రష్యా అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సర్వప్రియ సంగవాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2022 అక్టోబరు, అమెరికన్ నిఘా వర్గాలు షాక్‌కు గురయ్యాయి.
రష్యన్ సైనిక అధికారుల రహస్య సంభాషణను అమెరికా అధికారులు విన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌లోని ఏదైనా సైనిక కేంద్రం మీద అణు దాడి చెయ్యవచ్చనే ఆందోళనలు పెరిగాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు.
యుక్రెయిన్ మీద రష్యా ఆక్రమణ ప్రారంభమై వెయ్యి రోజులు గడిచాయి. ఇప్పుడు అణ్వాయుధాల ప్రయోగం గురించి మరోసారి చర్చ మొదలైంది.
పుతిన్ రష్యా అణు విధానంలో మార్పులు చేశారు. మరోవైపు, అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను రష్యా మీదకు ప్రయోగించింది యుక్రెయిన్.


ఫొటో సోర్స్, EPA
రష్యా కొత్త అణు విధానంలో ఏముంది?
రష్యాలో అణ్వాయుధాలను ఉపయోగించే విధానంలో మార్పులను ఇటీవల అధ్యక్షుడు పుతిన్ ఆమోదించారు.
రష్యా కొత్త అణ్వాయుధ విధానం ప్రకారం, అణ్వాయుధాలు లేని దేశం, అణ్వాయుధాలు ఉన్న దేశంతో జట్టు కడితే, ఆ రెండు దేశాలు తమపై దాడి చేస్తున్నట్లు రష్యా భావిస్తుంది.
యుక్రెయిన్ వద్ద అణ్వాయుధాలు లేవు. అయితే అమెరికా వద్ద ఉన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ ఈ యుద్ధంలో యుక్రెయిన్‌కు అండగా ఉన్నాయి. ఆయుధాలు, నిధులు అందిస్తున్నాయి.
దీంతో పాటు 32 దేశాల సైనిక కూటమి నేటో కుడా యుక్రెయిన్‌కు మద్దతిస్తోంది.
రష్యా మీద మరో దేశం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినా, వైమానిక దాడులు చేస్తే, ఆ దేశం మీద అణ్వాయుధాలతో ప్రతిస్పందించేలా రష్యన్ అణు విధానంలో మార్పులు చేశారు.
యుక్రెయిన్ ఇప్పటికే రష్యా మీద అనేకసార్లు వైమానిక దాడులు చేసింది. డ్రోన్లను ప్రయోగించింది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన క్షిపణులను ప్రయోగిస్తోంది.
దీంతో పాటు రష్యా అణు విధానంలో మరికొన్ని ఇతర అంశాలను చర్చించారు.
ఏ దేశమైనా మరో దేశంతో కలిసి సైనిక కూటమి ఏర్పాటు చేసినా, ఉన్న సైనిక కూటమిని విస్తరించినా, రష్యా సరిహద్దుల సమీపంలో సైనిక మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసినా, సైనిక విన్యాసాలు నిర్వహించినా ఆ దేశం మీద రష్యా అణ్వాయుధాలు ప్రయోగించవచ్చు.

ఫొటో సోర్స్, EPA
అమెరికాను హెచ్చరించిన రష్యా
అణ్వాయుధాలు ప్రయోగించడం గురించి రష్యా ఇప్పటికే అమెరికా, మరి కొన్ని దేశాలను హెచ్చరించింది.
2024 మార్చ్‌లో రష్యా అధ్యక్ష ఎన్నికలకు ముందు తాము అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. అమెరికా యుక్రెయిన్‌కు తన సైన్యాన్ని పంపిస్తే, యుద్ధం మరింత తీవ్రం అయి ఉండేది.
దీన్ని మరింత లోతుల్లోకి వెళ్లిచూస్తే, రష్యాలో అణ్వుయుధాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏ దేశం కూడా తన వద్ద ఉన్న ఆయుధాల గురించి కచ్చితమైన పూర్తి సమాచారం బహిర్గతం చెయ్యదు.
అయితే, వివిధ సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం రష్యా వద్ద అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. దాదాపు 5,977 ఉన్నట్లు అంచనా.
ఇది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వద్ద ఉన్న అణ్వాయుధాల కంటే ఎక్కువ. ఇందులో కొన్ని వ్యూహాత్మక ఆయుధాలు కూడా ఉన్నాయి.
వ్యూహాత్మక ఆయుధాలు అంటే ఒక ప్రత్యేక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే అణ్వాయుధాలు. వీటిని క్షిపణుల ద్వారా ప్రయోగించవచ్చు.
క్రూయిజ్ మిస్సైళ్ల మాదిరిగా వీటి వల్ల చాలా దూరం వరకూ రేడియో ధార్మికత వ్యాపించదు. వీటి ద్వారా ఒక కిలోటన్ను అణ్వాయుధాన్ని పేల్చవచ్చు.
అయితే, పుతిన్ ప్రకటనలు ఆయన వాక్చాతుర్యంలో భాగమేనని మీడియా సంస్థలు, పశ్చిమ దేశాలు చెప్పుకొచ్చాయి. దీనర్థం ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అలాంటి ప్రకటనలు చేసి ఉంటారని వాళ్లు భావించారు. అయితే ఆయన మాటల్ని చేతల్లో చూపించడం ఎంత వరకు సాధ్యం?
యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు గట్టి ఎదురు దెబ్బలు తగిలితే వ్యూహాత్మక ఆయుధాల్ని ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా మీద భారీగా ఆధారపడుతున్న రష్యా
చిన్నవైనా సరే, రష్యా అణ్వాయుధాలను ప్రయోగించడానికి చైనా కూడా మద్దతివ్వకపోవచ్చు.
ఎన్నడూ ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించకూడదు అనేది చైనా అణు విధానం.
రష్యా ముందుగా అణ్వాయుధాలను ఉపయోగిస్తే చైనా మాస్కోతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవచ్చు.
అణ్వస్త్ర విధానాన్ని మార్చడం ద్వారా పుతిన్ అందోళనలో పడేయాలని భావించి ఉండవచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రపంచ దేశాల మీద తన ప్రభావం పెంచుకునే ప్రయత్నం చేశారని వాళ్లు నమ్ముతున్నారు.
పుతిన్ కొత్త అణ్వస్త్ర విధానాన్ని అమెరికా విమర్శిస్తోంది. ఆయన ప్రకటన గురించి ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని అంటోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















