ఆ పదవిలో కొనసాగారు.
సిరియాలో ఇప్పుడు ఇస్లామిస్ట్ రెబల్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. అయితే, పదవీచ్యుతుడైన అధ్యక్షుడు అసద్, ఆయన భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఇపుడు అస్పష్టంగా కనిపిస్తోంది.
అసద్ కుటుంబం ప్రస్తుతం రష్యాలో ఉందిన. అక్కడ వారికి ఆశ్రయం లభించింది. మరి, వారి భవిష్యత్తు ఎందుకు ప్రశ్నార్థకంగా మారింది?


ఫొటో సోర్స్, Getty Images
రష్యాకే ఎందుకు వెళ్లారు?
సిరియా అంతర్యుద్ధం సమయంలో అసద్‌కు రష్యా మద్దతుగా నిలిచింది. ఈ దేశంలో రెండు కీలక సైనిక స్థావరాలను రష్యా ఏర్పాటు చేసింది.
2015లో అసద్‌కు సహాయం చేయడానికి రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. అది అసద్ యుద్ధంలో గెలవడానికి దోహదపడింది. తరువాతి తొమ్మిదేళ్లలో జరిగిన రష్యా సైనిక ఆపరేషన్లలో 8,700 మంది పౌరులతో సహా 21,000 మందికి పైగా మరణించారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానిటరింగ్ గ్రూప్ తెలిపింది.
కాగా, ఈ ఏడాది నవంబర్ చివర్లో సిరియాలో రెబల్స్ దాడులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో యుక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న రష్యా.. అసద్ ప్రభుత్వానికి సహాయం చేయలేదు. దీంతో డమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత అసద్, ఆయన కుటుంబం మాస్కోకు చేరుకుందని, మానవతా సాయంగా రష్యా వారికి ఆశ్రయం ఇవ్వనుందని అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది.
అసద్ ఆచూకీ, ఆశ్రయం గురించి రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను మీడియా అడిగినప్పుడు.. "నేను చెప్పడానికి ఏమీ లేదు. ప్రభుత్వాధినేత అనుమతి లేకుండా అలాంటి నిర్ణయం తీసుకోలేం. అది ఆయన నిర్ణయమే.." అని చెప్పారు.
రష్యాతో అసద్ కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉంది.
అసద్ అత్తమామలు రష్యా రాజధానిలో 18 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసినట్లు 2019లో చేసిన తమ దర్యాప్తులో వెల్లడైందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. సిరియా అంతర్యుద్ధం సమయంలో వందల కోట్ల డాలర్లను దేశం నుంచి దూరంగా ఉంచే లక్ష్యంతో ఇది జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది.
అసద్ పెద్ద కుమారుడు హఫీజ్ (22) రష్యాలో పీహెచ్‌డీ చేస్తున్నారు. హఫీజ్ చేస్తున్న పరిశోధనపై స్థానిక వార్తాపత్రిక గతవారం ఒక కథనం కూడా ప్రచురించింది.
రష్యా స్థావరాలను, రాయబార కార్యాలయాలను సురక్షితంగా ఉంచడానికి మాస్కోలోని అధికారులు "సిరియాలోని సాయుధ ప్రతిపక్ష గ్రూపులతో" చర్చలు జరుపుతున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా గతవారం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అసద్ కుటుంబం
బ్రిటిష్-సిరియన్ పౌరురాలు అయిన అస్మాను అసద్ వివాహం చేసుకున్నారు. అస్మా లండన్‌లో పుట్టి పెరిగారు. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ సిరియన్లే.
ఆమె ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కావడానికి ముందు లండన్‌లో చదువు పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో అస్మా శాశ్వతంగా సిరియాకు వెళ్లారు. అక్కడ ఆమె బషర్ అల్-అసద్‌ను వివాహం చేసుకున్నారు. తండ్రి మరణానంతరం బషర్ అల్-అసద్ అధ్యక్ష పదవిని చేపట్టిన సమయమది.
"అస్మాకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉంది కాబట్టి, ఆమె రష్యా నుంచి యూకేకు వెళ్లే అవకాశం ఉంటుంది" అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో విజిటింగ్ ఫెలో డాక్టర్ నస్రీన్ అల్రెఫాయ్ బీబీసీకి చెప్పారు.
"అస్మా తండ్రి డాక్టర్ ఫవాజ్ అల్-అఖ్రాస్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఆయన కూడా రష్యాలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి" అని ఆమె తెలిపారు.
అస్మా ప్రస్తుతానికి మాస్కోలోనే ఉండాలనుకోవచ్చని నస్రీన్ చెప్పారు.
అసద్, అస్మా జంటకు ముగ్గురు పిల్లలు, హఫీజ్, జైన్, కరీం.
అస్మా తండ్రి కార్డియాలజిస్ట్ అని, ఆమె తల్లి రిటైర్డ్ దౌత్యవేత్త అని వారి పక్కింటివారిని ఉటంకిస్తూ 'మెయిల్ ఆన్‌లైన్' కథనం తెలిపింది. కూతురు, అల్లుడిని కలవడానికి వారు మాస్కోకు వెళ్తున్నారని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక మోసాలు
సిరియాలో అసద్ కుటుంబం గురించి 2022లో కాంగ్రెస్‌కు అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికను సమర్పించింది. అసద్ అత్తమామల మొత్తం సంపద రూ. 8 వేల నుంచి 17 వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. అయితే, వారి సంపద చాలా అకౌంట్స్, రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలు, కార్పొరేషన్లలో ఉన్నందున అంచనా వేయడం కష్టమని పేర్కొంది.
ఆ రిపోర్టు ప్రకారం..
సిరియా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ముఖ్యులతో అసద్, అస్మాలు సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అసద్ ప్రభుత్వం నడపడానికి వారి కంపెనీలు చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా నల్లధనాన్ని సంపాదించాయి.
సిరియాలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘంపై కూడా అస్మా ప్రభావం ఉంది. సిరియాలో ఆహారం, ఇంధన సబ్సిడీలు, వాణిజ్యం, కరెన్సీ వంటి ముఖ్యమైన అంశాలపై ఆమె కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది.
'సిరియా ట్రస్ట్ ఫర్ డెవలప్‌మెంట్'లో కూడా అస్మా ఆధిపత్యం ఉంది. ఇది వాస్తవానికి సిరియాకు విదేశీ సహాయాన్ని పంపడానికి ఏర్పాటు చేసిందని సదరు రిపోర్టు తెలిపింది.
భర్త అసద్, ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో సిరియాలో యుద్ధం నుంచి లాభం పొందుతూ అపఖ్యాతి పాలైన వారిలో అస్మా ఒకరని 2020లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు.
అసద్ బంధువు రమీ మఖ్‌లౌఫ్‌తో పోటీ పడుతున్న కుటుంబ వ్యాపారానికి అధిపతి అస్మా అని అప్పటి ట్రంప్ ప్రభుత్వంలోని మరొక సీనియర్ అధికారి అభివర్ణించారు.
మఖ్‌లౌఫ్ సిరియాలోని అత్యంత ధనవంతులలో ఒకరు. తనతో సరిగా నడుచుకోలేదని మఖ్‌లౌఫ్ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడంతో కుటుంబ కలహాల విషయం వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అసద్ విచారణను ఎదుర్కొంటారా?
సిరియాలో అసద్ పతనం తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామార్డ్ మాట్లాడుతూ.. సిరియన్లు మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొన్నారని, చాలామంది బాధలు పడ్డారని అన్నారు.
ఇందులో "రసాయన ఆయుధాల దాడులు, బాంబులు, హత్య, చిత్రహింసలు, బలవంతపు అదృశ్యాలు, యుద్ధ నేరాలు.." ఉన్నాయని తెలిపారు.
అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకూ పాల్పడినట్లు అనుమానాలున్నాయని దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని అంతర్జాతీయ సమాజానికి ఆగ్నెస్ పిలుపునిచ్చారు.
గత పాలనలో రాజకీయ ఖైదీలను హింసించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి అధికారిపై విచారణ జరుగుతుందని మంగళవారం సిరియాలోని ఇస్లామిస్ట్ తిరుగుబాటు నాయకుడు ఒకరు చెప్పారు. అటువంటి అధికారులు విదేశాలకు పారిపోతే తీసుకురావడానికి సిరియన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అబు మొహమ్మద్ అల్-జులానీ అన్నారు.
2013లో సిరియాలో జరిగిన రసాయన దాడికి సంబంధించి ఫ్రాన్స్‌లోని ఇన్వెస్టిగేటివ్ జడ్జిలు అసద్‌పై అరెస్ట్ వారెంట్‌ను కోరారు. అయితే, రష్యా తన పౌరులను అప్పగించదు. అసద్ రష్యాను విడిచిపెట్టే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అసద్ మిగతా దేశాలకు వెళ్తే ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా సిరియాకు అప్పగించే పరిస్థితి రావొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














