ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

ఫొటో సోర్స్, FB/KTR
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది.
ఫార్ములా ఈ రేస్ ఈవెంట్‌కు సంబంధించి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేస్ నిర్వహణా కంపెనీకి రూ.55 కోట్ల నిధులను చెల్లించారనేది ప్రధాన అభియోగం.
ఈ కేసులో ఎ1గా కేటీఆర్, ఎ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఎ3గా చేర్చింది ఏసీబీ.
ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, తెలంగాణ శాసనసభలో స్పందించారు.
'ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలని కోరుతున్నా'' అని స్పీకర్ కు విజ్జప్తి చేశారు కేటీఆర్.
కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఆ లేఖను డిసెంబరు 17న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఏసీబీకి పంపించారు.
సీఎస్ నుంచి అందిన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసింది ఏసీబీ.

ఫొటో సోర్స్, FB/KTRTRS
ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(ఎ) రెడ్ విత్ 13(2) తోపాటు ఐపీసీ 409 రెడ్ విత్ 120-బి సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది.
మొత్తం రూ.54,88,87,043ను ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు ముందస్తు చెల్లింపులు చేశారనేది ప్రధాన అభియోగం.
హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లు దాటి చెల్లింపులు చేయాలంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాలి. అయినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా చేశారని ఏసీబీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
''ఈ ఒప్పందంలో హెచ్ఎండీఏ భాగస్వామిగా లేదు. అయినా సరే చెల్లింపులు చేసింది.
అగ్రిమెంట్ అనేది 2023 అక్టోబరు 30న జరిగింది. అంతకుముందే చెల్లింపులు జరిగాయి.
డబ్బులు చెల్లించిన మొత్తంలో కొంతభాగం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో జరిగింది. దీనికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోలేదు.
చెల్లింపులన్నీ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో జరిగాయి'' అని ఏసీబీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
కేటీఆర్‌పై వచ్చిన ఆరోపణలు ఏంటి?
ఫార్ములా-ఈ రేస్ ఈవెంట్ నిర్వహణ నిధులను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్)పై విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు.
కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు నెలన్నర క్రితం ప్రభుత్వం లేఖ రాసింది.
న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ అనుమతి ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.
''కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంపై కేబినెట్ చర్చించింది. గవర్నర్ అనుమతి లేఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఏసీబీకి వెళ్తుంది'' అని మీడియాకు డిసెంబరు 16న కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి చెప్పారు.
ఆ తర్వాత, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం లేఖ రాశారు. గవర్నర్ అనుమతి ఇచ్చిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఏసీబీకి సూచించారు. దీని ఆధారంగా ఏసీబీ విచారణ మొదలుపెట్టింది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది.
మరోవైపు, ఎలాంటి విచారణకైనా సిద్ధమని కేటీఆర్ అన్నారు.
''మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటున్నారు'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అలాగే బెంగళూరులో ఎఫ్4 రేసింగ్ ఈవెంట్‌పై మే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
''ఇది కూడా కుంభకోణమేనా?'' అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్.

ఫొటో సోర్స్, FB/KTRTRS
ఏమిటీ ఫార్ములా-ఈ రేస్?
2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫార్ములా-ఈ రేస్ పోటీలు జరిగాయి.
ఫార్ములా-1 పోటీలు సంప్రదాయ శిలాజ ఇంధనాలతో నడిచే కార్లతో జరుగుతాయి. కానీ, ఫార్ములా-ఈ రేస్ పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే పోటీ.
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా రేస్ జరగబోతున్నట్లుగా 2022 జూన్‌లో అధికారిక ప్రకటన వచ్చింది.
పోటీల నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్, మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర కమిటీగా ఏర్పడ్డారు.
పోటీలకు స్పాన్సర్‌గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్ కో కంపెనీ వ్యవహరించింది. ప్రమోటర్‌గా ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ వ్యవహరించింది.
ట్రాక్ సిద్ధం చేసే పని ప్రభుత్వం చేయగా, మిగతావన్నీ గ్రీన్ కో తీసుకుంది. హుస్సేన్ సాగర్ వద్ద 11 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 2.37 కిలోమీటర్ల ట్రాక్ ఉంటుంది.

పోటీలకు ఎన్ని నిధులు వెచ్చించారు?
పోటీల నిర్వహణకు రూ. 200 కోట్లు వెచ్చించినట్లు అప్పట్లో ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
''ఈవెంట్ నిర్వాహక సంస్థగా వ్యవహరించిన గ్రీన్ కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్లు, ఇతర అవసరాలకు హెచ్ఎండీఏ తరఫున రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారు'' అని మున్సిపల్ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.
నాటి ఈవెంట్ విజయవంతం కావడంతో సీజన్-10 (2023 ఫిబ్రవరిలో సీజన్-9 జరిగింది)ని కూడా హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఫార్ములా-ఈ ఆపరేషన్స్) తో 2023 అక్టోబరులో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇందుకు హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా రూ.55కోట్లు చెల్లించిందనేది అభియోగం.
ఈ మొత్తం ఎంతనేది బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఈ వ్యవహారంలో ఎన్ని కోట్లు దుర్వినియోగం జరిగాయన్నది విచారణలో తెలుస్తుందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

2024 ఫిబ్రవరిలో ఈవెంట్ ఎందుకు రద్దు అయింది?
2023 డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
2024 ఫిబ్రవరి 10న పదో సీజన్ ఈ రేసింగ్ పోటీలు జరగాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఈ ఏడాది జనవరి 6న ఎఫ్ఐఏ ప్రకటించింది.
హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది ఆ సంస్థ. దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్ సైట్‌లో ప్రకటించింది.
అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేటీఆర్ విమర్శించారు.
''ఫార్ములా-ఈ రేస్ వంటి ఈవెంట్లతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మొదటిసారి ఈవెంట్‌ను భారత్‌కు తీసుకురావడానికి ఎంతో శ్రమపడ్డాం. కాంగ్రెస్ ప్రభుత్వానిది తిరోగమన నిర్ణయం'' అన్నారు కేటీఆర్.
ఆరోపణ ఏంటి?
గతేడాది అక్టోబరులో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.
''ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లేదని ప్రాథమికంగా తెలిసింది. ఈవెంట్‌కు ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉండాలి. ఖర్చును గ్రీన్ కో, ఎఫ్ఐఏనే భరించాలి. అలా కాకుండా గ్రీన్ కోను తప్పించి హెచ్ఎండీఏ నిర్వహణ ఒప్పందం చేసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా అనుమతి లేకుండా కొంత మొత్తాన్ని విదేశీ కరెన్సీ (డాలర్ల) రూపంలో చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి రెండు వారాల తర్వాత ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించాం'' అని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఇప్పటికే ఈ అంశాల ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఫొటో సోర్స్, FB/revanthofficial
ప్రభుత్వం అభ్యంతరాలేంటి?
హెచ్ఎండీఏకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.
ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముందస్తు చెల్లింపులు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభియోగం.
ఈ వ్యవహారంపై జనవరి 9న ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, గత అక్టోబరులో హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్న అర్వింద్ కుమార్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.
అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఒప్పందం చేసుకున్నట్లుగా అర్వింద్ కుమార్ వివరణలో పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
"2024లో ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు లేకపోతే, దాని గురించి ప్రాసెస్ చేయమని అర్వింద్ కుమార్‌కు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాను. అందులో భాగంగా అత్యవసరంగా రూ.55 కోట్లు కట్టాలని అర్వింద్ కుమార్ ఫైల్ పంపితే నేను సంతకం పెట్టాను. ఇందులో ఆయన తప్పేం లేదు. మంత్రిగా నాదే బాధ్యత"అని కేటీఆర్ గతంలో ప్రెస్‌మీట్‌లో తెలిపారు.
"హెచ్‌ఎండీఏ స్వతంత్ర ప్రతిపత్తి గల బోర్డు. దానికి చైర్మన్‌గా సీఎం, వైస్ చైర్మన్‌గా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటారు. హెచ్‌ఎండీఏ నిధుల వినియోగానికి క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు" అని కేటీఆర్ అన్నారు.
ఇప్పటికే అర్వింద్ కుమార్‌తోపాటు హెచ్ఎండీఏ నాటి చీఫ్ ఇంజినీర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఫొటో సోర్స్, FB/KTR
గవర్నర్ అనుమతి ఎందుకు?
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ప్రకారం, ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికారం దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చినా, ఏ పోలీసు అధికారి కూడా అధీకృత వ్యక్తులు లేదా వ్యవస్థల అనుమతి లేకుండా విచారించడానికి వీలు లేదు.
అధీకృత వ్యక్తి అంటే ఆ పబ్లిక్ సర్వెంట్ ఏ సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఆ సమయంలో అతడిని తొలగించే అధికారం ఎవరికి ఉంటుందో వాళ్లు అవుతారు.
ఆ నిబంధనల ప్రకారం చూస్తే, ప్రస్తుత లేదా మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది.
విచారణకు అనుమతి కోరిన తర్వాత 3 నెలల్లోపు నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. రాతపూర్వకంగా కారణాలను నమోదు చేయాలనుకుంటే, అవసరమనుకుంటే మరో నెల పాటు గడువు పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














