చీడో తుపాను: 225 కిలోమీటర్ల వేగంతో గాలులు.. వెయ్యిమందికి పైగా మరణించినట్లు అంచనా

ఫొటో సోర్స్, Reuters: Mohamed Ismael
- రచయిత, రాచెల్ హాగన్, రిచర్డ్ కెగో
- హోదా, బీబీసీ న్యూస్
చీడో తుపాను సృష్టించిన విధ్వంసాన్ని మాయోట్ ప్రజలు వివరించారు.
‘ఫ్రెంచ్ హిందూ మహాసముద్ర’ ప్రాంతంలో గత 90 ఏళ్లలో సంభవించిన అత్యంత దారుణ తుపాను ఇదే.
చీడో తుపాను కారణంగా గంటకు 225 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి.
''మూడు రోజులుగా మాకు తాగేందుకు మంచినీళ్లు లేవు'' అని రాజధాని మామౌజూలో నివసించే ఒకరు చెప్పారు.
''ఇరుగుపొరుగు వాళ్లంతా ఆకలితో, దాహంతో ఉన్నారు'' అని మరొకరు అన్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే చర్యల్లో సహాయ సిబ్బంది నిమగ్నమయ్యారు.
ఇక్కడ చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉండొచ్చని స్థానిక అధికారులు చెప్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడి జనాభా 3,20,000. ఇందులో నమోదుకాని వలసదారుల సంఖ్య లక్షకు పైగా ఉండటంతో మరణాల సంఖ్యను చెప్పడం కష్టతరంగా మారిందని అధికారులు అంటున్నారు.
విద్యుత్ లైన్లు తెగిపోవడంతో పాటు రహదారులు దెబ్బతిన్నాయి.
మౌలిక సదుపాయాలకు నష్టం కలగడంతో అత్యవసర కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
షెల్టర్ల ఏర్పాటు కోసం అవసరమయ్యే టార్పాలిన్లు, సామగ్రితో కూడిన మొదటి విమానం అక్కడ దిగింది. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, షెల్టర్లకు తీవ్ర కొరత ఉంది.
''ఇదొక విషాదం. అణుయుద్ధం జరిగిన తర్వాత ఏర్పడే పరిస్థితిని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇరుగుపొరుగు ప్రాంతమంతా కనుమరుగైంది'' అని మామౌజూకు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్ వార్తాసంస్థ రాయిటర్స్‌తో చెప్పారు.
''శనివారం నుంచి ప్రజలంతా ఆకలితో ఉన్నారు. తినడానికి, తాగడానికి వారి వద్ద ఏమీ లేవు. ఇదే ఆందోళనకరంగా ఉంది'' అని ఫ్రెంచ్ మీడియాతో మాయోట్ సెనెటర్ సలామా రమియా అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తుపానుతో జరిగిన నష్టాన్ని ఒక్కసారి పూర్తిగా అంచనా వేసిన తర్వాత మరణాల సంఖ్య భారీగా పెరగొచ్చని మాయోట్ పరిపాలన అధికారి ఫ్రాంకోయిస్ జేవియర్ అన్నారు. కచ్చితంగా వందల మంది చనిపోయి ఉంటారని, వీరి సంఖ్య వేలల్లో కూడా ఉండొచ్చని ఆయన హెచ్చరించారు.
దృఢమైన ఇళ్లు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారని భావిస్తున్నారు.
మరణించిన వారిని 24 గంటల్లోగా ఖననం చేయాలనే ఇక్కడి ప్రజల ఆచారం కారణంగా మృతుల సంఖ్యను నమోదు చేయడం కష్టంగా మారిందని ప్రాంకోయిస్ చెప్పారు.
మాయోట్‌లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని బీబీసీతో ఫ్రెంచ్ రెడ్‌క్రాస్ అధికార ప్రతినిధి ఎరిక్ సామ్ వా చెప్పారు.
''మురికి వాడలు మొత్తం కొట్టుకుపోయాయి. నిరాశ్రయులైన ప్రజలకు సంబంధించిన వివరాలేమీ ఇంకా రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో వెల్లడయ్యే వాస్తవాలు చాలా భయంకరంగా ఉండనున్నాయి'' అని ఎరిక్ వివరించాయి.

ఫొటో సోర్స్, Getty Images
మొజాంబిక్ తీరాన్ని దాటిన చీడో తుపాను కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. చెట్లు నేలకూలాయి. పెంబాకు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరం వరకు భవనాలు ధ్వంసం అయ్యాయి. అక్కడ ముగ్గురు మరణించారు.
శనివారం ఉదయం నాంపులా, కాబో డెల్గాడో ప్రావిన్సుల్లో నిర్మాణాలకు నష్టం కలగడంతో పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని స్థానిక అధికారులు చెప్పారు.
''చాలా ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, కొన్ని తీవ్రంగా నష్టపోయాయి. ఆరోగ్యకేంద్రాలు, పాఠశాలల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి'' అని మొజాంబిక్‌లోని యూనిసెఫ్ ఏజెన్సీ అధికార ప్రతినిధి గయ్ టేలర్ చెప్పారు.
ఈ తుపాను తీవ్రతకు వాతావరణ మార్పులే కారణమని అంటున్నారు.

మాయోట్ ఎక్కడుంది?
మాయోట్ ఫ్రెంచ్ పాలనలో ఉన్న ఒక ద్వీపం.
ఇది ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్, అక్కడికి సమీపంలో హిందూ మహా సముద్రంలో ఉన్న మడగాస్కర్ దీవికి మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపం.
హిందూ మహాసముద్రంలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్ పాలనలో ఉండడంతో ఇక్కడి సముద్ర ప్రాంతాన్ని ‘ఫ్రెంచ్ ఇండియన్ ఓషన్’ అని వాడుకలో పిలుస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














