అమెరికా: పికప్ ట్రక్‌తో జనాలను ఢీకొట్టిన ఘటనలో 15కి చేరిన మృతుల సంఖ్య - పోలీస్ కాల్పుల్లో అనుమానితుడు మృతి

ఫొటో సోర్స్, Getty Images/fbi
అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో పికప్ ట్రక్‌తో జనంపైకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 15కి పెరిగింది. ఈ ఘటనలో మరో 30 మందికిపైగా గాయపడ్డారు.
టెక్సస్ రాష్ట్రానికి చెందిన షంషుద్దీన్ జబ్బార్(42) దీనికి కారకుడని అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆయన ఉద్దేశపూర్వకంగా ట్రక్‌ను జనంపైకి పోనిచ్చినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పోలీసుల కాల్పుల్లో షంషుద్దీన్ మరణించాడు.
ఘటనకు కారణమైన వాహనంలో ఇస్లామిక్ స్టేట్ జెండా కనిపించిందని, దాంతో ‘ఉగ్రవాద దాడి’గానే దీన్ని దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ అధికారులు ప్రకటించారు.
ఈ ఘటన వెనుక ఒకరు కంటే ఎక్కువ మంది ఉండొచ్చని ఎఫ్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా.. మరో ఘటనలో లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ బయట టెస్లా సైబర్ ట్రక్ పేలి ఒకరు చనిపోయారు.
ఈ రెండింటి మధ్య సంబంధం లేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.


న్యూ ఆర్లీన్స్ ఘటనలో పికప్ ట్రక్‌తో వచ్చిన వ్యక్తి దానిని వేగంగా నడుపుతూ వీలైనంతమందిపైకి పోనివ్వాలని చూశాడని పోలీస్ చీఫ్ కిర్క్ పాట్రిక్ చెప్పారు. నిందితుడు బారికేడ్లను ధ్వంసం చేస్తూ, కాల్పులు జరిపాడని, ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారని చెప్పారు.
ఆ వ్యక్తి వీలైనంత హాని, విధ్వంసం సృష్టించాలని కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనిపించాడని ఆమె చెప్పారు.
బుధవారం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు (భారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల ప్రాంతంలో) ఈ ఘటన జరిగింది.
దాడి తరువాత పరిస్థితి భయంకరంగా ఉందని రోడ్డుపై చాలామంది పడిపోయి ఉన్నారని, వారిలో కొందరు చనిపోయారని, మరికొందరు గాయపడి కనిపించారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
బార్బన్, కెనాల్ స్ట్రీట్ జంక్షన్ వద్ద నేలపై గాయాలతో పడి ఉన్న అనేకమందిని సీబీఎస్ రిపోర్టర్ ప్రత్యక్షంగా చూశారు.
బీబీసీ వెరిఫై ధ్రువీకరించిన వీడియోలో ఒక వ్యక్తి నేలపై పడిపోయి కనిపిస్తున్నాడు. తుపాకీ శబ్దాలు వినిపిస్తుండటంతో జనం చెల్లా చెదురవుతున్నారు.
మరో వీడియోలో ఇద్దరు వ్యక్తులు గాయాలతో కిందపడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రవాద కోణంలోనూ దర్యాప్తు
లూసియానాకు చెందిన ప్రత్యక్ష సాక్షి విట్ డేవిస్ బీబీసీతో మాట్లాడుతూ "ఈ ఘటనతో చాలా మంది షాక్‌కు గురయ్యారు. నేను తరచూ న్యూ ఆర్లీన్స్ వెళ్తుంటాను. కానీ ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. మేం సాయంత్రం బార్బన్ స్ట్రీట్‌లో ఉన్నాం. మేం బార్లో ఉన్నప్పుడు, కాల్పుల శబ్దంగానీ, వాహనం ఢీకొన్న శబ్దంగానీ ఏదీ వినిపించలేదు. ఎందుకంటే అక్కడ పాటల సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత జనం అక్కడ ఏదో షూటింగ్ డ్రిల్ జరుగుతున్నట్లు.. అటూ ఇటూ పరుగులు తీయడం, టేబుల్ కింద దాక్కోవడం మొదలెట్టారని చెప్పారు.
జనాలపైకి వాహనాన్ని నడిపిన వ్యక్తి చనిపోయాడని, కేసును విచారిస్తున్న ఎఫ్‌బీఐ అధికారులు చెప్పారు. ఈ ఘటనను తీవ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది.
విచారణకు నేతృత్వం వహిస్తున్న ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ డంకన్ మాట్లాడుతూ ఘటనాస్థలంలో పేలుడు పదార్థం కూడా లభ్యమైందని, అయితే ఇదెంతటి ప్రమాదకరమైనదనే విషయాన్ని నిర్థరించే పనిలో ఉన్నామని తెలిపారు.
న్యూ ఆర్లీన్స్‌లో ఘటన జరిగిన ఈ మార్గం నైట్ లైఫ్‌కు ప్రముఖం. ఇక్కడ ఎన్నో బార్లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఘటన జరిగిన ఆ సమయంలో అక్కడున్న చాలా మంది కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు.
న్యూ ఆర్లీన్స్ ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తెలిపామని ఆయన గవర్నర్ లాటోయా కాంట్రెల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని వైట్‌హౌస్ తెలిపింది.
లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ కూడా సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ప్రమాద బాధితులకు సాయం అందించే వారి కోసం ప్రార్థిస్తున్నానని, బార్బన్ స్ట్రీట్‌లో ఉదయం ఒక భయంకరమైన హింసాత్మక ఘటన జరిగిందని ఆ పోస్టులో పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














