విమానం కూలి 179 మంది మృతి, దక్షిణ కొరియాలో విషాదం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 179 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
విమానం కూలిన సమయానికి అందులో 181 మంది ఉన్నట్లు ఆ దేశ అగ్నిమాపక శాఖ తెలిపింది.
ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వే నుంచి అదుపుతప్పిన విమానం గోడను ఢీకొట్టిందని యోన్‌హాప్ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది.


ఫొటో సోర్స్, Reuters/Yonhap
థాయిలాండ్‌లోని బ్యాంకాక్ నుంచి వస్తున్న ఈ విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని, సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ సర్వీస్ అధికారి రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు.
విమానం వెనుక భాగంలోని వ్యక్తులను రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.
విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 173 మంది దక్షిణ కొరియన్లు కాగా, ఇద్దరు థాయ్ పౌరులు ఉన్నట్లు యోన్‌హాప్ పేర్కొంది.
విమానం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, పక్షులు చిక్కుకుపోవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, EPA
దుర్ఘటనకు సంబంధించిన ధ్రువీకరించని ఫుటేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయింది, దాని ప్రకారం ఉదయం 5.30 గంటల (భారత కాలమానం ప్రకారం) తర్వాత, కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి గోడమీదకి దూసుకెళ్లింది, ఆ తర్వాత మంటలు వ్యాపించాయి.
పెద్దఎత్తున నల్లటి పొగ ఆవరించిన ఇతర వీడియోలు కూడా బయటికి వచ్చాయి.
ఇప్పటి వరకూ విమాన సిబ్బందిలో ఒకరితో పాటు మరో ప్రయాణికుడిని రక్షించినట్లు దక్షిణ కొరియా ఫైర్ సర్వీస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 80 మంది ఫైర్ సర్వీస్ సిబ్బందిని, 30కి పైగా ఫైరింజన్లను మోహరించారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు దక్షిణంగా 288 కిలోమీటర్ల దూరంలో ఈ మువాన్ నగరం ఉంటుంది.
2005లో మొదలైన జెజు ఎయిర్ సంస్థ చరిత్రలో ఇదే మొదటి ఘోర ప్రమాదం. ఈ సంస్థ అతి తక్కువ ధరలో విమాన ప్రయాణ సేవలను అందిస్తోంది.
విమాన ప్రమాద బాధితులకు జెజు ఎయిర్ సంస్థ సీఈవో బహిరంగ క్షమాపణలు చెప్పారు.
సంస్థ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈవో కిమ్ ఈ-బే సహా ఇతర ఉన్నతాధికారులు క్షమాపణ చెబుతూ తలదించుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














