ఉమర్ ఖలీద్‌కు ఏడు రోజుల మధ్యంతర బెయిల్, కోర్టు పెట్టిన షరతులు ఏంటంటే..

ఫొటో సోర్స్, Getty Images
జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌కు దిల్లీలోని కర్కర్‌డూమా కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సమీప బంధువు వివాహానికి హాజరయ్యేందుకు ఖలీద్‌కు ఈ నెల 28 నుంచి జనవరి 3వరకు (ఏడు రోజులు) షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.


ఫొటో సోర్స్, Getty Images
షరతులేంటి?
బెయిల్‌పై బయట ఉన్న సమయంలో ఖలీద్ బంధువులు, స్నేహితులను మాత్రమే కలవాలి. కార్యక్రమం జరిగే చోట లేదా తన ఇంట్లో మాత్రమే ఖలీద్ బంధువులు, స్నేహితులను కలుసుకోవాలి. సోషల్ మీడియాను ఉపయోగించకూడదని, సాక్ష్యులతో మాట్లాడకూడదని కోర్టు ఖలీద్‌ను ఆదేశించింది.
ఇద్దరు వ్యక్తుల సంతకాలతో పాటు, 20 వేల రూపాయల బెయిల్ బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఉమర్ ఖలీద్‌ను అరెస్టు చేశారు.
స్టూడెంట్ నాయకుడు, యాక్టివిస్ట్ అయిన ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరు నుంచి జైలులో ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో హింసను ప్రేరేపించారనేే కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఖలీద్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఒక కేసులో 2021 ఏప్రిల్ ఖలీద్‌కు బెయిల్ వచ్చింది. రెండో కేసులో ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదైంది.

ఫొటో సోర్స్, FB/Umar Khalid
ఉమర్ ఖలీద్‌పై వచ్చిన ఆరోపణలేంటి?
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా 2019 డిసెంబర్‌లో భారీగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఉమర్ ఖలీద్ పాల్గొన్నారు. దాదాపు మూడు నెలల పాటు ఈ ఆందోళనలు జరిగాయి.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. 53 మంది చనిపోయారు. వారిలో ఎక్కువమంది ముస్లింలు. ఆందోళనల సమయంలో ఇతరులతో కలిసి కుట్రపూరితంగా ఖలీద్ హింసకు పాల్పడ్డారని, అందువల్లే అల్లర్లు చెలరేగాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఆరోపించారు.
ఈశాన్య దిల్లీలో 2020 ఫిబ్రవరి 24న ఉమర్ ఖలీద్‌పై ఒక ఎఫ్ఐఆర్ ( 101/120) నమోదయింది.
అల్లర్లను ప్రేరేపించడం, రాళ్లు రువ్వడం, బాంబులు వేయడం, రెండు వర్గాల మధ్య విద్వేషం వ్యాప్తిచేయడం, పోలీసులపై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అభియోగాలను నమోదు చేశారు.
మరో ఎఫ్ఐఆర్(59/2020)లో ఉమర్ ఖలీద్‌తో పాటు ఇతరులు నిందితులుగా ఉన్నారు. తీవ్రవాదం, కుట్ర, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు చేశారు. ఉపా, ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి.
తీవ్రమైన కుట్రవల్లే దిల్లీలో అల్లర్లు చెలరేగాయని ప్రభుత్వం ఆరోపించింది. సీఏఏకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, రోడ్లను దిగ్బధించడం వంటి ఆరోపణలను కూడా నిందితులపై చేశారు.
కుట్రలో నిందితునిగా ఉన్న ఒక వ్యక్తితో సమావేశమైన ఉమర్ ఖలీద్‌ను ప్రత్యక్షసాక్షిగా గుర్తించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు.
రాళ్లు రువ్వుకునే సమయంలో ఖలీద్ అక్కడ లేరని ఆయన తరఫు లాయర్ చెప్పారు. ఉమర్ ఖలీద్ అరెస్టులో రాజకీయ కుట్ర ఉందని, నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు ఖలీద్‌ను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














