భారత్‌లో ఆహార కొరతకు, అమెరికా లైబ్రరీల్లో పుస్తకాలకు సంబంధమేంటి?

ధాన్యానికి పుస్తకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్థానిక కరెన్సీతో అమెరికా ధాన్యం కొనుగోలు చేసిన భారత్, ఆ కరెన్సీతో పుస్తకాలు కొన్న అమెరికా
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, భారత్ ప్రతినిధి

అనన్య వాజ్‌పేయి అనే పీహెచ్‌డీ విద్యార్థి 1996లో షికాగో యూనివర్సిటీలోని రెగెన్‌స్టయిన్ లైబ్రరీలో ప్రసిద్ధ దక్షిణాసియా పుస్తకాల సేకరణను గుర్తించారు.

‘‘ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, హార్వర్డ్, కొలంబియాలలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దక్షిణాసియా గ్రంథాలయాలలో నేను సమయం గడిపాను. అయితే షికాగో యూనివర్సిటీలో ఉన్న పుస్తకాల సంపదకు అవేవీ సాటిరావు'' అని ఇండియా సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌లో ఫెలోగా ఉన్న అనన్య వాజ్‌పేయి చెప్పారు.

132 ఏళ్ల చరిత్ర ఉన్న షికాగో యూనివర్సిటీలో దక్షిణాసియాకు సంబంధించి 8లక్షల పుస్తకాలున్నాయి. ఇది దక్షిణాసియా గురించి తెలుసుకోవడానికి కీలకమైన పుస్తకాలు ఉన్న లైబ్రరీలో ఒకదానిగా మార్చింది. అయితే దక్షిణాసియా సాహిత్యానికి సంబంధించిన అంత నిధి అక్కడకు ఎలా చేరింది..?

దీనికి సమాధానం పీఎల్-480 అనే కార్యక్రమంలో ఉంది.. ప్రజా చట్టం 480 కింద 1954లో అమెరికా దీన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఫుడ్ ఫర్ పీస్(శాంతి కోసం ఆహారం) అని కూడా పిలుస్తారు. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి దౌత్యానికి ఇది హాల్ మార్క్ లాంటింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షికాగో యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీఎల్ - 480 కార్యక్రమంతో భారీగా లాభపడ్డ షికాగో యూనివర్సిటీ

పీఎల్ - 480 అంటే...

అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ సంతకంతో చట్టంగా మారిన పీఎల్-480 భారత్ వంటి దేశాలను ఆయా దేశాల కరెన్సీతో అమెరికా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వీలు కల్పించింది. దీనివల్ల ఆ దేశాలపై విదేశీ మారక ద్రవ్య భారం తగ్గతుంది. అమెరికా నుంచి ఈ ఆహార సాయం భారీగా అందుకున్న దేశాల్లో భారత్ ఒకటి. 1950,1960ల్లో భారత్‌కు తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు అమెరికా నుంచి ఈ కొనుగోళ్లు జరిపింది.

ఈ కార్యక్రమంలో అమెరికా యూనివర్సిటీలు పాల్గొనడానికి స్థానిక కరెన్సీకి సంబంధించిన నిధులను అందించేవాళ్లు. అనేక భారతీయ భాషల్లో స్థానిక పుస్తకాలు, పత్రికలు, ఫొనోగ్రాఫ్ రికార్డులు వంటివాటిని కొనేందుకు ఈ నిధులు ఉపయోగించారు. దీంతో దాదాపు పాతిక యూనివర్సిటీల్లో పుస్తకాలు, పత్రికలు, ఇతర మాధ్యమాల సేకరణ చాలా చేరింది. షికాగో యూనివర్సిటీ వంటి సంస్థలు దక్షిణాసియా అధ్యయనాలకు హబ్‌లుగా అవతరించాయి. (భారతీయ చట్టాలను అనుసరించి రాతప్రతులకు దీన్నుంచి మినహాయింపు లభించింది.)

''పీఎల్ -480 వల్ల షికాగో యూనివర్సిటీ, 30కిపైగా అమెరికా సేకరణ సంస్థలకు ఊహించలేనంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి'' అని షికాగో యూనివర్సిటీలో డిజిటల్ దక్షిణాసియా లైబర్రీ డైరెక్టర్ జేమ్స్ నై చెప్పారు.

దక్షిణాసియాకు సంబంధించిన సేకరణలతో అద్భుతమైన లైబ్రరీ రూపొందించడం తేలికయిన విషయమేం కాదు.

చికాగో లైబ్రరీ రీడింగ్ రూమ్

ఫొటో సోర్స్, University of Chicago Photographic Archive

భాష, సాంస్కృతిక వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ...

దిల్లీలో 1959లో 60మంది భారతీయులతో ప్రత్యేక బృందం ఏర్పాటయింది. తొలుత ప్రభుత్వ ప్రచురణల సేకరణపై దృష్టిపెట్టేందుకు ప్రారంభమైన కార్యక్రమం ఐదేళ్లలో పుస్తకాలు, పత్రికల వరకూ విస్తరించింది. 1968 నాటికి ఇలాంటి సేకరణల నుంచి 20 అమెరికా యూనివర్సిటీలు మెటీరియల్స్ సేకరించేవి. దక్షిణాసియా అధ్యయనాల గ్రంథకర్తల్లో ముందువరుసలో ఉండే మౌరీన్ పాటర్‌సన్ ఈ విషయాన్ని తెలిపారు.

పీఎల్-480 మొదలైన కొత్తల్లో భారత్‌లోని బృందం పుస్తకాల సేకరణలో ఎదుర్కొన్న ఇబ్బందులను 1969లో రాసిన వ్యాసంలో పాటర్‌సన్ గుర్తుచేసుకున్నారు. అనేక భాషలు, విస్తృత వైవిధ్యం ఉన్న దేశంలో పుస్తకాలను ఎంపిక చేయడం వారికి కష్టంగా మారింది.

మంచి పుస్తకాలేమిటో నిర్ణయించగల సామర్థ్యం ఉన్న నిపుణులైన పుస్తక విక్రేతల సాయం వారికి కావాల్సివచ్చింది. భారత్ వంటి పెద్ద దేశం, క్లిష్టమైన విస్తృత సాహిత్యం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ఒక్క డీలర్ కూడా సొంతంగా ఈ పనిచేయలేకపోయారు అని పాటర్‌సన్ఆ వ్యాసంలో రాశారు. 2012లో పాటర్‌సన్ చనిపోయారు.

''ఒక్కరికి ఈ బాధ్యతలు అప్పజెప్పకుండా అనేక పబ్లిషింగ్ హబ్స్‌ నుంచి డీలర్లను ఎంపిక చేశారు. డీలర్లు చాలా భాషలపై దృష్టిపెట్టారు. ఇలా కలిసికట్టుగా పనిచేయడం మంచి ఫలితాలను రాబట్టింది. శీర్షిక(టైటిల్స్)లను ఆమోదం కోసం దిల్లీ ఆఫీసుకు పంపేవారు. అన్ని భారతీయ భాషల్లో ఫిక్షన్‌(కల్పన)కు సంబంధించి విస్తృత సేకరణకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. ఏ కాలంలో అయినా చదవడానికి వీలుగా ఉండే డిటెక్టివ్ కథలు, నవలలు భారీ సంఖ్యలో సేకరించారు'' అని పాటర్‌సన్ ఆ వ్యాసంలో రాశారు.

అమెరికా యూనివర్సిటీల్లో భారత్ పుస్తకాలు

ఫొటో సోర్స్, Ananya Vajpeyi

ఫొటో క్యాప్షన్, అనన్య వాజ్‌పేయి

దక్షిణాసియా నుంచి మొత్తం పుస్తకాలు అమెరికాకు తరలించారా..?

1963లో పరిశోధన స్థాయికి తగిన పుస్తకాలు సేకరించారు. అనేక భాషల్లో ఫిక్షన్ పుస్తకాల సేకరణను సగానికి తగ్గించారు. 1966 నాటికి 7,50,000 పుస్తకాలు, పత్రికలు భారత్, నేపాల్, పాకిస్తాన్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలకు చేరాయి. భారత్ నుంచి అమెరికాకు చేరిన పుస్తకాల సంఖ్య 6,33,000కు పైనే.

''క్రీస్తు శకం 1,000 సంవత్సరం నుంచి 1,770 సంవత్సరం వరకు భారత్ చరిత్ర, హస్తకళలు, హిందూ సంస్కృతి,వ్యక్తిత్వం, మానసిక విశ్లేషణాత్మక అధ్యయనం వంటి వాటితో పాటు మరిన్ని రచనలు పంపాం'' అని ఈ కార్యక్రమంపై జరిగిన సమావేశంలో సమర్పించిన నివేదికలో రాసి ఉంది.

అమెరికాలోని ఓ ప్రాంతంతో పాటు ఇతర పాశ్చాత్య లైబ్రరీల్లో ఉన్న ఈ సేకరణ చూసి విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీలో దక్షిణాసియా అధ్యయనాల లైబ్రేరియన్ టాడ్ మైకేల్‌సన్-అంబెలాంగ్ ఆశ్చర్యపోయారు. భారత ఉపఖండం నుంచి సాహిత్య వనరులను తీసేసుకున్నారా అని ఆయన అచ్చెరువొందారు.

ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి ఉద్రిక్తల సమయంలో స్థాపించిన, విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ దక్షిణాసియా సెంటర్...పీఎల్ -480 నుంచి అందిన నిధులు ద్వారా తన గ్రంథాలయాన్ని 21 శతాబ్దంనాటికి 2లక్షలకు పైగా పుస్తకాలకు పెంచుకుంది.

భారత్‌లో దొరకవు..కానీ షికాగో లైబ్రరీలో ఉంటాయి

పీఎల్ – 480 వంటి కార్యక్రమాల కింద దక్షిణాసియా నుంచి పుస్తకాలను తీసుకురావడం జ్ఞానానికి సంబంధించిన అంతరాలను సృష్టిస్తుందని మైకేల్‌సన్ బీబీసీతో అన్నారు. పరిశోధకులు తమకు కావాల్సిన సమాచారం కోసం అక్కడి నుంచి తరచూ పశ్చిమ దేశాలకు ప్రయాణించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.

భారత్ నుంచి అమెరికా యూనివర్సిటీలకు చేరిన పుస్తకాలన్నీ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. భారత్‌లో దొరకని చాలా పుస్తకాలు షికాగో యూనివర్సిటీ లైబ్రరీలో కనిపిస్తున్నాయని ఫ్లేమ్ యూనివర్సిటీకి చెందిన మాయా డాడ్ చెప్పారు . వాటన్నింటిపైనా ''పీఎల్ -480'' అన్న స్టాంప్ వేసుందని తెలిపారు.

''పీఎల్ -480 కార్యక్రమం కింద సేకరించిన పుస్తకాలు చాలా భాగం దక్షిణాసియాలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. కానీ తెల్లచీమలు, తెగుళ్లు, సరైన ఉష్ణోగ్రతలు లేకపోవడం, తేమను నియంత్రించలేకపోవడం వంటివాటివల్ల ఆ పుస్తకాలను సంరక్షించడం అన్నది ఓ సవాల్‌గా మారింది. అదే సమయంలో పశ్చిమ దేశాల్లో ఉన్న లైబ్రరీల్లో సంరక్షణ బాగుండడంతో అక్కడ ఉన్న పుస్తకాలు, పత్రికలు మంచి స్థితిలో ఉన్నాయి'' అని మైకేల్‌సన్-అంబెలాంగ్ చెప్పారు.

పాశ్చాత్య దేశాల లైబ్రరీలను వలస రాజ్యాల ఆర్కైవ్స్ అని పిలవడానికి మరో కారణం, ఇవన్నీ విద్యావేత్తలకు అందుబాటులో ఉంటున్నాయి. వారి సంస్థల వెలుపల వారికి చాలా తక్కువగా లభ్యమవుతున్నాయి. దక్షిణాసియా సమాచారానికి సంబంధించి ఈ అసమానతలు ఏర్పడడానికి కారణం కాపీరైట్ చట్టాలు వంటివి.

తాళపత్ర గ్రంథాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చట్టాలను అనుసరించి రాతప్రతుల కొనుగోళ్ళను మినహాయించారు.

పీల్ -480 కార్యక్రమాన్ని ముగించినప్పుడు ఏమయింది?

1980ల్లో ఈ కార్యక్రమాన్ని ముగించడంతో అమెరికా గ్రంథాలయాలపై ఆర్థికభారం పడిందని నై చెప్పారు. ''పుస్తకాల ఎంపిక, వాటిని సేకరించడం, తెచ్చుకోవడం వంటివాటికి అమెరికా లైబ్రరీలు చెల్లింపులు చేయాల్సి వచ్చింది'' అని తెలిపారు. ఉదాహరణకు షికాగో యూనివర్సిటీ ఏటా లక్షడాలర్లకు పైగా డబ్బును పుస్తకాలు, పత్రికలను కొనడం వంటివాటికి ఖర్చుపెడుతోందని తెలిపారు. దిల్లీలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కార్యాలయం ద్వారా యూనివర్సిటీ పుస్తకాలు కొంటోందని చెప్పారు.

ఆహార ధాన్యాలకు పుస్తకాల ఒప్పందం వల్ల సానుకూల ఫలితాలొచ్చాయని అనన్య వాజ్‌పేయి అన్నారు. ఆమె సంస్కృతం చదివారు. అయితే షికాగో యూనివర్సిటీలో భారతీయ, యూరోపియన్ భాషలపై ఆమె పరిశోధన చేస్తున్నారు. ఫ్రెంచ్, జర్మన్, మరాఠి, హిందీ వంటి భాషలపై ఆమె పరిశోధన సాగుతోంది. సాహిత్యం, భాషాశాస్త్రం, తత్త్వశాస్త్రం వంటివాటితో ఆమెకు అనుబంధం ఉంది. ''రెగెన్‌స్టయిన్ లైబ్రరీలో నాకు కావాల్సిన పుస్తకాలు దొరకకపోవడం, ఆలస్యంగా దొరకడం అన్నది ఎప్పుడూ జరగలేదు'' అని ఆమె తెలిపారు.

పుస్తకాలు బాగున్నాయి. విలువైన పుసక్తాలు అందుబాటులో, ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్నాయి. భారత్‌లో అన్ని ప్రాంతాల్లో నేను లైబ్రరీలకు, ఆర్కైవ్స్‌కు, ఇన్‌స్టిట్యూషన్స్‌కు వెళ్లాను. అయితే అక్కడ నాకు నిరాశే ఎదురయింది. అక్కడ పుస్తకాలు పోయాయి. లేకపోతే పాడైపోయాయి. అవి నిర్లక్ష్యానికి గురయ్యాయి. అవి అందుబాటులోనూ లేవు'' అని ఆమె తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)