కమ్యూనిటీ వార్: ప్రత్యర్థులను చంపి అందులో 37 మందిని తినేశారా? ఈ అవశేషాలు ఏం చెబుతున్నాయి?

చరిత్ర, ఇంగ్లండ్, కాంస్య యుగం

ఫొటో సోర్స్, Rick Schulting

    • రచయిత, జార్జియాన రన్నార్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాలుగు వేల సంవత్సరాల కిందట జరిగిన ఒక ఘర్షణలో, ఒక వర్గానికి చెందిన వ్యక్తులు, మరొక వర్గంపై దాడి చేసి అందులో కొందరిని చంపి తిని ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు బ్రిటన్‌లోని సోమర్‌సెట్ ప్రాంతలో లభించాయి.

ఈ ఘర్షణలో ఒక వర్గం వ్యక్తులు ప్రత్యర్థులపై దాడి చేసి చంపేయడమే కాక, వారిలో 37 మందిని తినేసి ఉంటారని సైంటిస్టులు భావిస్తున్నారు.

కాంస్య యుగంలో, ఇంగ్లండ్ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద హింసాత్మక ఘటనగా వారు దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతపు చరిత్రలో ఈ కాలాన్ని అత్యంత శాంతియుతమైనదిగా పేర్కొంటుంటారు చరిత్రకారులు.

1970లలో బాధితులకు సంబంధించిన ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చరిత్ర పూర్వకాలం నాటి ఈ ఘటనలో, ప్రత్యర్థులను 15 మీటర్ల లోతున్న షాఫ్ట్‌లోకి పడేసినట్లు భావిస్తున్నారు.

‘‘ఎదుటి వర్గం మీద ప్రతీకారం కోసం ఈ దాడి జరిగి ఉండవచ్చు. దాని ప్రభావం అనేక తరాలలో కనిపించి ఉండొచ్చు" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రిక్ షుల్టింగ్ చెప్పారు.

మనుషుల్ని అంతమొందించే క్రమంలో వారిని తినేసి ఉంటారని, వారి అవశేషాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రత్యర్థులకు ఒక సందేశం పంపేవారని ఆయన వివరించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చరిత్ర, ఇంగ్లండ్, కాంస్య యుగం

ఫొటో సోర్స్, Rick Schulting

ఫొటో క్యాప్షన్, హింసాత్మక దాడులకు రాతి వస్తువులను వాడేవారని శాస్త్రవేత్తలు చెప్పారు

సోమర్‌సెట్‌లోని మెండిప్ హిల్స్‌ దగ్గర ఉన్న చార్టర్‌హౌస్ వారెన్ అనే గుహల సమూహంలో లభించిన దాదాపు 3,000 ఎముకల శకలాలను పురావస్తు శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది.

ఈ ఘర్షణలో 37 మంది చనిపోయి ఉంటారని, ఇందులో పురుషులు, స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిలో దాదాపు సగంమంది టీనేజర్లు, యువకులేనని కూడా శాస్త్రవేత్తలు అనుమానిస్తారు.

కాంస్య యుగం నాటి గ్రామాలలో 50 నుంచి 100 మంది నివసిస్తుంటారు. దీన్నిబట్టి చూస్తే ఒక కమ్యూనిటీ మొత్తం తుడిచిపెట్టుకుపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు

బ్రిటన్ ప్రాంతంలో కాంస్య యుగం క్రీస్తు పూర్వం 2500 నుంచి 2000 సంవత్సరాల మధ్య మొదలై, క్రీస్తు పూర్వం 800 వరకు సాగింది. ఆ రోజుల్లోనే ప్రాచీన మానవులు రాయిని వదిలేసి కంచు ఆయుధాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద వ్యవసాయ కమతాలను శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టింది కూడా ఈ సమయంలోనే.

తాజాగా బయటపడ్డ ఘర్షణ ఘటనలో బాధితులు తిరగబడినట్లు దాఖలాలు లేవని, హఠాత్తుగా వారి మీద ఈ దాడి జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

బాధితుల ఎముకలను పరిశీలించినప్పుడు వాటిపై గీతలు, గాట్ల ఆనవాళ్లు కనిపించాయి. దీన్నిబట్టి ప్రత్యర్థులు బాధితులను చంపి, వివిధ ఆయుధాలను ఉపయోగించి వారిని తినేసి ఉంటారని భావిస్తున్నారు.

''ఇవే ఆనవాళ్లు జంతువుల శరీర భాగాల మీద కనిపిస్తే, వాటిని చంపుకు తిన్నట్లు సులభంగా తెలిసిపోతుంది.'' అని ప్రొఫెసర్ షుల్టింగ్ అన్నారు.

ప్రాచీన మానవులు ఇలా తమలాంటి మనుషులనే చంపుకు తినడం ఆకలి తీర్చుకోవడానికి కాదని, మానవ అస్థికల పక్కనే దొరికిన జంతు అవశేషాలను బట్టి చూస్తే అక్కడ సమృద్ధిగా ఆహారం ఉండి ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

చరిత్ర, ఇంగ్లండ్, కాంస్య యుగం

ఫొటో సోర్స్, Rick Schulting

ఫొటో క్యాప్షన్, ఎముక మీద నరికినట్లు కనిపించే గాట్లు.

ఈ యుగానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో అవశేషాలు దొరకడం ఇదే మొదటిసారి.

ఈ ఘర్షణలు వనరుల కోసం జరిగినట్లు చెప్పడానికి ఎక్కువగా ఆధారాలు లేవు.

ఇరువర్గాల మధ్య పరిస్పర విశ్వాసం లోపించడం ఈ హింసాకాండకు దారి తీసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

"ఇది నిజంగా అసాధారణం. ఒక వ్యక్తిని పూర్తిగా నిర్మూలించడం కోసం ముక్కలు ముక్కలు చేశారు. అవతలి వ్యక్తికి తీవ్రమైన కోపం, భయం, ఆగ్రహం కలిగినప్పుడే అంతకు తెగిస్తారు.'' అని ప్రొఫెసర్ షుల్టింగ్ అన్నారు.

''ఇది కేవలం నరమేధం కాదు. ఒక కమ్యూనిటీని అంతం చేయడానికి మరొక కమ్యూనిటీ చేసిన ప్రయత్నం.'' అని ప్రొఫెసర్ షుల్టింగ్ అభిప్రాయపడ్డారు.

బహుశా తమ సంస్కృతిపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన అన్నారు.

''తప్పు జరిగిందని అనిపిస్తే, దాని మీద ఏదో ఒక చర్య తీసుకోవడంలాంటిది ఇది. న్యాయమూర్తి దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని అడిగే మనస్తత్వంకాదిది'' అని ప్రొఫెసర్ షుల్టింగ్ అన్నారు.

''పరిస్థితులు అదుపు తప్పి ఉంటాయి. దాన్ని అడ్డుకునే అన్ని ప్రయత్నాలు విఫలమై ఉంటాయి'' అని ఆయన భావిస్తున్నారు.

ఇది ఒక వ్యక్తి సొంత ఎజెండా వల్లనో లేదంటే ప్రశాంతంగా ఉండనివ్వని మనస్తత్వం వల్లనో ఇదంతా జరిగి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

''రెండు వర్గాలలో ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు పరిస్థితులు అదుపుతప్పుతాయి.'' అని అంటారు ప్రొఫెసర్ షుల్టింగ్.

చరిత్ర, ఇంగ్లండ్, కాంస్య యుగం

ఫొటో సోర్స్, Antony Audsley

ఫొటో క్యాప్షన్, సోమర్‌సెట్‌లోని గుహల సముదాయంలో ఈ ఘర్షణకు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి.

కాంస్య యుగం ఆరంభంలో ఇంగ్లండ్ ప్రాంతం చాలా శాంతియుతంగా ఉండేదని నిపుణులు చెబుతారు. ఇక్కడ ఘర్షణలు జరిగినట్లు ఎక్కువగా ఆధారాలు దొరకలేదు.

పైగా, తమను రక్షించుకోవడానికి కమ్యూనిటీలు కత్తులు వాడినట్లు, ఆయుధాలు తయారు చేసుకున్నట్లు, కోటలు కట్టుకున్నట్లు కూడా ఆధారాలు దొరకలేదు.

ఈ విషయాన్ని కనుక్కోవడానికి ముందు, ఆ కాలాన, ఈ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది మాత్రమే చనిపోయినట్లు తేలిందని ప్రొఫెసర్ షుల్టింగ్ చెప్పారు.

ఈ తరహా దాడుల్లో ఇది ఒక్కటేనని చెప్పే పరిస్థితి కూడా లేదని, ఇలాంటివి చాలా జరిగి ఉండొచ్చని ప్రొఫెసర్ షుల్టింగ్ అన్నారు.

"కానీ ఒక దశలో శాంతిని కోరుకునే నాయకులు వచ్చి ఉండొచ్చు. అందువల్ల ప్రజలు ప్రశాంతంగా జీవించి ఉంటారు. జన జీవితం సాధారణంగా మారి ఉంటుంది'' అన్నారాయన.

''ఇలాంటి ఘటనలు కాంస్య యుగంలో మనుషుల ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి'' అని షుల్టింగ్ అభిప్రాయపడ్డారు.

ఈ రీసెర్చ్ అకడమిక్ జర్నల్ ‘యాంటిక్విటీ’ లో ప్రచురితమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)