ఒకరే టీచర్, ఒకరే స్టూడెంట్, ఏడాదికి ఖర్చు ఎంతంటే..

విద్యార్థి, టీచర్
ఫొటో క్యాప్షన్, ఈ ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి, ఒక టీచర్ మాత్రమే ఉన్నారు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నేను కూడా రాకపోతే ఈ స్కూల్ మూత పడిపోతుందట. అందుకే మా నాన్న ఇక్కడికి పంపిస్తున్నారు. ఏడో తరగతి వరకు ఇక్కడే చదువుకుంటా. తర్వాత హైదరాబాద్‌లో హాస్టల్‌కు వెళ్లి చదువుకుంటా'' అని చెబుతోంది నాలుగో తరగతి చదువుతున్న నందిగామ కీర్తన.

కీర్తన వెళ్తున్న స్కూల్లో చదువుకుంటున్నది ఇప్పుడు ఆమె ఒక్కరే.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లిలో ఉందీ ప్రాథమికోన్నత పాఠశాల.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్కూలు, టీచర్, విద్యార్థి, ఖమ్మం, తెలంగాణ, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది.

టీచర్ కూడా ఒక్కరే

ఖమ్మం పట్టణం నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం.

బీబీసీ ఈ ఊరికి వెళ్లినప్పుడు ఈ స్కూల్లో కీర్తన, ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి మాత్రమే ఉన్నారు.

తోటి పిల్లలెవరూ లేకుండా ఒక్కదానివే ఉండడం వల్ల ఆడుకోవడానికి, స్కూల్‌లో ఉండటానికి ఇబ్బందిగా లేదా..? అని అడిగితే, అలాంటిదేమీ లేదని చెప్పింది కీర్తన.

''నన్ను రోజూ నాన్న స్కూల్‌కు తీసుకువస్తారు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఇంగ్లిష్.. తర్వాత తెలుగు చదువుతా. అన్నం తిని వచ్చాక మ్యాథ్స్, ఈవీఎస్ చదువుతా'' అని చెప్పింది.

ఈ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకునే వీలుంది. ఒక గది (కార్యాలయం, క్లాస్ రూమ్.. అన్నీ అక్కడే) మినహా మిగతా అన్ని తరగతి గదులకు తాళాలు వేసి కనిపించాయి.

స్కూలు, టీచర్, విద్యార్థి, ఖమ్మం, తెలంగాణ, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, దాదాపు 15 ఏళ్ల కిందట సుమారు 60-70 మంది విద్యార్థులుండేవారని గ్రామస్థులు చెప్పారు.

ఒకప్పుడు.. అంటే దాదాపు 15 ఏళ్ల కిందట సుమారు 60-70 మంది విద్యార్థులుండేవారని గ్రామస్థులు చెప్పారు. విద్యార్థుల సంఖ్య రానురానూ తగ్గుతూ వచ్చింది.

''నేను వచ్చినప్పుడు అంటే ఆరేళ్ల క్రితం 24 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ ఏడాది ఏడో తరగతి నుంచి ఆరుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చారు.

విద్యార్థి

మొదట్లో అంగన్వాడీకి పిల్లలు రాకపోవడంతో గ్రామంలో జననాల రేటు తక్కువగా ఉందని అనుకున్నాం. కానీ, మూడేళ్లు వచ్చేసరికి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. కొందర్ని గురుకులాలకు పంపుతున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలకు పూర్తిగా తగ్గిపోయారు'' అని చెప్పారు ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి.

ఒక్కరికే పాఠాలు చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుందా అని ప్రశ్నించగా.. ''ఒక్కరికి చెప్పినా, ఎక్కువ మంది పిల్లలకు చెప్పినా బోధనలో తేడా ఉండదు. ఒకే పిల్ల ఉండటంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెప్పడానికి వీలుంటోంది'' అని ఆమె చెప్పారు.

ఒక్కదాన్నే ఉండటంతో సెలవులు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నానని చెప్పారు ఉమా పార్వతి.

స్కూలు, టీచర్, విద్యార్థి, ఖమ్మం, తెలంగాణ, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, స్కూలును కొనసాగించేందుకే తన కుమార్తెను పంపిస్తున్నానని అనిల్ శర్మ చెప్పారు.

'దేవాలయం ఎలాగో, బడి కూడా అంతే'

ప్రస్తుతం ఊళ్లో 20 మంది వరకు బడి ఈడు పిల్లలున్నా.. వారిని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని చెప్పారు కీర్తన తండ్రి నందిగామ అనిల్ శర్మ.

తనతో సహా కుటుంబంలో మరికొంత మంది అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామని ఆయన వివరించారు.

''నేను పౌరోహిత్యం చేస్తాను. బడి అంటే దేవాలయంతో సమానం. దాన్ని నిలబెట్టాలనే బాధ్యత మనపై ఉండాలి'' అని చెప్పారాయన.

''ఏం మీకు డబ్బుల్లేవా? ప్రభుత్వ బడికి పంపించడమేంటి?'' అంటూ ఊళ్లో కొందరు తనను అడుగుతుంటారని అనిల్ శర్మ చెప్పారు.

''పోయిన సంవత్సరం మా పాపతో పాటు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారందరూ గురుకులాలకు వెళ్లిపోయారు. మా పాప కూడా లేకపోతే స్కూల్ బంద్ చేసే అవకాశం ఉంది. అందుకే స్కూల్ ఇక్కడ కొనసాగాలంటే మా పాపను అక్కడే చదివించాలనుకున్నా'' అని చెప్పారు అనిల్ శర్మ.

స్కూలు, టీచర్, విద్యార్థి, ఖమ్మం, తెలంగాణ, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, ప్రైవేటు స్కూళ్లకు పంపడాన్ని తల్లిదండ్రులు స్టేటస్‌లా భావిస్తున్నారని ఉమా పార్వతి చెప్పారు.

ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు?

మూడేళ్ల క్రితం ఈ పాఠశాలలోనూ ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించింది విద్యాశాఖ.

అయినప్పటికీ పిల్లలు ఎందుకు ప్రైవేటు స్కూళ్లవైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రశ్నకు ఉమాపార్వతి బదులిచ్చారు.

''తల్లిదండ్రులు అదో స్టేటస్‌లా చూస్తున్నారని అనిపించింది. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించడమంటే, తమను తాము తక్కువ చేసుకోవడం అని భావిస్తున్నారు. కొందరు ప్రైవేటు పాఠశాలలకు పంపించలేకపోతే, గురుకులాలకు పంపిస్తున్నారు'' అని చెప్పారు.

స్కూలు, టీచర్, విద్యార్థి, ఖమ్మం, తెలంగాణ, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ చెప్పారు.

రూ.11- 12 లక్షలు వెచ్చిస్తున్నాం: డీఈవో

తెలంగాణలో 26,105 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 4,324 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతుంటే, 11,393 ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల మంది చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

నారపునేనిపల్లి గ్రామంలో ఉన్న ఏకైక విద్యార్థిని కీర్తన చదువు కోసం ఏడాదికి రూ.11 లక్షల నుంచి 12 లక్షలు వెచ్చిస్తున్నామని చెప్పారు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ.

ఇందులో ఉపాధ్యాయురాలి జీతం, పాఠశాల నిర్వహణ గ్రాంటు, మధ్యాహ్న భోజన ఖర్చు, స్కూల్ అసిస్టెంట్ వేతనం.. ఇలా అన్నీ ఉంటాయని చెప్పారాయన.

''ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కాకూడదనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. పిల్లల సంఖ్య ఎంత తక్కువ ఉన్నా సరే, ఉపాధ్యాయులను నియమించి బోధన కొనసాగిస్తున్నాం.

స్కూలు, టీచర్, విద్యార్థి, ఖమ్మం, తెలంగాణ, విద్యాశాఖ

విద్యాహక్కు చట్టం ప్రకారం కూడా ఏ పిల్లవాడూ చదువుకు దూరం కాకూడదని ఉంది. అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది'' అని సోమశేఖరశర్మ బీబీసీకి చెప్పారు.

తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని సోమశేఖర శర్మ బీబీసీతో అన్నారు.

ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి బీబీసీతో మాట్లాడుతూ.. ''ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఒక విద్యార్థి ఉన్నా సరే స్కూల్ నడిపిస్తున్న పట్టుదల చూసి తమ పిల్లలను తల్లిదండ్రులు బడికి పంపిస్తారని అనుకుంటున్నా'' అని చెప్పారు.

కీర్తన తండ్రి అనిల్ శర్మ మాట్లాడుతూ.. ''మా పట్టుదల చూసి వచ్చే ఏడాది తమ పిల్లలను పంపిస్తామని ఊళ్లోని మరో ఇద్దరు, ముగ్గురు చెప్పారు'' అని అన్నారు.

స్కూలు, టీచర్, విద్యార్థి, ఖమ్మం, తెలంగాణ, విద్యాశాఖ
ఫొటో క్యాప్షన్, ఒక్కరే ఉండటం వల్ల పోటీ తత్వం, సామాజిక స్పృహ లాంటివి తగ్గిపోయే అవకాశం ఉందని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అనిత ఆరె అన్నారు.

పోటీతత్వం లోపిస్తుంది: మానసిక నిపుణులు

ఎక్కువ మంది పిల్లలున్నప్పటితో పోల్చితే ఒక్కరే ఉంటూ చదువుకోవడం వల్ల సామాజికంగా, మానసికంగా పిల్లలపై ప్రభావం పడుతుందని చెప్పారు హైదరాబాద్ కు చెందిన కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అనిత ఆరె.

''ఎక్కువ మంది పిల్లలతో కలిసి చదువుకోవడం వల్ల అకడమిక్ పోటీతత్వం అలవడుతుంది. ఒక్కరే ఉంటే ఆ పోటీతత్వం లోపించి తాము ఏది చేసినా అదే కరెక్ట్ అన్నట్లుగా ఉంటుంది.

నలుగురితో కలిసి ఆడుకున్న పిల్లల్లో ఎదుగుదల, అందరితో కలివిడితనం ఎక్కువగా అలవడుతుంది. అలాకాకపోతే సోషల్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ తగ్గిపోతుంది'' అని బీబీసీతో అన్నారు.

పిల్లలతో కలిసేలా చూడటం, బయటకు తీసుకెళ్లడం, అకడమిక్స్ పరంగా ఏ స్థాయిలో ఉన్నారో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే మంచిదని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)