గినీ ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదం: రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ, 56 మంది మృతి, అసలేం జరిగిందంటే..

ఫుట్‌‌బాల్
    • రచయిత, నటాషా బూటీ, సోఫియా ఫెరీరా శాంటోస్
    • హోదా, బీబీసీ న్యూస్

ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఘర్షణ కారణంగా 56 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. గినీ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన జెరెకొరెలో ఈ ఘటన జరిగింది.

అయితే, మృతుల సంఖ్యపై భిన్న వాదనలు ఉన్నాయి. ఈ గొడవలో దాదాపు 100 మంది చనిపోయి ఉంటారని చాలా మంది భావిస్తున్నారు.

మ్యాచ్ రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం తర్వాత పరిస్థితులు అదుపు తప్పాయని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

మ్యాచ్‌లో పర్యాటక జట్టులోని ఇద్దరు ప్లేయర్లను మైదానం నుంచి బయటకు పంపించి, ఒక పెనాల్టీ కిక్‌ను ఇవ్వడంతో వివాదం రాజుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఘటనకు కారణమైనవారిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించామన్న గినీ ప్రధానమంత్రి ఓరీ బాహ్, మృతులకు సంతాపం తెలిపారు. దీన్ని విషాదకర ఘటనగా అభివర్ణించారు.

“ఆసుపత్రిలో ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. శవాల గది నిండిపోయింది. కొన్ని మృతదేహాలు గదిలోని నేలపైనే ఉన్నాయి’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక డాక్టర్, వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో చెప్పారు.

రిఫరీ మీద కోపంతో ఓ జట్టు మద్దతుదారులు మైదానంలోకి రాళ్లు విసిరేశారని, వారిని అదుపు చేయడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారని స్థానిక మీడియా పేర్కొంది.

‘‘రిఫరీ నిర్ణయంతో ఇదంతా మొదలైంది. అభిమానులు పిచ్‌పైకి దూసుకెళ్లారు’’ అని వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో ఒక సాక్షి చెప్పారు.

ఫుట్‌బాల్ మ్యాచ్

కొన్ని భీతిగొలిపే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

స్టేడియంలో నేలపై ఉన్న మృతదేహాలను దాటుకుంటూ ప్రజలు గుంపులు, గుంపులుగా స్టేడియం గోడలు దూకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా బీబీసీ ధ్రువీకరించిన సోషల్ మీడియా వీడియోలు, చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇందులో కొందరు పిల్లలు కూడా ఉన్నారు.

మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయిందని స్థానిక జర్నలిస్ట్ పాల్ సకౌవోగి బీబీసీతో చెప్పారు.

‘‘బయటకు వెళ్లేందుకు ఒకటే దారి ఉంది. భయంతో కొందరు గోడల మీదకు ఎక్కారు. ప్రేక్షకులంతా ఒకేసారి గేటు వైపు పరుగెత్తారు. అదేమో చాలా చిన్న దారి. పట్టు దొరక్క కొందరు నేలపై పడిపోయారు" అని సకౌవోగి వివరించారు.

ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారని ఆయన చెప్పారు. గాయపడినవారిని చేర్చుతున్న ఆసుపత్రుల వద్ద పోలీసులు ఉన్నారని తెలిపారు.

‘‘ఆసుపత్రికి చెందిన మూడు ప్రవేశ ద్వారాల వద్ద ఆరు పోలీస్ స్థావరాలు ఏర్పాటయ్యాయి. వారు కేవలం వైద్య సిబ్బందిని మాత్రమే లోపలికి వెళ్లనిస్తున్నారు. మిగతా వారిని వెనక్కి పంపించేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

ఫుట్‌బాల్ మ్యాచ్

“మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం” అని ఆఫ్రికన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు ప్యాట్రిస్ మోట్‌సేపే ఒక ప్రకటనలో పేర్కొనారు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లేని దేశాల్లో గినీ ఒకటి. ఇక్కడి మ్యాచ్ వేదికలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ ఆఫ్రికా ఫుట్‌బాల్ సమాఖ్య వీటిపై నిఫేధం విధించింది.

ఈ కారణంగా ‘ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్’ క్వాలిఫయర్స్‌ టోర్నీలో గినీ పాల్గొన్నప్పుడు, వారి హోమ్ మ్యాచ్‌లన్నీ పొరుగున ఉన్న ఐవరీ కోస్ట్‌లో నిర్వహించారు.

దశాబ్దాల కిందట ప్రారంభించిన ఇంకా పూర్తికాని వేదికలో ఆదివారం నాటి ఈ మ్యాచ్ జరిగింది.

2021 సెప్టెంబర్‌లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మామడీ డంబోయా గౌరవార్థం నిర్వహిస్తోన్న టోర్నమెంట్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది.

రాబోయే ఎన్నికల్లో మామడీ డంబోయా అభ్యర్థిత్వానికి మద్దతును సమకూర్చేందుకు జరుగుతున్న కుట్రగా ప్రతిపక్షాలు ఆరోపించాయి.

"ఈ ఘోరానికి అధికారులు కూడా బాధ్యులు" అని ప్రతిపక్ష సమూహం నేషనల్ అలయన్స్ ఫర్ చేంజ్ అండ్ డెమోక్రసీ సోమవారం ఆరోపించింది.

దీనిపై ప్రభుత్వం స్పందించలేదు.

గినియా ఫుట్‌బాల్‌లో అధికారం చేతుల్లో ఉన్న వ్యక్తులపై ఇటీవలి కాలంలో నిఘా పెరిగింది.

గినియా ఫుట్‌బాల్ బాడీ ‘ఫెగ్యుఫుట్’ అధ్యక్షుడిగా ఉన్న అబౌబాకర్ సంపిల్‌, ఈ జులైలో ఫుట్‌బాల్ క్రీడలో అవినీతి, హింసాత్మక ఘటనల్ని ప్రోత్సహించారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)