షట్‌డౌన్ ముప్పు ముంగిట అమెరికా.. గతంలో ఎన్నిసార్లు ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడింది

ట్రంప్, మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్
    • రచయిత, రాచెల్ లుకర్, అలెక్స్ బిన్లీ
    • హోదా, బీబీసీ న్యూస్

స్వల్పకాలిక నిధుల బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతుండటంతో అమెరికా ఆర్థిక ప్రతిష్టంభన(షట్‌డౌన్‌) ప్రమాదంలో పడింది.

యూఎస్ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఒక్కరోజుకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి.

అంతేకాదు, రిపబ్లికన్ల అనుమతితో గురువారం రాత్రి అత్యవసరంగా ప్రవేశపెట్టిన సవరించిన ఖర్చుల బిల్లు కూడా తిరస్కరణకు గురైంది.

ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 వంతు మెజార్టీ కావాలి.

కానీ, ప్రతినిధుల సభ దీనిని 235-174 ఓట్లతో తిరస్కరించింది.

అంటే డెమొక్రాట్లతో పాటు 38 మంది రిపబ్లికన్లు సైతం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. బిల్లు ఆమోదం పొందితే అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తొలగిపోయిండేది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
USA shutdown
ఫొటో క్యాప్షన్, 1980 నుంచి అమెరికాలో షట్‌డౌన్‌లు.

ట్రంప్ వ్యతిరేకించడంతో..

హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్, డెమొక్రాట్లు రూపొందించిన మునుపటి బిల్లును అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ వ్యతిరేకించారు.

బిలియనీర్ ఎలాన్ మస్క్ విమర్శల అనంతరం ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ట్రంప్ అడ్డుకున్నారు.

దాని స్థానంలో తీసుకొచ్చిన ప్రత్యామ్నాయ బిల్లుకు ట్రంప్ అంగీకరించారు.

రెండేళ్ల పాటు రుణాలపై సీలింగ్‌ను సస్పెండ్ చేయడం వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. అయితే, దీనికి కూడా ఆమోదం దక్కలేదు.

సభ మైనార్టీ నాయకుడు, డెమొక్రాట్ల అగ్రనాయకుల్లో ఒకరైన హకీమ్ జెఫ్రీస్ ఈ ప్రతిపాదనను హాస్యాస్పదమైనదిగా అభివర్ణించారు.

స్పీకర్ మైక్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్పీకర్ మైక్ జాన్సన్

సెప్టెంబరుతో మొదలు..

సెప్టెంబరులో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. డిసెంబర్ నిధుల డెడ్‌లైన్ సమీపించడంతో స్పీకర్ జాన్సన్ ఆరు నెలల నిధుల పొడిగింపు బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించారు. ఇందులో సేవ్ యాక్ట్ కూడా ఉంది, దాని ప్రకారం అమెరికాలో ఓటు వేయాలంటే పౌరసత్వ రుజువు అవసరం. దీంతో చాలామంది డెమొక్రాట్లు బిల్లును వ్యతిరేకించారు.

దీంతో ప్రభుత్వానికి నిధులు అందించే ద్వైపాక్షిక ఒప్పందాన్ని కాంగ్రెస్ ప్రతిపాదించింది. డిసెంబర్‌కు నిధులు అయిపోతాయని, అందుకే అన్నింటికీ ఓటువేయాల్సిన అవసరం లేదని, ఖర్చులకు సంబంధించిన అత్యవసర బిల్లు ఆమోదించాల్సి ఉందని రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో జాన్సన్ విజ్ఞప్తిచేశారు.

ఖర్చుల బిల్లుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకులు మంగళవారం (డిసెంబర్ 17న) విడుదల చేశారు. సభ్యుల సెలవులకు మూడురోజుల ముందు ఇది జరిగింది. ఈ బిల్లు మొత్తం 1,547 పేజీలు ఉంది.

ట్రంప్, మస్క్, వాన్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బిల్లును ట్రంప్, మస్క్, వాన్స్ వ్యతిరేకించారు.

ఈ బిల్లుతో మార్చి 14 వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుతాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే ట్రంప్ వైట్‌హౌస్‌లో తిరిగి అడుగుపెట్టిన తర్వాత 3 నెలల వరకు ప్రభుత్వ ఖర్చులకు ఇబ్బంది ఉండదు.

ఇందులో 110 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 9.34 లక్షల కోట్లు) అత్యవసర విపత్తు సాయం, రైతులకు 30 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.54 లక్షల కోట్లు) సాయం వంటివి ఉన్నాయి.

2009 తర్వాత తొలిసారి చట్టసభ్యులకు జీతాలు పెంచడం, బాల్టిమోర్‌లో కూలిపోయిన బ్రిడ్జి పునర్ నిర్మాణం, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, మోసపూరిత ప్రకటనల నుంచి హోటళ్లు, ప్రత్యక్ష కార్యక్రమ వేదికలను నిరోధించే నిబంధనలు ఉన్నాయి.

అయితే, ప్రాథమిక వ్యయ బిల్లును తీసుకురాలేకపోయారని జాన్సన్‌ను కొంతమంది రిపబ్లికన్లు విమర్శించారు. డెమొక్రాట్ల మద్దతు పొందేందుకు బిల్లులో పెట్టిన విషయాలను వారు వ్యతిరేకించారు.

అయితే, ఈ ఒప్పందాన్ని జాన్సన్ సమర్థించారు. విపత్తు సాయం, రైతులకు మద్దతు వంటి నిబంధనలు అదనంగా చేర్చాలని అన్నారు. అయినప్పటికీ ఆ బిల్లుకు రిపబ్లికన్ల ఆమోదం దక్కలేదు. మరోవైపు, తాజాగా జాన్సన్, రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన సవరణ 'ఖర్చుల బిల్లు' కూడా ఆమోదం పొందలేకపోయింది.

హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్

డెమొక్రాట్ల విమర్శలు

''వాళ్లు ఇప్పటికే అంగీకరించిన వాటిపై సమస్యలు ఏర్పడి ప్రతిష్టంభనలోకి వెళ్లడం నిజంగా బాధ్యతారహితమైనది'' అని జాన్సన్ అన్నారు.

బిల్లుపై సొంతపార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో జాన్సన్‌కు డెమొక్రాట్ల మద్దతు అవసరం. అయితే సవరణ బిల్లుపై జాన్సన్‌కు మద్దతుగా నిలిచేందుకు డెమొక్రాట్లు సిద్ధంగా లేరు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని తిరస్కరించడంపై వారు అసంతృప్తితో ఉన్నారు.

''దైపాక్షిక ఒప్పందాన్ని మీరు తిరస్కరించారు. దాని పర్యవసానాలకు మీరే బాధ్యత వహించాలి'' అని డెమొక్రటిక్ హౌస్ మైనార్టీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ ఎక్స్‌లో పోస్టుచేశారు.

ప్రజాప్రతినిధి కాని మస్క్ ఆదేశాలు పాటిస్తున్నట్లు కనిపిస్తున్న రిపబ్లికన్లపై మరికొందరు విమర్శలు చేశారు.

ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ అగ్రనేతల్లో ఒకరైన కనెక్టికట్ రిప్రజెంటేటివ్ రోసా డీలారో గురువారం సభలో.. 'ప్రెసిడెంట్ మస్క్' అనగానే ఇతర డెమొక్రాట్లు బిగ్గరగా నవ్వారు.

''ఇవేమీ చేయకండి. ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేయండి అని అధ్యక్షుడు మస్క్ చెప్పారు'' అని ఆమె అన్నారు.

బిల్లు ఆమోదం కోసం డెమొక్రాట్ల మద్దతుకు ఇప్పటికీ జాన్సన్ దారులు వెతకాల్సి ఉంది. ఎందుకంటే, సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయం చాలా ముఖ్యమైనది. ఇలాంటి సంప్రదింపులు సాధారణంగా వారాల తరబడి సాగుతుంటాయి.

షట్ డౌన్

ఫొటో సోర్స్, Getty Images

షట్‌డౌన్ అయితే ఏమవుతుంది?

ప్రభుత్వాల పాలన సాగాలంటే వార్షిక నిధుల కేటాయింపే ఆధారం. ఖర్చులకు సంబంధించిన 12 బిల్లులను పాస్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైతే ఖర్చు పెట్టడానికి నిధులుండవు. అత్యవసరం కాని విధులను ఆయా సంస్థలు నిలిపివేయాల్సి ఉంటుంది.

సరిహద్దు భద్రత, వైద్యసేవలు, చట్టాల అమలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు.

కానీ ప్రభుత్వ ఉద్యోగులకు చాలామందికి జీతాలుండవు. సామాజిక భద్రత, వైద్యావసరాలు వంటి వాటికి కార్డుల జారీ నిలిచిపోతుంది. అనుబంధ పోషకాహార కార్యక్రమానికి నిధులు తప్పనిసరి. కానీ షట్‌డౌన్ వల్ల వాటిపై ప్రభావం పడుతుంది. దీనికి సంబందించిన కార్యక్రమాల అమలు కూడా ఆలస్యమవుతుంది.

ఇతర సంస్థలు కార్యకలాపాలు మొత్తంగా నిలిచిపోతాయి. ఆహార భద్రత తనిఖీలను ఫుడ్, డ్రగ్ అధికార యంత్రాంగం నిలిపివేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ తనిఖీలు ఆగిపోతాయి. నేషనల్ పార్కులను మూసివేస్తారు.

జాన్సన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జాన్సన్‌కు ఓటు వేయబోమని, సభకు నేతృత్వం వహించే అవకాశం ఆయనకు కల్పించబోమని చాలామంది రిపబ్లికన్లు అంటున్నారు.

జాన్సన్‌ను పంపించేస్తారా?

ప్రస్తుత రిపబ్లికన్లపై ట్రంప్ ప్రభావానికి ఇది పెద్ద పరీక్ష. గురువారం జరిగిన ఓటింగ్‌లో పలువురు బిల్లును తిరస్కరించారు.

స్పీకర్ జాన్సన్‌కు ఇది సవాలుగా మారింది. కాంగ్రెస్ తర్వాతి స్పీకర్ కోసం 15 రోజుల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. ఇంతకుముందు జాన్సన్‌ గెలుపు ఖాయమనుకోగా, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

ట్రంప్, మస్క్ నుంచి ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాన్సన్ ఇప్పుడు నిధుల నిర్వహణలో సొంత పార్టీ నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జాన్సన్‌కు ఓటు వేయబోమని, సభకు నేతృత్వం వహించే అవకాశం ఆయనకు కల్పించబోమని చాలామంది రిపబ్లికన్లు అంటున్నారు. అయితే, రిపబ్లికన్ల మద్దతు కోల్పోవడంపై ఆయన దృష్టి లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో పార్టీకి కేవలం ఐదు సీట్ల మెజార్టీ మాత్రమే ఉంది.

రిపబ్లికన్ల ఇటీవల చర్యలను గమనిస్తే జాన్సన్‌కు ఇబ్బందికర పరిస్థితే.

2023 జవనరిలో కాలిఫోర్నియా రిపబ్లికన్ కెవిన్ మెక్‌కార్తీ స్పీకర్‌గా గెలుపొందారు. అయితే, 10 నెలల తర్వాత రిపబ్లికన్లు ఆయన్ను తొలగించారు. ఖర్చులను తగ్గించడంలో విఫలమైనందుకు, షట్‌డౌన్‌ను నివారించడానికి డెమొక్రట్లతో కలిసి పనిచేసినందుకు రిపబ్లికన్లు ఆయనకు సాగనంపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)