భారత్ X ఆస్ట్రేలియా: ''రోహిత్ మీ సేవలకు ధన్యవాదాలు, మీ టెస్టు కెరీర్ ఇక్కడితో ముగిసింది'' అని అన్నదెవరు?

ఫొటో సోర్స్, Getty Images
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆఖరిరోజున భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన తర్వాత సోషల్ మీడియాలో ''హ్యాపీ రిటైర్మెంట్'' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.
ఈ టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగులతో భారత్‌పై గెలుపొందింది. అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ముందంజ వేసింది.
సిరీస్‌లో ఆఖరిదైన అయిదో టెస్టు సిడ్నీలో జరగనుంది.


ఫొటో సోర్స్, Getty Images
నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ అవుటవ్వగానే పెద్ద షాక్ తగిలింది.
గత ఇన్నింగ్స్‌లతో పోలిస్తే రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్‌లో ఓపికగా ఆడుతున్నట్లు కనిపించాడు. తన స్వభావానికి విరుద్ధంగా దూకుడైన షాట్లేమీ ఆడలేదు. కానీ, ప్యాట్ కమిన్స్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్, రోహిత్ బ్యాట్ అవుట్ సైడ్ ఎడ్జ్‌ను తగులుతూ వెళ్లి మిచెల్ మార్ష్ చేతుల్లో పడింది. దీంతో రోహిత్ అవుటయ్యాడు.
40 బంతులు ఆడిన రోహిత్ 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ 29 బంతుల్లో 5 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్‌లో యశస్వీ జైస్వాల్ పోరాడుతున్నాడు.
ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు అవుటవ్వడం మైదానంలో కూర్చొని మ్యాచ్‌ను చూస్తున్న అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. వారంతా సోషల్ మీడియా వేదికగా తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇక రిటైర్ అవ్వాలంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా రోహిత్, విరాట్‌కు సలహాలు ఇవ్వడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సోషల్ మీడియాలో పెల్లుబికిన ఆగ్రహం
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన పట్ల నిరాశ చెందిన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
''రోహిత్, కోహ్లీ చాలా మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించారు. వారిపట్ల ఉన్న గౌరవంతో చెబుతున్నా రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ బుమ్రానే కెప్టెన్‌గా వ్యవహరించి ఉంటే మనం ఈ సిరీస్‌ను గెలిచి ఉండేవాళ్లం. గతంలో కూడా రహానే, పంత్, అశ్విన్, విహారి మ్యాచ్‌ల్ని గెలిపించారు'' అని గుర్మీత్ చద్దా అనే ఒక యూజర్ ట్వీట్ చేశారు.
అనుజ్ సింఘాల్ అనే మరో అభిమాని ట్వీట్ చేస్తూ, ''ఒకవేళ కోహ్లీ, రోహిత్ టెస్టు కెరీర్‌లు ఈ మ్యాచ్ తర్వాత ముగియకపోతే భారత క్రికెట్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. ప్రతి మ్యాచ్‌ను తొమ్మిది మంది ఆటగాళ్లతో ఆడలేం'' అని రాశారు.
చేతన్ కౌల్ అనే యూజర్ అనుజ్ వ్యాఖ్యలతో ఏకీభవించారు.
''అయిదో టెస్టు తుదిజట్టులో కూడా వారిద్దరు ఉంటే, సిరీస్‌ను గెలుపొందడం కంటే ఈ ఇద్దరు ఆటగాళ్లే ముఖ్యమనే సందేశం వెళుతుంది'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
''వారు మానసికంగా అలసిపోయారు. హ్యాపీ రిటైర్మెంట్'' అని మరో యూజర్ రాశారు.
విరాట్ కోహ్లీ అవుటైన తీరును చూపించే వీడియో క్లిప్‌ను షేర్ చేసిన యానిక అనే యూజర్, ''కోహ్లీ గత 9 ఇన్నింగ్స్‌లలో ఒకే రీతిలో అవుటయ్యాడు. అదే పొరపాటు మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి'' అని రాశారు.

ఫొటో సోర్స్, AFP
మాజీ క్రికెటర్లు ఏమంటున్నారు?
బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో చిట్‌చాట్ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ, ''విరాట్ ఇంకా ఆడతాడు. అతను ఎలా అవుట్ అవుతున్నాడన్నది మర్చిపోండి. కానీ, విరాట్ ఇంకో మూడు నాలుగేళ్లు ఆడతాడని నేను భావిస్తున్నా. రోహిత్ విషయానికొస్తే, తన ఆట గురించి అతనొక నిర్ణయం తీసుకోవాలి. అతని ఫుట్‌వర్క్ ముందులా లేదు. టైమింగ్ కూడా సరిగా లేదు. ఈ సిరీస్ చివరలో అతను ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు'' అని అన్నారు.
రోహిత్ తాజా ఫామ్ మీద ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను భారత సెలెక్టర్ అయితే, రోహిత్‌ను టెస్టు జట్టు నుంచి తొలిగించేవాడినని మార్క్ వా వ్యాఖ్యానించారు.
''నేనే భారత సెలెక్టర్‌ను అయితే, రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ అవుటైన తర్వాత 'మీ సేవలకు ధన్యవాదాలు రోహిత్. సిడ్నీ టెస్టుకు బుమ్రాను కెప్టెన్‌గా చేస్తున్నాం. మీ టెస్టు కెరీర్ ఇక్కడితోనే ముగుస్తుంది' అని రోహిత్‌కు చెప్పేవాడిని'' అని వా అన్నారు.
ఆటతీరు గురించే కాకుండా రోహిత్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
రోహిత్ గురించి 'కెప్టెన్ క్రై బేబీ' అని ఆస్ట్రేలియా మీడియా వర్ణిస్తోంది. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు వదిలేసిన తర్వాత యశస్వీ జైస్వాల్ పట్ల రోహిత్ వైఖరిని కొంతమంది క్రికెటర్లు తప్పుబట్టారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ, ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ, ''నిజం చెప్పాలంటే, భారత కెప్టెన్ వైఖరి నాకు నచ్చలేదు. రోహిత్ ఒత్తిడిలో ఉన్నాడు, వికెట్ల కోసం తాపత్రయపడుతున్నాడది నిజమే. కానీ, ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటంతో పాటు సహచరులకు మద్దతుగా నిలవాల్సిన వ్యక్తి అతనే'' అని అన్నాడు.

ఏడాదంతా టెస్టుల్లో వైఫల్యాలే
టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన సెప్టెంబర్ నుంచి కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో టెస్టులో కూడా రోహిత్ బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు.
సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఉండే ప్రయోజనాల్ని కూడా రోహిత్ అందిపుచ్చుకోలేకపోతున్నాడు. గత రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 42 పరుగులే చేశాడు.
న్యూజీలాండ్‌పై కూడా ఆరు ఇన్నింగ్స్‌లలో 91 పరుగులే చేశాడు.
ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ ఆడలేదు.
అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుకు టీమ్‌తో చేరిన రోహిత్ శర్మ ఆ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగాడు. పెద్దగా ఫలితమేమీ లేదు. మూడో టెస్టులోనూ ఇదే స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్ రాణించలేకపోయాడు.
తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో ఓపెనింగ్‌కు దిగిన రోహిత్ ఇక్కడ కూడా విఫలమయ్యాడు.
జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో అయిదో టెస్టు జరుగుతుంది.
అయితే, క్రికెట్ ఔత్సాహికులు ఇప్పటినుంచే భారత టీమ్ కూర్పు గురించి రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు.
రోహిత్ శర్మ అయిదో టెస్టు నుంచి తప్పుకుంటాడా?
రోహిత్ స్థానాన్ని శుబ్‌మన్ గిల్ భర్తీ చేస్తాడా?
తొలి మ్యాచ్‌లో జట్టును గెలిపించి బుమ్రా మళ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా? అంటూ రకరకాలుగా ఆలోచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














