గుకేశ్: ఈ చెస్ వరల్డ్ చాంపియన్‌ గెలుచుకున్న ప్రైజ్‌‌మనీలో సగం పన్నులకే పోతుందా

గుకేశ్ దొమ్మరాజు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అతి పిన్న వయసులో వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న గుకేశ్ దొమ్మరాజు
    • రచయిత, నాగేంద్రసాయి కుందవరం
    • హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం

వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ను అతి పిన్న వయసులో గెలుచుకున్న గుకేశ్ దొమ్మరాజు పేరు ఇప్పుడు ఇండియాలో మార్మోగుతోంది.

అయితే చాలామంది మాట్లాడుకుంటున్న మరో అంశం గుకేశ్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ.

విజేతగా నిలిచిన గుకేశ్‌కు రూ. 11.34 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఈ మొత్తంతో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు ప్రకటించింది.

చెస్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన ప్రైజ్‌మనీ‌పై గుకేశ్ సుమారు రూ.4.67 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని టీడీఎస్‌ కింద డిడక్ట్‌ చేసి ఇస్తారు కాబట్టి చివరకు గుకేశ్ చేతికి వచ్చే మొత్తం రూ. 6.67 కోట్లు మాత్రమే.

ఐపీఎల్‌ సీజన్‌ 2025లో ధోనీకి వచ్చిన జీతం కంటే ఈ ట్యాక్స్‌ ఎక్కువని కొందరు వ్యాఖ్యానించగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అందరికంటే పెద్ద చెక్‌మేట్‌ అని మరికొందరు మీమ్స్ చేస్తున్నారు.

ఇంతకీ ప్రైజ్‌మనీ విషయంలో ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయ్? లాటరీలో కోట్ల డబ్బు గెల్చుకున్నవాడికి, కష్టపడి ఆడి దేశ ఖ్యాతిని నిలబెట్టిన వాడికి ఒకటే నిబంధనా? ఇద్దరినీ ఒకే ట్యాక్స్ శ్లాబ్‌ కింద ఎలా పరిగణిస్తారు? అందరూ ఒకేలా 30 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?

ఆదాయంపై తగిన మొత్తంలో పన్ను కట్టడం చట్ట ప్రకారం తప్పనిసరి. ఈ పన్ను లెక్కింపుల కోసం రకరకాల పన్ను శ్లాబ్స్ ఉన్నాయి.

ఇక్కడ గుకేశ్ విషయంతో పాటు ఇతర స్పోర్ట్స్, గేమ్‌ షోలు, లాటరీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి వాటికి వర్తించే పన్ను ఏంటి? వంటి విషయాలు తెలుసుకుందాం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

టాక్స్ ఎందుకు?

భారత్‌లో ఏటా రూ. 15 లక్షలకు మించి ఆదాయం పొందే వాళ్లు ఎవరైనా 30శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లోకి వస్తారు. అయితే రూ. 5 కోట్లకు మించి ఆదాయం ఉన్న వాళ్లకు ఇంకా అదనపు భారం ఉంటుంది. వాళ్లు సర్‌చార్జి పేరుతో అదనంగా ట్యాక్స్ మీద 37 శాతం.. హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెస్‌ కింద మరో 4 శాతం కట్టాలి. దీంతో మొత్తం పన్ను భారం దాదాపుగా 42.5 శాతం వరకూ ఉంటుంది.

గుకేశ్‌కు రూ.11.34 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. తను భారత పౌరుడు. అంటే ప్రపంచంలో అతను ఎక్కడ ఏ మార్గంలో డబ్బులు గెలుచుకున్నా ఇండియాలో ట్యాక్స్‌ కట్టాల్సిందే. రూ.15 లక్షలకు మించి వచ్చే ఆదాయంపై ఇండియాలో 30 శాతం ట్యాక్స్‌ కట్టాలి.

ఈ లెక్కన గుకేశ్ ప్రైజ్‌మనీపై ట్యాక్స్ సుమారు రూ.3,43,50,000 అవుతుంది. దీనిపై అదనంగా 4 శాతం ఎడ్యుకేషన్‌, హెల్త్‌‌ సెస్‌ కట్టాలి. ఇది అదనంగా మరో రూ.18,81,960 అవుతుంది. ఇది ఇక్కడితో ఆగదు. నెట్‌ ట్యాక్స్ అమౌంట్‌పై 37 శాతం సర్‌చార్జీని కూడా విధిస్తారు. దీంతో మొత్తం ట్యాక్సేషన్‌ రూ.4,89,41,460 అవుతుంది.

అయితే కొత్త ట్యాక్స్‌ విధానాన్ని( న్యూ ట్యాక్స్ రెజీమ్) ఎంపిక చేసుకుంటే ఈ మొత్తం రూ.4.46 కోట్లకు తగ్గే వీలుంది.

గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

సింగపూర్‌లో కూడా ట్యాక్స్‌

ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సింగపూర్‌లో జరిగింది కాబట్టి అక్కడ కూడా పన్ను కట్టాలి. అయితే సింగపూర్‌ - ఇండియా మధ్య ఉన్న డబుల్‌ ట్యాక్సేషన్‌ అవాయిడెన్స్‌ ఒప్పందం ప్రకారం ఇందులో కొంత ఊరట లభిస్తుంది.

సింగపూర్‌ స్థానిక నిబంధనల ప్రకారం అక్కడ గెలుచుకున్న ప్రైజ్‌మనీపై పన్ను కట్టాలి. ప్రొఫెషనల్‌ ఎర్నింగ్స్‌పై సింగపూర్‌ ప్రభుత్వం 22 శాతం పన్ను విధిస్తోంది. అంటే రూ.11.45 కోట్లపై రూ.2.52 కోట్ల పన్నును సింగపూర్‌ ప్రభుత్వం డిడక్ట్ చేసి, ఫామ్ 67 ద్వారా ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఇస్తుంది.

ఇప్పుడు ఇక్కడ గుకేశ్ కట్టాల్సిన రూ.4.67 కోట్ల మొత్తం నుంచి పైన చెప్పిన రూ.2.52 కోట్ల మొత్తాన్ని డిడక్ట్‌ చేసి ఇక్కడ పన్ను కట్టొచ్చు. రిటర్న్స్‌ ఫైల్ చేసే సమయంలో విదేశీ సంస్థలు ఇచ్చే ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఫార్మ్‌ను సబ్‌మిట్‌ చేయాలని చెబుతోంది ట్యాక్స్‌ స్కాన్‌ సంస్థ. )

గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Rajinikanth

ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులతో చిన్ననాటి గుకేశ్

ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?

లాటరీలు:

ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 115 బీబీ ప్రకారం లాటరీ ద్వారా గెలిచే మొత్తంపై ఫ్లాట్‌గా 30శాతం పన్ను ఉంటుంది. ఇందులో ఎలాంటి డిడక్షన్స్‌కు, మినహాయింపులకు ఆస్కారం లేదు. ఇతర ఆదాయాలతో సంబంధం లేకుండా లాటరీని విభిన్నంగా చూస్తారు.

వీటితో పాటు 4 శాతాన్ని ఎడ్యుకేషన్‌, హెల్త్‌ సెస్‌ కింద వసూలు చేస్తారు. లాటరీలో రూ.కోటి కంటే ఎక్కువ ప్రైజ్‌మనీ గెలిస్తే ట్యాక్స్ మీద 15 శాతం అదనపు సర్‌చార్జ్‌ కూడా ఉంటుంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ గెలుచుకుంటే ట్యాక్స్ మీద 37శాతం అదనపు సర్‌చార్జ్‌ విధిస్తారు.

అవార్డులు:

ఒక్కోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు, రివార్డుల రూపంలో కళాకారులను, క్రీడాకారులను, సామాజిక వేత్తలనూ సత్కరిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని మినహాయింపులను ఐటీ శాఖ అందిస్తోంది. ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్ గేమ్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ పతక విజేతలకు మాత్రమే ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 10(17ఏ) నిబంధన కింద మినహాయింపు ఉంది. అంటే వీళ్లు తెచ్చుకునే ప్రైజ్‌మనీపై ఎలాంటి పన్నూ ఉండబోదు.

అవార్డ్‌, రివార్డ్‌ ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే అంశాలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్దిష్టమైన నియమ, నిబంధనలను పొందుపర్చింది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొన్ని ట్యాక్స్ ఫ్రీ అవార్డులు ఇవి. పూర్తిగా 100 శాతం పన్ను మినహాయింపు లభించే వాటిల్లో జాతీయ అవార్డులు, నోబెల్‌ ప్రైజ్ (కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలి), అర్జున అవార్డ్‌, భారతరత్న వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఇతర దేశాల్లో గెలిచిన అవార్డులకు (ఒలింపిక్స్‌, కామన్వెల్త్, ఏషియన్‌ గేమ్స్‌ వంటివి) కూడా మినహాయింపు ఉంది. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవార్డులను ఆమోదించని పక్షంలో ఐటీ యాక్ట్ సెక్షన్‌ 56(2) యాక్ట్‌ కింద, ఈ మొత్తాన్ని ఇన్‌కం ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌ (ఇతర ఆదాయ మార్గాలు) కింద చూపించి ట్యాక్స్‌ కట్టాల్సి ఉంటుంది.

ఐసీసీ క్రికెట్‌ అవార్డ్స్‌, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌, గ్రామీ అవార్డ్స్‌, విజ్డెన్‌ క్రికెటర్‌ అవార్డ్స్‌ వంటి వాటికి భారత్‌లో మినహాయింపు లేదు. అంటే వాళ్లంతా గరిష్ఠ పన్ను శ్లాబుల కింద పన్ను కట్టాల్సిందే.

వీళ్ల ట్యాక్స్ శ్లాబ్‌ 20 శాతం ఉన్నా సరే దాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఇక్కడ వ్యక్తిగత పన్ను శ్లాబ్‌కు బదులు ఫ్లాట్‌ ట్యాక్స్‌ మాత్రమే చూస్తారు.

ప్రైజ్‌మనీ రూ.5 కోట్ల కంటే కింద ఉంటే 31.2 శాతం పన్ను కట్టాల్సిందే. వాళ్లకు ఇచ్చే నగదు బహుమతే కాదు, కార్లు ఇతర ఖరీదైన బహుమానాలు (బంగారు నగలు, వజ్రాలు, ఇతర ఖరీదైన వస్తువులు) వాటికి మార్కెట్ విలువ లెక్కించి పన్ను కట్టాల్సి ఉంటుంది.

గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

గెలుచుకున్నవాళ్లే కట్టాలి

ఇక్కడ ప్రైజ్ మనీ లేదా అవార్డ్‌ గెలుచుకున్న వాళ్లే పన్ను కట్టాల్సి ఉంటుంది. బహూకరించే సంస్థే టీడీఎస్ (ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్) మినహాయించి డబ్బు చెల్లిస్తారు.

''అవార్డులు, ప్రైజ్ మనీ ఇచ్చే కంపెనీయే టీడీఎస్‌ కట్ చేసి ఇస్తుంది. ఈ మొత్తాన్ని మళ్లీ బహుమతి పొందిన వాళ్లు నిబంధనలు, అర్హతకు తగ్గట్టు క్లెయిం చేసుకునే వీలుంది. సాధారణంగా రూ.10వేల వరకూ ఏదైనా రివార్డ్‌ వస్తే దానికి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. అంతకు మించి వచ్చే సొమ్ము ఎంతైనా సరే అది ట్యాక్సబుల్‌ ఆదాయం కిందికే వస్తుంది'' అని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ పొనుగోటి రవిశంకర్‌ రెడ్డి వివరించారు.

గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ట్యాక్స్‌ డిడక్షన్స్‌ ఉండవా?

ప్రభుత్వం నోటిఫై చేయని క్రీడ ఏదైనా ఉంటే దానిపై ఎలాంటి డిడక్షన్స్‌ క్లెయిం చేసుకునే అవకాశం లేదు. ఇవన్నీ పూర్తిగా ట్యాక్సబుల్. అంటే సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ వంటివి కూడా క్లెయిం చేసుకునే వీలు లేదని చాప్టర్‌ 6ఏ ఐటీ యాక్ట్‌ చెబుతోంది.

గుకేశ్ విషయానికి వస్తే తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల బహుమానం ప్రకటించింది. ఐటీ చట్టం క్లాస్‌ 17ఏ ఆఫ్ సెక్షన్‌ 10 ప్రకారం లిటరరీ, సైన్స్‌, ఆర్ట్స్‌, స్పోర్ట్స్ విభాగాల కింద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే మొత్తంపై ఐటీ యాక్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

వాళ్లు ఎలాంటి క్లెయిమ్స్‌ చేసుకోలేరా?

ఆటగాళ్లు ఇలాంటి విజయాలు సాధించే స్థితికి రావడం వెనక ఎన్నో ఏళ్ల కష్టం దాగి ఉంటుంది. అలాంటప్పుడు ఇంతంత మొత్తాన్ని పన్నుల రూపంలో కట్ చేస్తే ఏం ప్రయోజనం అనుకోవచ్చు.

అయితే వాళ్ల కోచింగ్‌ ఫీజులు, నివాసం, ప్రయాణ ఖర్చులు, మెయింటెనెన్స్‌ వంటి అంశాలను సెక్షన్‌ 57 కింద డిడక్షన్స్‌గా చూపించుకోవచ్చని చెబుతున్నారు రవిశంకర్‌ రెడ్డి. తగిన డాక్యుమెంటేషన్‌ ఉంటే సెక్షన్ 80జీ కింద కూడా మినహాయింపులు పొందే వీలుంది, అయితే స్పాన్సర్‌షిప్ ఫీజులు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లు వంటి వాటికి మాత్రం 30 శాతం పన్ను కచ్చితంగా వర్తిస్తుందని ఆయన వివరించారు.

గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, AFP

సచిన్‌ ఫెరారీ కార్‌ విషయంలో ఏమైందంటే..

సచిన్‌ తెందూల్కర్‌కు అప్పటి ఫార్ములా ఒన్‌ ప్రముఖ రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ 2002లో ఫెరారీ 360 మోడెనా కారును బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో సచిన్‌...సర్‌ బ్రాడ్‌మన్‌ 29 టెస్ట్ సెంచరీల రికార్డ్‌ను బ్రేక్‌ చేసి, ఫామ్‌లో ఉన్నారు.

ఫెరారీ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. కొన్ని మినహాయింపులు ఇస్తూ, 120 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ (రూ.1.13 కోట్లు) ను కేంద్రం మినహాయించింది.

ఆర్థికంగా అప్పటికే బాగా స్థిరపడిన సచిన్‌...ఇలా మినహాయింపు కోరడాన్ని అప్పట్లో కొంత మంది తీవ్రంగా విమర్శించారు. దీంతో ఆ కస్టమ్స్ డ్యూటీని తామే చెల్లిస్తామని కారు తయారీ కంపెనీ ముందుకొచ్చింది.

గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

‘ట్యాక్స్‌లు మేమే కడతాం’

హైదరాబాద్‌కు చెందిన సుచిర్‌ ఇండియా సంస్థ 2007లో భారత క్రికెటర్లకు, 2008లో మహిళా హాకీ కప్‌ విజేతలకు ప్లాట్లను బహూకరించింది. అయితే వీటిపై రిజిస్ట్రేషన్‌ ఫీజు సహా మిగిలిన పన్నులను తామే కట్టామని చెప్పారు సుచిర్‌ ఇండియా ఎండీ వై.కిరణ్.

అనేక సందర్భాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చినప్పుడు కూడా టీడీఎస్‌ సహా ఇతర పన్నులు ఏమైనా ఉంటే తామే కట్టామని ఆయన వివరించారు.

‘‘ఆటగాళ్లను ప్రోత్సహించడానికి బహుమతులు ఇస్తాం. అవి వాళ్లకు భారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉండాలని భావిస్తాం’’ అని బీబీసీతో అన్నారు వై.కిరణ్.

ఒకవేళ వ్యక్తిగతంగా ఏదైనా పన్ను భారం పడే అవకాశం ఉంటే, దానికి కూడా తాము బాధ్యత తీసుకున్న సందర్భాలున్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు.

సాధారణంగా నిర్వాహకులు ఇలాంటి ప్రైజ్‌మనీ ఇచ్చేటప్పుడు 30 శాతానికిపైగా పన్ను డిడక్ట్‌ చేసి మిగిలిన మొత్తాన్ని చేతుల్లో పెడతారు. అది క్రీడలైనా లేక కౌన్‌ బనేగా కరోడ్‌పతి వంటి గేమ్‌ షో అయినా సరే.

నిర్వాహకులు టీడీఎస్‌ మొత్తాన్ని డిడక్ట్ చేసి ఫార్మ్‌ 16ఏ ఇస్తారు. దీన్ని ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసే సమయంలో క్లెయిం చేసుకోవచ్చు. ఐటీఆర్‌ 2 ఫైల్‌ చేసే సమయంలో ఈ మొత్తాన్ని వాళ్లు ఇన్‌కం ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌ కింద చూపిస్తారు.

గుకేశ్ దొమ్మరాజు, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, ఇన్‌కమ్ ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రభుత్వం తలచుకుంటే పెద్ద విషయమా?’

ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుని, దేశప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేసిన వాళ్లకు కొన్ని సందర్భాల్లో కేంద్రం మినహాయింపును ఇస్తుంది.

ప్రభుత్వానికి అభ్యర్థన చేసుకుంటే పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు సీఏ రవిశంకర్‌ రెడ్డి.

దరఖాస్తు తర్వాత ప్రభుత్వ కమిటీ పరిశీలించి, మినహాయింపును ఐటీ శాఖకు సిఫార్సు చేస్తుందని, అప్పుడు ఈ ప్రైజ్‌మనీపై మాత్రమే మినహాయింపు లభిస్తుందని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)