‘నాకు తెలిసిన ఏకైక ఆట రాయడమే’ అన్న మలయాళ దిగ్గజ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత

వాసుదేవన్ నాయర్

ఫొటో సోర్స్, Ajeeb Komachi

ఫొటో క్యాప్షన్, జ్ఞాన్‌పీఠ్ సహా అనేక అవార్డులు ఎంటీ వాసుదేవన్ నాయర్ సొంతమయ్యాయి.
    • రచయిత, మెర్లీ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

కేరళకు చెందిన ప్రసిద్ధ రచయిత, దర్శకుడు ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు.

శ్వాస సంబంధ సమస్యలతో కొన్నిరోజుల క్రితం కోజికోడ్ జిల్లాలో ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.

వాసుదేవన్ నాయర్ రచయితగానే కాకుండా దర్శకుడు, స్క్రీన్‌రైటర్‌గా గుర్తింపుపొందారు.

మలయాళ సాహితీ దిగ్గజంగా భావించే వాసుదేవన్ నాయర్‌కు పలువురు నివాళులర్పిస్తున్నారు.

కేరళలోని పాలక్కడ్ జిల్లాలలో నాయర్ 1933లో జన్మించారు. ఆయన కుటుంబం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించకపోయినప్పటికీ చిన్నతనం నుంచే ఆయన విపరీతంగా చదివేవారు. చాలా చిన్న వయసు నుంచే ఆయన రాయడం కూడా ప్రారంభించారు. అనేక పత్రికల్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి.

''నా వయసులో ఉన్న ఇతర అబ్బాయిల్లా నాకు ఆడుకోవడంపై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. నేనాడే ఒకే ఒక్క ఆట రాయడం'' అని గతంలో అవుట్‌లుక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయర్ చెప్పారు.

రసాయన శాస్త్రం చదివిన నాయర్ తరువాత స్కూల్లో లెక్కల టీచర్‌గా పనిచేశారు. తర్వాత ఆయన ప్రతిష్టాత్మక మాతృభూమి వారపత్రికలో చేరారు. చేరిన కొద్దికాలానికే రచయితగా సంపాదకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక నవలలు, చిన్న కథలు, కాలమ్స్, ట్రావెలాగ్స్‌తో పేరు తెచ్చుకున్నారు.

ఎడిటర్‌గా ఉన్న సమయంలో అనేక మంది యువ రచయితలను గుర్తించి, వారి కథలను ప్రచురించారు. తర్వాత కాలంలో వారంతా ప్రముఖ రచయితలగా గుర్తింపు పొందారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత, దర్శకునిగా విశేష గుర్తింపు

ఉమ్మడి కుటుంబాల క్షీణతపై నాయర్ రాసిన నాలుకెట్టు (నాలుగు భాగాలు) నవల 1959లో కేరళ అత్యున్నత సాహిత్య పురస్కారం గెలుచుకుంది. తర్వాత కాలంలో ఆయన ఈ నవలను దూరదర్శన్ కోసం తెరకెక్కించారు. ఆ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించింది.

తరువాత ఆయన భీముడి కోణంలో మహాభారత ఇతిహాసాన్ని చెప్పిన నవల రండ మూజహమ్ (రెండో మలుపు)ను భారతీయ సాహిత్యంలో క్లాసిక్‌గా భావిస్తారు.

నాయర్ తన జీవితంలో జ్ఞాన్‌పీఠ్ సహా అనేక అవార్డులు అందుకున్నారు.

రచయితగానే కాకుండా మలయాళం సినిమా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఆయన స్క్రీన్ ప్లే అందించిన వాటిలో అత్యత్తమమైన సినిమా ఒరు వడక్కన్ వీరగాథ. కేరళలో 16వ శతాబ్దాతానికి చెందిన కథను జానపదం తరహాలో ప్రతినాయకుని కోణంలో తెరకెక్కించారు. శక్తిమంతమైన సంభాషణలు, నటీనటుల ప్రదర్శనలతో ఈ చిత్రం మలయాళం క్లాసిక్‌గా గుర్తింపుపొందింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

నిరంతర పఠనం

వాసుదేవన్ నాయర్ చిన్న కథల సంకలనం ఆధారంగా రూపొందిన తాజా సిరీస్ మనోరథంగల్‌లో కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ వంటి దక్షిణాది దిగ్గజ నటులు నటించారు.

ఈ సిరీస్‌లో నటించిన మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్..నాయర్‌ను కేరళకు గర్వకారణమైన వ్యక్తిగా అభివర్ణించారు.

''మనం ఇతర ఏ సినిమాల్లో అయినా డైలాగ్‌లు మార్చగలం. కానీ నాయర్ సినిమాల్లో మార్చలేం. ఎందుకంటే అందులోని విషయాన్ని అర్ధంచేసుకోవడానికి ఆ సంభాషణలు తప్పనిసరి'' అని ఆయనన్నారు.

తాను చదివిన పుస్తకాల గురించి ఇంటర్వ్యూల్లో నాయర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.

నాయర్ 90వ పుట్టినరోజునాడు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయామ్స్ కుమార్ ఆయన పుస్తకాలు చదివే అలవాటు గురించి ప్రస్తావించారు.

'నాతో సహా భవిష్యత్ తరాలన్నీ కచ్చితంగా నాయర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే.. ఏకాగ్రత. నేనెప్పుడు చూసినా ఆయన చుట్టూ పుస్తకాలుండేవి. ఆయన ఆ పుస్తకాలు చదవడంలో మునిగిపోయుండేవారు. చెప్పాలంటే ధ్యానంలో ఉన్నట్టే ఉండేవారు. మార్క్వెజ్ లాంటి రచయితల పుస్తకాలతోపాటు కొత్తగా విడుదలయిన పుస్తకాలన్నీ ఆయన టేబుల్‌పై ఉండేవి'' అని ఆయన గుర్తుచేసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)