కోళ్లు, గుడ్లు దొంగతనం చేశారని ఇద్దరికి ఉరిశిక్ష.. పదేళ్ల తర్వాత ఏమైందంటే...

- రచయిత, మన్సుర్ అబూబకర్
- హోదా, బీబీసీ న్యూస్
కొన్ని కోళ్లను, గుడ్లను దొంగిలించాడంటూ మరణశిక్ష విధించిన ఒక వ్యక్తికి పదేళ్ల తర్వాత క్షమాబిక్ష ప్రసాదించారు.
పదేళ్ల పాటు శిక్షను అనుభవించిన ఆ నైజీరియా వ్యక్తికి ఒసన్ రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష పెట్టారు. 2010లో అరెస్ట్ అయినప్పుడు సెగున్ ఓలువూకెరె వయస్సు 17 ఏళ్లు. సెగున్‌తో పాటు మొరాకిన్యో సండే అనే మరో వ్యక్తిని కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు.
వారిద్దరూ పాత కాలం నాటి ఒక చెక్క తుపాకీ, కత్తితో ఒక పోలీసు అధికారితో పాటు మరో వ్యక్తి ఇంటిపై దాడి చేసి, కోడిగుడ్లు, కోళ్లతో పారిపోయారని ఆరోపణలు వచ్చాయి.
పోలీసు అధికారి ఇంటిలోకి చొరబడి, దొంగతనానికి పాల్పడ్డారనే అభియోగాల్లో దోషిగా తేలడంతో 2014లో ఒసన్ హైకోర్టు వారిద్దరికీ ఉరిశిక్ష విధించింది.


ఫొటో సోర్స్, Remi Tunde
దీంతో నైజీరియా వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారిద్దరికీ తీవ్రమైన శిక్ష విధించారంటూ చాలామంది అభిప్రాయపడ్డారు.
తర్వాత వీరిద్దరిని లాగోస్‌లోని కరుడుగట్టిన నేరస్థులను ఉంచే కిరికిరి మాగ్జిమం సెక్యూరిటీ జైల్లో మరణశిక్ష ఖైదీల విభాగానికి తరలించారు.
జీవితానికి ఉండే పవిత్రతను కాపాడటం ముఖ్యమైనందున సెగున్‌ను క్షమించాలని మంగళవారం గవర్నర్ అడెమోలా అడెలెకె ఒక ప్రకటనలో ఆదేశించారు.
''ఆ యువకుడికి క్షమాబిక్షను అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశాను. న్యాయం, సమానత్వానికి నిలయం ఒసన్. ఇక్కడ ప్రాణాలకు న్యాయంగా రక్షణ కల్పించాలి'' అని ఎక్స్‌లో గవర్నర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సెగున్‌తో పాటు అరెస్టయిన మొరాకిన్యో సండే భవిష్యత్ ఏంటనే అంశంపై స్పష్టత లేదు. ఎందుకంటే గవర్నర్ విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరును ప్రస్తావించలేదు.
సెగున్ తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘాలు, ఇతర నైజీరియన్లు ఆయనను విడుదల చేయాలంటూ ఏళ్ల పాటు పోరాటాలు చేశాయి.
తమకు ఏకైక సంతానమైన సెగున్‌ను క్షమించి విడిచిపెట్టాలంటూ ఇటీవలే ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
సెగున్‌ను 2025 ఆరంభంలో విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు.
2012 నుంచి నైజీరియాలో ఎవరినీ ఉరి తీయలేదు. కానీ, ప్రస్తుతం అక్కడ 3,400 మందికి పైగా ఖైదీలు మరణశిక్షను అనుభవిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














