మడ్ స్కిపర్: జీవితకాలంలో 90 శాతం నేల మీద తిరిగే చేప కథ ఇది...

మడ్ స్కిపర్ చేపలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాల్లోకి ఎగురుతున్న మడ్ స్కిపర్ చేప

మడ అడవుల్లో ఏది మనం ఊహించినట్టు ఉండదు. ఇక్కడ చెట్లు సముద్రంలో పెరుగుతాయి, చేపలు భూమిపైన నివసిస్తాయి.

జపాన్‌లోని సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మడ్‌స్కిపర్ చేప భూమిపై తిరుగుతూ గాలిని పీల్చుకోగలదు. ఇది తన జీవితంలో 90% సమయం నీటి బయటే గడుపుతుంది. తడి భూమిపై పెరిగే చిన్న, చిన్న మొక్కలు, బురద మట్టిలో కనిపించే జీవులే వాటికి ఆహారం.

పొడవు కేవలం 5 సెంటీమీటర్లే ఉన్నా, చిత్తడి భూములలో తనే మాస్టర్. పైగా భూమి మీద తిరిగే ఈ చేపలు ప్రమాదాల విషయంలో చాలా అలర్ట్‌గా ఉంటాయి. తలపై భాగంలో ఉన్న కళ్లతో నీళ్లల్లో ఉంటూనే ప్రమాదాలను పసిగడతాయి.

ఈ చేప తన పొట్టకు ఉన్న రెక్కల సాయంతో చెట్లపైకి ఎక్కగలదు, రాళ్లపై పాకగలదు. ఏదైనా అడ్డొచ్చినా, శత్రువు ఎదురైనా తన దగ్గరన్న ప్రధాన ఆయుధం...గెంతడం.

తన తోక సహాయంతో అది ఒక్కసారిగా గాల్లోకి ఎగరగలదు. శత్రువుల నుంచి తప్పించుకోవడానికే కాదు, తన పార్ట్‌నర్‌కు తన ఉనికిని సూచించి ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఇలా గెంతడం ద్వారా చేస్తుంటుంది.

ఆడ మడ్ స్కిపర్‌ చేపను ఆకట్టుకునేందుకు మగ చేపలు దాదాపు అర మీటర్ ఎత్తు వరకు ఎగురుతూ విన్యాసాలు చేస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ విన్యాసాలతో తన కుటుంబాన్ని ప్రారంభించడానికి ఎదురయ్యే పోటీని, అడ్డంకులను మగ మడ్ స్కిపర్ చేప అధిగమిస్తుంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మడ్ స్కిపర్ చేపలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శత్రువుల నుంచి తప్పించుకోవడానికీ, ఆడ చేపలను ఆకర్షించడానికి మగ మడ్ స్కిపర్‌లు గెంతుతూ విన్యాసాలు చేస్తాయి.

భూమిపై ఉన్నప్పుడు తనకు హాని తలపెట్టే వేటగాళ్లే కాదు, ఎండ కూడా ఈ చేపకు శత్రువే. ఎందుకంటే నేత మీద ఉన్నప్పుడు తడి ఉన్నంత వరకే అది గాలి నుండి ఆక్సిజన్‌ను పీల్చుకోగలదు.

తన చర్మాన్ని చల్లగా, తేమగా ఉంచేందుకు బురదలో, బొరియలలో తిరుగుతూ కనిపిస్తాయి ఈ చేపలు.

మడ్‌స్కిపర్లు ఎక్కువగా భూమిపైనే ఉండడం వల్ల నీటి బయట కదలడం, ఊపిరి పీల్చుకోవడం, చూడటంలాంటి లక్షణాలకు రూపాంతరం చెందాయి.

వాటి కళ్లు చదునుగా మారాయి కాబట్టి, గాలిలో మెరుగ్గా చూడడానికి అనుకూలంగా ఉంటాయి. నీటి అడుగున వీటికి చూపు సరిగా ఉండదు.

మడ్ స్కిపర్ చేపలు
ఫొటో క్యాప్షన్, చెట్టు ఎక్కుతున్న మడ్ స్కిపర్ చేప

మడ్‌స్కిపర్లు 24 రకాలు. అన్ని జాతుల మడ్‌స్కిపర్లు నీటి బయట జీవించడానికి వీలుగా శరీరంలో మార్పులు వచ్చాయి. కొన్ని జాతుల మడ్ స్కిపర్లు రెండున్నర రోజుల వరకు నీటికి దూరంగా ఉండగలవు.

నీటిలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాస తీసుకుంటాయి. భూమిపై ఉన్నప్పుడు చర్మం ద్వారా, నోటి ద్వారా గాలి నుండి నేరుగా ఆక్సిజన్‌ను గ్రహించగలవు. అందుకే తరచుగా అవి గాలిని మింగుతున్నటు మనకు కనిపిస్తాయి.

భూమిపై కదలడానికి, చెట్లపై ఎక్కడానికి, దూకడానికి, ప్రత్యేకించి స్కిప్పింగ్ తరహాలో ఈత కొట్టడానికి ఈ చేపలకు ఉన్న కీళ్లు, రెక్కలు వీలును కల్పిస్తాయి.

డస్కీ గిల్డ్ మడ్‌స్కిపర్ జాతి చేపల కదలికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చేప చేసే అరుదైన 'వాటర్ హాప్'ను ఇటీవలే కనుగొన్నారు శాస్తవేత్తలు.

ఇవి తమ రెక్కలను ఉపయోగించి ఇసుకలో నడవగలుగుతాయని కూడా శాస్తవ్రేత్తలు గుర్తించారు.

2020లో ఒక పరిశోధనా బృందం, నీటి మీద సమాంతరంగా విసిరినప్పుడు రాయి ఎగురుకుంటూ వెళ్లినట్లు డస్కీ గిల్డ్ మడ్‌స్కిపర్ చేప ఊపిరి పీల్చుకుంటూ, ఎగురుకుంటూ వెళ్లగలదని కూడా కనిపెట్టింది.

మడ్ స్కిపర్ చేపలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మడ్ స్కిపర్ చేప జీవితంలో 90 శాతం నీటి వెలుపలే జీవిస్తుంది.

ఈ జాతి ఆడ చేపలు గుడ్లు పెట్టిన కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. వాటిని సాకే, జాగ్రత్త చేసే బాధ్యత మగ చేపలదే. చాలా అంకితభావంతో గుడ్లను రక్షిస్తూ కొన్ని వారాలు వాటి దగ్గరే గడుపుతాయి మగ చేపలు. ఇది అంత సులువైన పనేమీ కాదు.

భూమి నుండి దాదాపు 30 సెంటీమీటర్ల దిగువన ఆడచేపలు గుడ్లను పెడతాయి. ఇది చక్కటి సురక్షితమైన ప్రదేశం. చల్లగా కూడా ఉంటుంది. కానీ, వెంటిలేషన్ లేకపోవడం వల్ల, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ఇది చాలా ప్రమాదకరం.

గుడ్లకు అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు తండ్రి చేపలు అవిశ్రాంతంగా స్వచ్ఛమైన గాలిని ఉపరితలం నుండి భూమి కిందకు తీసుకువెళ్తుంటాయి.

తన పిల్లలు గుడ్డు నుంచి బయటకు వచ్చేదాకా ప్రతి రోజూ మగ మడ్ స్కిపర్ చేపలు పడే శ్రమ అంతా ఇంతా కాదు.

నీటిలో తాము మునిగిపోకుండా ఉండేందుకు, అసాధారణమైన విన్యాసాలు చేస్తుంటాయి. వీలయినంత వరకు నీటిని తాకకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి.

ఒక చేప నీటిని తాకకుండా ఉండాలనుకోవడం నిజంగా విచిత్రమే కదా!

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)