ఈ భారతీయ నగరంలో బిచ్చం వేస్తే కేసు పెడతారు

బిచ్చం వేయడం నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండోర్‌లో యాచన, బిచ్చం వేయడం రెండూ నేరమే

యాచక వృత్తిని నిర్మూలించేందుకు ఇండోర్ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది అంటే జనవరి1, 2025 నుంచి ఇండోర్‌లో యాచకులకు ఎవరైనా బిచ్చం వేస్తే వారు, ఎఫ్ఐఆర్ నమోదు సహా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ చేపట్టిన కార్యక్రమం కింద ఇందోర్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

స్మైల్ (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్‌లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ -జీవనోపాధి పొందడంలో అణగారిన వర్గాలకు చేయూతనివ్వడం) పథకం కింద కేంద్రం ఈ కార్యక్రమం ప్రారంభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండోర్‌లో యాచకులపై చర్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మైల్ స్కీమ్ ప్రస్తుతం మొత్తం 81 నగరాలు, పట్టణాల్లో అమలవుతోంది.

స్మైల్ పథకం ఏంటి?

స్మైల్ పథకం కింద కేంద్రప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు, యాచకులకు పునరావాసం కల్పిస్తుంది. ఇందుకోసం 2022 ఫిబ్రవరి 12న స్మైల్ పథకాన్ని తీసుకువచ్చింది.

బిక్షాటన చేసేవారికి వైద్యసదుపాయాలు అందించడం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, చదువు చెప్పించడం, నైపుణ్య శిక్షణతోపాటు ఆర్థిక సంబంధాలపై అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేయనుంది.

హైదరాబాద్ సహా ఎంపిక చేసిన కొన్ని నగరాలను, పట్టణాలను యాచకులు లేని ప్రాంతాలుగా మార్చాలన్నది స్మైల్ లక్ష్యాల్లో ఒకటి. వాటిల్లో ఇండోర్ కూడా ఉంది. ఈ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు నిధులు కేటాయిస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. యాచకుల పునరావాసం కోసం మొత్తం వంద కోట్లు కేటాయించింది.

యాచకుల కోసం స్మైల్ పథకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాచకులకు పునరావాసం కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది

ఇండోర్‌లో ఏం చేస్తున్నారు?

కేంద్రప్రభుత్వం చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు అమలుపై ఇండోర్ యంత్రాంగం దృష్టిపెట్టింది. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఇండోర్‌లో ఎవరు బిచ్చం వేసినా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేస్తారు. ఇప్పటికే అక్కడ దీనిపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

డిసెంబరు చివరి వారం వరకు అవగాహనా కార్యక్రమాలు ఉంటాయని ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ చెప్పారు. ''బిచ్చం వేయడం ద్వారా పాపంలో భాగం కావొద్దని ఇండోర్ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా'' అని సింగ్ అన్నారు.

యాచకులపైనా, వారికి బిచ్చం వేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇండోర్‌లో 7 నుంచి 8 శాతం యాచకులు మాత్రమే ఉన్నారని జనవరి చివరి నాటికి యాచకవృత్తి లేకుండా చేయడం లక్ష్యమని పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

యాచనపై ఇప్పటికే నిషేధం విధిస్తూ ఇండోర్ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. జనవరి ఒకటి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. కొన్ని వ్యవస్థీకృత గ్యాంగ్‌లు కొందరిని మోసం చేసి ప్రమాదకరరీతిలో యాచకులుగా మారుస్తున్నట్టు అధికారయంత్రాంగం గుర్తించింది.

యాచకులపై చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న సోదాల్లో సాధువులు కనిపించారని, వారి నెలవారీ ఆదాయం లక్షల్లో ఉందని ఇందోర్ కలెక్టర్ చెప్పారు.

యాచకుల కోసం స్మైల్ పథకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిక్షాటన చేసే సాధువుల ఆదాయం లక్షల్లో ఉన్నట్టు అధికారయంత్రాంగం గుర్తించింది.

స్మైల్ అమలు ఎక్కడెక్కడ?

యాచకులకు పునరావాసం కల్పించడం కోసం ప్రారంభించిన స్మైల్ సబ్ స్కీమ్ ప్రస్తుతం మొత్తం 81 నగరాలు, పట్టణాల్లో అమలవుతోందని కేంద్రప్రభుత్వం డిసెంబరు 4న తెలిపింది.

ఇప్పటివరకు 7,660మంది యాచకులను గుర్తించామని, వారిలో 352మంది పిల్లలు సహా 970 మందిని పునరావాసానికి తరలించామని తెలిపింది. 352మంది పిల్లల్లో 169 మందిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చామని, 79 మంది బాగోగులను అంగన్‌వాడీలు చూసుకుంటున్నారని, 33మంది శిశుసంక్షేమ కమిటీల సంరక్షణలో ఉన్నారని, 71మంది స్కూళ్లకు వెళుతున్నారని కేంద్రం వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ స్మైల్ సబ్ స్కీమ్ అమల్లో ఉంది. తిరుపతి, విశాఖపట్టణం, గుంటూరు, విజయవాడలో ఇది అమలవుతోంది. తెలంగాణలో హైదరాబాద్, రామగుండం, వరంగల్‌లో అమల్లో ఉంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి, అసోం, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, చండీగఢ్, దిల్లీ ఎన్‌సీటీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, గుజరాత్, మణిపుర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లో ఈ పథకం అమల్లో ఉందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ మంత్రి వీరేంద్రకుమార్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)