రవిచంద్రన్ అశ్విన్: ''భారత క్రికెటర్‌గా ఇదే చివరి రోజు'' అంటూ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన ఆఫ్ స్పిన్నర్

ఫొటో సోర్స్, Getty Images
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
బ్రిస్బేన్‌లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు.
38 ఏళ్ల అశ్విన్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు.
బ్రిస్బేన్ టెస్టు భారత తుది జట్టులో అశ్విన్ లేడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో అశ్విన్, ఆధునిక క్రికెట్‌లోని గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.
అశ్విన్ మొత్తం 106 టెస్టుల్లో 24 సగటుతో 537 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా, అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు.
ఇదే కాకుండా టెస్టుల్లో అతని బ్యాటింగ్ సగటు 25.75 కాగా, ఆరు సెంచరీలు కూడా కొట్టాడు.


ఫొటో సోర్స్, Getty Images
''అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో భారత క్రికెటర్‌గా ఇదే నాకు చివరి రోజు'' అని మ్యాచ్ అనంతరం గబ్బాలో జరిగిన విలేఖరుల సమావేశంలో అశ్విన్ చెప్పాడు.
''క్రికెటర్‌గా నాలో ఇంకాస్త ఆట మిగిలి ఉందని అనుకుంటున్నా. క్లబ్ క్రికెట్‌లో ఆ ఆటను ప్రదర్శిస్తా'' అని అశ్విన్ అన్నాడు.
అశ్విన్ 116 వన్డేల్లో 33.20 సగటుతో 156 వికెట్లు, 65 టి20 మ్యాచ్‌ల్లో 23.22 సగటుతో 72 వికెట్లు దక్కించుకున్నాడు.
భారత్ వేదికగా 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అశ్విన్ సభ్యుడు.
అయితే, టెస్టు క్రికెట్‌లో అశ్విన్ ప్రదర్శనలు అతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టాయి.
టెస్టుల్లో అతను 37 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇలా చేసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మొదటి స్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు సిరీస్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.
ఆస్ట్రేలియా టూర్‌కు ముందే రిటైర్మెంట్ తీసుకోవాలని అశ్విన్ భావించారని, ఈ సిరీస్‌లో ఆడేలా అతన్ని ఒప్పించామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
తొలి టెస్టుకు దూరంగా ఉన్న అశ్విన్, రెండో టెస్టులో ఒక వికెట్ దక్కించుకున్నాడు.
''అతనికి ఏం చేయాలనేదానిపై మంచి స్పష్టత ఉంది. అశ్విన్ నిర్ణయాన్ని జట్టుగా మేం గౌరవిస్తాం'' అని రోహిత్ అన్నాడు.
''భారత జట్టు సాధించిన అనేక గొప్ప విజయాల్లో అశ్విన్ భాగంగా ఉన్నాడు. అతనొక పెద్ద మ్యాచ్ విన్నర్'' అని రోహిత్ ప్రశంసించాడు.

ఫొటో సోర్స్, Getty Images
''ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకరు''
అశ్విన్‌కు ఒకప్పుడు కెప్టెన్‌గా, ఇప్పుడు సహచరుడిగా ఉన్న విరాట్ కోహ్లీ కూడా అశ్విన్ రిటైర్మెంట్‌పై స్పందించాడు.
''14 ఏళ్లు నీతో కలిసి ఆడాను. రిటైర్మెంట్ గురించి నువ్వు మొదట చెప్పినప్పుడు నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను. మనం కలిసి ఆడిన క్షణాలన్నీ కళ్లముందు మెదిలాయి. ఇన్నాళ్లు నీతో కలిసి ఆడిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. నీ నైపుణ్యాలు, మ్యాచ్ విన్నింగ్ కంట్రిబ్యూషన్‌లను ఎన్నటికీ మరువలేం. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నువ్వు ఎల్లప్పుడూ నిలిచిపోతావు. జీవితంలో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా'' అంటూ కోహ్లీ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.
అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకరిగా నిలిచిపోతాడని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు.
''అతనొక అద్భుత ఆటగాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వేదికల్లోనూ రాణించాడు. అశ్విన్ లాంటి ఆఫ్ స్పిన్నర్లు ఎక్కువ మంది ఉండరు. అశ్విన్ పట్ల మా టీమ్‌కు ఎనలేని గౌరవం ఉంది'' అని కమిన్స్ ప్రశంసించాడు.
భారత కోచ్, ఒకప్పుడు అశ్విన్‌తో కలిసి ఆడిన గౌతమ్ గంభీర్ కూడా రిటైర్మెంట్‌పై స్పందించాడు.
''ఒక యువ బౌలర్ స్థాయి నుంచి దిగ్గజంగా నువ్వు ఎదిగిన తీరును చూడటం గౌరవంగా భావిస్తున్నా. నీ ఎదుగుదలను నేను మాటల్లో చెప్పలేను. కానీ, అశ్విన్‌ను చూసే నేను బౌలర్ అయ్యానని రాబోయే తరాల బౌలర్లు చెబుతారు'' అని ఎక్స్‌లో గంభీర్ ట్వీట్ చేశాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














