బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలను ఎందుకు వదిలేశారు? ఇప్పుడేం చేస్తున్నారు?

ఆమిర్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్
    • రచయిత, నూర్ నంజీ, సాదియా ఖాన్
    • హోదా, బీబీసీ న్యూస్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ చాలా హిట్ చిత్రాలలో నటించారు. లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ వంటి చిత్రాలతో బాక్సాఫీసు రికార్డులు నెలకొల్పారు.

అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. కోవిడ్ సమయంలో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఆమిర్ ఖాన్ (59) సినిమాలను వదిలేశారు.

"ఇక సినిమాల్లో నటించాలనుకోవడం లేదని నా కుటుంబ సభ్యులకు చెప్పాను. సినిమాలు నిర్మించాలని, దర్శకత్వం వహించాలని, నటించాలని అనుకోలేదు. నా కుటుంబంతో ఉండాలనుకున్నా" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ చెప్పారు.

ఆమిర్ లాంటి పెద్ద స్టార్ ఇండస్ట్రీని వదిలేయడం సినిమాలకు ప్రాముఖ్యతనిచ్చే భారత్‌లో చాలామందిని షాక్‌కు గురిచేస్తుందని అనుకోవచ్చు. కానీ, కోవిడ్ సమయంలో తక్కువ సినిమాలు చేయడంతో ఆ నిర్ణయాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆమిర్ చెప్పారు.

"దాని గురించి ఎవరికీ తెలియదు" అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లాపతా లేడీస్

ఫొటో సోర్స్, Aamir Khan Productions

ఫొటో క్యాప్షన్, లాపతా లేడీస్ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నారు

సినిమాల్లోకి ఎలా తిరిగి వచ్చారు?

అయితే, ఆమిర్ అభిమానులు కాస్త ఊపిరి తీసుకోవచ్చు. ఆయన ఎక్కువ కాలం సినిమాలకు దూరంగా ఉండలేదు.

ఆయన తిరిగొచ్చి ‘లాపతా లేడీస్’ అనే చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దీనిని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక చేశారు.

తన పిల్లలే తనను ‘పని’లో చేరాలంటూ ఒప్పించారని ఆమిర్ ఖాన్ చెప్పారు.

"వారు నాతో.. 'మేం నీతో 24 గంటలు గడపలేం. కాబట్టి సినిమాల్లోకి వెళ్లండి, జీవితాన్ని ఆస్వాదించండి' అని చెప్పారు, నెమ్మదిగా మళ్లీ నన్ను సినిమాల్లోకి నెట్టారు" అని ఆమిర్ గుర్తుచేసుకున్నారు.

ఆమిర్ ఖాన్ మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. "బాలీవుడ్ ఖాన్‌లలో" ఒకరిగా ప్రసిద్ధి చెందారు.

సామాజిక సమస్యలను ఎత్తిచూపే చిత్రాలను రూపొందిస్తారని ఆమిర్‌కు పేరుంది. ఆయన సినిమాలు చాలా ప్రశంసలు పొందాయి. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. ఆమిర్ ఖాన్ చిత్రాలు ఆస్కార్ గడప దగ్గరికీ చేరాయి. ఆయన నటించిన లగాన్ చిత్రం 2002లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో నామినేట్ అయింది.

ఇప్పుడు, లాపతా లేడీస్‌తో ఆమిర్ చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. ఇది విజయవంతమైతే ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఆస్కార్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలుస్తుంది. తుది జాబితాలో ఇది చోటు దక్కించుకుంటుందో లేదో మంగళవారం తెలుస్తుంది.

అవార్డులను ఎలా తీసుకోవాలో తనకు ఖచ్చితంగా తెలియదని ఆమిర్ ఖాన్ చెప్పారు. కానీ గెలవడం వల్ల భారత్‌కు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

"భారతీయులకు సినిమాల పట్ల చాలా మక్కువ ఉంది. ఇండియన్ సినిమాకు అకాడమీ అవార్డు రావాలని ఆశించాం. అది ఇప్పటికీ నెరవేరలేదు. అవార్డు వస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు" అని ఆమిర్ ఖాన్ చెప్పారు.

"కాబట్టి, మా దేశ ప్రజల కోసం, దేశం కోసం అవార్డును గెలుచుకుంటే నేను నిజంగా సంతోషిస్తాను" అని అన్నారు.

లగాన్ చిత్రం

ఫొటో సోర్స్, Aamir Khan Productions

ఫొటో క్యాప్షన్, ఆమిర్ నటించిన లగాన్ చిత్రం 2002లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయింది.

ఈ చిత్రంతోనే ఎందుకు?

గ్రామీణ భారతం నేపథ్యంలో సాగే చిత్రం లాపతా లేడీస్. గృహ హింసకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని స్పృశిస్తూ, మహిళల పట్ల వ్యవహరించే తీరును చూపించే వ్యంగ్య చిత్రం ఇది.

ఈ చిత్రం "మహిళలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు, వారి స్వాతంత్య్రం, వారు ఏం చేయాలనుకుంటున్నారో ఎంచుకునే హక్కు" గురించి కూడా మాట్లాడుతుందని ఆమిర్ ఖాన్ చెప్పారు.

ఈ సమస్యలే సినిమాపై ఆసక్తిని కలిగించాయని ఆయన చెప్పారు.

"సమాజంలోని ముఖ్యమైన సమస్యల పట్ల అవగాహన పెంచుకునే అవకాశం లభిస్తుంది" అని అన్నారు.

మాజీ భార్య కిరణ్ రావు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2005లో పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్, కిరణ్ రావు 2021లో విడిపోయారు

మాజీ భార్య దర్శకత్వం

తన మాజీ భార్య కిరణ్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఆమిర్ కోరుకున్నారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ సన్నిహితంగా మెలుగుతున్నారు.

"నేను కిరణ్‌ని ఎంచుకోవడానికి కారణం ఆమె కథ పట్ల నిజాయితీగా ఉంటారు. నేను కోరుకున్నదీ అదే.." అని ఆమిర్ అన్నారు.

"మేము ఒకరినొకరు ప్రేమించుకుంటాం, గౌరవించుకుంటాం. మా బంధం కొంచెం మారిపోయి ఉండవచ్చు, కానీ ఒకరి పట్ల మరొకరికి ఉన్న భావాలు మారాయని అర్థం కాదు" అని అన్నారు.

అయినప్పటికీ, అదంత సాఫీగా సాగలేదు. సెట్‌లో వాదనలు జరిగాయని ఆమిర్ అంగీకరించారు.

''వాదించకుండా సినిమా తీయలేం, ప్రతి విషయంలోనూ వాదిస్తాం, బలమైన అభిప్రాయాలతో ఉంటాం. ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ఉత్తమ మార్గం కోసం ఒకరినొకరు ఒప్పించడానికి ప్రయత్నిస్తాం" అని ఆయన చెప్పారు.

"చాలా ఏళ్లుగా ఇండియా గొప్ప చిత్రాలను రూపొందించింది. కొన్నిసార్లు సరైన చిత్రం పంపలేకపోయారు. పోటీ పడుతున్న చిత్రాలనూ అర్థం చేసుకోవాలి. మీరు ఐదు లేదా ఆరు చిత్రాలతో పోటీ పడటం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన దాదాపు 80 లేదా 90 సినిమాలతో పోటీ" అని అన్నారు.

ఒక బాలీవుడ్ చిత్రం ఏదో ఒకరోజు ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంటుందా అని ఆమిర్‌ను అడిగినపుడు.. సాధ్యమే అని చెప్పారు.

భారత చిత్రనిర్మాతలు ప్రపంచ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడం ప్రారంభించాలని ఆమిర్ సూచించారు. అయితే ప్రస్తుతం మనకు అలా నిర్మించే సామర్థ్యం ఉందని అనుకోవడం లేదన్నారు ఆమిర్.

ఆమిర్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

' సాయంత్రం 6 గంటల తర్వాత పని చేయను'

ప్రస్తుతానికి ఖాన్ 2025లో విడుదల కానున్న ఆయన తదుపరి చిత్రం ‘సితారే జమీన్ పర్‌’తో పాటు పలు రకాల ప్రాజెక్టులపై దృష్టి సారించారు. సంవత్సరానికి ఒక సినిమా చేయాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

సినిమాలకు తిరిగి వచ్చినప్పటి నుంచి ఆమిర్ విభిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన పిల్లలు ఈ మార్పుకు కారణం. నువ్వు ఒకే విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టే వ్యక్తివని తన కొడుకు చెప్పారని ఆమిర్ అన్నారు.

''నా కొడుకు మాట్లాడుతూ 'నువ్వు లోలకం లాంటివాడివి. నువ్వు కేవలం సినిమాలు, సినిమాలు, సినిమాలే చేశావు. ఇపుడు సినిమాలు వద్దనుకొని ఇటు వచ్చావు. కుటుంబం, కుటుంబం, కుటుంబం అంటున్నావు. రెండింటికి మధ్యలో మీరు పరిగణించాల్సింది ఉంది' అని అన్నాడు'' అని చెప్పారు ఆమిర్.

జీవితంలో కొంత బ్యాలెన్స్ కోసం ప్రయత్నించాలని తన కొడుకు సలహా ఇచ్చాడని ఆమిర్ చెప్పారు.

"అతను చెప్పింది నిజమే. అప్పటి నుంచి బ్యాలెన్స్‌గా జీవితాన్ని గడపడం కోసం ప్రయత్నిస్తున్నాను. నిజానికి నేను గతంలో చేసిన దానికంటే ఎక్కువ పని చేస్తున్నాను. కానీ 6 గంటల తర్వాత పని చేయడంలేదు" అని అన్నారు.

తన కూతురు ఇరా మానసిక ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్నట్లు ఆమిర్ చెప్పారు. ఆమె ప్రేరణతో కొన్నేళ్లుగా థెరపీ తీసుకుంటున్నానని తెలిపారు.

"ఇది నన్ను నేను అర్థం చేసుకోవడానికి సహాయపడింది. పని, వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలెన్స్ దొరుకుతోంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ స్పేస్‌కు చేరుకున్నాను" అని ఆమిర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)