సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఏంటి, ఆ మహిళ ఏం చెప్పారు, ఆయన ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతిలో కేసు నమోదైంది. ఆయన తనను లైంగికంగా వేధించి, బెదిరించారని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఆరోపణల తర్వాత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన ఓ మహిళ, ఆదిమూలంపై ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె సెప్టెంబర్ 5 ఉదయం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి విడుదల చేశారు. ఆయన దురాగతాలను బయటపెట్టడానికి తానే పెన్ కెమెరా ద్వారా ఆ దృశ్యాలు రికార్డు చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాశానని ఆమె మీడియాకు చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికల ముందువరకు వైసీపీలో (ఎమ్మెల్యేగా) ఉన్న ఆదిమూలం, సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తర్వాత సత్యవేడు నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

ఆమె ఏం చెప్పారు?
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను పలుమార్లు లైంగికంగా వేధించారని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ మహిళ ఆరోపించారు. విషయం బయటకు చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని ఆయన బెదిరించారని కూడా చెప్పారు.
‘‘వైసీపీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. అప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తర్వాత వాట్సాప్‌లో అది పెట్టు, ఇది పెట్టు అని అడిగేవారు. ఏదో పెద్దాయన అనుకున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు రమ్మన్నారు. నేను జులై 6న ఆ హోటల్లో రూమ్ నెంబర్ 109కి వెళ్లాను. నేను రూమ్‌లోకి వెళ్లగానే ఆయన నాపై బలాత్కారానికి పాల్పడ్డారు. నేను ఆయనకు లొంగిపోయాను. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెబితే నిన్ను చంపేస్తాను. నీ కుటుంబాన్ని చంపేస్తాను అని బెదిరించారు. అందువల్ల నేను ఎవరికీ చెప్పుకోకుండా సైలెంట్‌గా ఉండిపోయాను’’ అని ఆమె వివరించారు.
చివరకు తన భర్తకు అనుమానం రావడంతో జరిగిన విషయం ఆయనకు చెప్పానని, భర్త చెప్పినట్లే వీడియో రికార్డ్ చేసి, ఎమ్మెల్యే దురాగతాన్ని బయటపెట్టానని ఆమె చెప్పారు.
‘‘నేను అవాయిడ్ చేస్తుంటే, ఆయన పదేపదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నాకు ఫోన్ చేసేవారు. దీంతో నా భర్త చూసి ఎమ్మెల్యే ఎందుకు నీకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? అని అడగంతో నేను నా భర్తకు జరిగిన విషయాన్ని చెప్పాను. ఆయన నాకు ఒక పెన్ కెమెరాని ఇచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 10న భీమాస్ ప్యారడైజ్‌కు మధ్యాహ్నం 1.30కి వెళ్లాను. అక్కడ జరిగినదంతా రికార్డ్ చేసి నా భర్తకు ఇచ్చాను’’ అని ఆమె వివరించారు.
‘‘నాలా ఇంకా ఎంతోమంది...’’
వీడియో రికార్డ్ చేసిన తర్వాత కోనేటి ఆదిమూలం గురించి పార్టీ (టీడీపీ)కి, అగ్ర నేతలకు ఫిర్యాదు చేశానని, ఎమ్మెల్యే నుంచి ప్రాణభయం ఉండటంతో హైదరాబాద్‌కు వచ్చి ఆ విషయం బయటపెట్టానని ఆ మహిళ చెప్పారు. తనలా ఇంకా ఎంతోమంది మహిళలు ఆ ఎమ్మెల్యే చేతిలో అన్యాయానికి గురవుతున్నారని ఆమె ఆరోపించారు.
‘‘మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లి పెద్ద బాబు, చిన్నబాబుకు ఈ విషయాన్ని తెలియజేశాను. వాళ్ల నుంచి పిలుపు వస్తుందని చూశాం. ఈ విషయం ఎమ్మెల్యే తెలుసుకొని నన్ను బ్లాక్‌మెయిల్ చేసి, మా ఇంటి దగ్గరికి మనుషులను పంపారు. ప్రాణ భయంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇలాంటివారు తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీకి మంచి పేరు రాదని బాబు గారికి తెలియజేస్తున్నాను. ఆయన్ను మీరు వెంటనే సస్పెండ్ చేయకపోతే నాలాంటి మహిళలు బయటకు రాలేక కుంగిపోతారు. ఆయన చేతిలో ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు కూడా బలైపోతున్నారు’’అని ఆమె చెప్పారు.
‘‘ఒక ఎమ్మెల్యేనే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే సామాన్యులు తమ బాధలు ఇక ఎవరికి చెప్పుకోవాలి?’’ అని ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, UGC
పార్టీ నుంచి సస్పెన్షన్
ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేస్తూ ఆ మహిళ పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు.
ఈ అంశంపై సీరియస్ అయిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సెప్టెంబర్ 5 మధ్యాహ్నం ప్రకటించారు.
దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
‘‘కోనేటి ఆదిమూలం మీద కఠిన చర్యలు తీసుకున్నాం. ఒక మహిళ పట్ల ఎవరైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని సందేశం ఇవ్వడానికే పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేశాం. ఎవరిపై అయినా ఆరోపణలు రావచ్చు. దానిమీద పూర్తిస్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వీడియో నిజమైనదేనా కాదా అనేది వెరిఫై చేయాల్సి ఉంది’’అని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
వైసీపీ ఏమంటోంది?
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని సస్పెండ్ చేయడం కాదు, ఆయనతో ఎమ్మెల్యే పదవికి టీడీపీ రాజీనామా చేయించాలని సత్యవేడు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ నూకతోట రాజేష్ బీబీసీతో అన్నారు.
"మహిళలపై వేధింపులకు సంబంధించి ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం వరకు టీడీపీలోని ఒక వర్గం వారు తనపై కుట్రపన్నారని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ అయన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఆ మహిళతో ఆరోపణలు చేయించారని వైసీపీపై బురద చల్లడం సరికాదు. ఇదంతా కేవలం పెద్దిరెడ్డి పేరు చెప్పి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి వారు ఆడుతున్న నాటకం. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే నియోజవర్గంలో మహిళా ఉద్యోగులు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ముందు ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలి" అని రాజేష్ డిమాండ్ చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు
మహిళ ఫిర్యాదుతో కోనేటి ఆదిమూలంపై సెప్టెంబర్ 5న బి.ఎన్.ఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 64, 351(2) కింద కేసు నమోదు చేసినట్లు తిరుపతి పోలీసులు చెప్పారు.
‘‘జులై 6న, జులై 17న, ఆగస్టు 10వ తేదీన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై అత్యాచారం చేశారని బాధితురాలు (36) ఫిర్యాదు చేశారు. ఆ విషయం పార్టీలో ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆయన, ఆయన అనుచరులు తనను బెదిరించారని ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులపై బాధితురాలు పెన్ కెమెరాతో వీడియో కూడా తీశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం’’అని తిరుపతి ఈస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ బీబీసీతో చెప్పారు.
మహిళా అధికారితో దర్యాప్తు
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనిపై స్పందించారు. ఈ కేసులో మహిళా అధికారిని నియమించి దర్యాప్తు చేయిస్తామని చెప్పారు.
‘‘చట్టం ముందు ఎవరైనా ఒకటే. దీనిపైన ఒక మహిళా అధికారిని నియమిస్తాం. ఇందులో ఎవరున్నా సరే, పోలీసు ఆఫీసర్లు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి. ఆమెకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తాం. దర్యాప్తు నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాం’’ అని హోంమంత్రి అనిత చెప్పారు.
‘‘నాపై కుట్ర పన్నారు’’ - ఎమ్మెల్యే ఆదిమూలం
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కోనేటి ఆదిమూలం స్పందించారు. తనపై కుట్ర జరిగిందని, వీడియోలను మార్ఫింగ్ చేశారని కొన్ని మీడియా సంస్థలతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు.
‘‘నేను ఏ తప్పూ చేయలేదు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలా కుట్ర పన్నారు. ఎన్నికల్లో టిక్కెట్ వచ్చినప్పటి నుంచే నాపై కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో టీడీపీ పేరు చెప్పుకునే వారితోపాటు వైసీపీలోని కొందరు పెద్దలు కూడా ఉన్నారు. మహిళా నాయకురాలిని వాడుకుని నాపై మచ్చ వేశారు. నాపై ఈర్ష్య, ద్వేషం, కోపంతో ఈ నిందలు వేశారు. చాలా బాధ కలిగిస్తోంది. నాపై నింద వేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను’’ అని అన్నారు.
తన వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదని భావిస్తున్నానని చెప్పిన ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘‘50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నవాడిని. న్యాయం, ధర్మం గెలుస్తుందనే నమ్ముతున్నాను’’ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














