ఖాళీగా ఉన్న హాస్టళ్లు, శిక్షణ కేంద్రాలు.. కోటా కోచింగ్ ఇండస్ట్రీ ప్రాభవం కోల్పోతోందా? - గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సోనూ గౌతమ్ ఎనిమిది అంతస్తుల భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లో రెండేళ్లుగా ఉంటున్నారు. ఆయన యూపీలోని కాన్పూర్ నుంచి వచ్చారు.
అతని గదిలో మంచం, టీ పెట్టుకునేందుకు చిన్న సిలిండర్, పుస్తకాలు, కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రూ.2,500 అద్దె చెల్లిస్తున్న ఈ గదిలో సోనూ ఒంటరిగా ఉంటున్నారు. ఆయన స్నేహితుల్లో అనేక మంది రాజస్థాన్‌లోని కోటా వదిలి వెళ్లిపోయారు.
ఒకప్పుడు వాళ్ల హాస్టల్ విద్యార్థులతో సందడిగా ఉండేది. ప్రస్తుతం దాదాపు ఖాళీ అయ్యింది.
"ప్రస్తుతం పిల్లల సంఖ్య తగ్గిపోయింది. కోచింగ్ కేంద్రాల్లో కూడా ఇంతకు ముందు ఉన్నంతమంది పిల్లలు లేరు. నేను రెండేళ్ల నుంచి ఇంటికి వెళ్లలేదు. ఊరికి వెళితే ఇంతవరకు ఎందుకు రాలేదని ఇరుగుపొరుగు వాళ్లు అడుగుతారు" అని సోనూ చెప్పారు.

హిందీ మీడియంలో చదువుకున్న సోనూకు ఇంగ్లీష్‌లో కోచింగ్ తీసుకోవడం కష్టంగా మారింది. అంతే కాకుండా నగరంలో మారుతున్న పరిస్థితులు కూడా ఆయనకు సవాళ్లు విసురుతున్నాయి.
ప్రస్తుతం ఆయన ఎక్కువ సమయం చదువుకోవడం, తనలో తాను మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనతో మాట్లాడటానికి ఆ గదిలో ఎవరూ లేరు. హాస్టల్‌లో సగానికి పైగా గదులకు తాళం వేసి ఉంది.
ఇది సోనూ గౌతమ్ ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదు. నగరానికి పది కిలోమీటర్ల దూరంలో 25 వేల మంది విద్యార్థుల కోసమే నిర్మించిన కోరల్ పార్క్ సిటీ మొత్తం దాదాపు ఖాళీగా ఉంది.
కోచింగ్ తీసుకునేందుకు వచ్చే విద్యార్థుల కోసం కొన్నేళ్లుగా ఇక్కడ 350కి పైగా హాస్టళ్లు నిర్మించారు.

ఫొటో సోర్స్, Siddharth Kejriwal/BBC
జీవితంలో పైకి రావాలనే లక్ష్యం, విజయం సాధించాలనే తపనతో ఏటా దేశం నలు మూలల నుంచి లక్షల మంది విద్యార్థులు కోటాకు వస్తుంటారు.
పది లక్షల జనాభా ఉన్న కోటాలో గత 20 ఏళ్ల కాలంలో హాస్టళ్లు విపరీతంగా ఏర్పడ్డాయి. ఎక్కడ చూసినా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులకు సిద్ధమవుతున్న విద్యార్థులే కనిపించేవారు.
అయితే ఇప్పుడు మెల్లమెల్లగా కోటా మెరుపు తగ్గుతోంది. కోట్లాది రూపాయల విలువైన కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది.
విద్యార్థులతో కళకళలాడే హాస్టళ్ల గదులకు ఇప్పుడు తాళాలు వేసి ఉన్నాయి.
ఇది హాస్టళ్లతో పాటు నగరంలోని ప్రజలపైనా ప్రభావం చూపుతోంది. కోటా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్న విద్యార్థుల సంఖ్య తగ్గడంతో నగరంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా తగ్గాయి.
ఐఐటీ, నీట్ కోచింగ్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే కోటాకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? కోచింగ్ కోసం వస్తున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? కోటా ఈ సంక్షోభాన్ని అధిగమించగలదా?

విద్యార్థుల సంఖ్య ఎంత తగ్గింది?
1990లలో కోటాలోని విజ్ఞాన్ నగర్‌లో వీకే బన్సల్ కోచింగ్ క్లాసులను ప్రారంభించారు. కొద్దిమంది పిల్లలతో మొదలైన కోచింగ్ తర్వాతి కాలంలో భారీగా విస్తరించింది.
ఆ తర్వాత, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచింగ్ సెంటర్లు తమ బ్రాంచ్‌లను కోటాలో స్థాపించాయి. ఇంజనీరింగ్, మెడికల్ కోచింగ్ సెంటర్లతో కోటాలో కోచింగ్ అనేది పరిశ్రమ స్థాయికి ఎదిగింది.
2024లో సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాగా, దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ చెబుతోంది.
గత 20 ఏళ్లలో కోటాకు కోచింగ్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య 25 నుంచి 30 శాతం తగ్గిపోవడం ఇదే తొలిసారి అని కోటా హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ మిట్టల్ చెప్పారు.
"కరోనా తర్వాత, అనేక మంది పిల్లలు వచ్చారు. ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఆ తర్వాత పిల్లల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉందంటే లక్ష లేదా లక్షా పాతిక వేల మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడికి వచ్చారు" అని డాక్టర్ సోమ్‌వీర్ తయాల్ చెప్పారు. ఆయన కోటా కోచింగ్ పరిశ్రమలో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు.

హాస్టళ్ల పరిస్థితి ఏంటి?
కోచింగ్ కోసం వచ్చే విద్యార్థుల కోసం కోటాలో ఎక్కడ చూసినా హాస్టళ్లు కనిపించేవి. దక్షిణ కోటాలోని విజ్ఞాన్ నగర్, మహావీర్ నగర్, ఇందిరాకాలనీ, రాజీవ్ నగర్, తల్వండి, ఉత్తర కోటాలోని కోరల్ పార్క్ విద్యార్థులు ఉండే ప్రాంతాలు.
అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో హాస్టళ్లు, ఇళ్ల బయట ఎక్కడ చూసినా "To let" బోర్డులు కనిపిస్తున్నాయి. బయటకు తళతళలాడుతూ కనిపిస్తున్న భవనాల్లో గదులకు తాళాలు వేసి ఉన్నాయి.
"దాదాపు 30 శాతం మంది పిల్లలు తగ్గిపోవడంతో మా పరిశ్రమ రూ.6,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు పడిపోయింది" అని నవీన్ మిట్టల్ చెప్పారు.
కోటా వాసి దీపక్ కోహ్లీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన 25 ఏళ్లుగా హాస్టల్ నడుపుతున్నారు. రాజీవ్ నగర్‌లో 50 గదుల హాస్టల్, విజ్ఞాన్ నగర్‌లో 20 గదుల పీజీ, కోరల్ సిటీలో 50 గదుల హాస్టల్ నిర్వహిస్తున్నారు.
‘‘ఏడాది క్రితం రాజీవ్ నగర్‌లో ఒక గదికి రూ.15 వేలు అద్దె తీసుకుంటే, ఇప్పుడు అది రూ.8 వేలకు తగ్గింది. విజ్ఞాన్ నగర్‌లో పీజీకి ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు తీసుకున్నాం, ప్రస్తుతం 3 వేల రూపాయలకు ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. అన్ని హాస్టళ్లలోనూ సగానికి పైగా గదులు ఖాళీగా ఉన్నాయి" అని కోహ్లీ చెప్పారు.
కోరల్ సిటీలో హాస్టల్ నడుపుతున్న ముకుల్ శర్మ ఆందోళన చెందుతున్నారు. ఆయన 2009 నుంచి హాస్టల్ పరిశ్రమలో ఉన్నారు. కోరల్ సిటీలో ఆయన 75 గదుల హాస్టల్ నడుపుతున్నారు.
"మా హాస్టల్ కీలక ప్రాంతంలో ఉంది. దీంతో ఇది ఎప్పుడూ నిండుగా ఉంటుందని భావించాను. కానీ ఇప్పుడు అందులో సగానికి పైగా గదులు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్ నిర్మాణానికి సుమారు రూ. 4 కోట్లు ఖర్చయింది. దాని మీద నెలకు 4 లక్షల రూపాయలు ఆదాయం రావాలి. కానీ, ప్రస్తుతం లక్ష రూపాయలు కూడా రావడం లేదు" అని శర్మ చెప్పారు.
‘‘పిల్లల సంఖ్య తగ్గడంతో అద్దెలు కూడా తగ్గాయి. మేము విస్తృత సౌకర్యాలు కల్పిస్తూ పిల్లల నుంచి రూ. 15 వేలు వసూలు చేసేవాళ్లం. అయితే ఇప్పుడు రూ.8 వేలు మాత్రమే తీసుకుంటున్నాం. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. రుణాలకు వాయిదాలు చెల్లించడం కూడా కష్టంగా మారింది’’ అని శర్మ వాపోయారు.

ఆర్థిక వ్యవస్థకు ఎదురు దెబ్బ
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గడం వల్ల జరుగుతున్న నష్టం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది.
పాత సైకిళ్లు కొనడం, అమ్మడం కోటాలో పెద్ద వ్యాపారం. సిటీకి చేరుకోగానే చాలా మంది పిల్లలు చేసే మొదటి పని సైకిల్ కొనుక్కోవడం.
‘‘విద్యార్థుల్లో ఎక్కువ మంది రెండున్నర వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలతో పాత సైకిల్ కొంటారు. కొత్త సైకిల్ కోసం రూ. 10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది" అని విజ్ఞాన్ నగర్‌లో రాజు సైకిల్ స్టోర్ మేనేజర్ దినేష్ కుమార్ భవనాని చెప్పారు.
"మేము ఒక షాపు మూసేయాల్సి వచ్చింది. ఆ షాపులో నలుగురు పని చేసేవారు. ఇప్పుడు ఒక్కరిని పెట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా షాపులు కూడా మూతపడతాయి" అని దినేష్ కుమార్ తెలిపారు.
20 ఏళ్లుగా విజ్ఞాన్ నగర్‌లో హాస్టల్‌తో పాటు మెస్‌ను నడుపుతున్న సందీప్ జైన్ కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.
"గతంలో 500 నుంచి 700 మంది విద్యార్థులు మా మెస్‌లో భోజనం చేసేవారు. కానీ ఇప్పుడా సంఖ్య సగానికి పడిపోయింది. ఇంతకుముందు 20 మంది సిబ్బంది ఉండేవారు. ఈ ఏడాది ఐదుగురితో నెట్టుకొస్తున్నాం" అని సందీప్ జైన్ వాపోయారు.
మహావీర్ నగర్‌లో టీ దుకాణం నడుపుతున్న మురళీధర్ యాదవ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ''మొన్నటి వరకు పిల్లలతో రద్దీగా ఉండేది. ఒక్క నిమిషం మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. రోజూ 80 లీటర్ల పాలతో చేసిన టీ అమ్మేవాడిని. ఇప్పుడు కనీసం 40 లీటర్ల పాలు కూడా ఖర్చు కావడం లేదు" అని ఆయన చెప్పారు.
కోటాకు కోచింగ్ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆటో డ్రైవర్లపైనా ప్రభావం చూపుతోంది.
విద్యార్థులు అధికంగా ఉండే కోరల్ పార్క్ సిటీలో ఆటో నడుపుకునే ప్రేమ్‌సింగ్ గతంలో రోజూ వెయ్యి రూపాయలకు పైగా సంపాదించేవాడినని, ప్రస్తుతం రూ. 500 కూడా రావడం లేదని అన్నారు.
"ఈసారి పిల్లలు తగ్గడంతో జీవితం కష్టమైంది. పిల్లల వల్లే మా వ్యాపారం నడుస్తుంది. ఇదిలాగే కొనసాగితే అప్పులవాళ్లు నా ఆటో ఎత్తుకెళ్తారు" అని ప్రేమ్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నగరానికి వస్తున్న పిల్లల సంఖ్య తగ్గడంపై దక్షిణ కోటా డిప్యూటీ మేయర్ పవన్ మీనా కూడా ఆందోళన చెందుతున్నారు.
"కోచింగ్ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల కోటా మొత్తం బాధపడుతోంది. నగర ఆర్థిక వ్యవస్థకు వారే ప్రధాన ఆర్థిక వనరు" అని ఆయన చెప్పారు.
కార్పొరేషన్ పరిధిలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, నగరానికి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలా నీరు, విద్యుత్, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు మీనా చెప్పారు.

ఫొటో సోర్స్, Siddharth Kejriwal/BBC
కోటాలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది?
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోటాకు దూరం కావడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
2023లో కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2015 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకోవడం ఇదే తొలిసారి.
బిహార్‌కు చెందిన ఆదిత్య కుమార్ తనతో పాటు చదువుకున్న పది మంది విద్యార్థులతో కలిసి రెండేళ్ల క్రితం కోటా వెళ్లారు. ఐఐటీలో చేరడం అతని లక్ష్యం. అయితే అతనితో పాటు అతని స్నేహితులంతా బిహార్ తిరిగి వచ్చే ఇళ్ల దగ్గరే ఉండి ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నారు.
"2024లో మేమంతా తిరిగి వచ్చాం. ఆత్మహత్యల గురించి వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. అవి మాకు ఆందోళన కలిగించాయి. అంతే కాకుండా అక్కడ విద్యార్థులకు పరీక్ష పెట్టి బ్యాచ్‌లుగా విభజించారు. తక్కువ మార్కులు వచ్చిన వారిని పట్టించుకోవడం లేదు" అని ఆదిత్య బిహార్‌లో బీబీసీ ప్రతినిధి సీతూ తివారీతో చెప్పారు.
"మీతో పాటు ఉంటున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది? అలాంటి పరిస్థితుల్లో మీరు చదువు మీద దృష్టి పెట్టలేరు" అని బెగూసరాయ్‌లో ఉంటున్న సాకేత్ చెప్పారు. ఆయన కోటా నుంచి మధ్యలోనే తిరిగి వచ్చారు.
"90లలో బిహార్‌లో వాతావరణం అధ్వాన్నంగా ఉండేది. దాని వల్లనే కోటా పుట్టింది" అని పట్నాలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కుమార్య మనోజ్ చెప్పారు.
"పిల్లల కోసం లక్షల రూపాయలు ఖర్చు చెయ్యగల తల్లిదండ్రులు తమ పిల్లలను బిహార్‌లో గ్యాంగులు కిడ్నాప్ చెయ్యకుండా ఉండేందుకు కోటా పంపించేవారు" అని మనోజ్ చెప్పారు.
"ప్రస్తుతం బిహార్ వాతావరణం బాగానే ఉంది. దేశంలోని పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లన్నీ పట్నాలో తమ శాఖలను ప్రారంభించాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కోటా పంపకుండా పట్నాలోనే చదివిస్తున్నారు. ఇక్కడ నుంచి కోటా వెళ్లడానికి 26 గంటల సమయం పడుతుంది. అదే తల్లిదండ్రులు పట్నాలో పిల్లల్ని కలుసుకోవాలనుకుంటే గంట, రెండు గంటలు చాలు" అని మనోజ్ అన్నారు.

నిబంధనల్లో మార్పు కూడా కారణమేనా ?
కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల్ని, పిల్లలపై ఒత్తిడి తగ్గించడానికి విద్యాశాఖ ఇటీవల కొత్త విద్యా విధానం తీసుకొచ్చింది. నూతన విద్యా విధానం 2020 కింద ప్రకారం కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ కోసం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇందులో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్ ఇవ్వకూడదనేది ప్రధాన నిబంధన.
గతంలో నగరంలోని అనేక కోచింగ్ సెంటర్లు ఆరో తరగతి నుంచే పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉండేవి. అయితే ఇప్పుడవి మూత పడ్డాయి
ఆరో తరగతి నుంచి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పది శాతం ఉందన్న నవీన్ మిట్టల్, ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు.
"కొన్ని నిబంధనలు పెట్టి అవన్నీ తప్పనిసరి అంటే ఎలా? ఐపీఎల్‌లో13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. క్రీడల్లో అలాంటి నియమాలు అవసరం లేనప్పుడు కోచింగ్ విషయంలో ఎందుకు? ఒత్తిడి ప్రతీ రంగంలోనూ ఉంటుంది" అని నవీన్ మిట్టల్ అన్నారు.
కోటాలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇది సానుకూల పరిణామమని ఈకోర్స్ వ్యవస్థాపకుడు సోమ్‌వీర్ తయాల్ చెప్పారు.
"2020 తర్వాత కోటా కోచింగ్ పరిశ్రమకు కేంద్రంగా మారింది. మంచి కోచింగ్ సెంటర్లు నిధులు సేకరించి ఇతర రాష్ట్రాలకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరిస్తాయి" అని ఆయన అన్నారు.
అయితే, ఈ భయాలేవీ పట్టించుకోకుండా కోటాలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ధోల్‌పూర్ నివాసి ప్రీతి జదౌన్, ఆమె భర్త జై సింగ్ జాదౌన్ తమ కుమార్తె కనక్ జదౌన్‌ని కలవడానికి ప్రతి నెల కోటాకు వస్తున్నారు.
ప్రీతి జదౌన్ కుమారుడు పునీత్ కోటాలో ఉంటూ నీట్‌కు కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
"మా అమ్మాయి తొలిసారి ఇంటినుంచి బయటకు వచ్చింది. ఆమె ఒంటరిని అయ్యానని అనుకుంటోంది. ఆమెపై ఒత్తిడి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమెకు ధైర్యాన్నిచ్చేందుకు నేను ప్రతీ నెల ఇక్కడకు వస్తుంటాను. దీని వల్ల ఆమెకు కుటుంబాన్ని మిస్ అయ్యాననే భావన ఉండదు" అని ప్రీతి చెప్పారు.
"మీడియాలో ఆత్మహత్య వార్తలను చూసినప్పుడల్లా మాకు కూడా ఆందోళన కలుగుతుంది. ఆయితే మేము మా అమ్మయితో నిరంతరం మాట్లాడుతూ ఉంటాం. చివరిసారి నేను ఆమెతో రెండు నెలలు ఉన్నాను" అని ప్రీతి చెప్పారు.
ఆత్మహత్యల పేరుతో కావాలనే కోటా ప్రతిష్టను దెబ్బ తీశారని హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ అభిప్రాయపడ్డారు.
"మీరు నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాలను చూడండి. కోటా ర్యాంకు చాలా వెనుక ఉంది. కోటా కేవలం కోచింగ్ సిటీ మాత్రమే కాదు. అది విద్యార్థులను భద్రంగా చూసుకుంటుంది. ఇటీవల మేము కోటా స్టూడెంట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాము, ఇందులో 16 జట్లు ఉన్నాయి. పిల్లలకు మంచి వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము" అని ఆయన చెప్పారు.
కోటా కోచింగ్ పరిశ్రమలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, ఏ పరిశ్రమకైనా ఇలాంటివి సహజమేనని సోమ్‌వీర్ తాయల్ భావిస్తున్నారు.
"జేఈఈ నమూనా మార్చినప్పుడు, కోటా మనుగడ సాగించగలదా అని అడిగారు. దాని తర్వాత కూడా కోటా బయటపడి బలంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి నుంచి కోటా బయటపడుతుంది" అని ఆయన అన్నారు.
(బిహార్ నుంచి బీబీసీ ప్రతినిధి సీతూ తివారీ అదనపు రిపోర్టింగ్‌తో..)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














