స్కూటర్ బాంబ్ పేలి రష్యా రసాయన ఆయుధ విభాగాధిపతి మృతి.. యుక్రెయిన్ పనే అని అనుమానం

ఫొటో సోర్స్, AP
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యాకు చెందిన రేడియేషన్, కెమికల్, బయోలాజికల్ ప్రొటెక్షన్ దళాల అధిపతి ఇగోర్ కిరిలోవ్ మాస్కోలో జరిగిన ఒక పేలుడులో మరణించారు.
యుక్రెయిన్ యుద్ధంలో రసాయన ఆయుధాలు వినియోగించారని, ఈ వ్యవహారాలను ఇగోర్ పర్యవేక్షిస్తున్నారని ఇప్పటికే పశ్చిమ దేశాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే ఆయన హత్యకు గురికావడం చర్చనీయమైంది.
ఈ పేలుడు వెనక యుక్రెయిన్ సెక్యురిటీ సర్వీస్ (ఎస్‌బీయూ) ప్రమేయం ఉన్నట్లు యుక్రెయిన్ నుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.
ఇది సాధారణ యుద్ధవ్యూహంలో భాగం కాదని, స్పెషల్ ఆపరేషన్ అని కూడా చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చిన పేలుడు పదార్ధం పేలడంతో ఆయన, ఆయన సహచరుడు మరణించారని.. మాస్కో సమీపంలోని రియాజాన్‌స్కీ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటి నుంచి బయలుదేరి వస్తుండగా ఈ ఘటన జరిగిందని రష్యా అధికారులు వెల్లడించారు.


ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
‘మిస్‌ఇన్ఫర్మేషన్ ప్రతినిధి’
రష్యా మంత్రిత్వ శాఖ తరఫున పదే పదే ప్రకటనలు, తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తిగా ఆయనను పాశ్చాత్య దేశాలు పేర్కొంటాయి. యూకే విదేశాంగ కార్యాలయం ఆయన్ను ‘‘క్రెమ్లిన్ నుంచి పదేపదే తప్పుడు సమాచారం అందించే ప్రతినిధి’’గా అభివర్ణించింది.
2017లో రష్యా సైన్యానికి చెందిన రేడియేషన్, కెమికల్ అండ్ బయాలాజికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్‌కు అధిపతి కాకముందు ఆయన టిమోషెంకో రేడియేషన్, కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రొటెక్షన్ అకాడమీకి నాయకత్వం వహించారు.
సైన్యానికి ఏర్పడబోయే ప్రమాదాలను, ముప్పును ముందుగా గుర్తించడం, వాటి నుంచి సైన్యాన్ని రక్షించడం ఈ విభాగం ప్రధాన విధి. అంతేకాకుండా, మంటలు, పొగ వంటివి ఉపయోగించి శత్రుసైన్యాలకు నష్టం కలిగించడం దీని విధుల్లో భాగమని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
‘‘ఆయన నాయకత్వం వహించిన దళం యుక్రెయిన్‌లో అనాగరికమైన రీతిలో రసాయన ఆయుధాలను మోహరించింది’’ అని యూకే విదేశాంగ కార్యాలయం పేర్కొంది. అల్లర్లను నియంత్రించే రసాయనాలను, టాక్సిక్ చోకింగ్ ఏజెంట్ క్లోరోపిక్రిన్‌ను ఆయన నాయకత్వం వహించిన దళాలు విస్తృతంగా వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిషేధిత రసాయనాలను భారీ ఎత్తున వాడినట్లు ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు విచారణకు కూడా ఆయన హాజరు కాలేదని యుక్రెయిన్ సెక్యురిటీ సర్వీసెస్ వెల్లడించింది.
2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్ భూభాగంలో 4,800 పైగా రసాయన ఆయుధాలను వినియోగించినట్లు ఈ కేసులో ఆరోపణలున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
రసాయన ఆయుధాల వినియోగం ఆరోపణలు
డ్రోన్‌లతోపాటు, గ్రనేడ్‌లలోనూ ప్రాణాంతక రసాయన పదార్థాలను నింపి ఆయన సంస్థ ఉపయోగించేదని యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆరోపించింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాల మీదా, యుక్రెయిన్ మీదా కిరిలోవ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పాశ్చాత్య దేశాలు విమర్శించేవి.
‘యుక్రెయిన్‌లో అమెరికా జీవాయుధాల ప్రయోగశాలను నిర్మిస్తోంది’ అన్నది ఆయన చేసిన అతిపెద్ద ఆరోపణల్లో ఒకటి. 2022లో యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధాన్ని సమర్థించే ప్రయత్నంలో భాగంగా ఈ ఆరోపణలు చేసినట్లు పాశ్చాత్య దేశాలు విమర్శించాయి.
ఫిబ్రవరి 24 యుక్రెయిన్‌పై దాడి జరిగిన రోజునే రష్యా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుందంటూ మార్చి 2022లో ఆయన ఒక నివేదికను సమర్పించారు. ఈ రిపోర్టును రష్యా అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. అయితే, స్వతంత్ర నిపుణులు ఈ రిపోర్టును తప్పుబట్టారు.
ఈ ఏడాది కూడా యుక్రెయిన్ విషయంలో అనేక తప్పుడు ఆరోపణలు, క్లెయిములు చేసి అపఖ్యాతి పాలయ్యారు కిరిల్లోవ్.
రష్యాలోని కుర్క్స్ అణు విద్యుత్ ప్లాంటును ఆక్రమించడమే యుక్రెయిన్ ఎదురుదాడి ప్రధాన లక్ష్యాలలో ఒకటని కిరిలోవ్ ఈ ఏడాది నవంబర్‌లో ప్రకటించారు.
యుక్రెయిన్‌కు చెందిన ఒక నివేదికను ఆధారంగా చేసుకుని ఆయన రష్యా ప్రభుత్వానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు.
‘‘ఏదైనా జరగరానిది జరిగితే రేడియో ధార్మికత కారణంగ రష్యా భూభాగానికే నష్టం కలుగుతుంది’’ అని యుక్రెయిన్ రిపోర్టులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
డర్టీబాంబ్ ఆరోపణలు
కిరిలోవ్ పదే పదే చేసిన ఆరోపణల్లో యుక్రెయిన్ ‘డర్టీ బాంబు’ను తయారు చేయాలనుకుంటోందన్నది ఒకటి.
రెండు సంస్థలకు ఈ ‘డర్టీ బాంబు’ తయారీ బాధ్యతలను యుక్రెయిన్ అప్పగించిందని, ఆ పని చివరి దశలో ఉందని ఆయన రెండేళ్ల కిందట ఆరోపించారు.
ఇవి తప్పుడు ఆరోపణలని, నిరాధారమని పాశ్చాత్య దేశాలు ఖండించాయి.
కిరిలోవ్ చేస్తున్న ఆరోపణలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ కూడా స్పందించాల్సి వచ్చింది.
‘‘ఒకవేళ యుక్రెయిన్ అలాంటి ఆయుధాలను తయారు చేస్తోందని నమ్మితే, ఆ బాంబులను రష్యా ఇప్పటికే తయారు చేస్తోంది’’ అని అన్నారు.
గత ఏడాది కూడా కిరిలోవ్ ఈ డర్టీ బాంబు ఆరోపణలను తెరపైకి తెచ్చారు. రష్యా గత ఫిబ్రవరిలో స్వాధీనం చేసుకున్న ఒక యుక్రెయిన్ భూభాగంలో కెమికల్ వెపన్స్ లేబరేటరీని కూడా రష్యా సైన్యం గుర్తించిందని ఆయన అన్నారు.
కిరిలోవ్ మరణం రష్యా అనుకూల వర్గాలకు పెద్ద దెబ్బగా యుద్ధ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.
అలాగే, మాస్కోలోని ఉన్నత స్థాయి అధికారులను టార్గెట్ చేసుకుని దాడులు చేయగల సామర్ధ్యం యుక్రెయిన్‌కు ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని కూడా వారు పేర్కొంటున్నారు.
కిరిలోవ్ మరణం తీరని లోటని రష్యా పార్లమెంటు ఎగువ సభ డిప్యూటీ స్పీకర్ కాన్‌స్టాంటిన్ కొసాచెవ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














