రాజ్యాంగంపై చర్చ: ప్రధాని మోదీ ముందు రాహుల్ గాంధీ మరో అవకాశాన్ని కోల్పోయారా?

ఫొటో సోర్స్, ANI
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్రమోదీ తన సుదీర్ఘ ప్రసంగంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పాలనా కాలాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
అంతకు ముందు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్ల సావర్కర్ నమ్మకాన్ని ప్రశ్నించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
రాజ్యాంగంపై చర్చ గురించి సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత స్పందన వ్యక్తమైంది.


ఫొటో సోర్స్, ANI
‘‘లెక్కల క్లాసు రెండుసార్లు విన్నట్టుంది’’
ప్రధాని మోదీ ప్రసంగం చరిత్రాత్మకమని, కాంగ్రెస్ పార్టీకి వారి తప్పులను ఎత్తి చూపేలా ఉందని బీజేపీ ఎంపీలు అభివర్ణించారు.
"ఇది చరిత్రాత్మక ప్రసంగం. సభలో ఎలా మాట్లాడాలో ప్రతిపక్షాలు నేర్చుకోవాలి. వారి ప్రవర్తన గురించి ఇవాళ చర్చించారు" అని నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ అన్నారు.
బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ ఎంపీల ప్రసంగంపై విరుచుకుపడ్డారు."కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద నినాదం గరీబీ హఠావో. కానీ వారు పేదరికాన్ని తొలగించలేకపోయారు, పేదరికాన్ని తొలగించిన ఏకైక పార్టీ బీజేపీ" అని ఆయన అన్నారు.
"రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించడం, మంత్రిగా ఉన్నప్పుడు వేధించడం, ఆయన అస్తిత్వాన్ని తగ్గించేందుకు ప్రయత్నించడం లాంటి పాపాలకు కాంగ్రెస్ పాల్పడింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని హత్య చేసింది" అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.
అయితే ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ కూడా ఘాటుగానే స్పందించింది.
"ప్రధానమంత్రి ఇలాంటి భాష మాట్లాడకూడదు. ఇది శాఖా ప్రముఖ్ లేదా ప్రచారక్ చేసే ప్రసంగంలా ఉంది. రాజ్యాంగంపై చర్చించాల్సిన సమయంలో ఆయన ఆరోపణలు, ప్రత్యారోపణలకు పరిమితం అయ్యారు" అని షోలాపూర్ కాంగ్రెస్ ఎంపీ ప్రణితి షిండే అన్నారు. ఒక్కసారి కూడా ప్రధాని "సర్వ ధర్మ సమభావన" లాంటి పదాలను ఉపయోగించకపోవడంపై ఆశ్చర్యపోయానని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ‘‘ప్రధాని కొత్తగా ఏమీ చెప్పలేదు. ఆయన ప్రసంగం స్కూల్‌లో వరుసగా రెండుసార్లు లెక్కల క్లాసు విన్నట్టు అనిపించింది. నాకే కాదు, నడ్డా చేతులు రుద్దుకుంటుంటే ప్రధాని మోదీ ఆయన వంక చూడటంతో, ఆయన మోదీ మాటలు శ్రద్ధగా వింటున్నట్టు నటించడం మొదలుపెట్టారు. అమిత్ తలపై చేతులు పెట్టుకున్నారు. పీయూష్ గోయల్‌కు నిద్ర ముంచుకొస్తున్నట్టు కనిపించింది’’ అన్నారు.
"ప్రధాని ఏదైనా కొత్తగాచెబుతారనుకున్నాను. ఆయితే ఆయన 11 డొల్ల తీర్మానాల గురించి చెప్పారు. అవినీతిని సహించమని మాట్లాడారు.మరి అదానీపై చర్చించాలి కదా" అని ప్రియాంక ప్రశ్నించారు.
"ఇది సుదీర్ఘమైన ప్రసంగం. సాధ్యం కాని నినాదాలు ఎవరివో జర్నలిస్టులకు బాగా తెలుసు. ఇవాళ మనం అలాంటి 11 తీర్మానాల నినాదాల గురించి విన్నాం" అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ గాంధీ అవకాశాన్ని చేజార్చుకున్నారా?
రాజ్యాంగంపై చర్చలో రాజ్యాంగం గురించి తక్కువ, రాజకీయాల గురించి ఎక్కువ చర్చ సాగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
"రాజ్యాంగంపై లోక్‌సభలో జరిగిన చర్చలో రాజ్యాంగ పీఠిక, ఆదేశిక సూత్రాల గురించి ఎటువంటి చర్చా జరగలేదు. ఈ చర్చను అందరూ తమ సమకాలీన రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు" అని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేదీ బీబీసీతో చెప్పారు.
కాంగ్రెస్ పట్టుబట్టడం వల్లనే ఈ చర్చ జరిగింది. "రాహుల్ గాంధీ తన 20-25 నిమిషాల ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర , ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణల గురించి వివరించే ప్రయత్నం చేయలేదు" అని త్రివేదీ అన్నారు. రాజ్యాంగం మీద, ప్రధానిగా మోదీ పదిన్నరేళ్ల పాలనా కాలంపై ప్రజల్లో చర్చ జరిగే పరిస్థితిని సృష్టించగల అవకాశాన్ని కోల్పోయారనేది విజయ్ త్రివేది అభిప్రాయం.
"రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ఇదొక పెద్ద అవకాశం. వారు దానిని కోల్పోయారు. రాహుల్ గాంధీ ప్రసంగం చూసిన తర్వాత 'ఆయన ఎప్పుడూ ఓడిపోయే అవకాశాన్ని కోల్పోరు' అనే మాట ఆయనకు సరిగ్గా నప్పుతుందని అర్థమైంది" అని విజయ్ త్రివేది అన్నారు.
"దేశవ్యాప్తంగా కులగణనకు బీజేపీ సానుకూలంగా ఉందా లేదా అని రాహుల్ గాంధీ అడిగి ఉండవచ్చు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన ఇంకా అనేక ప్రశ్నలు సంధించి ఉండవచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తెస్తారా అని ప్రశ్నించి ఉండవచ్చు. దీని గురించి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏంటో దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రభుత్వాన్ని నిలదీసి ఉండవచ్చు. కానీ ఆయన చాలా వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు" అని త్రివేదీ అభిప్రాయపడ్డారు.
"రాజ్యాంగంలోని సూక్ష్మ అంశాలపై కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులైన వారికి అవకాశం ఇవ్వడం ద్వారా అర్ధవంతమైన చర్చను సృష్టించగలదు. ఆ పార్టీ ఎంపీలు శశిథరూర్, శైలజా కుమారి అందుకు సమర్థులు. అయితే కాంగ్రెస్ పార్టీ తన ప్రసంగాన్ని ప్రియాంక గాంధీతో ప్రారంభించింది. ఎందుకంటే హస్తం పార్టీ ఆమెను పైకి తీసువచ్చే ప్రయత్నం చేస్తోంది" అని త్రివేది చెప్పారు
ఈ చర్చ ద్వారా సమకాలీన రాజకీయాలపై బలమైన ముద్ర వేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేజార్చుకుందనేది ఆయన అభిప్రాయం.
రాహుల్ గాంధీ హడావుడిగా కనిపించారని, తన ప్రసంగాన్ని చాలా త్వరగా ముగించారని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
‘‘కాంగ్రెస్‌ను దోషిగా చూపే ప్రయత్నం’’
రాజ్యాంగంపై చర్చలో ప్రధానమంత్రి, బీజేపీ నేతలు నెహ్రూ- గాంధీ కుటుంబాన్ని విమర్శించేందుకు, గతాన్ని తవ్వేందుకు ఎక్కువ సమయం కేటాయించారు.
"ప్రధాని మోదీ ఇందిరా గాంధీని, ఎమర్జెన్సీని విమర్శించారు. 50 ఏళ్లు గడిచాయి. దీని గురించి ఇంకా ఎంత సేపు మాట్లాడతారు. భవిష్యత్‌లో రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారో చెప్పి ఉంటే బావుండేది" అని విజయ్ త్రివేది అన్నారు
రాజ్యాంగ సవరణలపైనా బీజేపీ వైపు నుంచి తీవ్ర చర్చ జరిగింది. అయితే ఇది వాస్తవాల పట్ల పక్షపాతంతో ఉందన్నారు త్రివేది.
"నెహ్రూ రాజ్యాంగంలో సవరణలు చేశారని ప్రధాని పదే పదే చెప్పారు, ఆపై ఇందిరా గాంధీ కూడా మార్పులు చేశారు. దేశంలో జరిగిన 106 రాజ్యాంగ సవరణలలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు 30 సవరణలు చేశాయి. బీజేపీ కూడా అనేకసార్లు రాజ్యాంగానికి సవరణలు చేసింది" అని ఆయన అన్నారు,
‘‘ప్రధానమంత్రి కూడా జమిలి ఎన్నికల గురించి మాట్లాడలేదు. ఇది రాజ్యాంగ మార్పుకు సంబంధించిన అంశం. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా ఎన్నికల సంస్కరణల గురించి లేదా రాజ్యాంగాన్ని బలోపేతం చేయడం గురించి మాట్లాడలేదు. కుల పరమైన రిజర్వేషన్ల విషయంలో తాను మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని మాత్రమే చెప్పారు. అంతే కానీ కుల రిజర్వేషన్లు, కుల గణనపై ఏమీ మాట్లాడలేదు.’’ అన్నారు త్రివేది.
రాజ్యాంగంపై చర్చలో కేంద్ర రాష్ట్రాల సంబంధాలు అనే ఒక పెద్ద అంశం మిగిలిపోయింది. దీనిపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇది ఇప్పటికీ రగులుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్రాల హక్కులు, గవర్నర్ల పాత్ర గురించి అటు ప్రధాని, ఇటు రాహుల్ ఇద్దరూ ప్రస్తావించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘చర్చలో నిజాయితీ లోపించింది’’
రాజ్యాంగంపై అధికార, ప్రతిపక్షాల మధ్య నిజాయితీగా చర్చ జరగలేదని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ అన్నారు. పార్లమెంటులో జరిగిన చర్చ ఎవరి వైపు ఉందో ఎవరైనా చెప్పగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఇది చాలా కక్షపూరిత చర్చ. నెహ్రూ గురించి బీజేపీ వైపునుంచి చర్చించారు. కానీ అసలు విషయం ఏమిటంటే, నెహ్రూ వదిలిపెట్టిన విలువైన వారసత్వానికి వారు భయపడుతున్నారు. ఈ ప్రసంగం గురించి ఇలా మాట్లాడటం తప్పు కాకపోవచ్చు" అని వినోద్ శర్మ బీబీసీతో అన్నారు.
"అప్పట్లో నెహ్రూ తన విజన్ ప్రకారం భారతదేశాన్ని నిర్మించారు. నెహ్రూతో పాటు మిగిలిన స్వాతంత్య్ర సమరయోధుల ఔన్నత్యం ఎంత పెద్దదంటే వాటిని అధిగమించడం కష్టం" అనేది వినోద్ శర్మ అభిప్రాయం.
సోమవారం రాజ్యసభలో చర్చ జరగనుంది. అక్కడ సీనియర్లు ఉన్నారు కాబట్టి అక్కడ కొంత మంచి చర్చను ఆశించవచ్చని వినోద్ శర్మ చెప్పారు.
లోక్‌సభలో చర్చించిన నాయకులు రాజ్యాంగ పరిషత్ రూపుదిద్దుకోవడానికి సాక్షులు కాదు, అటల్ బిహారీ వాజ్‌పేయి లేదా లాల్ కృష్ణ అద్వానీ అక్కడ ఉండి ఉంటే చర్చ మరోలా ఉండేది.

ఫొటో సోర్స్, ANI
‘‘కాంగ్రెస్ లక్ష్యం అదే’’
కాంగ్రెస్ పట్టుబట్టడం వల్లనే రాజ్యాంగంపై చర్చ జరిగింది. కానీ కాంగ్రెస్ నేతల ప్రసంగాలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
‘‘రాజ్యాంగంపై చర్చించడం ద్వారా మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేస్తోందని చెప్పాలని భావించింది. ఈ చర్చ ద్వారా ప్రభుత్వం కంటే రాజ్యాంగం అత్యున్నతమైనదనే అంశాన్ని వివరించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది" అని రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ చెప్పారు.
"రాజ్యాంగంలో ఏ అంశాన్ని సమీక్షించాలి, అది మన అంచనాలను ఏ విధంగా అందుకోవచ్చు. ఇంకా ఎలా మెరుగ్గా చెయ్యవచ్చు అనే చర్చ జరగాలి. అయితే చర్చ అంతా అందరూ ఊహించినట్లుగానే జరిగింది" అని కిద్వాయ్ అన్నారు.
"ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా దుర్వినియోగం చేసిందో ప్రస్తావించింది" అని ఆయన చెప్పారు.
రాహుల్ గాంధీ కొన్ని నెలలుగా తన ప్రసంగాల్లో సావర్కర్‌ను ప్రస్తావిస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగంపై చర్చ సమయంలోనూ ఆయన సావర్కర్ పేరు ప్రస్తావించారు.
దీని వెనుక రాహుల్ గాంధీకి ఓ వ్యూహం ఉందని రషీద్ కిద్వాయ్ భావిస్తున్నారు. "సావర్కర్ పేరు ప్రస్తావించడం ద్వారా ఆయన బీజేపీ సిద్ధాంతకర్త అని చెప్పేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సావర్కర్‌కు రాజ్యాంగంపై నమ్మకం లేదని ఇప్పుడు మరోసారి స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు"
"ఈ చర్చను చేపట్టడం ద్వారా రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది" అని కిద్వాయ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














