కొడుకు పేరు వివాదం.. విడాకుల దాకా వెళ్లింది

కొడుకు పేరుపై భార్యాభర్తల మధ్య గొడవ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొడుకు పేరు విషయంలో తలెత్తిన వివాదం కారణంగా విడిపోవాలనుకున్న దంపతులు

పిల్లలకు పేరు పెట్టడం కోసం దంపతులు వాదులాడుకోవడం, గొడవలు పడడం అసాధారణం ఏమీ కాదు. అయితే ఈ సమస్యకు కోర్టులో పరిష్కారం దొరకడం మాత్రం అరుదు. కర్ణాటకలో అదే జరిగింది.

తమ కొడుకుకి పేరు పెట్టే విషయంలో మూడేళ్లపాటు గొడవపడ్డ తల్లిదండ్రులు చివరకు కోర్టులను ఆశ్రయించారు.

కొడుకు పేరుపై చెలరేగిన గొడవ, భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకునేంతగా ముదిరింది.

ఇదంతా 2021లో మొదలైంది. ఓ మహిళ(పేరు తెలియదు) కొడుకుకు జన్మనిచ్చి.. పుట్టింట్లో ఉంటున్నారు. కొన్ని నెలల తర్వాత భార్యను, కొడుకును తమ ఇంటికి తీసుకెళ్లడానికి భర్త వచ్చారు. ఆ సమయంలోనే కుమారుడి పేరు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

కుమారుడికి తన భర్త పెట్టిన పేరును భార్య అంగీకరించలేదు. దీంతో భర్త నిరుత్సాహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమెను తీసుకెళ్లడానికి తర్వాత ఎప్పుడూ ఆయన భార్య పుట్టింటికి వెళ్లలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొడుకుకు ‘ఆది’ అనేపేరు పెట్టిన తల్లి

తర్వాత తల్లి కొడుకుకు ‘ఆది’ అనే పేరు పెట్టారు.

'కొడుకు పేరులో మొదటి అక్షరాన్ని తన పేరులోంచి తీసుకున్న ఆమె, మిగిలిన అక్షరాన్ని భర్త పేరులోంచి తీసుకున్నారు' అని హున్సూర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎమ్‌ఎన్ సౌమ్య చెప్పారు.

నెలలు, సంవత్సరాలుగా మారాయి కానీ ఆ మహిళకు భర్త దగ్గరి నుంచి ఆహ్వానం అందలేదు. ఆమె పుట్టింట్లోనే ఉన్నారు. దీంతో ఆ మహిళ మైసూర్ జిల్లా హున్సూర్ పట్టణంలోని స్థానిక కోర్టును ఆశ్రయించారు. భర్త నుంచి ఆర్థికసాయం కోరుతూ ఆమె పిటిషన్ వేశారు.

పేరు కోసం మొదలైన గొడవ చివరకు ఆమె విడాకులు కోరేవరకూ వెళ్లిందని లాయర్ ఎంఆర్ హరీశ్ బీబీసీతో చెప్పారు.

''గృహిణి కావడంతో ఇంటి నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు'' అని లాయర్ చెప్పారు.

మొదట ఆ మహిళ స్థానిక కోర్టును ఆశ్రయించారు. తర్వాత కేసు విచారణను లోక్ అదాలత్‌కు అప్పగించారు. మధ్యవర్తుల ద్వారా లోక్ అదాలత్ కేసులను పరిష్కరిస్తుంది.

కోర్టులో సుత్తి

ఫొటో సోర్స్, Getty Images

భార్యాభర్తలను కలిపిన కోర్టు

ఆ భార్యాభర్తలకు న్యాయమూర్తులు అనేక సూచనలు చేసినప్పటికీ తమ కొడుకు పేరుపై వారిద్దరూ మొదట వెనక్కి తగ్గలేదు. చివరకు కోర్టు సూచించిన పేరును వారిద్దరూ అంగీకరించారు.

బాలుడి పేరును కోర్టు ఆర్యవర్థనగా నిర్ణయించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సౌమ్య చెప్పారు. ఆర్యవర్థన అంటే గొప్ప వ్యక్తి అని అర్థం.

తర్వాత భార్యాభర్తలిద్దరూ దండలు మార్చుకున్నారు. కలిసి జీవించడం కోసం సంతోషంగా కోర్టు నుంచి వెళ్లిపోయారు.

పిల్లలకు పేరు పెట్టే విషయంలో ఎదురయిన సమస్యలకు భారత్‌లోని కోర్టులు పరిష్కారం చూపడం ఇదే మొదటిసారి కాదు.

గత సెప్టెంబర్‌లో కేరళలోనూ ఇలాగే జరిగింది. బర్త్ సర్టిఫికెట్‌ లేకపోవడంతో కేరళలో ఓ బాలికను స్కూళ్లోకి అనుమతించలేదు.

నాలుగేళ్లుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకునేందుకు తానెంతగానో ప్రయత్నించానని చెబుతూ బాలిక తల్లి కోర్టును ఆశ్రయించారు. మహిళ, భర్తకు దూరంగా ఉండడంతో, భర్త అక్కడికి రాకపోవడంతో బర్త్ సర్టిఫికెట్‌ను ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.

అప్పుడు, తల్లి సూచించిన పేరును అంగీకరింపచేయాలని, తండ్రి పేరు అదనంగా కలపాలని కేరళ హైకోర్టు జనన ధ్రువీకరణ కార్యాలయాన్ని ఆదేశించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)