కోటి రూపాయలకు చేరువలో బిట్‌కాయిన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోవా డ సిల్వా
- హోదా, బిజినెస్ రిపోర్టర్
బిట్‌కాయిన్ రికార్డ్ ధరకు చేరింది. డోనల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ఈ క్రిప్టోకరెన్సీ ధర 50 శాతానికి పైగా పెరిగి గరిష్ఠ స్థాయిని తాకింది.
సోమవారం ఆసియా ట్రేడ్‌లో ఒక దశలో 1,06,000 డాలర్లకు(రూ. 90 లక్షలు) చేరిన బిట్‌కాయిన్ ధర తర్వాత 1,05,000 డాలర్లకు(సుమారు రూ. 89.10 లక్షలు) తగ్గింది.
బిట్‌కాయిన్ ప్రపంచంలోని క్రిప్టోలన్నిటిలోనూ అత్యంత ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ.
క్రిప్టోకరెన్సీల విషయంలో బైడెన్ కంటే ట్రంప్ మరింత అనుకూలంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు.
దేశంలోని వ్యూహాత్మక చమురు నిల్వల తరహాలోనే డిజిటల్ కరెన్సీ జాతీయ నిల్వలను సృష్టించడాన్ని పరిశీలిస్తున్నట్లుగా గురువారం ట్రంప్ పునరుద్ఘాటించారు.
ఆ ప్రకటన తరువాత బిట్‌కాయిన్ ధర పరుగులు తీసింది.


‘అమెరికా ఎన్నికల నాటి నుంచి బిట్‌కాయిన్ ర్యాలీ ఊపందుకుంది’ అని బీబీసీతో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ఎమ్. కామ్‌కు చెందిన పీటర్ మెక్‌గుయిర్ చెప్పారు.
‘ఈ ఏడాది చివరికల్లా బిట్‌కాయిన్ 1,20,000 డాలర్లు (రూ. కోటి), వచ్చే ఏడాది మధ్యలో 1,50,000 డాలర్లు (సుమారు రూ. 1.27 కోట్లు) దాటుతుందని చాలామంది ఇన్వెస్టర్లు భావిస్తున్నారు'' అని ఆయన తెలిపారు.
అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోకరెన్సీ సలహాదారుగా సిలికాన్ వ్యాలీ ఎంటర్‌ప్రెన్యూర్ డేవిడ్ సాక్స్ పేరును ఈ నెల మొదట్లో ట్రంప్ ప్రకటించారు.
డేవిడ్ సాక్స్ గతంలో పేపాల్ (PayPal) సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ట్రంప్ అడ్వైజర్ ఎలాన్ మస్క్‌కు ఆయన సన్నిహితుడు.

ఫొటో సోర్స్, Getty Images
క్రిప్టోకరెన్సీకి అనుకూలుడిగా పేరున్న వాషింగ్టన్ అటార్నీ పాల్ అట్కిన్స్‌ను సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) అయిన వాల్ స్ట్రీట్ రెగ్యులేటర్‌కు కొత్త అధిపతిగా నామినేట్ చేస్తానని కూడా ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజైన జనవరి 20న తన పదవికి రాజీనామా చేస్తానని ప్రస్తుత ఎస్‌ఈసీ అధిపతి గ్యారీ జెన్‌స్లర్ గత నెలలో ప్రకటించారు.
''ఈ బాధ్యతను నాకు అప్పగించి నాపై ఎంతో నమ్మకముంచిన బైడెన్‌కు ధన్యవాదాలు. ఎస్‌ఈసీ ఎలాంటి భయానికి లొంగకుండా చట్టాన్ని అమలు చేసింది'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో గ్యారీ జెన్‌స్లర్ రాశారు.
క్రిప్టో కరెన్సీ సంస్థలపై ఎస్‌ఈసీ చైర్మన్ న్యాయపరమైన చర్యలు తీసుకోవడం కొన్ని వర్గాల్లో వివాదానికి దారితీసింది. తన హయాంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే జెన్‌స్లర్‌ను పదవి నుంచి తొలగించే యోచనలో ఉన్నట్లు గతంలో ట్రంప్ వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














