స్లీప్ డివోర్స్: జంటలు విడివిడిగా పడుకోవాలనే ఈ ధోరణి ఎందుకు పెరుగుతోందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండా పౌల్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
సిసిలియాకు బాగా గుర్తుంది. కరోనా మహమ్మారి కాలం తర్వాత ఈ పరిణామం మొదలయింది. తన పార్ట్‌నర్ పెట్టే గురక భరించలేనిదిగా మారడంతో ఆమె నిద్రపోలేకపోయేవారు.
తన భాగస్వామిని తట్టడం, మరోవైపు తిరిగి పడుకోమని చెప్పడం ద్వారా గురక ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేదు. చివరకు ఆమె ఓ నిర్ణయానికి వచ్చారు.
ఇప్పుడు ఆమె, ఆమె పార్ట్‌నర్ వేర్వేరు గదుల్లో పడుకుంటున్నారు.
''నేను పనిమీద దృష్టిపెట్టలేకపోయా. రోజంతా ప్రయత్నించా. రెండు, మూడు రాత్రులయితే దీన్ని భరించవచ్చు. రోజూ అదే అంటే తట్టుకోలేం'' అని బీబీసీకి చెప్పారు సిసిలియా.
‘‘ఆ నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు. ఇది మా మనసుల మీద కూడా కొంచెం ప్రభావం చూపింది. ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామన్న విషయం అర్ధమయ్యాక సంతోషం వేసింది'' అని ఆమె చెప్పారు.
సిసిలియా, ఆమె భాగస్వామి ‘స్లీప్ డివోర్స్’ (విడివిడిగా నిద్రపోవడం)'' అనే విధానాన్ని పాటిస్తున్నారు.
‘‘ స్లీప్ డివోర్స్ అనేది తొలుత తాత్కాలికంగా జరుగుతుంది. తాము ఒంటరిగా పడుకున్నప్పుడు బాగా నిద్రపోతున్నామన్న విషయాన్ని భార్యాభర్తలు గుర్తిస్తారు'' అని అమెరికాలోని మెక్‌లీన్ ఆస్పత్రిలో మానసిక వైద్యురాలు స్టెఫానీ కొలియర్ చెప్పారు.
''సాధారణంగా ఇవి ఆరోగ్యానికి సంబంధించిన కారణాలు. గురకపెట్టే వ్యక్తికి కాళ్ల నొప్పులొస్తుంటాయి. నిద్రలో నడుస్తుంటారు. ఎక్కువగా బాత్‌రూమ్‌కు వెళ్తుంటారు. కదులుతుంటారు. అటు నుంచి ఇటు తిరుగుతుంటారు. ఇది భాగస్వామికి ఇబ్బంది కలిగిస్తుంది'' అని ఆమె బీబీసీతో తెలిపారు.
స్లీప్ డివోర్స్ విధానం మరింతగా పెరుగుతుందని ఆమె అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
మిలీనియల్స్‌లో పెరుగుతున్న స్లీప్ డివోర్స్
‘లిప్‌స్టిక్ ఆన్ ద రిమ్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ప్రఖ్యాత అమెరికా నటి కామెరాన్ డియాజ్ కూడా ఇదే విషయం చెప్పారు. తాను, తన భర్త ఒకే గదిలో నిద్రపోవడం లేదని ఆమె తెలిపారు. మిలీనియల్స్‌లో స్లీప్ డివోర్స్ బాగా పెరుగుతోందని ఆమె అన్నారు.
''మేం బెడ్‌రూమ్‌లను విడివిడిగా ఉంచుకోవాలని నాకర్థమయింది'' అని ఆమె అన్నారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో వేలాది స్పందనలు వచ్చాయి. మీడియాలో అనేక ఆర్టికల్స్ వచ్చాయి. ఇది హాలీవుడ్ నటికి మాత్రమే ప్రత్యేకమైనది కాదు.
అమెరికా అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్(ఏఏఎస్‌ఎమ్) 2023లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం...ఈ పరిశీలనలో పాల్గొన్నవారిలో మూడోవంతుమంది రోజూ లేదా అప్పుడప్పుడైనా భాగస్వాములతో సంబంధం లేకుండా వేరే గదిలో నిద్రిస్తున్నామని, మంచి నిద్రకోసమే ఇలా చేస్తున్నామని చెప్పారు.
అధ్యయనంలో పాల్గొన్న మిలీనియల్స్ (ప్రస్తుతం 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్నవారు)లో 43శాతం తాము ఒంటరిగా నిద్రిస్తామని చెప్పారు.
ఎక్స్ జనరేషన్ (1965 నుంచి 1980 మధ్య పుట్టినవారు)లో 33శాతం, జనరేషన్ జెడ్(1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు)లో 28శాతం, బేబీ బూమర్స్(1946 నుంచి 1964 మధ్య పుట్టినవారు)లో 22శాతం తాము భాగస్వామి నుంచి విడిగా నిద్రిస్తున్నామని తెలిపారు.
యువత ఈ విధానానికి ఎక్కువగా ఎందుకు మొగ్గుచూపుతుందో తెలియనప్పటికీ, దీనిపై కొన్ని ఊహాగానాలున్నాయి. వేర్వేరుగా నిద్రపోవడం వారికి పెద్ద విషయం కాదు. అది సంప్రదాయాల్లో వచ్చిన మార్పు.
'' విడిగా నిద్రపోతే నాకు బాగుంటుంది. వేరుగా ఎందుకు పడుకోకూడదు'' అని వారు ఆలోచిస్తున్నట్టు డాక్టర్ కొలియర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ ఈ విధానం ఉంది
డబుల్ బెడ్ అనేది అధునాతన విషయమని చరిత్రకారులు అంటుంటారు. పారిశ్రామిక విప్లవం వల్ల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించడం వల్ల ఈ ధోరణి పెరిగిందని వారు చెబుతున్నారు.
19వ శతాబ్దానికి ముందు పెళ్లయిన వారు వేర్వేరుగా పడుకోవడం అన్నది సాధారణమైన విషయమని వారు అన్నారు.
''ఎక్కువ సామాజిక, ఆర్థిక స్థాయి ఉన్నవారిలోనూ ఇది సాధారణమైన విషయం. రాజుల కాలంలో ఎలా నిద్రపోయేవారో మీకు తెలిసే ఉంటుంది'' అని చిలీలోని క్యాథలిక్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్‌లో సోమ్నాలజిస్ట్ అయిన పాబ్లో బ్రాక్‌మాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వేర్వేరుగా నిద్రించడం వల్ల ఉపయోగాలేంటి?
వేర్వేరు గదుల్లో నిద్రపోవాలని దంపతులు నిర్ణయించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ''మంచి నిద్రపోవచ్చు. బాగా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది'' అని డాక్టర్ కొల్లియర్ చెప్పారు.
''ఓ వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే ఆయన లేదా ఆమె రోగనిరోధక శక్తితో పాటు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. అంతేకాదు...తొందరగా కోపం వస్తుంది. సహనంతో ఉండలేరు. ఓ రకమైన డిప్రెషన్ బారిన కూడా పడతారు'' అని ఆమె తెలిపారు.
స్లీప్ డివోర్స్ వల్ల భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పడుతుందని కూడా సైకియాట్రిస్ట్ కొల్లియర్ అంటున్నారు.
''బాగా విశ్రాంతి లేని దంపతులు ఎక్కువ వాదులాడుకోవడం, చికాకుతో ఉండడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయన్న సంగతి మనకు తెలుసు'' అని ఆమె అన్నారు.
పల్మనాలజిస్ట్, ఏఏఎస్‌ఎమ్ ప్రతినిధి సీమా ఖోస్లా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.
''నిద్రలేకపోవడం మన మూడ్‌ను దెబ్బతీస్తుంది. నిద్రలేనివారు తమ భాగస్వాములతో ఎక్కువ గొడవపడుతుంటారు. తమ నిద్రకు అంతరాయం కలగడానికి భాగస్వామే కారణమన్న ఆగ్రహంతో ఉంటారు. ఇది భార్యాభర్తల బంధంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది'' అని ఏఏఎస్‌ఎమ్ సంస్థ స్లీప్ డివోర్స్‌పై తమ పరిశోధన ప్రారంభించిన సమయంలో ఆమె చెప్పారు.
‘‘ఆరోగ్యానికి, సంతోషానికి రాత్రి సమయంలో మంచి నిద్రపోవడం ముఖ్యం. తామిద్దరం బాగుండడానికి వేర్వేరుగా నిద్రపోవాలని భార్యాభర్తలు నిర్ణయించుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు'' అని ఆమె అన్నారు.
తన భాగస్వామితో సంబంధం లేకుండా వేరే గదిలో నిద్రపోవడం తన జీవితాన్ని మార్చివేసిందని సిసిలియా చెప్పారు.
''అది నాకు చాలా సౌకర్యవంతంగా ఉంది. మంచిగా నిద్రపోగలగడం, మంచంపై చాలా ఖాళీ ఉండడం, ఎవరికీ ఆటంకం కలగకుండా అటూ ఇటూ దొర్లడానికి అవకాశం ఉండడం చాలా బాగుంది.'' అని ఆమె అన్నారు.
మన భాగస్వామి నిద్రలేచినప్పుడు మనమూ నిద్రలేవాల్సిన అవసరం ఉండదని, మనకు లేవాలని అనిపించినప్పుడే నిద్రలేవొచ్చని అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
స్లీప్ డివోర్స్ వల్ల నష్టాలేంటి?
స్లీప్ డివోర్స్ వల్ల అదనంగా ఒక మంచం కావాలి. ఇంకా చెప్పాలంటే మరో గది కావాలి. చాలా జంటలకు ఈ అవకాశం అసలు ఉండదు.
ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ ఈ నిర్ణయం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలూ ఉన్నాయి. చాలా జంటలు సాన్నిహిత్యం కోల్పోతామని ఆందోళన చెందుతారని నిపుణులు అంటున్నారు.
''నా భాగస్వామితో నాకున్న అనుబంధంలో ఏదో మార్పువచ్చిందని నాకనిపిస్తోంది'' అని సిసిలియా అంగీకరించారు.
''ఇద్దరి మధ్య అనుబంధం, సాన్నిహిత్యంపై ప్రభావం పడింది. అయితే ఇది ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదు.'' అని ఆమె అన్నారు.
రోజంతా పనిచేసేవారిలో ఎక్కువమంది, తమకు భాగస్వామితో అనుబంధం పెరిగేది నిద్రపోయే సమయంలోనే అని భావిస్తారని డాక్టర్ కొల్లియర్ చెప్పారు.
దీనికి ఒక పరిష్కారంగా ఇద్దరూ కలిసి కొంత సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవచ్చని ఆమె సూచించారు.
స్లీప్ డివోర్స్ అనేది జంటలందరికీ ఉపయోగపడదని డాక్టర్ బ్రాక్‌మన్ అంటారు.
''జంటలు కలిసి నిద్రించడం వల్ల శారీరకంగా కొన్ని ఉపయోగాలుంటాయన్నారు. చాలా మందికి కలలో ఒక అనుబంధం ఏర్పడుతుంది. మనుషుల్లో ఇది పురాతన కాలం నుంచి ఉంది. ఉదాహరణకు తల్లీ, బిడ్డల అనుబంధం చూసుకుంటే పాలిచ్చే సమయంలో తల్లీబిడ్డల మధ్య ఈ అనుబంధం ఏర్పడుతుంది. అలాగే వాళ్లిద్దరూ ఒకే సమయంలో నిద్రించడం ద్వారా ఇద్దరికీ విశ్రాంతి కలుగుతుంది'' అని డాక్టర్ బ్రాక్‌మాన్ అన్నారు.
మంచి నిద్రకే ప్రాధాన్యత
‘‘ఏళ్లగా కలిసి నిద్రిస్తున్న జంటలు తమ నిద్రవేళలను భాగస్వాములకు అనుగుణంగా మార్చుకుంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల మంచి నిద్రపోయే సమయం పెరుగుతుంది'' అని సోమ్నాలజిస్ట్ బ్రాక్‌మన్ తెలిపారు.
భార్యాభర్తల్లో ఒకరు స్లీప్ డివోర్స్ ప్రయత్నించాలనుకుంటే వాళ్లను అడ్డుకోవాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఒకరు దీనికి సుముఖంగా ఉండి మరొకరు వ్యతిరేకతో ఉంటే ఉపయోగం లేదని, దీనివల్ల ఒకరిపై ఒకరికి కోపం పెరుగుతుందని డాక్టర్ కొల్లియర్ చెప్పారు.
''కొంతమంది ఒంటరిగా నిద్రపోవడానికి ఇష్టపడరు. ఇది వారికి బాధ కలిగిస్తుంది. అలాంటప్పుడు ఇద్దరికీ ఆమోదయోగ్యమైనదాని కోసం వారు ఆలోచించాలి. ఇద్దరూ కలిసి ఓ అభిప్రాయానికి రావాలి'' అని ఆయనన్నారు.
''గురక, నిద్రలో నడక, కాళ్లు పట్టడం వంటి ఏ సమస్యలనయినా తట్టుకోవడం కష్టం. కానీ వేర్వేరు మంచాలపై నిద్రపోవడం కొందరికి ఇష్టముండదు. ముఖ్యంగా మగవారికి.'' అని డాక్టర్ బ్రాక్‌మన్ చెప్పారు.
కొన్నిదేశాల్లో ఈ విధానం పెరుగుతోందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
బ్రిటన్‌లో 2020లో కలిసి నిద్రించిన జంటల్లో ఆరుగురిలో ఒకరు(15శాతం) ఇప్పడు స్లీప్ డివోర్స్ పాటిస్తున్నారని నేషనల్ బెడ్ ఫెడరేషన్ తెలిపింది. వారిలో ప్రతి 10మందిలో తొమ్మిది మంది(89శాతం)వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారని తెలిపింది.
2009లో ద స్లీప్ కౌన్సిల్ నిర్వహించిన అధ్యయనంలో ప్రతి పది జంటల్లో ఓ జంటకు (7శాతం) వేర్వేరు మంచాలు ఉన్నాయని తేలింది.
ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే గడచిన దశాబ్దం కాలంలో వేర్వేరుగా నిద్రపోయే జంటల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని ద నేషనల్ బెడ్ ఫెడరేషన్ విశ్లేషించింది.
ఎవరు ఎక్కడ నిద్రపోతున్నారన్న విషయానికొస్తే....మంచి నిద్రపోవడానికి ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తున్నారు.














