చైనా: ఇక్కడ డాక్టరేట్లు, పీజీలు చేసినవాళ్లు డ్రైవర్లుగా, కూలీలుగా పనిచేస్తున్నారు, ఎందుకంటే...

చైనా

ఫొటో సోర్స్, BBC/Rachel Yu

    • రచయిత, స్టీఫెన్ మెక్‌డోనెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఓ వ్యక్తి హైస్కూల్లో హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్‌ చదివిన మరో వ్యక్తి క్లీనర్‌గా, ఫిలాసఫీ చదివిన వ్యక్తి డెలివరీ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మక సింఘువా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పట్టా పొందిన పట్టభద్రుడొకరు వలంటీర్ పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇదీ చైనాలో యువత పరిస్థితి.

ఒడిదొడుకుల్లో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న రియల్ లైఫ్ కేసులు ఇవి. అక్కడ మరిన్ని ఇలాంటి కేసుల్ని కనుగొనడం పెద్ద కష్టమేమీ కాదు.

''ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో పని చేయడం నా డ్రీమ్ జాబ్'' అని సున్ జాన్ చెప్పారు. ప్రస్తుతం ఆయన నాన్‌జింగ్ నగరంలోని హాట్‌పాట్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నారు.

25 ఏళ్ల సున్ జాన్ ఇటీవలే ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. చదువుకు తగిన ఉద్యోగం సంపాదించి మంచి జీతం పొందాలని కోరుకున్నారు.

''అలాంటి మంచి ఉద్యోగం కోసం వెదికాను. కానీ, ఎక్కడా కనిపించలేదు'' అని అన్నారాయన.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చైనాలో ప్రతీ ఏడాది లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లుగా యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. కానీ, కొన్ని రంగాల్లో విద్యార్థులకు తగినన్ని ఉద్యోగాలు అందుబాటులో లేవు.

చైనా ఆర్థిక వ్యవస్థ పోరాడుతోంది. రియల్ ఎస్టేట్, మాన్యుఫాక్చరింగ్ సహా పలు ప్రధాన రంగాలు స్థంభించిపోయాయి.

పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు కనిపించడానికి వీలుగా గణాంకాలను కొలిచే విధానాలను ఇటీవలే మార్చింది చైనా ప్రభుత్వం. దీనికి ముందు చైనాలో నిరుద్యోగిత శాతం 20 శాతంగా ఉండేది. 2024 ఆగస్టులో ఇది 18.8 శాతంగా, నవంబర్‌లో 16.1 శాతంగా నమోదైంది.

చాలా మంది గ్రాడ్యుయేట్లు, తాము చదువుకున్న రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడంతో తమ అర్హత కంటే తక్కువైన ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబీకులు, స్నేహితుల నుంచి విమర్శలు, ఎత్తిపొడుపులను కూడా ఎదుర్కొంటున్నారు.

వు డాన్

ఫొటో సోర్స్, BBC/RachelYu

సున్ జాన్ ఒక వెయిటర్‌గా పనిచేస్తుండటం ఆయన తల్లిదండ్రులకు నచ్చలేదు.

''నా కుటుంబం ఏమనుకుంటుందో అదే నాకు ముఖ్యం. ఇన్నేళ్లు, ఇంత మంచి స్కూళ్లలో చదివిన తర్వాత ఇలాంటి పని చేయాల్సి వస్తోంది'' అని సున్ జాన్ వాపోయారు.

తన ఉద్యోగాన్ని చూసి కుటుంబీకులు అవమానంగా భావించారని, తానొక అధికారి లేదా పబ్లిక్ సర్వెంట్‌గా పనిచేయాలని వారు కోరుకున్నారని ఆయన చెప్పారు.

కానీ, తనకున్న చాయిస్ ఇది మాత్రమే అని సున్ జాన్ తెలిపారు.

వెయిటర్‌గా పనిచేస్తోన్న సున్ జాన్ ఒక ప్లాన్‌లో ఉన్నారు. రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తూనే ఈ వ్యాపారానికి సంబంధించిన మెలకువలు నేర్చుకొని సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలనేది ఆయన ఆలోచన.

ఒకవేళ తాను సొంతంగా, విజయవంతంగా వ్యాపారం నడిపిస్తే తన కుటుంబం తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందని ఆయన ఆశిస్తున్నారు.

''చైనాలో ఉద్యోగాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి యువతలో చాలామంది తమ ఆశయాలు, లక్ష్యాల విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది'' అని హాంకాంగ్‌లోని సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాంగ్ జున్ అన్నారు.

చాలామంది విద్యార్థులు మెరుగైన అవకాశాల కోసం ఉన్నత చదువులు చదువున్నారని, కానీ వాస్తవానికి ఉపాధి అవకాశాలు వారికి తగినట్లుగా లేవని ఆమె చెప్పారు.

''జాబ్ మార్కెట్ కఠినంగా ఉంది. నాతో మాస్టర్స్ చదివిన వాళ్లలో చాలామంది ఉద్యోగాల వేటలో ఉన్నారు. వారిలో చాలా కొద్ది మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగాన్ని పొందగలిగారు'' అని షాంఘైలోని స్పోర్ట్స్ ఇంజ్యూరీ మసాజ్ క్లినిక్‌లో ట్రైనీగా పనిచేస్తోన్న 29 ఏళ్ల వు డాన్ అన్నారు.

హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫైనాన్స్ డిగ్రీ అందుకున్న ఆమె, మసాజ్ క్లినిక్‌లో ట్రైనీగా చేరతానని ఎప్పుడూ అనుకోలేదు.

ఈ పని కంటే ముందు షాంఘైలోని ఫ్యూచర్స్ ట్రేడింగ్ కంపెనీలో ఆమె పనిచేశారు.

హాంకాంగ్‌లో చదువులు ముగించుకొని చైనా మెయిన్‌ల్యాండ్‌కు తిరిగొచ్చాక ఒక ప్రైవేట్ ఈక్విటి సంస్థలో పని చేయాలని ఆమె ఆశించారు. అనుకున్నట్లుగానే కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, అందులోని కండీషన్లు నచ్చకపోవడంతో ఆ ఉద్యోగాలు చేయాలనుకోలేదు. బదులుగా స్పోర్ట్స్ మెడిసిన్‌లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ పని ఆమె కుటుంబానికి నచ్చలేదు.

''గతంలో అంత మంచి ఉద్యోగం చేసిన నేను ఇప్పుడు నా స్థాయి కంటే చిన్నదైన ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నానో వారికి అర్థం కాలేదు. ఇందులో వచ్చే స్వల్ప జీతం కోసం ఎక్కువగా శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. పైగా నేను ఉన్నత చదువులు చదివాను'' అని ఆమె అన్నారు.

తన భాగస్వామికి సొంత ఇల్లు ఉందని, లేకపోతే తనకొచ్చే జీతంతో షాంఘైలో బతకడం కష్టమని ఆమె ఒప్పుకున్నారు.

మొదట తన కెరీర్‌కు ఎవరూ మద్దతు ఇవ్వలేదని ఆమె చెప్పారు. తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న తన తల్లికి చికిత్స చేశానని, తర్వాత ఆమె నొప్పి తగ్గిపోయి చాలా ఉపశమనం కలిగిందని తెలిపారు. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.

ఒకప్పుడు ఫైనాన్స్ చదివిన తనకు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రపంచంలో పని చేయడం అసలు ఏమాత్రం నప్పదని ఆమె భావిస్తున్నారు.

స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ రంగంపై తనకు ఆసక్తి పెరిగిందని, ఈ ఉద్యోగం తనకు చాలా నచ్చిందని ఆమె చెప్పారు. ఏదో ఒకరోజు సొంతంగా క్లినిక్ తెరవాలనుకుంటున్నాని ఆమె అన్నారు.

హెంగ్‌డియాన్

ఫొటో సోర్స్, Getty Images

చైనా గ్రాడ్యుయేట్లు, ''గుడ్ పొజిషన్'' అని పిలిచే ఉద్యోగాలపట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని ప్రొఫెసర్ జాంగ్ అన్నారు.

చైనాలోని చాలా టెక్ కంపెనీలు సహా అనేక సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలిగించాయి. యువత దీన్నొక హెచ్చరికగా తీసుకోవాలి'' అని ఆమె చెప్పారు.

ఒకప్పుడు గ్రాడ్యుయేట్లను భారీగా నియమించుకున్న రంగాలు ఇప్పుడు దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్నాయని, ఈ రంగాల్లోని మంచి అవకాశాలు కనుమరుగవుతున్నాయని వివరించారు.

భవిష్యత్‌లో ఏం చేయాలనే అంశంపై కసరత్తు చేస్తోన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు.. ఫిల్మ్, టెలివిజన్ ఇండస్ట్రీల వైపు మళ్లుతున్నారు.

చైనాలో సినిమాల నిర్మాణానికి ఫేమస్ అయిన హెంగ్‌డియాన్‌ పట్టణంలో యాక్టింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువత చాలామంది కనిపిస్తారు.

''నేను ఎక్కువగా హీరో పక్కన నిలబడి కనిపిస్తాను. తరచుగా లీడ్ యాక్టర్ల పక్కనే ఉంటుంటాను. కాకపోతే నాకేం డైలాగ్స్ ఉండవు'' అని 26 ఏళ్ల వు జింగై చెప్పారు. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్ చదివిన వు జింగై ప్రస్తుతం ఒక డ్రామాలో బాడీగార్డ్ పాత్రలో నటిస్తున్నారు.

చాలామంది హెంగ్‌డియాన్‌కు వచ్చి కొన్ని నెలల పాటు పని చేస్తారు. ఏదైనా శాశ్వత ఉద్యోగం దొరికేంత వరకు తాత్కాలికంగా ఈ పని చేస్తున్నానని ఆయన చెప్పారు. ''ఈ పనితో ఎక్కువ డబ్బులేం రావు. కాకపోతే, నేను రిలాక్స్‌గా ఉన్నాను'' అని ఆయన అన్నారు.

‘‘ఇది చైనాలో ఉన్న పరిస్థితి. మీరు గ్రాడ్యుయేట్ కాగానే నిరుద్యోగిగా మారతారు’’ అని లీ అన్నారు.

ఆయన ఫిల్మ్ డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్‌లో నైపుణ్యాలు సాధించారు. కానీ, కొన్ని నెలల పాటు చిన్న చిన్న పాత్రల్లో నటించడానికి ఒప్పుకున్నారు.

''నేను చాలా చిన్న వయసులోనే పని వెదుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. తర్వాత ఒక స్థిరమైన ఉద్యోగాన్ని వెదుక్కుంటాను'' అని ఆయన అన్నారు.

చైనా ఆర్థిక వ్యవస్థ పథంపై విశ్వాసం లేకపోవడం వల్ల భవిష్యత్ ఎలా ఉంటుందోనని యువత ఆందోళన చెందుతోంది.

తన స్నేహితుల్లో ఉద్యోగాలు చేస్తోన్నవారు కూడా భవిష్యత్‌ను భద్రంగా ఫీల్ కావడం లేదని వు డాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)