ఎక్కడ చూసినా పుర్రెలు, ఎముకలు.. ఆప్తుల ఆనవాళ్ల కోసం శ్మశానాల్లో గాలిస్తున్న సిరియా ప్రజలు

అడ్రా శ్మశాన వాటిక
ఫొటో క్యాప్షన్, అడ్రా శ్మశానవాటిక చాలా ఏళ్లుగా సిరియా అధ్యక్షుడు అసద్ సైన్యం ఆధీనంలో ఉండేది
    • రచయిత, లూసీ విలియమ్సన్
    • హోదా, బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్

అడ్రా ఒక అసాధారణ శ్మశానవాటిక. చాలా ఏళ్లుగా ఇది సిరియా అధ్యక్షుడు (ఇప్పుడు మాజీ) బషర్ అల్-అసద్ సైన్యం ఆధీనంలో ఉంది.

అసద్ పారిపోయిన వారం తర్వాత ఈ శ్మశానవాటికలోని ఒక మూలన కాంక్రీట్ స్లాబ్ తొలగించారు. అక్కడ ఒక సమాధి కనిపించింది. అందులో కనీసం అర డజను తెల్లటి బాడీ బ్యాగ్‌లు ఉన్నాయి. వాటిపై పేర్లు, జైలు నంబర్లు రాసి ఉన్నాయి.

మేము అక్కడికి చేరుకునే సరికి, సమీపంలో నివసించే ఖలీద్ అల్ హమద్ చాలాకష్టంగా బ్యాగులను బయటకు తీస్తున్నారు.

అంతకుముందే తెరిచిన మూడు సంచులను ఆయన మాకు చూపించారు. ఆ సంచుల్లో మానవ పుర్రెలు, ఎముకలు ఉన్నాయి. అవి ఇద్దరు మహిళా ఖైదీలు, ఒక మగ ఖైదీ అవశేషాలని బ్యాగులపై రాసిన వివరాలు సూచిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎముకలు
ఫొటో క్యాప్షన్, అడ్రా శ్మశానవాటికలో బాడీబ్యాగ్ లోపల ఎముకలు కనిపించాయి

అదృశ్యమైన వారి కోసం..

వారెలా మరణించారన్నది తెలియదు. ఖలీద్‌ తన సోదరులు జిహాద్, హుస్సేన్ కోసం వెతుకుతున్నారు. వారిని దశాబ్దం కిందట అసద్ ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆ ఇద్దరి ఆచూకీ లేదు.

"కొంతమందిని 'డ్రైవింగ్ స్కూల్' అనే ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశారు. నా సోదరులను కూడా అలాగే చంపేసి ఉంటారని అనుకుంటున్నాను. వారు ఇక్కడ పాతిపెట్టిన ఏదో ఒక సంచిలో ఉండొచ్చు" అని ఖలీద్ అన్నారు.

బీబీసీ ఈ సమాచారాన్ని సిరియాలోని హ్యూమన్ రైట్స్ వాచ్‌తో పంచుకుంది. ఖైదీల అవశేషాలను ఇతర చోట్ల కూడా ఇలాగే బ్యాగుల్లో పారేసినట్లు వచ్చిన వార్తలపై విచారణ జరుపుతున్నామని ఆ సంస్థ చెప్పింది.

ఆప్తుల ఆచూకీ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారిలో అసద్ పతనం ఆశలు పెంచింది.

"అసద్ పాలనా కాలంలో ఎవరూ ఇటువైపు తలెత్తి చూసే అవకాశం ఉండేది కాదు" అని ఖలీద్ చెప్పారు.

"ఈ ప్రాంతం గుండా వాహనాలు చాలా వేగంగా వెళ్తాయి. వాహనం ఆపితే వారు మీ దగ్గరికి వచ్చి, తలకు ప్లాస్టిక్ బ్యాగ్‌ కప్పి, మిమ్మల్ని తీసుకెళ్తారు" అని ఖలీద్ అప్పటి పరిస్థితుల గురించి వివరించారు.

ఖలీద్ వంటి వేలాది కుటుంబాలు అదృశ్యమైన తమ బంధువుల కోసం ఇపుడు సిరియా జైళ్లలో లేదా సైనిక విచారణ కేంద్రాలలో వెతుకుతున్నాయి. అదృశ్యమైన వారిలో కొందరిని డమాస్కస్‌లోని మజ్జే సైనిక విమానాశ్రయానికి తరలించారు.

అబు జర్రా, హయత్ తహ్రీర్ అల్-షామ్ సభ్యుడు
ఫొటో క్యాప్షన్, హయత్ తహ్రీర్ అల్-షామ్ సభ్యుడు అబు జర్రాహ్

జైళ్లలో అత్యాచారాలు

అసద్ సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య ఒకప్పుడు కీలకమైన బఫర్ జోన్‌గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నిర్జన ప్రదేశంగా మారింది. సైనికుల బూట్లు రన్‌వేపై కనిపించాయి. రాకెట్లు నేలపై పడి ఉన్నాయి.

ఇపుడు అక్కడ కొత్త గార్డులు, హయత్ తహ్రీర్ అల్-షామ్ (హెచ్‌టీఎస్) మిలీషియా సభ్యులు ఉన్నారు. అసద్ సైన్యానికి చెందిన ‘టార్చర్ ఛాంబర్‌’ను వారు మాకు చూపించారు. ఖైదీలను కొట్టే ముందు వారి కాళ్లను కట్టడానికి ఒక స్తంభం ఉంది. దాని పక్కనే వైర్‌లతో కూడిన విద్యుత్ స్విచ్‌బోర్డ్‌లు ఉన్నాయి.

"ఇక్కడ వారు ఖైదీలకు విద్యుత్ షాక్‌లు ఇచ్చారు. ఇవి కరెంటు తీగలు. విచారణ అధికారి ఇక్కడ కూర్చునేవారు. ఖైదీలకు ఈ వైర్ల ద్వారా విద్యుత్ షాక్‌ ఇచ్చారు" అని గార్డు కమాండర్ అబు జర్రాహ్ అన్నారు.

"ఖైదీలు ఎంతగా ప్రభావితమవుతారంటే వారు ప్రతిదీ ఒప్పుకుంటారు. విచారణ అధికారి తనకు కావలసినది రాయాలని చెప్తారు, టార్చర్ ఆపేస్తారనే ఆశతో ఖైదీలు రాసేస్తారు" అని ఆయన తెలిపారు.

ఛాయాచిత్రాలు
ఫొటో క్యాప్షన్, శ్మశాన వాటికలో కాంక్రీట్ నేలపై పడి ఉన్న ఫొటోలను బాధితుల కుటుంబాలు నిర్విరామంగా జల్లెడ పడుతున్నాయి.

అక్కడ ఖైదీలుగా ఉన్న 400 మంది మహిళలు నిత్యం అత్యాచారానికి గురయ్యారని, వారి పిల్లలు జైలులోనే జన్మించారని అబు జర్రాహ్ చెప్పారు.

ఇక్కడ లభించే రికార్డుల్లో తల్లిదండ్రులు లేదా పిల్లలను వెతకడం చాలా కష్టం. అయితే, వారిని కనుగొనలేకపోవడం ఇంకా బాధాకరం.

పక్కనే ఉన్న భవనంలో కాంక్రీట్ నేలపై పడి ఉన్న ఛాయాచిత్రాలను బాధితుల కుటుంబాలు నిర్విరామంగా జల్లెడ పడుతున్నాయి. ఒక ముఖం తర్వాత మరొకటి ఇలా కుటుంబీకుల కోసం వెతుకుతున్నారు.

మహమూద్ సయీద్ హుస్సేన్ తల్లి
ఫొటో క్యాప్షన్, మహమూద్ సయీద్ హుస్సేన్ కోసం ఆయన తల్లి 11 ఏళ్లుగా వెతుకుతున్నారు

'మా బాధను అసద్ అనుభవించాలి'

ఈ ఏడుస్తున్న మహిళల్లో ఒకరు అల్-కమిష్లీకి చెందిన మహమూద్ సైద్ హుస్సేన్ తల్లి.

"నిన్న ఎయిర్‌బేస్ జైలు రికార్డులలో అతని పేరు చూశాం. కానీ అతను కనిపించలేదు. కొడుకు కోసం 11 సంవత్సరాలుగా ఒక జైలు నుంచి మరొక జైలుకు ఇలా వెతుకుతూనే ఉన్నాను" అని అన్నారామె.

నేలపై ఉన్న ఛాయాచిత్రాల కుప్పను హుస్సేన్ తల్లి చూపుతూ "వీళ్లు కూడా నా కొడుకుల వంటి వారే. మేం పడిన బాధను దేవుడు అసద్‌కూ ఇవ్వాలి" అని అరుస్తూ చెప్పారు.

వాటి వెనుక మూడు గదులల్లో ఫైల్స్ ఉన్నాయి. నేలపై అనేక అడుగుల ఎత్తులో ఉన్న పత్రాల కుప్పల పక్కన చాలామంది కూర్చున్నారు.

ఒక మహిళ కోపంగా "ఈ పత్రాలన్నీ ఏమిటి?" అని అరిచారు.

"మాకు ఎవరూ సహాయం చేయడం లేదు. ఎవరైనా వచ్చి ఈ పత్రాలను తనిఖీ చేయండి. ఇన్ని ఫైళ్లలో అతన్ని ఎలా వెతకలగను?" అని అన్నారు.

సరైన వ్యవస్థ లేకపోవడంతో అక్కడ రోజురోజుకూ ముఖ్యమైన ఆధారాలు ధ్వంసమవుతున్నాయి.

ఇందులో అసద్ పాలనతో యూఎస్, యూకే వంటి విదేశీ ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి సమాచారం ఉండొచ్చు. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారి విచారణ కోసం విదేశాలకు పంపే అమెరికా 'ఎక్స్ట్రార్డినరీ రెండిషన్' విధానంలో ఈ రెండు దేశాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

ఉగ్రవాదంపై యుద్ధం అనే పేరుతో సిరియాతో సహా అనేక పశ్చిమాసియా దేశాలకు అమెరికా బందీలను పంపినప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం స్పందించలేదని మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)