ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న రేప్ కేసులో 51 మందికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది?

Gisèle Pelicot, ఫ్రాన్స్, రేప్, అత్యాచారం, కోర్టులు, సెక్స్

ఫొటో సోర్స్, CLEMENT MAHOUDEAU/AFP

ఫొటో క్యాప్షన్, తన కేసు విషయాలను బహిరంగపరచాలని కోర్టును కోరారు జీసెల్ పెలికో
    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫ్రాన్స్‌లో 72 ఏళ్ల జీసెల్ పెలికోపై అత్యాచారం కేసులో 51 మందికి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. ఫ్రెంచ్ నగరం ఎవిగాన్‌లో న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించనున్నారు.

జీసెల్ పెలికో మాజీ భర్త దాదాపు పదేళ్ల పాటు ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆమె స్పృహలో లేనప్పుడు, ఆమెపై అత్యాచారం చేసేందుకు డజన్ల మందిని ఇంటికి పిలిచారు. దీంతోపాటు ఆన్‌లైన్‌ ద్వారా కొంతమందిని నియమించుకున్నారు.

సాధారణంగా అత్యాచార కేసుల్లో బాధితుల గుర్తింపును గోప్యంగా ఉంచుతారు. కానీ, జీసెల్ తన వివరాలు వెల్లడించడమే కాకుండా కేసు విచారణ కూడా బహిరంగంగానే సాగాలని కోరారు.

జీసెల్ పెలికో భర్త తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. అయితే విచారణ సమయంలో అనేకమంది నిందితులు తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు.

దోషులుగా తేలినవారికి నాలుగేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు.

అయితే, కోర్టులో విచారణ సరిగ్గా జరగలేదని, హడావుడిగా పూర్తైందని ఓ నిందితుడు అన్నారు.

ఇతర యూరోపియన్ దేశాల మాదిరిగానే ఫ్రాన్స్‌లోనూ అత్యాచార నిరోధక చట్టాలను రూపొందించేందుకు ఏకాభిప్రాయం అవసరమని ఈ కేసు నిరూపిస్తోందని కార్యకర్తలు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Gisèle Pelicot, ఫ్రాన్స్, రేప్, అత్యాచారం, కోర్టులు, సెక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జీసెల్ పెలికో మాజీ భర్త డొమినిక్, అతని తరపు న్యాయవాది రేఖా చిత్రం

ఈ కేసు ఏమిటి?

2011 నుంచి 2020 వరకు డొమినిక్ పెలికో తన భార్యకు తెలియకుండా మత్తుపదార్ధాలు, నిద్ర మాత్రలను పొడిగా చేసి ఆహారంలో, తాగే నీటిలో కలిపి ఇచ్చేవారు.

ఈ డ్రగ్స్ కారణంగా జీసెల్ పెలికో మతి మరుపు, తరచూ స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో బాధపడ్డారు. తన జీవితంలో పదేళ్లను కోల్పోయానని ఆమె చెప్పారు.

డొమినిక్ ఒక సూపర్ మార్కెట్‌లో మహిళల స్కర్టుల కింద నుంచి ఫొటోలు తీస్తూ ఉండటాన్ని చూసిన ఓ సెక్యూరిటీ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డొమినిక్ పెలికో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

"మేము సన్నిహితంగా ఉండే దంపతులం అని అనుకున్నాం" అని జీసెల్ గతంలో ఒకసారి కోర్టులో చెప్పారు. అయితే ఆమె భర్త చాలా క్రూరంగా ప్రవర్తించారు. నిషేధిత వెబ్‌సైట్ కోకో.ఎఫ్ఆర్ నుంచి స్థానిక పురుషుల్ని తన ఇంటికి పలిచి, తన భార్య గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆమెతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడు.

"నన్ను బలి పీఠంపై ఉంచి బలి ఇచ్చారు" అని విచారణ తొలినాళ్లలో జీసెల్ పెలికో కోర్టులో అన్నారు.

2024 సెప్టెంబర్ ప్రారంభం నుంచి జడ్జి రోజర్ అరటా, ఆయన నలుగురు సహచరులు 50 మంది నిందితులు చెప్పిందంతా విన్నారు. 27 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న వీరంతా మజన్ గ్రామంలోని పెలికో ఇంటికి వెళ్లి ఏం చేశారో కోర్టులో చెప్పారు.

Gisèle Pelicot, ఫ్రాన్స్, రేప్, అత్యాచారం, కోర్టులు, సెక్స్

ఫొటో సోర్స్, Benoit PEYRUCQ/AFP

ఫొటో క్యాప్షన్, డొమినిక్ పెలికో కోర్టులో సాక్ష్యం ఇస్తున్నట్లుగా గీసిన స్కెచ్

డొమినిక్ పెలికో తనపై నమోదైన అభియోగాలన్నింటినీ అంగీకరించారు. భార్యకు మత్తు పదార్థాలు ఇవ్వడం, అత్యాచారం చేయించడం, అందుకు అనేకమందిని నియమించడం లాంటివన్నీ చేసినట్లు ఒప్పుకున్నారు. అత్యాచారం చేసేందుకు ప్రోత్సహించినందుకు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించాలని న్యాయవాదులు కోర్టును కోరారు.

"అవును నేను రేపిస్టునే" అని ఆయన న్యాయమూర్తులతో చెప్పారు. "కేసుకు సంబంధించి నేను అన్ని వాస్తవాలను అంగీకరిస్తున్నాను" అని అన్నారు. తన మాజీ భార్య, ముగ్గురు పిలల్ని క్షమాపణ కోరారు. అయితే ఆయన చర్యల వల్ల వారి కుటుంబం ముక్కలైంది.

మిగతా నిందితుల్లో అన్ని వర్గాలకు చెందినవారు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పెలికో గ్రామం మజన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారే. అందులో ఫైర్ ఫైటర్లు, సెక్యూరిటీ గార్డులు, లారీ డ్రైవర్లు ఉన్నారు. వారిలో అనేకమందికి పిల్లలు కూడా ఉన్నారు.

మొత్తం 51 మంది నిందితుల్లో 50 మంది మీద అత్యాచారం, అత్యాచారయత్నం ఆరోపణలు ఉన్నాయి.

రోమైన్ వీ అనే 63 ఏళ్ల వ్యక్తిపై నేరం రుజువైతే ఆయన 18 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఆయనకు హెచ్‌ఐవీ ఉన్నప్పటికీ ఎలాంటి రక్షణ పద్ధతులు పాటించకుండా జీసెల్ పెలికోపై ఆరు సార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మరో 10 మందికి 15-17ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 38 మందికి 10-14 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు.

తీర్పు వెలువడటానికి ముందు, అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించిన ఓ నిందితుడు తన కుమార్తె ద్వారా బీబీసీతో మాట్లాడారు. "అప్పుడు అంత ఆలోచించలేదు. అది నాకు అవసరం లేని పని" అని తన తండ్రి చెప్పారని ఆమె అన్నారు.

ఈ కేసులో అత్యాచారం చేసినట్లు రుజువైతే ఫ్రాన్స్ చట్టాల ప్రకారం సగటున 11.1 ఏళ్లు శిక్ష పడుతుంది.

ఒక నిందితుడి మీద రేప్‌ కాకుండా లైంగిక దాడి ఆరోపణలు ఉన్నాయి. 69 ఏళ్ల వయసున్న అతను స్పోర్ట్ మాజీ కోచ్ అని ప్రాసిక్యూటర్ జోసెఫ్ చెప్పారు. అతనికి నాలుగేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

నిందితుల్లో చాలామంది తమ ప్రవర్తనకు క్షమాపణ చెప్పారు. అయితే కొంతమంది చెప్పలేదు.

జీసెల్ పెలికోకు సిరిల్ బి క్షమాపణ చెప్పారు.

"నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను సిగ్గు పడుతున్నాను" అని జీన్ పియర్రే ఎం చెప్పారు. అతని పశ్చాత్తాపాన్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుంటారని అతని తరపు న్యాయవాది ఆశతో ఉన్నారు.

Gisèle Pelicot, ఫ్రాన్స్, రేప్, అత్యాచారం, కోర్టులు, సెక్స్

ఫొటో సోర్స్, Reuters

ఈ కేసును అసాధారణంగా మార్చిన అంశమేంటి?

ప్రజల దృష్టిలో నుంచి మాత్రమే కాదు, ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. డొమినిక్ పెలికో జరిగిందంతా రికార్డు చేశారు. ఆ వీడియోలను కోర్టులో ప్రదర్శించారు.

"వాళ్లు నన్ను వస్త్రం బొమ్మలా ట్రీట్ చేశారు" అని భర్తకు విడాకులు ఇచ్చిన జీసెల్ పెలికో చెప్పారు. "ఆ సెక్స్ దృశ్యాల గురించి నాతో మాట్లాడకండి. అవి అత్యాచారం చేసిన దృశ్యాలు" అని ఆమె అన్నారు.

వీడియో ఆధారాలు ఉండటంతో జీసెల్ పెలికో గాఢ నిద్రలో ఉన్నప్పుడు తాము ఆమె గదిలో లేమని నిందితుల్లో ఎవరూ వాదించగలిగే అవకాశం లేదు.

"ఆమె ఎదురు చెప్పకపోతే, అనుమతి ఇచ్చినట్లు అనుకోవడం రాతి యుగానికి చెందిన ఆలోచన" అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లౌరరే చబౌడ్ కోర్టుకు చెప్పారు.

ఫ్రాన్స్‌లో జీసెల్ పెలికోకు లక్షల మంది మద్దతుగా నిలిచారు. మహిళలు ప్రతీ రోజూ కోర్టు బయట నిల్చుని "సిగ్గు పడాల్సింది మగవాళ్లు" అనే నినాదాలు చేస్తున్నారు.

Gisèle Pelicot, ఫ్రాన్స్, రేప్, అత్యాచారం, కోర్టులు, సెక్స్

ఫొటో సోర్స్, MIGUEL MEDINA/AFP

ఫొటో క్యాప్షన్, జీసెల్ పెలికోకు మద్దతుగా అవిగ్నాన్‌లో వెలసిన పోస్టర్లు

జీసెల్ పెలికో విచారణ జరిగిన ప్రతిసారీ కోర్టుకు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ముందే ఆమె సన్ గ్లాసెస్ పెట్టుకుని కోర్టుకు వచ్చేవారు.

ఈ కేసులో తన వివరాలను బహిర్గతం చేయాలని ఆమె తీసుకున్న నిర్ణయం అసాధారణమైంది. అమె ప్రతీ దశలోనూ స్థిర నిశ్చయంతో ఉన్నారు "అత్యాచార బాధితులందిరికీ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. పెలికో చేసింది నేను కూడా చెయ్యగలను అని వాళ్లు అనుకోవాలి" అని అన్నారు.

అయితే ఆమె ముఖంపై కనిపిస్తున్న కృత నిశ్చయం వెనుక ఒక "శిధిలమైన క్షేత్రం" ఉంది. ఆమె నిర్ణయం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆమె దేన్నైనా ధిక్కరించగల ఒక హీరో అని నిరూపించింది.

"నేను మామూలుగానే ఉన్నాను" అని ఆమె పదే పదే చెబుతున్నారు. తననొక గొప్పవ్యక్తిగా పరిగణించడాన్ని ఆమె ఇష్టపడటం లేదు" అని ఆమె తరపు న్యాయవాది స్టెఫాన్ బాబోన్నో బీబీసీ ప్రతినిధి ఎమ్మా బార్నెట్‌తో చెప్పారు.

"మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుంది. తమలో అంత శక్తి ఉంటుందని వాళ్లు ఊహించలేరు. వాళ్లు తమను తాము నమ్మాలి. అదే ఆమె సందేశం" అని స్టెఫాన్ చెప్పారు.

Gisèle Pelicot, ఫ్రాన్స్, రేప్, అత్యాచారం, కోర్టులు, సెక్స్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తన కేసులో విచారణను బహిర్గతం చెయ్యాలని కోరడం ద్వారా ఆమె రేపిస్టులను సిగ్గు పడేలా చేశారు.

ఈ కేసు ఫ్రాన్స్‌లో ఎందుకు సంచలనమైంది?

ఈ కేసులో ఎవరూ చనిపోలేదు కాబట్టి, దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోర్టులో విచారణ మొదలైనప్పుడు మజన్ గ్రామ మేయర్ బీబీసీతో చెప్పారు.

మేయర్ వ్యాఖ్యల మీద ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో వెంటనే క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఈ విచారణ బహిరంగంగా జరగడంతో ప్రతీ రోజూ కేసులో ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు కూలంకషంగా వివరిస్తూ కథనాలు వచ్చాయి.

"జీసెల్ పెలికో ఈ కేసును తన కంటే పెద్దగా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి మార్గాల వల్లనే మనం ఒక సమాజంగా లైంగిక హింస మీద పోరాడవచ్చు" అని డేర్ టుబి ఫెమినిస్ట్ గ్రూప్ కార్యకర్త ఎల్సా లాబౌరెట్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)