70 ఏళ్ల భార్యపై ఇతరులతో పదేపదే అత్యాచారం చేయించిన భర్త, మగాళ్ల లైంగిక వాంఛలు ఇలా ఎందుకుంటున్నాయి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లూయిస్ చున్
- హోదా, బీబీసీ న్యూస్
హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక వేధింపుల గురించిన వర్ణన ఉంది.
దాదాపు పదేళ్ల పాటు జీసెల్ పెలికో భర్త ఆమెకు తెలియకుండా ఆహారం, నీటిలో కలిపి డ్రగ్స్ ఇస్తూ, ఆమెను రేప్ చేసేందుకు కొందరు వ్యక్తులను ఆన్‌లైన్ ద్వారా ఆహ్వానించారు. తమ పడక గదిలో స్పృహలో లేని ఆమెను వాళ్లు అత్యాచారం చేస్తుంటే ఆయన ఆ దృశ్యాలను చిత్రీకరించారు.
జీసెల్ పెలికోపై అత్యాచారం చేసిన వారి వయసు 22 నుంచి 70 ఏళ్ల మధ్య ఉంది. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఫైర్ ఫైటర్లు, లారీ డ్రైవర్లు, నర్సులు, జర్నలిస్టులు, జైలు వార్డర్లు, సైనికులు ఉన్నారు.
వాళ్లంతా డొమినిక్ పెలికో సూచనలను పాటించారు.
ఒక మహిళ శరీరంలోకి చొరబడి తమ వాంఛ తీర్చుకోవాలనే కోరిక వారిలో ఉంది. మగతలో ఉన్న ఓ వృద్ధురాలు బొమ్మలా పడి ఉన్నప్పుడు, అంగీకారం లేకుండా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన 50 మంది కోర్టులో ఉన్నారు. వారంతా జీసెల్ పెలికో నివసిస్తున్న మజాన్‌కు 50 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటున్నారు.
వాళ్లంతా "ఇతర మనుషుల్లాగే" ఉన్నారు.
30 ఏళ్ల ఓ మహిళ నాతో ఇలా చెప్పారు "మొదట దీని గురించి విన్నప్పుడు, ఒక వారం రోజుల పాటు మగాళ్లకు సమీపంలోకి వెళ్లకూడదనిపించింది. నా భర్త దగ్గరకు కూడా. ఇది నన్ను చాలా భయ పెట్టింది" అని అన్నారు.
జీసెల్ పెలికో వయసుకు దాదాపు దగ్గరగా ఉన్న 70 ఏళ్ల మహిళ " నా భర్త, పిల్లలతో సహా ఇతర పురుషుల బుర్రల్లో ఏముందో అనే ఆలోచనలు ఆగడం లేదు. పెలికో కేసు మంచు ఖండంలో ఐసు ముక్క అనుకోవచ్చా" అని అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
‘మగవాళ్లను చూసే వైఖరి మారొచ్చు’
పెలికో కేసులో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రచయిత, థెరపిస్టు 61ఏళ్ల డాక్టర్ స్టెల్లా డఫీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు "మగాళ్లంతా ఇలా ఉండరని నమ్మడానికి నేను ప్రయత్నిస్తున్నాను. జీసెల్ పెలికాట్ గ్రామానికి చెందిన భార్యలు, గాళ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, కూతుర్లు, తల్లుల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ కేసు తర్వాత మహిళలు మగవాళ్లను చూసే ధోరణి మారవచ్చు. అలాగే ఇది మగాళ్లు ఇతర మగాళ్లను చూసే వైఖరి కూడా మార్చి ఉండవచ్చు"
ఈ కేసులో కోర్టు తీర్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడీ కేసును దాటి కొన్ని అంశాలను పరిశీలించవచ్చు. పురుషుల్లో ఇలాంటి క్రూరమైన, హింసాత్మక ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది? అనుమతి లేకుండా సెక్స్‌లో పాల్గొనడం అత్యాచారం అవుతుందని వారికి తెలియదా?
అయితే ఇక్కడ ఒక విస్తృతమైన ప్రశ్న కూడా ఉంది. ఒక చిన్న ప్రాంతంలో ఉండే కొంతమంది పురుషులకు స్పృహలో లేని మహిళ మీద తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ తమ వాంఛను తీర్చుకోవాలనే ఫాంటసీ ఉంటుందా అన్నదే ఈ ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్‌నెట్ వలనే జరిగిందా?
ఇంటర్‌నెట్ లేకుండా పెలికో మీద జరిగిన అత్యాచారం, లైంగిక దాడి స్థాయిని ఊహించడం చాలా కష్టం.
తన భార్యను రేప్ చేసేందుకు డొమినిక్ పెలికో కొంతమంది వ్యక్తులను ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఆహ్వనించారు. ఈ వెబ్‌సైట్‌లో ఎటువంటి నియంత్రణా ఉండదు. ఈ సైట్‌లో ఎవరైనా తమ శృంగార ఆసక్తులను పంచుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలను మనం ఇంటర్‌నెట్ యుగానికి ముందు ఊహించలేం.
పెలికో న్యాయవాదుల్లో ఒకరు ఈ వెబ్‌సైట్‌ను "హత్యకు ఉపయోగించే ఆయుధం’’ గా అభివర్ణించారు. ఈ వెబ్‌సైట్ లేకుండా కేసు ఈ స్థాయికి చేరడాన్ని ఊహించలేమని చెప్పారు.
అయితే ఇంటర్‌నెట్ వల్ల పరస్పర అంగీకారంతో, అశ్లీలానికి తావు లేని సెక్స్‌ను ఆనందించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. గతంలో కొంతమంది అభ్యంతరకరం అని భావించే లైంగిక వాంఛలను ఇంటర్‌నెట్ సాధారణ స్థాయికి తీసుకొచ్చింది.
లండన్‌లోని సోహోలో లభించే పాతకాలపు అడల్డ్ మేగజైన్లు, శృంగార వాంఛలను రెచ్చగొట్టే చిత్రాల నుంచి ఆధునిక పోర్న్‌హబ్ లాంటి వెబ్‌సైట్ల వరకు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. 2024లో ఒక్క జనవరిలోనే ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 14 లక్షల మంది పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌ను సందర్శించారు. పోర్నోగ్రఫీ హద్దులు విస్తృతమయ్యాయి. పోర్న్ సైట్లలో విపరీత ధోరణులు పెరగడంతో అలాంటి సెక్స్ కూడా సాధారణ అంశంగా మారుతోంది.
జనవరి 2024లో యూకే ఆన్‌లైన్ యూజర్ల సర్వే ప్రకారం 25 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి పదిమందిలో ఒకరు ప్రతిరోజు పోర్న్ సైట్లు చూస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎక్కువ మంది పురుషులే.
కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న 24 ఏళ్ల డైసీ తనతో పాటు తనకు తెలిసిన అనేక మంది పోర్న్ చూస్తారని చెప్పింది. తాను ఒక ఫెమినిస్ట్ సైట్ చూస్తానని, ఆ సైట్‌లో "ఉద్వేగ భరితం", "శారీరంగా ప్రేరేపించడం", "మొద్దుగా వ్యవహరించడం" అనే పదాలతోకూడిన ఫిల్టర్లు ఉంటాయి.
కొంతమంది ఆమె మగ స్నేహితులు తాము పోర్న్ చూడటం లేదని చెప్పారు. "ఎందుకంటే తాము పిల్లలుగా ఉన్నప్పటి నుంచి పోర్న్ చూస్తున్నామని, ఎక్కువగా చూడటం వల్ల సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆనందించలేకపోతున్నట్లు" చెప్పారు.
ఇంగ్లండ్‌కు చెందిన చిల్డ్రన్ కమిషనర్ రాచెల్ డి సౌజా 2023లో ఒక సర్వే నిర్వహించారు. అందులో 16 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న వారిలో పాతికశాతం తాము ప్రాథమిక పాఠశాలలో ఉండగానే పోర్న్ చూసినట్లు తేలింది.
తల్లిదండ్రులు తాము యవ్వనంలో ఉండగా చూసిన అడల్ట్ కంటెంట్‌ను ప్రస్తుతం లభిస్తున్న కంటెంట్‌తో పోల్చి చూస్తే అది పాత ఫ్యాషన్‌గా అనిపించవచ్చని డిసౌజా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
లైంగిక వైఖరి మారుతుందా?
చిన్నప్పుడే ఫోన్లలో పోర్న్ చూసే వారు, 20వ శతాబ్ధంలో ప్లేబాయ్ లాంటి మేగజైన్లు చూసే వారితో పోలిస్తే కచ్చితంగా వైవిధ్యమైన సెక్సువల్ అంచనాలతో పెరుగుతారు.
స్త్రీ, పురుషుల మధ్య బంధం సహజంగా ఏర్పడకపోతే, పోర్నోగ్రఫీ వీక్షణ, హానికరమైన సెక్స్ వైఖరి కారణంగా మహిళలతో ప్రవర్తించే తీరు ప్రమాదకరంగా మారుతుందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
కోవిడ్ 19కి ముందు ప్రభుత్వం నిర్వహించిన ఓ పరిశోధనలో "పోర్నోగ్రఫీలో చూపించినట్లుగా సెక్స్ చెయ్యాలనే కోరిక, అలా చేసేందుకే పోర్న్ చూస్తున్నట్లు, అలాగే మహిళలు పోర్న్ వీడియోలలో మాదిరిగా సెక్స్‌లో పాల్గొనడాన్ని ఇష్టపడతారని భావిస్తున్నట్లు" తేలింది.
ఇందులో కొన్ని సార్లు సెక్స్‌లో ఆధిపత్యం కోసం కొట్టడం, మెడగట్టిగా నొక్కిపెట్టి ఉక్కిరిబిక్కిరి చెయ్యడం, అరవడం, ఉమ్మడం లాంటివి చేయడం ముద్దులాగా సాధారణమైపోయాయి. నేను ఇటీవల డేటింగ్ చేసిన వ్యక్తికి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రవర్తించవద్దని చెప్పాను. అతను సరేనన్నాడు అని డైసీ అన్నారు.
అయితే మహిళలందరికీ అలా చెప్పే ధైర్యం ఉండదని ఆమె నమ్ముతున్నారు. "బెడ్‌రూమ్‌లో మహిళలు పై చేయి సాధించడాన్ని ఎక్కువమంది పురుషులు ఇష్టపడరని నా అనుభవంలో తేలింది. అక్కడ వారు తమ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటారు" అని డైసీ చెప్పారు.
డైసీ సీనియర్ 40 ఏళ్ల సుజన్నే నోబెల్ తన సెక్సువల్ సాహాసాల గురించి పుస్తకం రాశారు. ప్రస్తుతం ఆమె వెబ్‌సైట్‌తో పాటు సెక్స్ అడ్వైజ్ ఫర్ సీనియర్స్ అనే పాడ్‌కాస్ట్ నడుపుతున్నారు. పోర్న్ అందుబాటులో ఉండటం వల్ల బలవంతం చెయ్యడం, హింసకు పాల్పడటం లాంటివి మహిళలకు ఇష్టమనే అభిప్రాయం పాతుకుపోతోంది.
"వెబ్‌సైట్లలోని సూడో రేప్‌లకు, నిజానికి మధ్య ఉన్న తేడా తెలుసుకునే చైతన్యం కరువైంది’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్‌తో మరింత తేలికగా..
ఇంటర్‌నెట్ పోర్నోగ్రఫీని పడక గదిలోకి తీసుకువచ్చింది. అలాగే నిజ జీవితంలో జరిగే సంఘటనలను చూసేందుకు అవకాశం కలిపించింది. గతంలో ఇలాంటి అవకాశం ఉండేది కాదు. ఉదాహరణకు గతంలో ఎస్ అండ్ ఎం (శాడోమాసోచిజం - శారీరక,మానసిక బాధలు కలిగించి ఆనందించడం ) లాంటి వాటిని తీర్చుకోవడానికి మేగజైన్ల వెనుక భాగంలో వచ్చే పర్సనల్స్ యాడ్స్ ద్వారా అనుసంధానమయ్యేవారు. ఇందుకోసం తమ చిరునామాను గోప్యంగా ఉంచుతూ పోస్ట్ బాక్స్ నెంబర్లు ఇచ్చేవారు. లైంగికసంబంధాలకు ఇది చాలా నిదానమైన, కష్టమైన మార్గం. అయితే ఇప్పుడు అంతా తేలిగ్గా మారింది. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులంతా ఆన్‌లైన్ సాయంతో నేరుగా కలుసుకోగలుగుతున్నారు.
డేటింగ్ యాప్స్ ద్వారా బ్రిటన్‌లో ప్రేమికులను, భాగస్వాములను కలుసుకోవడం సర్వసాధారణం. అలా కలుసుకున్న వారు తమ లైంగిక ప్రాధాన్యాల గురించి కూడా చర్చించుకుంటున్నారు. హద్దు మీరిన, పరిధి దాటిన లైంగిక వాంఛల గురించి అన్వేషించడానికి ఫీల్డ్ లాంటి యాప్స్ వారికి వేదికగా మారాయి.
ఆన్‌లైన్‌లో ఇలాంటి జాబితాలో 31 వాంఛలు ఉన్నాయి. ఇందులో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగికచర్యలో పాల్గొనడం, భాగస్వామి అనుమతితో కట్టివెయ్యడం, హింసిచేలా వ్యవహరించడం లాంటివి ఉన్నాయి.
అల్బెర్టినా ఫిషర్ ఆన్‌లైన్ సైకోసెక్సువల్ థెరపిస్టు. తన వద్దకు వచ్చే వారికున్న లైంగికపరమైన ఊహల గురించి ఆమె వారితో మాట్లాడతారు. "సెక్సువల్ ఫాంటసీ ఉండటం తప్పేమీ కాదు. అయితే ఆ ఫాంటసీకి భాగస్వామి అనుమతి కూడా ఉండటం అవసరం" అని ఆమె వివరించారు.
సెక్సువల్ ఫాంటసీల విషయంలో స్త్రీ, పురుషుల ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయని ఆమె చెప్పారు. "ఇందులో ఎక్కువగా ఆధిపత్యం, తీవ్రంగా వ్యవహరించడం లాంటివే ఉంటాయి. అయితే ఎలాంటి కోరికలు, ఆలోచనలు ఉన్నా, స్త్రీ, పురుషులిద్దరికీ అంగీకారం ఉంటే మంచిది. ఇద్దరు వ్యక్తులు ఎలా చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్న వారిద్దరికీ ఇష్టమైతే మంచిది" అంటూ పరస్పర అంగీకారం అనే మాటను ఆమె నొక్కి చెప్పారు.
ఇదంతా పెలికాట్ కేసుకు సంబంధించినది కాకపోవచ్చు. అది లైంగిక హింసకు సంబంధించిన కేసు. భార్య భర్తల మధ్య అలాంటిది జరగడం ఎవరికైనా విచారాన్ని కలిగిస్తుంది. భాగస్వామి అంగీకారం లేకుండా లైంగిక కోరికల్ని తీర్చుకోవడం మతిలేని చర్యకు పరాకాష్ట లాంటిది.

ఫొటో సోర్స్, Getty Images
అంగీకారం అవసరం లేదా?
సెక్సువల్ ఫాంటసీలో కీలకమైన ప్రశ్న అందులో ఎలాంటి కోరికలు ఉన్నాయనేది. సిగ్మండ్ ఫ్రాయిడ్ తర్వాతి కాలంలో కోరికల్ని అణచివేయకూడదనే సత్యం సర్వసాధారణమైంది. 1960ల్లో వచ్చిన స్వేచ్ఛా సిద్ధాంతంలో భాగంగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి ఆమోదం పెరిగింది.అయితే, పురుషుల లైంగిక కోరికలు వివాదాస్పదమైన చర్చగా మారాయి.
పెలికో కేసులో అత్యాచారానికి పాల్పడిన వారు తమను తాము దోషులుగా భావించడం లేదు. వారిలో కొంతమంది తాము జీసెల్ పెలికో అంగీకారంతోనే స్వేచ్చాయుత లైంగిక క్రీడలో పాల్గొన్నామని వాదించారు. వారిలో ఎక్కువమంది తమ లైంగిక వాంఛను తీర్చుకున్నామని భావిస్తున్నారు.
ఇక్కడ కనిపించని చిన్న గీత ఉంది. పురుషుడు తన లైంగిక వాంఛ తీర్చుకోవాలనే విషయంలో మహిళకు కూడా సమాన హక్కులు ఉంటాయి. అయితే పురుషులు ఇలాంటి సందర్భంలో స్త్రీల పట్ల శ్రద్ధ చూపించడం లేదా వారి అంగీకారాన్ని పట్టించుకోవడం లేదు.
ఒక రోజులో వంద మంది పురుషులతో సెక్సులో పాల్గొంటానంటూ ఓన్లీ ఫాన్స్ యాక్ట్స్రెస్ లిలీ ఫిలిఫ్స్ ఇటీవల చేసిన ప్రకటన వందల మందిని ఆకర్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.
కొన్ని కేసుల్లో మహిళలను విమర్శించే ధోరణి వల్ల వారి కోరికను పూర్తిగా నిర్మూలించాలనే అంశంగా పరిణమిస్తుంది. మహిళలకు ఎంచుకునే స్వేచ్ఛను ఇది ప్రతిబింబించదు.
పురుషుల వాంఛ అనేక రకాలుగా ఉంటుంది. అందులో కొన్ని ఆరోగ్యకరంగా ఉండవచ్చు, కానీ అవి సాంస్కృతిక కట్టుబాట్లకు పరిమితమైనప్పుడు మాత్రమే. ప్రస్తుతం బ్రిటన్, పశ్చిమ దేశాల్లో ఈ సరిహద్దులు పూర్తిగా మారిపోయాయి. కోరికలను నెరవేర్చుకోవడం ఒక్కోసారి స్వేచ్ఛ కొన్ని సార్లు సామర్థ్యానికి సంబంధించిన చర్యగా మారుతోంది. కొన్ని సార్లు రెండూ కలిసి ఉంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆధిపత్యమే పురుషత్వమా?
లండన్‌లోని సౌత్ కెన్సింగ్టన్‌కు చెందిన థెరపిస్టు ఆండ్రూ డి ట్రిచాటో... "ఎక్స్"లో కోటి మందికిపైగా ఫాలోయర్లు కలిగి, తనను తాను స్త్రీ ద్వేషిగా ప్రకటించుకున్న ఆండ్రూ టేట్‌కు ప్రభావశీలత గురించి ప్రస్తావించారు.
ఫెమినిజం కారణంగా అవమానాలు ఎదుర్కొన్న, నిరాశ్రయులైన వారిని తాను కలిసినట్లు డి ట్రిచాటో చెప్పారు. "కొంతమంది పురుషులకు ఎవరు కావాలో తెలియదు. సామాజికంగా పురుషులు ఆధిపత్య ధోరణిలో ఉండాలి. కానీ వారు తమ భావోద్వేగాలను, నిస్సహాయతను ప్రదర్శించాలని భావిస్తుంటారు’’ అని ట్రిచాటో చెప్పారు. కానీ తమకు లభించిన సామాజిక ఆధిపత్యం కారణంగా వీటిని ప్రదర్శించలేక అయోమయానికి గురై చివరకు అది స్త్రీవాద ఉద్యమంపై ఆగ్రహానికి దారితీస్తుంది. దీని వల్ల బాధితులైన వారు టేట్ లాంటి స్త్రీద్వేషులను అనుసరిస్తారు’’ అని చెప్పారు.
టేట్ వద్దకు వస్తున్న వారిలో 60 శాతం పురుషులు ఉంటున్నారు. " ఇతరులపై ఆధిపత్యం అధికారం చూపడమే పురుషత్వ గుర్తింపులో కీలకమని భావిస్తుంటారు’’
"ఇవేవీ పెలికో కేసును సమర్థించడానికి కాదు. అయితే డొమినిక్ ప్రవర్తన అసమర్థత, చేతకానితనం నుంచి తప్పించుకోవడానికి నిదర్శనంగా చూడవచ్చు" అని ఆయన అన్నారు.
"ఈ కేసు చాలా కలవరం కలిగిస్తోంది. ఎందుకంటే జనం ఆలోచనలు ఎంత విపరీతంగా ఉన్నాయో చూపిస్తోంది" అని ట్రిచాటో అన్నారు.
జీసెల్‌ను రేప్ చేసేందుకు వ్యక్తుల్ని ఎంచుకోవడానికి డొమినిక్ ఆశ్రయించిన వెబ్‌సైట్లలాంటివి చాలా ప్రభావవంతమైనవని ఆయన గుర్తించారు. ‘‘మీరొక గ్రూపులో ఉన్నారు. మీ ఆలోచనలకు ఆమోదం లభించింది. ఎవరైనా ఒకరు మీరు చేస్తున్నదాన్ని సరైనదే అంటే మిగతా వారు కూడా వారిని అనుసరిస్తారు" అని ఆయన చెప్పారు.
పెలికో కేసు విచారణలో భాగంగా ఎక్కువ భాగం సెక్స్‌లో పరస్పర అంగీకారం, అంగీకారం లేని సెక్స్‌నుఎలా వర్గీకరించాలనే చర్చ జరిగింది. దీన్ని చట్టంలో మరింత మెరుగ్గా నిర్వచించాలా అనే దానిపై దృష్టి కేంద్రీకరించారు. అయితే అసలు సమస్య ఏంటంటే అంగీకారం కలిగి ఉండటం అనే దాన్ని నిర్వచించడం సంక్లిష్టమైన అంశం.
తన వయసున్న కొంతమంది మహిళలు తమ సొంత భావాలను పట్టించుకోకుండా పురుషుల లైంగిక ప్రాధాన్యాల ప్రకారమే నడుచుకుంటారు అని 24ఏళ్ల డైసీ చెప్పారు.
తమ లైంగిక వాంఛల ప్రాధాన్యతల కోసం అశ్లీలం వైపు మొగ్గడం పురుషుల్లో మారుతున్న కోరికల గురించి కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది. మహిళలు పురుషుల సాన్నిహిత్యం కోసం ఆ కోరికలను ఏ స్థాయికైనా ఆమోదించాలని భావిస్తే, వారి అంగీకారంపై వివాదం అనవసరం.
అంతిమంగా, పెలికో కేసులో దోషులకు శిక్ష పడింది. ఆమెకు న్యాయం జరిగింది. అయితే ఈ కేసు అనేక సమాధానం లేని ప్రశ్నలను సంధించింది. అవి బలమైన ఫ్రెంచ్ మహిళ ఒకరు సంధించిన, బహిరంగంగా చర్చించాల్సిన ప్రశ్నలు కావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














