సీసీటీవీ కెమెరాలు తమను చంపుతాయని ఇక్కడి దుకాణాల యజమానులంతా భయపడుతున్నారు, ఎందుకంటే..

సోమాలియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మొహమ్మద్ గబోబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సోమాలియా రాజధాని మొగాదిషులోని దుకాణాల యజమానులకు పెద్ద చిక్కు ఎదురైంది.

నగరంలో బలమైన ఉనికి ఉన్న ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులపై నిఘా పెంచేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో వారు వణికిపోతున్నారు.

కెమెరాలను అమర్చితే అల్-షబాబ్ తిరుగుబాటుదారులు తమను కాల్చి చంపే ప్రమాదం ఉందని, ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే పోలీసులు అరెస్టు చేస్తారని దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారవేత్తలు, ఇంటి యజమానుల భద్రత కోసం పేర్లు మార్చాం.

"సీసీటీవీ కెమెరాల వల్లే ఇప్పుడు నేను ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను" అని 48 ఏళ్ల హమ్జా నూర్ అన్నారు. తన పిల్లల్లో ఒకరిని పట్టుకొని సోఫాలో కూర్చొని ఉన్న హమ్జా, బీబీసీతో మాట్లాడారు. ఆయన ఇంతకుముందు ఒక దుకాణం నడిపేవారు. ఇరువర్గాల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు తన వ్యాపారాన్ని అమ్మేయాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు హమ్జా చెప్పారు.

''ఒకవైపు కెమెరాలను తీసివేయొద్దని ఆదేశించారు. మరోవైపు కెమెరాలను తీసేయాలని చెప్పారు. మేం ఎంచుకున్న దాని ప్రకారం మా కోసం బుల్లెట్ లేదా జైలు గది వేచి ఉంటాయి" అని నూర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అల్-షబాబ్ దాడులను అరికట్టేందుకు దుకాణదారులు తమ సొంత ఖర్చుతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం గత ఏడాది ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయం ఫలించిందని నగర డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అహ్మద్ దిరియే బీబీసీతో చెప్పారు. "మొగాదిషులో నెలకు నాలుగైదు బాంబు దాడులు జరిగేవి. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు" అని ఆయన చెప్పారు.

ఇళ్ల బయట, అపార్ట్‌మెంట్ బ్లాక్‌ల వెలుపల కూడా కెమెరాలను అమర్చాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.

దాంతో, తమ ఇళ్లకు అల్-షబాబ్ నుంచి ముప్పు ఉందని చాలా మందిలో భయం పెరిగింది.

అక్టోబర్ నుంచి సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి 10 దాడుల్లో నలుగురు వ్యాపారవేత్తలను అల్-షబాబ్ చంపినట్లు ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ & ఈవెంట్ డేటా (అక్లెడ్) తెలిపింది.

ప్రభుత్వ లక్ష్యం అల్-షబాబ్ డబ్బు అందకుండా చేయడమే. ఎందుకంటే అల్-షబాబ్ సభ్యులు దుకాణాల యజమానుల దగ్గర డబ్బును దోచుకెళ్తుంటారు. అయితే తిరుగుబాటుదారుల ప్రతీకార దాడుల కారణంగా "మొగాదిషు ప్రధాన మార్కెట్లలోని అనేక దుకాణాలను రోజుల తరబడి మూసివేయాల్సి వచ్చింది" అని అక్లెడ్ పేర్కొంది.

సోమాలియా

ఫొటో సోర్స్, Mohamed Gabobe

హమ్జా నూర్ మోదట్లో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు. కానీ భద్రతా దళాల నుంచి ఆయన తప్పించుకోలేకపోయారు. చివరికి సీసీటీవీ కెమెరాలను నూర్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

కానీ, ఆ కెమెరాలను ఏర్పాటు చేశాక, ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్ మొదలయ్యాయి.

ఎవరెవరో ఫోన్ చేసి, బెదిరిస్తున్నారని నూర్ చెప్పారు.

"ఒక రోజు ఓ యువకుడు నా షాపు దగ్గరికి వచ్చాడు. తుపాకి చూపించి, నా సిమ్ కార్డ్ ఆన్ చేయమన్నాడు. తర్వాత నా ఫోన్ మోగింది. 'మా డిమాండ్ల కంటే ప్రభుత్వ డిమాండ్లే నీకు అంత ముఖ్యమా? అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి గొంతు వినిపించింది'' అని నూర్ గుర్తు చేసుకున్నారు.

''నాకేం చేయాలో తెలియలేదు. పిస్టల్‌ పట్టుకున్న ఆ వ్యక్తి అలాగే నా ముందు నిలబడి ఉన్నాడు. నేను ఆ ఫోన్‌కాల్ కట్ చేయగానే అతడు నన్ను కాల్చిచంపేస్తాడేమో అని భయపడ్డా. లోలోపల భగవంతుడిని ప్రార్థించా'' అని నూర్ చెప్పారు.

అదృష్టవశాత్తు, తాను ఫోన్ కాల్ కట్ చేయగానే ఆ వ్యక్తి ఎలాంటి హంగామా చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆయన తెలిపారు.

అక్టోబర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు దుకాణాదారులు చనిపోయారు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు నూర్ వెల్లడించారు.

''జీవితం కంటే విలువైనది ఏదీ లేదు'' అని ఆయన అన్నారు.

సోమాలియా

ఫొటో సోర్స్, AFP

ప్రభుత్వ ఆదేశాలను నూర్ తప్పుబట్టారు.

''పూట గడవడానికే ఇబ్బంది పడుతున్న సామాన్యులను ఒక శక్తిమంతమైన గ్రూపుకు వ్యతిరేకంగా పోరాడాలంటూ యుద్ధంలోకి లాగుతున్నారు. ఈ గ్రూపుపై పోరాడేందుకు ప్రభుత్వమే ఇబ్బంది పడుతోంది. ఇక సాధారణ పౌరులమైన మేం ఎంత అవస్థ పడుతున్నామో ఊహించండి'' అని నూర్ అన్నారు.

కొంతమంది వ్యాపారులు భయపడుతున్నారని, అయితే వారికి భరోసా కల్పించేందుకు, వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని డిప్యూటీ మేయర్ దిరియే అన్నారు.

''నగరం ప్రశాంతంగా ఉంది. వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయి'' అని దిరియే అన్నారు.

ముసుగులు వేసుకున్న వ్యక్తులు తన 40 ఏళ్ల సోదరుడు దహిర్ మొహమ్మద్ వార్సమేను అతని దుకాణంలోనే కాల్చి చంపారని బీబీసీతో అసియో మొహమ్మద్ వార్సమే చెప్పారు.

మొగాదిషులోని యాషిద్ జిల్లాలో అక్టోబర్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపారు. సెక్యురిటీ బలగాల ఒత్తిడి మేరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఇలా జరిగిందని ఆమె అన్నారు.

''ఆయనకు ఆరుగురు పిల్లలు. అందరి కంటే చిన్న పాప వయసు 4 నెలలు'' అని ఆమె తెలిపారు.

అల్- షబాబ్‌కు చెందినవారి నుంచి అజ్ఞాత ఫోన్ కాల్స్ రావడంతో తన దుకాణాన్ని మూసేసినట్లు 33 ఏళ్ల ఇస్మాయిల్ హషి చెప్పారు.

''వాళ్లకు నా పేరుతో పాటు చాలా విషయాలు తెలుసు. నా గురించి మిగిలిన అన్ని విషయాలూ వారికి తెలుసేమో అనిపించింది'' అని ఆయన చెప్పారు.

తర్వాత దుకాణాన్ని తెరవాల్సిందిగా పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, వారి మాటలు పట్టించుకోకపోవడంతో తనను కొన్ని రోజులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

ఇప్పుడు తన దుకాణాన్ని తిరిగి తెరిచానని ఆయన అన్నారు.

''ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాను. కానీ, ఎవరైనా వచ్చి నా ప్రాణాలు తీయబోతుంటే ప్రభుత్వం నన్ను రక్షించలేదని నాకు తెలుసు. నేను దుకాణంలో ఉన్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే నాకు చాలా భయంగా ఉంటుంది. నన్ను చంపడానికే వచ్చారేమో అనిపిస్తుంది'' అని తన భయాలను బీబీసీతో పంచుకున్నారు హషి.

వజీర్ జిల్లాలోని తన ఇంటికి సీసీటీవీ కెమెరా అమర్చకపోవడంతో పోలీసులు తనను అరెస్ట్ చేశారని 39 ఏళ్ల సిడో అబ్దుల్లా మొహమ్మద్ చెప్పారు.

తనతో పాటు అదే వీధిలోని మరో 14 మందిని కూడా అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం తనతో పాటు తమ పొరుగువారు కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు తామంతా భయంతో బతుకుతున్నామని ఆయన తెలిపారు.

''సాధారణ పౌరులమైన మేం మా డబ్బుతో కెమెరాలు కొనాలి, వాటిని ఇన్‌స్టాల్ చేయించాలి. అల్ షబాబ్ నుంచి బెదిరింపులు ఎదుర్కోవాలి. మా హృదయాలను, మనస్సులను గెలుచుకునే మార్గం ఇదేనా?'' అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)