గులాబీ బంతి గుట్టేమిటి? రోహిత్ టీమ్‌కు ఆ ట్రిక్ తెలియదా

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, WILLIAM WEST/AFP via Getty Images

    • రచయిత, జస్వీందర్ సిద్ధూ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టెస్టు మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజే ఆలౌటైన జట్టుకు మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ. అది కూడా గులాబీ బంతితో రెండు రకాల వెలుతురులో ఆడుతున్న మ్యాచ్.

భారత జట్టుకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబీ బంతితో ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోవడం అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో బయటపడింది.

ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ బృందాన్ని ఓడించింది.

ఓటమి తరువాత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అయిన ఇషా గుహతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఈ వారం మాకు కలిసి రాలేదు. మేం బాగా ఆడలేదు. ఆస్ట్రేలియా జట్టు మా కంటే మెరుగ్గా ఆడింది. మ్యాచ్‌లో పుంజుకునేందుకు మాకు చాలా అవకాశాలు వచ్చాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం. అందుకే ఓడిపోయాం. పెర్త్‌లో మేం పెద్ద విజయాన్ని సాధించాం, కానీ ఏ మ్యాచ్ ఫలితం దానిదే. ఇప్పుడు మా పూర్తి దృష్టి తరువాత మ్యాచ్‌పైనే ఉంది’ అని అన్నారు.

కుల్దీప్ లాల్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ కోసం క్రికెట్ రిపోర్టింగ్ చేస్తుంటారు. భారత్ ఓటమి తర్వాత ఆయన సోషల్ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

"న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలతో పోరాడకుండా ఓడిపోవడం భారత సెలెక్టర్లకు ఆందోళన కలిగించేదే. రోహిత్ బృందం ఇంతకంటే బాగా రాణించగలదు'' అని రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కేఎల్ రాహుల్, పింక్ టెస్టు

ఫొటో సోర్స్, Getty Images

పింక్ బాల్ ట్రిక్ పసిగట్టలేకపోయారా?

బంతిని ఆడాలంటే దానిని అర్థం చేసుకోవాలి. బంతిపైన ఉండే నల్లని కుట్టు ఏ వైపు పడుతుందో చివరి క్షణం వరకు గమనించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు.

గులాబీ బంతి (పింక్ బాల్) ఆటలో ఆస్ట్రేలియాకు మంచి అనుభవం ఉంది. ఆసీస్ బౌలర్లు బంతిని సరిగ్గా ఉపయోగించారు. ఆఫ్ స్టంప్‌పై కొంచెం ఎత్తులో వేసిన బంతిని భారత బ్యాటర్లు ఆడారు. వికెట్ల వెనుక క్యాచ్ ఔట్ అయ్యారు.

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "గులాబీ బంతి కూడా తెలుపు, ఎరుపు బంతుల మాదిరిగానే ఉంటుంది. మేం పాజిటివ్ మైండ్‌తో బౌలింగ్, బ్యాటింగ్ చేశాం. ఈ పిచ్‌పై బౌలింగ్ చేయడం బాగుంది" అని చెప్పారు.

అయితే, భారత బౌలర్లు గులాబీ బంతి ట్రిక్‌ పసిగట్టడంలో విఫలమయ్యారు. మొహమ్మద్ సిరాజ్ తొలి రోజు 15 శాతం, రెండో రోజు 24.7 శాతం మాత్రమే ఫుల్ లెంగ్త్ బంతులు సంధించాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా తొలిరోజు 7.5 శాతం, 21.3 శాతం ఫుల్ లెంగ్త్ బంతులు వేశాడు. హర్షిత్ రాణాకు ఇది 20, 31 శాతాలుగా ఉంది.

పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో జట్టు విజయానికి అతిపెద్ద కారణం బౌలర్ల సరైన లైన్ అండ్ లెంగ్త్. ఈ మ్యాచ్‌లో అది మిస్ అయింది. దీంతో మ్యాచ్ ఫలితంపై ప్రభావం పడింది.

ఆసీస్ బౌలింగ్, పాట్ కమిన్స్

ఫొటో సోర్స్, Getty Images

భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ "ఈ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు మొదటి రోజు నుంచి చక్కగా బౌలింగ్ చేసి, పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఈ బంతి సాఫ్ట్‌గా మారిన తర్వాత పరుగులు రాబట్టొచ్చు. అదేసమయంలో రాత్రి సెషన్‌లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది" అని అన్నారు.

గులాబీ బంతితో ఆడిన అనుభవం భారత జట్టుకు లేదని.. నేర్చుకుంటోందని ఆయన చెప్పారు.

ప్రపంచకప్ ఫైనల్ నుంచి భారత జట్టుకు ట్రావిస్ హెడ్ తలనొప్పిగా మారాడు. అడిలైడ్‌ టెస్టులో 141 బంతుల్లోనే 140 పరుగులతో అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ట్రావిస్ ఇన్నింగ్స్ చూస్తే భారత బౌలర్ల దగ్గర అతన్ని కట్టడి చేయడానికి ఎటువంటి ముందస్తు ప్లాన్ లేనట్లే కనిపించింది. ఈ ఇన్నింగ్స్‌తో భారత జట్టు విజయావకాశాలు దెబ్బతీశాడు ట్రావిస్.

గులాబీ బంతితో సాయంత్రం సెషన్‌లో ఎక్కువ వికెట్లు పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులోనే ఆసీస్ బౌలర్లు ఐదు వికెట్లు తీశారు.

విరాట్ కోహ్లీ, అడిలైడ్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఆ ఇద్దరు బ్యాటర్ల ఫామ్

మరోవైపు, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫామ్ కలవరపరిచేదే. రెండో ఇన్సింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే వరకు రోహిత్ నాటౌట్‌గా ఉంటాడనుకున్నారు. కానీ ఆఫ్ స్టంప్‌పై పాట్ కమిన్స్ వేసిన బంతికి 'హిట్‌మ్యాన్' ఔటయ్యాడు.

2024-25లో రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు కేవలం 11.83. రోహిత్‌కు ఏ లెంగ్త్‌లో బౌలింగ్ వేస్తే ఔటవుతాడో తెలిసినట్లు ఆసీస్ బౌలర్లు బంతులు వేశారు. అతను ఆఫ్ స్టంప్ దగ్గరే వికెట్ చేజార్చుకుంటున్నాడు.

ఈ సీజన్‌లో రోహిత్ ఆడిన చివరి 12 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. ఎనిమిదింటిలో 10 పరుగులు దాటడంలో విఫలమయ్యాడు.

మరోవైపు, విరాట్ కోహ్లి ఇన్‌సైడ్ ఎడ్జ్‌‌లో పదే పదే అవుట్ అవుతున్నాడు. స్లిప్‌లో, వికెట్ల వెనుక క్యాచ్ అవుట్‌గా వెనుదిరుగుతున్నాడు. ఇంత పెద్ద టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి లాంటి బ్యాటర్ పరుగులు చేయకపోతే జట్టుకు నష్టమే, అది జట్టు గెలుపును కష్టతరం చేస్తుంది.

విరాట్ కోసం స్టార్క్, కమిన్స్, స్కాట్ బోలాండ్ హోంవర్క్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. విరాట్ ఇలా ఔట్ అవుతుండటం భారత జట్టుకు ఆందోళన కలిగించేదే.

ఈ ఓటమి తర్వాత రోహిత్, విరాట్‌ల ఆటతీరుపై విమర్శలు వస్తాయి, వీరిద్దరూ భారత జట్టులో ఎంతకాలం ఉంటారని ప్రశ్నిస్తారు.

ప్రస్తుతం సిరీస్ 1-1తో ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర పోటీని ఆశించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)