అతిపెద్ద ఐస్‌బర్గ్ సుడిగుండం నుంచి తప్పించుకుని మళ్లీ కదులుతోంది

ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ భారీ మంచుకొండ నెలల పాటు సుడిగుండంలో చిక్కుకుంది
    • రచయిత, జార్జ్ సండేమాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది చాలా నెలల పాటు సుడిగుండంలో చిక్కుకున్న భారీ ఐస్‌బర్గ్ మళ్లీ కదులుతోంది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్. దీనికి 'ఏ23ఏ' అనే పేరు పెట్టారు.

ఈ ఐస్‌బర్గ్ దాదాపు 3,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అంటే, వైశాల్యంలో గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ పరిధి) కంటే దాదాపు 6 రెట్లు పెద్దది. గ్రేటర్ లండన్ కంటే రెండు రెట్లు పెద్దది. బహ్రెయిన్, సింగపూర్ లాంటి 29 దేశాల కంటే విశాలమైనది.

సుడిగుండంలో చాలా నెలల పాటు ఆగిన ఈ భారీ ఐస్‌బర్గ్‌ ఇప్పుడు ఉత్తరం వైపు కదులుతోందని డిసెంబర్ 13న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే(బాస్) సంస్థ తెలిపింది.

వాట్సాప్ చానల్
A23a ఐస్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఐస్‌బర్గ్ అంచులు క్రమంగా కరిగిపోతున్నాయి

ఏ23ఏ ఐస్‌బర్గ్ దశాబ్దాల ప్రయాణం..

1986లో అంటర్కిటికా తీరప్రాంతం నుంచి ఈ ఐస్‌బర్గ్ విడిపోయింది.

తరువాత వెడ్డెల్ సముద్రంలో 350 మీటర్ల లోతుకు చేరుకుని దాదాపు 30 ఏళ్లపాటు ఒక మంచు ద్వీపంలా ఉండిపోయింది.

తర్వాత క్రమంగా ఈ మంచు కొండ కరగడం మొదలైంది. 2020 నాటికి నీటిపై తేలడం మొదలైంది.

మొదట్లో ఇది నెమ్మదిగా కదిలినా, తరువాత వేడిగాలులు, నీటి అలల కారణంగా ఉత్తర దిశగా సాగుతోంది. అయితే, ఇటీవల సుడిగుండంలో చిక్కుకుని ఆగిపోయింది. దాని నుంచి బయటపడి తాజాగా మళ్లీ కదులుతోందని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే సంస్థ వెల్లడించింది.

‘‘ఈ ఐస్‌బర్గ్ కొంతకాలం అక్కడ చిక్కుకుని, తర్వాత మళ్లీ కదలడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అంటార్కిటికా నుంచి విడిపోయిన ఇతర భారీ మంచు కొండలు వెళ్లిన మార్గంలోనే ఇది కూడా వెళ్తుందో లేదో చూడాలి’’ అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన ఓషనోగ్రాఫర్ ఆండ్రూ మెయిజెర్స్ చెప్పారు.

A23a ఐస్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters

ఈ ఐస్‌బర్గ్ క్రమంగా ముందుకెళ్లి, అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుందని, అక్కడ వెచ్చని నీటిలోకి ప్రవేశిస్తే అది క్రమంగా ముక్కలు ముక్కలుగా విరిగిపోయి, కరిగిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.

అలా కరిగిపోయినప్పుడు ఈ ఐస్‌బర్గ్‌లోని ఖనిజ వనరులు సముద్రంలో కలుస్తాయని, అలా సముద్రపు ఆహార గొలుసుకు ఇదో పుష్కలమైన వనరుగా మారుతుంది.

ఐస్‌బర్గ్‌లు హిమనీనదంలో భాగంగా ఉన్నప్పుడు అందులోని ఖనిజాలు ఐస్‌బర్గ్‌లను అంటిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడైతే అది ముక్కలు ముక్కలుగా విడిపోతుందో, అప్పుడు ఖనిజాలు కూడా అక్కడి నీటిలో కలిసిపోతాయి.

గతంలో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ఈ ఐస్‌బర్గ్ పరిమాణాన్ని కొలవడానికి ప్రయత్నించినప్పుడు దీని ఎత్తు 920 అడుగులుగా గుర్తించారు.

అయితే, వేగంగా ఢీకొడుతున్న అలల ఉధృతి ఈ మంచు కొండను కోతకు గురిచేస్తోంది.

దీనివల్ల ఇందులో గుహలాంటి ఆకారాలు ఏర్పడుతున్నాయి. అలాగే అనేక ఐస్ ముక్కలు సముద్రంలోకి పడిపోతున్నాయి.

మంచుకొండపై భాగాన కరిగిన నీరు అక్కడి నుంచి క్రమంగా ఐస్‌బర్గ్ చీలికల ద్వారా కిందకు జారిపోతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)