హైదరాబాద్ ‘లేడీ డాన్’ అంగూరీబాయి ఎలా చిక్కారు?

గంజాయి, హైదరాబాద్, టాస్క్‌ఫోర్స్, అంగూరీబాయి, ధూల్‌పేట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అంగూరీబాయి
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లేడీ డాన్‌లు సినిమాల్లో తప్ప బయట కనిపించడం కాస్త అరుదు. కానీ అలాంటి లేడీ డాన్ ఒకరిని హైదరాబాద్ పోలీసులు ఇటీవలే పట్టుకున్నారు.

అంగూరీబాయిగా స్థానికంగా అందరికీ తెలిసిన అరుణాబాయి హైదరాబాద్ ధూల్‌పేట కేంద్రంగా చిన్న సైజు డ్రగ్ సామ్రాజ్యాన్నే నిర్మించారని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.

ఆమెపై ఏకంగా 13 గంజాయి కేసులు ఉన్నాయని చెప్పారు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు.

ఆమె అరెస్ట్‌కు సంబంధించి అధికారులు ఒక ప్రకటన విడుదల చేసి వివరాలు వెల్లడించారు.

తెలంగాణ ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అంగూరీబాయి ఒకప్పుడు సాధారణ గృహిణి.

‘ఉత్తర భారతదేశ మూలాలున్న కుటుంబం ఆమెది. హైదరాబాద్‌లోని ధూల్‌పేట కేంద్రంగా ఆమె కుటుంబం గుడుంబా వ్యాపారం చేసేది. ప్రభుత్వాలు గుడుంబాను అరికట్టే చర్యలు చేపట్టడంతో క్రమంగా గంజాయి అక్రమ రవాణాలోకి దిగింది ఆమె కుటుంబం.

ఈ క్రమంలో అంగూరీబాయి కూడా ఆ వ్యాపారంలో అడుగుపెట్టారు’ అని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గంజాయి, హైదరాబాద్, టాస్క్‌ఫోర్స్, అంగూరీబాయి, ధూల్‌పేట్

ఫొటో సోర్స్, Getty Images

చిన్న పొట్లాలతో ప్రారంభించి..

ముందుగా ఇంటి దగ్గర చిన్నచిన్న పొట్లాల్లో గంజాయి అమ్మేవారు ఆమె.. తన భర్త ఇతర కుటుంబ సభ్యులు తెచ్చే సరకు అమ్మడం ఆమె పనిగా ఉండేదని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.

‘2017లో మొదటిసారి గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు దొరికారు అంగూరీబాయి. అయితే అప్పట్లో అర కేజీ కంటే తక్కువ గంజాయి దొరకడంతో ఆమెకు బెయిల్ దొరికింది. ఆ తరువాత కూడా ఆమె వ్యాపారం ఆపకపోగా, ఇంకా పెంచుకుంటూపోయారు. కోవిడ్ తరువాత ఆమె వ్యాపారం మరింత పెరిగింది’' అని బీబీసీకి చెప్పారు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి.

‘సినిమాల్లో చూపించినట్టుగా చాలా వేగంగా, పదేళ్లలోనే తన గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించారు. పొట్లాల్లో గంజాయి అమ్మే స్థాయి దాటి, పెద్ద మొత్తంలో గంజాయి దిగుమతి చేసి దాన్ని మధ్యవర్తులకు, రీటెయిల్ వారికి సరఫరా చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను, బంధువులను అందరినీ ఒక గొడుగు కింద చేర్చి ఒక సరఫరా నెట్వర్క్ ఏర్పాటు చేశారు’ అన్నారు ఆ అధికారి.

ఆ క్రమంలో అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చేవారని.. పోలీస్, ఎక్సైజ్ శాఖల్లోనూ ఆవిడ మనుషులు ఉన్నారని.. దొరకకుండా ఉండడంలో వారు సహకరించేవారని స్థానికులు చెప్తున్నారు.

గంజాయి, హైదరాబాద్, టాస్క్‌ఫోర్స్, అంగూరీబాయి, ధూల్‌పేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ కేంద్రంగా పొరుగు రాష్ట్రాలకు

‘అంగూరీబాయి వ్యాపారాన్ని హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించడం కోసం అవసరమైన సరకును ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి తెప్పించేవారు. ఇందుకు సొంత వాహనాలతో పాటు, ప్రైవేటు వాహనాలను ఉపయోగించి దిగుమతి చేసుకునేవారు.

ఆమె గంజాయిని అఫ్జల్ గంజ్ వరకు తెప్పించి, అక్కడి నుంచి శివరాంపల్లి దగ్గర ఉన్న తన అపార్టుమెంటులో దాచి ఉంచేవారు. అక్కడి నుంచి తెలంగాణ, ఉత్తర భారత రాష్ట్రాలకు కూడా గంజాయి సరఫరా చేసేవారు’' అని బీబీసీతో చెప్పారు ఒక ఎక్సైజ్ శాఖ అధికారి.

తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటోంది.

గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పదుల సంఖ్యలో అరెస్టులు చేస్తోంది.

పెద్ద మొత్తంలో గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పట్టుకుంటోంది.

అయితే మిగతా వారిని పట్టుకున్నంత తేలికగా అంగూరీబాయి దొరకలేదు.

ఆమె ఫోన్ కూడా వాడకుండా, తన సొంత నెట్‌వర్క్‌‌తో అధికారుల కన్నుగప్పి తప్పించుకునేవారని ఎక్సైజ్ విభాగం చెప్పింది.

దీంతో ఆమె కోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొన్ని రోజుల తరబడి ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు.

''అంగూరీబాయి ఆస్తులు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఆవిడకు ఫామ్‌హౌసులు కూడా ఉన్నాయి. ఆమె ఏ స్థాయికి ఎదిగిందంటే, ఆంధ్రా-ఒడిశాల్లో గంజాయి పండించే రైతులకు పెట్టుబడికి అవసరమైన డబ్బులు ఇచ్చేవారు. ఆ తరువాత వారు ఆ పంటను ఈవిడకే అమ్ముతారు. కేసు విచారణ పూర్తయితే పూర్తి వివరాలు తెలుస్తాయి" అని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

గంజాయి, హైదరాబాద్, టాస్క్‌ఫోర్స్, అంగూరీబాయి, ధూల్‌పేట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 12న కార్వాన్ ప్రాంతంలో అంగూరీబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎక్సైజ్ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారి అంజిరెడ్డి ఈ అరెస్టులో కీలక పాత్ర పోషించారు. అంగూరీబాయిని పట్టుకున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు టాస్క్ ఫోర్స్ ఛీఫ్ కమలాసన రెడ్డి.

ప్రస్తుతం అంగూరీబాయితో పాటూ ఆమె కొడుకులు, అల్లుళ్లు, చెల్లెలు, ఇతర బంధువులు, అందరూ ఈ వ్యాపారంలోనే ఉన్నారని అధికారులు చెప్పారు.

‘వారి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. కుక్కలు ఉంటాయి. ఇది కాక ఆమె బాడీగార్డులను కూడా పెట్టుకుంది’ అని వివరించారు అధికారులు.

మొత్తంగా ఎంతో రెక్కీ చేసి, ఎందరో సిబ్బందిని గస్తీలో పెట్టి చివరకు డిసెంబరు 12న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కార్వాన్ ప్రాంతంలో ఆమె చిక్కారు.

తరచూ మకాం మార్చడం, ఫోన్ వాడకపోవడం, వాడినా రకరకాల సిమ్‌లు మార్చడం, ఇలా అనేక కారణాల వల్ల ఆమె అరెస్టు ఆలస్యం అయిందని అధికారులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)