వివాదాస్పద కొత్త డ్రెస్‌కోడ్ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఇరాన్

ఇరాన్, హిాజాబ్, డ్రెస్‌కోడ్, పెజిష్కియాన్, ఆందోళనలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జియర్ గాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వివాదాస్పద "హిజాబ్, పవిత్రత చట్టం’’ అమలును ఇరాన్ జాతీయ భద్రత మండలి తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చట్టాన్ని శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావించింది.

ఇది "అస్పష్టంగా ఉన్నప్పటికీ అవసరమైన సంస్కరణ" అని అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ అన్నారు. ఆయన మాటలు ఈ చట్టాన్ని పునః సమీక్షించాలనే ఆయన ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రతిపాదిత కొత్త చట్టం, తమ జుట్టు, మోచేతులు, లేదా మోకాళ్ల కింద భాగాలు బయటికి కనిపించేలా దుస్తులు ధరించిన మహిళలు, బాలికలకు కఠిన శిక్షలు విధించాలని చెబుతోంది. దీనిని హక్కుల కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మహిళలు, బాలికల వస్త్ర ధారణను జాతీయ భద్రత అంశంగా భావించి గత పాలకులు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, హిాజాబ్, డ్రెస్‌కోడ్, పెజిష్కియాన్, ఆందోళనలు

ఫొటో సోర్స్, EPA

కొత్త చట్టం ప్రకారం పదే పదే తప్పులు చేసినవాళ్లు, నియమావళిని విమర్శించేవారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు 15 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి సమాచారం అందించడాన్ని ఈ చట్టం తప్పనిసరి చేసింది.

ఈ చట్టంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరానియన్ అధికారులు "ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వ్యవస్థను మరింతగా పాతేయాలని చూస్తున్నారు" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది.

ఇరాన్‌లో హిజాబ్ విషయంలో మహిళల పట్ల గత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జులైలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన సమయంలో అప్పటి అధ్యక్ష అభ్యర్థి పెజాష్కియన్ బహిరంగంగా విమర్శించారు.

తాను మహిళల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోబోనని ఆయన హామీ ఇచ్చారు. హిజాబ్ విషయంలో ప్రభుత్వ మొండి వైఖరితో విసిగిపోయిన యువతరంలో ఆయన మాటలు ఆశలు రేకెత్తించాయి.

"కొత్త చట్టం వల్ల ఇరాన్‌లోని సగం జనాభాపై నేరారోపణ చెయ్యడం లాంటిది" అని స్త్రీ, కుటుంబ వ్యవహారాల విభాగం మాజీ అధ్యక్షుడు మసౌమెహ్ ఎబ్టేకర్ చెప్పారు.

ఇరాన్, హిాజాబ్, డ్రెస్‌కోడ్, పెజిష్కియాన్, ఆందోళనలు

ఫొటో సోర్స్, EPA

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ప్రముఖ గాయకురాలు పారస్తూ అహ్మదీ హిజాబ్ ధరించకుండా యూట్యూబ్‌లో వర్చువల్‌గా సంగీత కచేరి నిర్వహించడంతో ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో గత వారం హిజాబ్ మీద చర్చ మరింత తీవ్రమైంది.

ఈ కన్సర్ట్ వైరల్‌గా మారింది. దీంతో అహ్మదీ ఆమెతో పాటు కచేరిలో పాల్గొన్న ఇతర కళాకారులను అరెస్ట్ చెయ్యడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. ప్రజలు ఆందోళనకు దిగడంతో అధికారులు వారిని తర్వాతి రోజు విడుదల చేశారు.

2022లో మహ్‌సా "జినా" అమినీ మరణం తర్వాత హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్ అంతటా ఆందోళనలు తీవ్రం అయ్యాయి. డ్రెస్ కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెను పోలీసులు హింసించడంతో ఆమె పోలీస్ కస్టడీలో చనిపోయారు.

రెండేళ్లుగా, ఇరాన్ యువతులు హిజాబ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

గత వారం, 300 మందికి పైగా ఇరాన్ హక్కుల కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు కొత్త హిజాబ్ చట్టాన్ని బహిరంగంగా ఖండించారు. కొత్త చట్టం "చట్టవిరుద్ధం, అమలుకు అసాధ్యం" అని తెలిపారు. అధ్యక్షుడు పెజిష్కియాన్ తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.

సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి సన్నిహితంగా ఉండే కరడుగట్టిన వర్గాల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, ఇరాన్‌ యువత పాలనాపరమైన ఆంక్షలను ఎదుర్కోవడంలో తెగింపు ప్రదర్శిస్తోంది.

కొత్త చట్టాన్ని యువతులు ధిక్కరిస్తారని, దేశంలో పరిస్థితి మరింత దిగజారుతుందని పెజిష్కియాన్ మద్దతుదారులు భావిస్తునారు.

అయినప్పటికీ చట్టం విషయంలో ముందుకే వెళ్లాలని ఈ చట్టానికి మద్దతిస్తున్నవారు చెబుతున్నారు. చట్టం అమలు కోసం అధ్యక్షుడు సంతకం చెయ్యాలని, చట్టం అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న జాతీయ భద్రత మండలి తీరుపైనా వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

హిజాబ్‌కు వ్యతిరేకంగా రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలు మరోసారి చెలరేగవచ్చనే భయంతోనే చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)