ప్రియాంక గాంధీ హ్యాండ్ బ్యాగ్: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లాదేశ్.. వయనాడ్ ఎంపీ సంచిపై సందేశాలేమిటి? బీజేపీ అభ్యంతరాలు ఏమిటి

ఫొటో సోర్స్, pawankhera/X
హ్యాండ్ బ్యాగ్ విషయంలో వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది.
సోమవారం ప్రియాంక గాంధీ పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఆమె హ్యాండ్ బ్యాగ్ మీద పాలస్తీనా అని రాసి ఉంది. ఆ బ్యాగు మీద పాలస్తీనా చిహ్నాలు కూడా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ‘ముస్లింలను సంతృప్తిపరిచే రాజకీయాలు’ చేస్తోందని.. ప్రియాంక హ్యాండ్‌బ్యాగ్‌పై రాతలు అందులో భాగమేనని బీజేపీ ఆరోపించింది.
ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా ఎన్నికైన తరువాత గత వారం దిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయ ఇంచార్జ్ ఆమెను కలిసి అభినందనలు తెలిపారు.
అంతకు ముందు ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడాన్ని ప్రియాంక ఖండించారు.

గాజా విషయంలో ప్రియాంక గాంధీ తరచూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని వివిధ సందర్భాల్లో ఆమె ఖండించారు.
హ్యాండ్ బ్యాగ్ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు.
‘ఈ సమస్యపై గతంలో అనేక సార్లు నా అభిప్రాయం చెప్పాను. నేనిప్పుడు ఏ దుస్తులు ధరించాలో ఎవరు నిర్ణయిస్తారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి ఇదేమైనా పితృస్వామ్య వ్యవస్థా?" అని ఆమె ప్రశ్నించారు.
కాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు "కొత్త ముస్లిం లీగ్"లా మారిందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ.
‘పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున రెండు నిమిషాలు కాంగ్రెస్ కోసం మౌనం పాటించండి. తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రియాంక గాంధీ పరిష్కారం అని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా భావిస్తోంది. అయితే ఆమె ఆ పార్టీకి రాహుల్ గాంధీకి మించి డిజాస్టర్‌లా మారారు. పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగును భుజానికి తగిలించుకుని రావడం పితృస్వామ్యం మీద పోరాడటం అని ఆమె భావిస్తున్నారు’ అని అమిత్ మాలవీయ "ఎక్స్"లో పోస్ట్ చేశారు.
"నెహ్రూ కాలం నుంచి నుంచి ప్రియాంక వరకు గాంధీ కుటుంబ సభ్యలు తమ భుజాలకు బుజ్జగింపు బ్యాగులు తగిలించుకుని తిరుగుతున్నారు. వాళ్లెప్పుడూ దేశభక్తి బ్యాగుల్ని తగిలించుకోలేదు. దాని భారం మోయలేదు. వాళ్లు ఏ మార్గం ఎంచుకున్నా అందులో బుజ్జగింపు రాజకీయాలే ఉన్నాయి" అని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
"అజ్ఞానంతో కూడిన అహంకారంతో పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ పట్టుకుని అద్భుతాలు చెయ్యవచ్చని భావించడం సగం నిండిన కూజా పొర్లిపోవడం లాంటిది" అని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.
"పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగును భుజానికి తగిలించుకోవడం ముస్లింలను బుజ్జగించడం కాదు. పాలస్తీనా సమస్యను ముస్లింలతో ముడిపెడుతున్నవారు వారికి అన్యాయం చేస్తున్నారు. ఇది మానవీయ సమస్య. మీరేదైనా చట్టబద్దమైన సమస్యను లేవనెత్తితే దాన్ని ముస్లిం, హిందువులు, క్రైస్తవుల సమస్య అని అనడం సరికాదు. ఇది అంతర్జాతీయ సమస్య. సీపీఐ పాలస్తీనీయులకు మద్దతిస్తోంది. పాలస్తీనా సమస్యను లేవనెత్తడం హమాస్‌కు మద్దతిస్తున్నట్లు కాదు. ప్రియాంక ఆ బ్యాగును తీసుకురావడం ద్వారా మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను" అని సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు.
బీజేపీ నేతల విమర్శల గురించి పీటీఐ వార్తా సంస్థ ప్రియాంక గాంధీని ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా స్పందించారు. "బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి ఏదైనా చెయ్యమని వారితో చెప్పండి. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి దాడులు జరక్కుండా చూడండి. అర్థం లేని మాటలు మాట్లడకండి" అని అన్నారు.

ఫొటో సోర్స్, @drshamamohd
ప్రియాంక గాంధీ మంగళవారం మరోసారి తన హ్యాండ్ బ్యాగ్‌తో పార్లమెంటుకు చేరుకున్నారు.
సోమవారం ఆమె పాలస్తీనా అని రాసి ఉన్న హ్యాండ్‌బ్యాగ్ ధరించడంపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు.
దీంతో మంగళవారం ఆమె బంగ్లాదేశ్ అని రాసి ఉన్న బ్యాగ్‌తో పార్లమెంటుకు వచ్చారు.
ఆమెతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు చాలామంది ఇలాంటి బ్యాగులతో పార్లమెంటుకు వచ్చారు.
ప్రియాంక హ్యాండ్‌బ్యాగు మీద " బంగ్లాదేశ్ హిందువులు, ముస్లింలకు మద్దతుగా" అని రాసి ఉంది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా ప్రియాంక నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు సభ వెలుపల నినాదాలు చేశారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలను భారత ప్రభుత్వం అణిచివేస్తోందన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
గాజా మీద గతంలోనూ ప్రియాంక ప్రకటనలు
నిరుడు అక్టోబర్‌లో గాజా మీద ఐక్యరాజ్య సమితి తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడాన్ని ప్రియాంక విమర్శించారు.
"మానవీయతకు అనుకూలంగా ఉన్న చట్టాలను పక్కన పెట్టినప్పుడు, అలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉండటం తప్పే" అని ఆమె అన్నారు.
"కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని చీకట్లో పడేస్తుంది. గాజాలో కాల్పుల విరమణపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటంపై నేను సిగ్గు పడుతున్నాను. మన దేశం అహింస, సత్యం అనే సిద్ధాంతాల మీద ఏర్పడింది. ఈ సిద్ధాంతల కోసమే స్వాతంత్ర యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. రాజ్యాంగానికి మూల సూత్రాలివి. ఇవే మన జాతీయతను వెల్లడిస్తాయి" అని ఆమె మహాత్మా గాంధీ సందేశాన్ని జోడించి ట్వీట్ చేశారు.
"లక్షల మంది ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, సమాచార వ్యవస్థ, సరఫరాలు, విద్యుత్ అందడం లేదు. పాలస్తీనాలో స్త్రీ, పురుషులు, పిల్లలను చంపేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏదో ఒక వైఖరి తీసుకోకపోవడం తప్పు. ఒక దేశంలో భారత్ దేనికోసమైతే పోరాడుతుందో, దానికి ఇది వ్యతిరేకం" అని ప్రియాంక తన సందేశంలో తెలిపారు.
2023 నవంబర్ 5న చేసిన మరో ట్వీట్‌లో "దాదాపు 10వేల మంది ప్రజలు, అందులో 5వేల మంది పిల్లలు చనిపోవడం దారుణం, సిగ్గు చేటు. కుటుంబాలకు కుటుంబాలే లేకుండా పోయాయి. ఆసుపత్రులు, అంబులెన్స్‌ల మీద బాంబులు వేశారు. శరణార్థి శిబిరాలను కూడా వదల్లేదు" అని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనా విషయంలో భారత వైఖరి ఏంటి?
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. హమాస్ ఫైటర్లు 1200 మందిని చంపేసి, 253 మందిని బందీలుగా పట్టుకెళ్లారు.
ఈ సంఘటన తర్వాత ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటి వరకు 44,875 మంది చనిపోయారని, లక్ష మందికిపై గాయపడ్డారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ చెబుతోంది.
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ట్వీట్ చేశారు. "ఇజ్రాయెల్ మీద టెర్రరిస్టుల దాడి షాకింగ్‌గా ఉంది. అమాయకులైన బాధితులు, వారి కుటుంబాలకు మా సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తాం" అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ 'ఎక్స్'లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. "
"ఇజ్రాయెల్‌లో అమాయకులైన పౌరుల మీద జరిగిన దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చట్టబద్ధమైన ఆకాంక్షలను విశ్వసిస్తుంది. పాలస్తీనా ప్రజలు చర్చల ప్రక్రియ ద్వారానే గౌరవం, సమానత్వం, గౌరవప్రదమైన జీవితాన్ని సాధించుకోవాలి. ఇజ్రాయెల్ చట్టబద్దమైన జాతీయ భద్రతాపరమైన ప్రయోజనాలను కాపాడాలి. హింస ఏ రూపంలో ఉన్నా సరే, అది ఆమోదయోగ్యం కాదు. దాన్ని కచ్చితంగా ఆపాలి" అని అందులో పేర్కొన్నారు.
పాలస్తీనాపై భారత దేశం వైఖరి గురించి అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ.. "పాలస్తీనా ప్రజల కోసం స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు జరిగే చర్చలను భారత దేశం ఎప్పుడూ సమర్థిస్తుంది. సొంత సరిహద్దులతో పాలస్తీనాను ఏర్పాటు చేస్తే అది ఇజ్రాయెల్ కలిసి అది ప్రశాంతంగా జీవించగలదు" అని బాగ్చీ చెప్పారు.
పాలస్తీనియన్ల విషయంలో భారత్ దీర్ఘకాలంగా ఒకే వైఖరితో ఉందని, అందులో ఎలాంటి మార్పు లేదని బాగ్చీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














